అధ్యాయం 1
‘ఇదిగో! మన దేవుడు’
1, 2.(ఎ)దేవుణ్ణి మీరు ఏ ప్రశ్నలు అడగడానికి ఇష్టపడతారు? (బి) మోషే దేవుణ్ణి ఏమని అడిగాడు?
దేవునితో సంభాషించడాన్ని మీరు ఊహించుకోగలరా? విశ్వ సర్వోన్నతాధిపతి మీతో సంభాషించడమనే తలంపే భీతిగొలిపేదిగా ఉంటుంది! మొదట కాస్త జంకినా, ఆ తర్వాత మీరు ఎలాగో జవాబివ్వగలుగుతారు. ఆయన మీరు చెప్పేది వింటాడు, దానికి ప్రతిస్పందిస్తాడు, చివరకు మీరు ఏ ప్రశ్నయినా సరే ధైర్యంగా అడగవచ్చని భావించేలా కూడా చేస్తాడు. అలాంటప్పుడు మీరాయనను ఏ ప్రశ్న అడుగుతారు?
2 చాలాకాలం క్రితం, ఒక వ్యక్తి సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఆయన పేరు మోషే. అయితే ఆయన దేవుణ్ణి అడగాలనుకున్న ప్రశ్న మీకు ఆశ్చర్యం కలిగిస్తుండవచ్చు. ఆయన తన గురించి, తన భవిష్యత్తు గురించి లేదా మానవాళి అవస్థ గురించి అడుగలేదు. బదులుగా ఆయన, దేవుని పేరు అడిగాడు. మోషేకు దేవుని పేరు అప్పటికే తెలుసు కాబట్టి, ఆయన అలాంటి ప్రశ్న అడగడం మీకు అసంబద్ధంగా అనిపించవచ్చు. అయితే, ఆయన ప్రశ్నకు లోతైన భావం ఉండేవుంటుంది. వాస్తవానికి, మోషే అడగగల అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న అదే. దానికివ్వబడిన జవాబు మనందరిపై ప్రభావం చూపుతుంది. దేవునికి సన్నిహితం కావడంలో ఒక ఆవశ్యకమైన చర్య తీసుకోవడానికి అది మీకు సహాయం చేయగలదు. ఎలా? గమనార్హమైన ఆ సంభాషణను మనం పరిశీలిద్దాం.
3, 4.మోషే దేవునితో సంభాషించేందుకు దారితీసేలా ఎలాంటి సంఘటనలు జరిగాయి, క్లుప్తంగా వారి సంభాషణా సారాంశమేమిటి?
3 మోషేకు 80 సంవత్సరాలు. ఆయన, ఐగుప్తు దాసత్వంలోవున్న తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దూరంగా నాలుగు దశాబ్దాలపాటు దేశాంతర జీవితం గడిపాడు. ఒకరోజు ఆయన తన మామ మందను మేపుతున్నప్పుడు, ఒక వింతైన సంఘటన చూశాడు. ఒక ముళ్లపొద మండుతోంది, కానీ అది కాలడంలేదు. అది కొండ మీదున్న దీప స్తంభంలాగ వెలుగులు విరజిమ్ముతూ మండుతోంది. దాన్ని పరిశీలిద్దామని మోషే దాని దగ్గరకు వెళ్లాడు. ఆ మంట మధ్యనుండి ఆయనకొక స్వరం వినబడినప్పుడు ఆయనెంత భయపడి ఉంటాడో గదా! ఒక దేవదూత ద్వారా దేవుడు మోషేతో చాలాసేపు మాట్లాడాడు. తటపటాయిస్తున్న మోషేను తన ప్రశాంతమైన జీవితం విడిచిపెట్టి, ఇశ్రాయేలీయులను దాసత్వం నుండి విడిపించేందుకు ఐగుప్తుకు తిరిగి వెళ్లమని దేవుడు అక్కడే ఆజ్ఞాపించాడని బహుశా మీకు తెలిసే ఉండవచ్చు.—నిర్గమకాండము 3:1-12.
4 అప్పుడు, మోషే దేవుణ్ణి ఏ ప్రశ్నయినా అడగగలిగేవాడే. అయితే ఆయన అడగడానికి ఎంచుకొన్న ఈ ప్రశ్నను గమనించండి: “చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచి—మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు—ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెను?”—నిర్గమకాండము 3:13.
5, 6.(ఎ)మోషే అడిగిన ప్రశ్న మనకు సరళమైన, ఆవశ్యకమైన ఏ సత్యాన్ని బోధిస్తోంది? (బి) దేవుని పేరుకు సంబంధించి ఎలాంటి నిందార్హమైన పని జరిగింది? (సి) మానవాళికి దేవుడు తన పేరు వెల్లడిచేయడం ఎందుకంత ప్రాముఖ్యమైనది?
5 ఆ ప్రశ్న మొట్టమొదట, దేవునికి ఒక పేరున్నదని మనకు తెలుపుతోంది. సరళమైన ఈ సత్యాన్ని మనం తేలికగా తీసుకోకూడదు. కానీ చాలామంది అలా చేస్తున్నారు. అసంఖ్యాక బైబిలు అనువాదాల నుండి దేవుని పేరును తొలగించి, దాని స్థానంలో “ప్రభువు,” “దేవుడు” అనే పదాలను ఉపయోగించారు. ఇది మతం పేరిట జరిగిన అత్యంత విషాదకరమైన, నిందార్హమైన పనుల్లో ఒకటి. నిజానికి, మీరు ఎవరినైనా కలిసినప్పుడు మొట్ట మొదట మీరేమి చేస్తారు? మొదట మీరు వాళ్ళ పేరు అడగరా? దేవుణ్ణి తెలుసుకునే విషయంలో కూడా అంతే. ఆయన మనం తెలుసుకోలేని లేదా అర్థంచేసుకోలేని, మనకు ఎంతో దూరంగా ఉండే అనామకుడు కాడు. ఆయన అదృశ్యుడైనప్పటికీ, ఆయనొక వ్యక్తి, ఆయనకు ఒక పేరుంది. ఆ పేరే యెహోవా.
6 అంతేకాకుండా, దేవుడు తన పేరు వెల్లడించినప్పుడు, సమీప భవిష్యత్తులో గుర్తించదగినది, ఉత్తేజకరమైనదేదో జరుగుతుందని దాని భావం. తనను తెలుసుకొమ్మని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు. జీవితంలో మనం అతి శ్రేష్ఠమైన ఎంపిక చేసుకోవాలని అంటే మనమాయనకు సన్నిహితం కావాలని ఆయన కోరుతున్నాడు. అయితే యెహోవా మనకు తన పేరు చెప్పడం మాత్రమే కాదు, ఆ పేరు ధరించిన వ్యక్తి ఎలాంటివాడో కూడా బోధించాడు.
దేవుని పేరుకు అర్థం
7.(ఎ)దేవుని పేరుకు అర్థం ఏమిటని భావించబడుతుంది? (బి) మోషే దేవుని పేరు అడిగినప్పుడు నిజానికి ఆయనేమి తెలుసుకోవాలని కోరుకొన్నాడు?
7 యెహోవా, తనకోసం విశేషార్థాన్నిచ్చే ఒక పేరును స్వయంగా ఆయనే ఎంపికచేసుకున్నాడు. “యెహోవా” అనే పేరుకు “తానే కర్త అవుతాడు” అని అర్థమని భావించబడుతుంది. విశ్వమంతటిలో ఆయనకు సాటి ఎవరూ లేరు. ఎందుకంటే ఆయనే సమస్తాన్నీ ఉనికిలోకి తెచ్చాడు, తన సంకల్పాలన్నిటినీ ఆయన నెరవేరుస్తాడు. ఆ వాస్తవం మనలో భయాన్ని కలుగజేస్తుంది. అయితే దేవుని పేరు అర్థానికి మరో ప్రత్యేకత ఏమైనా ఉందా? మోషే ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకున్నాడని స్పష్టమవుతోంది. యెహోవాయే సృష్టికర్తని మోషేకు తెలుసు, ఆయన పేరు కూడా మోషేకు తెలుసు. దేవుని పేరు ఆయనకు కొత్తకాదు, శతాబ్దాలుగా ప్రజలు దానిని ఉపయోగిస్తున్నారు. కాబట్టి, మోషే దేవుని పేరు అడిగినప్పుడు నిస్సందేహంగా, ఆయన ఆ పేరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి గురించి అడుగుతున్నాడు. నిజానికి ఆయనిలా అడుగుతున్నాడు: ‘నీపై విశ్వాసం కలగడానికి, నీవు నిజంగా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపిస్తావని వారిని నమ్మించడానికి నేనేమి చెప్పాలి?’
8, 9.(ఎ)మోషే ప్రశ్నకు యెహోవా ఎలా జవాబిచ్చాడు, అయనిచ్చిన జవాబు తరచూ అనువదించబడిన విధానంలో ఉన్న తప్పేమిటి? (బి) “నేను ఎలా కావాలంటే అలా అవుతాను” అనే మాటల అర్థమేమిటి?
8 దానికి జవాబుగా యెహోవా తన వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడిచేశాడు. దానికి, ఆయన పేరు అర్థానికి సంబంధం ఉంది. ఆయన మోషేకిలా చెప్పాడు: “నేను ఎలా కావాలంటే అలా అవుతాను.” (నిర్గమకాండము 3:14, NW) ఈ వచనం అనేక బైబిలు అనువాదాల్లో ఇలా ఉంది: “నేను ఉన్నవాడను అను వాడనై యున్నాను.” అయితే జాగ్రత్తగా చేసిన అనువాదాలు, దేవుడు కేవలం తన సొంత ఉనికిని ధృవీకరించడం లేదని సూచిస్తున్నాయి. బదులుగా, తన వాగ్దానాలు నెరవేర్చడానికి యెహోవా ఎలా అవసరమైతే అలా “అవుతాడు” లేదా అలా అవ్వాలనుకుంటాడు అని మోషేతోపాటు మనందరికీ ఆయన బోధిస్తున్నాడు. జె. బి. రోథర్హామ్ అనువాదం ఆ వచనాన్ని ఇలా అనువదిస్తోంది: “నాకు ఎలా ఇష్టమో ఆ రీతిగా నేను అవుతాను.” బైబిలు సంబంధ హీబ్రూ భాషా నిపుణుడు ఒకాయన ఆ పదబంధాన్ని ఇలా వివరిస్తున్నాడు: “పరిస్థితి లేదా అవసరం ఎలాంటిదైనా . . . , దేవుడు ఆ అవసరానికి తగిన పరిష్కారం ‘అవుతాడు’.”
9 ఇశ్రాయేలీయులకు అది ఏ భావాన్నిచ్చింది? వారి ఎదుట అడ్డంకు ఎంత భయంకరంగా కనబడినా, వారి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉన్నా, వారిని దాసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశానికి తెచ్చేందుకు యెహోవా ఎలా అవసరమైతే అలా అవుతాడు. నిశ్చయంగా ఆ పేరు దేవునిపై నమ్మకాన్ని పురికొల్పింది. నేడది మనకూ అలాంటి నమ్మకాన్నే కలిగించగలదు. (కీర్తన 9:10) ఎందుకలా కలిగించగలదు?
10, 11.యెహోవాను బహుముఖ ప్రజ్ఞావంతునిగా, మనం ఊహించగల అతి శ్రేష్ఠమైన తండ్రిగా భావించమని ఆయన పేరు మనలను ఎలా ఆహ్వానిస్తోంది? వివరించండి.
10 ఉదాహరణకు: పిల్లల్ని పెంచేటప్పుడు తామెంత బహుముఖ ప్రజ్ఞావంతులుగా ఉండాలో, సమయానుకూలంగా తమను తాము ఎలా మలుచుకోవాలో తల్లిదండ్రులకు తెలుసు. తల్లిదండ్రులు ఒక్క రోజులోనే నర్సులుగా, వంటవారిగా, ఉపాధ్యాయులుగా, శిక్షకులుగా, న్యాయనిర్ణేతలుగా, అలా ఎన్నో విధాలుగా వ్యవహరించవలసి ఉంటుంది. తమ పిల్లలు తమకు గాయమైనప్పుడు దాన్ని అమ్మానాన్నలు తగ్గించగలరా, వివాదాలన్నీ పరిష్కరించగలరా, ఆటబొమ్మ ఏదైనా విరిగితే దాన్ని బాగుచేయగలరా, నిరంతరం తమకొచ్చే సందేహాలకు సమాధానం చెప్పగలరా అని ఎన్నడూ సందేహించకుండా తమపై చూపించే అచంచల విశ్వాసాన్ని వారు గమనిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు తమపై ఉంచబడిన అంతటి విశ్వాసానికి తాము అర్హులం కాదని భావిస్తారు, తమ పరిమితులనుబట్టి అప్పుడప్పుడు నిరుత్సాహపడతారు. ఈ పాత్రల్లో అనేక పాత్రలను పోషించే సామర్థ్యం తమకు ఎంతమాత్రం లేదని వారు భావిస్తారు.
11 యెహోవా కూడా ప్రేమగల తండ్రే. అయినా, తన పరిపూర్ణ నియమాల పరిధిలో, తన భూసంబంధ పిల్లలపట్ల సాధ్యమైనంత శ్రేష్ఠంగా శ్రద్ధ చూపేందుకు తానుగా ఆయన కాలేనిది ఏదీలేదు. అందుకే యెహోవా అనే ఆయన పేరు, ఆయననే ఊహించదగిన అత్యంత శ్రేష్ఠమైన తండ్రిగా భావించమని మనలను ఆహ్వానిస్తోంది. (యాకోబు 1:17) యెహోవా తన పేరుకు తగ్గవాడని త్వరలోనే మోషేతోపాటు నమ్మకస్థులైన ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొన్నారు. ఆయన తానే అపజయమెరుగని సైనికాధికారిగా, ప్రకృతి శక్తులన్నిటిపై యజమానిగా, అసమాన శాసనకర్తగా, న్యాయాధిపతిగా, శిల్పిగా, ఆహారపానీయాల దాతగా, వస్త్రాలు పాదరక్షలు పాతపడి పోకుండా కాపాడిన సంరక్షకునిగా, ఇంకా మరెన్నో విధాలుగా అవడాన్ని వారు భక్తిపూర్వక భయంతో గమనించారు.
12.యెహోవాపట్ల మోషేకున్న దృక్పథానికి ఫరో దృక్పథమెలా భిన్నంగా ఉంది?
12 ఈ విధంగా దేవుడు తన పేరును తెలియజేయడమే కాదు, ఆ పేరు పెట్టుకున్న వ్యక్తి గురించిన ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడిచేశాడు, తన గురించి తాను చెప్పుకున్నది నిజమని ప్రదర్శించాడు. నిస్సందేహంగా, మనమాయనను తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దానికి మనమెలా ప్రతిస్పందిస్తాం? మోషే దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకున్నాడు. ఆ ప్రగాఢమైన కోరికే మోషే జీవన విధానాన్ని మార్చివేసి, ఆయన తన పరలోక తండ్రికి మరింత సన్నిహితమవడానికి దారితీసింది. (సంఖ్యాకాండము 12:6-8; హెబ్రీయులు 11:27) అయితే మోషే సమకాలీనుల్లో చాలామందికి అలాంటి కోరిక లేకపోవడం శోచనీయం. మోషే ఫరోకు యెహోవా అనే పేరు చెప్పినప్పుడు, అహంకారుడైన ఆ ఐగుప్తు రాజు, “యెహోవా ఎవడు?” అని ఎద్దేవా చేశాడు. (నిర్గమకాండము 5:2) యెహోవా గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఫరో ఇష్టపడలేదు. బదులుగా, ఆయనంత ప్రాముఖ్యం కాదన్నట్టు లేదా అప్రస్తుతమన్నట్టు అతడు ఎగతాళిగా ఇశ్రాయేలీయుల దేవుణ్ణి కొట్టిపారేశాడు. అలాంటి దృక్పథమే నేడు కూడా ప్రబలంగా ఉంది. అది సమస్త సత్యాల్లోకి అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని అంటే యెహోవాయే మహోన్నతుడనే సత్యాన్ని ప్రజలు తెలుసుకోకుండా చేస్తోంది.
మహోన్నత ప్రభువైన యెహోవా
13, 14.(ఎ)బైబిల్లో యెహోవా అనేక విధాలుగా ఎందుకు పిలువబడ్డాడు, వాటిలో కొన్ని ఏమిటి? ( 14వ పేజీలోని బాక్సు చూడండి.) (బి) “మహోన్నతుడు” అని పిలువబడేందుకు యెహోవా మాత్రమే ఎందుకు అర్హుడు?
13 యెహోవా ఎంతటి బహుముఖ ప్రజ్ఞావంతుడు, ఆయన ఎంతగా పరిస్థితికి తగ్గట్టు మారతాడంటే, లేఖనాల్లో న్యాయబద్ధంగానే ఆయన అనేక బిరుదులతో పిలువబడ్డాడు. అవి ఆయన వ్యక్తిగత పేరుతో పోటీ పడవు; బదులుగా, అవి ఆయన పేరుకు ప్రతీకగావున్న విషయాన్ని మనకు మరింత ఎక్కువ తెలియజేస్తాయి. ఉదాహరణకు, ఆయన “మహోన్నతుడు” అని పిలువబడ్డాడు. (కీర్తన 97:9) బైబిల్లో అనేకమార్లు కనబడే ఆ ఉత్కృష్టమైన బిరుదు యెహోవా స్థానం గురించి మనకు చెబుతుంది. సమస్త విశ్వానికి పరిపాలకునిగా ఉండే హక్కు ఆయనకు మాత్రమే ఉంది. ఎందుకో పరిశీలించండి.
14 సృష్టికర్తగా యెహోవా సాటిలేనివాడు. ప్రకటన 4:10, 11 ఇలా చెబుతోంది: “ప్రభువా, [“యెహోవా” NW] మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.” ఈ గౌరవార్థక మాటలు మరెవ్వరికీ అన్వయించబడే అవకాశం లేదు. విశ్వంలో ఉన్న ప్రతీదీ యెహోవా మూలంగానే ఉనికిలోవుంది! మహోన్నతునిగా, సమస్తానికి సృష్టికర్తగా మహిమ ఘనత ప్రభావములు పొందడానికి నిస్సందేహంగా యెహోవాయే అర్హుడు.
15.యెహోవా “సకల యుగములలో రాజు” అని ఎందుకు పిలువబడ్డాడు?
15 యెహోవాకు మాత్రమే అన్వయించబడే మరో బిరుదు, “సకల యుగములలో రాజు” అనేది. (1 తిమోతి 1:17; ప్రకటన 15:3) దీని అర్థమేమిటి? మన పరిమిత మేధకు దానిని పూర్తిగా గ్రహించడం కష్టం, అయితే యెహోవా ఇరువైపులా అంటే భూత భవిష్యత్ కాలాల్లో నిత్యుడు. కీర్తన 90:2 ఇలా చెబుతోంది: “యుగయుగములు నీవే దేవుడవు.” అందువల్ల యెహోవాకు ఆరంభంలేదు; ఆయన సర్వకాలాల్లో ఉనికిలో ఉన్నాడు. విశ్వంలో ఎవ్వరూ, ఏదీ ఉనికిలోకి రాకపూర్వమే ఆయన ఎప్పటినుండో ఉనికిలోవున్నాడు కాబట్టి, సముచితంగానే ఆయన “మహావృద్ధుడు” అని పిలువబడ్డాడు. (దానియేలు 7:9, 13, 22) మహోన్నతునిగా ఆయన హక్కు గురించి న్యాయంగా ఎవరు ప్రశ్నించగలరు?
16, 17.(ఎ)మనం యెహోవాను ఎందుకు చూడలేము, దానికి మనమెందుకు ఆశ్చర్యపడకూడదు? (బి) మనం చూసి స్పర్శించగల వాటికంటే యెహోవా ఏ భావంలో మరింత వాస్తవికంగా ఉన్నాడు?
16 అయినప్పటికీ, ఫరోలాగే కొందరు ఆ హక్కు గురించి ప్రశ్నిస్తారు. అసంపూర్ణ మానవులు తమ కన్నులతో చూడగల దానినే ఎక్కువగా నమ్మడం, ఆ సమస్యకు కొంతవరకు కారణం. మనం మహోన్నతుని చూడలేము. ఆయన ఆత్మ స్వరూపి, మానవ నేత్రాలకు కనిపించడు. (యోహాను 4:24) అంతేకాదు, రక్తమాంసాలుగల మానవులు యెహోవా దేవుని సమక్షంలో నిలబడే పరిస్థితేవస్తే, వారు బ్రతకరు. స్వయంగా యెహోవాయే మోషేకు ఇలా చెప్పాడు: “నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడు.”—నిర్గమకాండము 33:20; యోహాను 1:18.
17 అది మనలను ఆశ్చర్యపరచకూడదు. మోషే యెహోవా మహిమలో కేవలం కొంతభాగాన్ని చూశాడు, అదీ ఒక దేవదూత ఆయనకు ప్రాతినిధ్యం వహించగా అలా చూశాడని వాస్తవాలు వెల్లడిచేస్తున్నాయి. దాని ప్రభావమెలా ఉంది? ఆ తర్వాత కొద్ది సమయం వరకు మోషే ముఖము ‘ప్రకాశించింది.’ మోషే ముఖాన్ని సూటిగా చూసేందుకు సహితం ఇశ్రాయేలీయులు జంకారు. (నిర్గమకాండము 33:21-23; 34:5-7, 29, 30) కాబట్టి, మహోన్నతుడు తన సమస్త మహిమతో ఉన్నప్పుడు అల్పుడైన ఏ మానవుడూ ఆయనను చూడలేడు. అంటే ఆయన మనం చూసి, స్పర్శించగల వాటికంటే తక్కువ వాస్తవికంగా ఉంటాడని దానర్థమా? ఎంతమాత్రం కాదు, ఎందుకంటే మనం చూడలేని గాలి, రేడియో తరంగాలు, తలంపుల వంటి అనేక విషయాల వాస్తవికతను మనం వెంటనే అంగీకరిస్తాం. అంతేకాక, చెప్పనలవిగాని శతకోట్ల సంవత్సరాలు గడచినా సరే గడిచే కాల ప్రభావం లేకుండా యెహోవా శాశ్వతంగా ఉన్నవాడు. ఆ భావంలో, మనం చూసి స్పర్శించగల వాటికంటే కూడా ఆయన ఎంతో వాస్తవికంగా ఉన్నాడు, ఎందుకంటే భౌతిక జగత్తు వార్ధక్యానికి, క్షీణతకు లోనవుతుంది. (మత్తయి 6:19) అంతమాత్రాన, ఆయన కేవలం ఒక నిగూఢ పదార్థమని, భావరహిత శక్తి అని లేదా అస్పష్ట ప్రథమ కారణమని మనం భావించాలా? మనమా విషయం పరిశీలిద్దాం.
వ్యక్తిత్వమున్న దేవుడు
18.యెహెజ్కేలు ఎలాంటి దర్శనం చూశాడు, యెహోవాకు సమీపంగావున్న “జీవుల” నాలుగు ముఖాలు వేటికి ప్రతీకగా ఉన్నాయి?
18 మనం దేవుణ్ణి చూడలేకపోయినా, కొద్ది క్షణాలపాటు మనకు పరలోకాన్నే చూపించగల ఉత్కంఠభరిత వాక్యభాగాలు బైబిల్లో ఉన్నాయి. యెహెజ్కేలు మొదటి అధ్యాయం అందుకు ఒక ఉదాహరణ. యెహోవా పరలోక సంస్థకు సంబంధించిన ఒక దర్శనాన్ని యెహెజ్కేలు చూశాడు, దానిని ఆయన ఒక సువిశాల దివ్య రథంగా చూశాడు. యెహోవా చుట్టూ ఉన్న బలమైన ఆత్మసంబంధ ప్రాణుల గురించిన వర్ణన ప్రత్యేకంగా మనస్సులపై ముద్రవేసేదిగా ఉంది. (యెహెజ్కేలు 1:4-10) ఈ ‘జీవులకు’ యెహోవాతో సన్నిహిత సంబంధముంది, పైగా వారి రూపాలు వారు సేవించే దేవుని గురించి ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనకు చెబుతాయి. ప్రతి ఒక్కరికి ఎద్దు ముఖం, సింహ ముఖం, పక్షిరాజు ముఖం, మానవ ముఖం వంటి నాలుగు ముఖాలు ఉన్నాయి. ఇవి యెహోవా వ్యక్తిత్వపు నాలుగు ప్రధాన లక్షణాలకు ప్రతీకగా ఉన్నాయని స్పష్టమవుతోంది.—ప్రకటన 4:6-8, 10.
19.(ఎ)ఎద్దుముఖం, (బి) సింహముఖం, (సి) పక్షిరాజు ముఖం, (డి) మానవ ముఖం ద్వారా ఏ లక్షణం సూచించబడింది?
19 బైబిల్లో ఎద్దు తరచూ శక్తికి ప్రాతినిధ్యంగావుంది, అది సముచితమే, ఎందుకంటే అది అపార బలమున్న జంతువు. మరోవైపున, సింహం తరచూ న్యాయానికి చిత్రీకరణగా ఉంది, ఎందుకంటే నిజమైన న్యాయానికి ధైర్యం అవసరం, ఆ లక్షణానికి సింహాలు ప్రసిద్ధికెక్కాయి. పక్షిరాజు లేదా గ్రద్దలు వాటి సునిశిత కనుదృష్టికి పేరుగాంచాయి, ఎన్నో కిలోమీటర్ల దూరంనుండి కూడా అవి అతిచిన్న వస్తువులను సహితం చూడగలవు. అందువల్ల పక్షిరాజు ముఖం దూరదృష్టిగల దేవుని జ్ఞానాన్ని చక్కగా చిత్రీకరిస్తుంది. మరి మానవ ముఖం దేనిని సూచిస్తుంది? దేవుని స్వరూపంలో చేయబడిన మానవునికి దేవుని ప్రబల లక్షణమైన ప్రేమను ప్రతిబింబించే నిరుపమాన సామర్థ్యముంది. (ఆదికాండము 1:26) యెహోవా వ్యక్తిత్వపు ఈ ముఖరూపాలు శక్తి, న్యాయము, జ్ఞానము, ప్రేమ లేఖనాల్లో ఎంత తరచుగా నొక్కిచెప్పబడ్డాయంటే వాటిని దేవుని ప్రధాన లక్షణాలుగా పేర్కొనవచ్చు.
20.దేవుని వ్యక్తిత్వం మారిందేమోనని మనం కలతచెందాలా, మీరెందుకు అలా జవాబిస్తారు?
20 ఇవి బైబిల్లో వర్ణించబడి ఇప్పటికి వేల సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి, ప్రస్తుతం దేవుడు మారిపోయి ఉండొచ్చని మనం కలతచెందాలా? అక్కర్లేదు, దేవుని వ్యక్తిత్వం ఎన్నడూ మారదు. ఆయనిలా చెబుతున్నాడు: “యెహోవానైన నేను మార్పులేనివాడను.” (మలాకీ 3:6) యెహోవా అకారణంగా మార్పుచెందే వ్యక్తిగా ఉండడానికి బదులు, ప్రతి పరిస్థితికి తాను ప్రతిస్పందించే విధానంలో ఆదర్శప్రాయుడైన తండ్రిగా నిరూపించుకుంటాడు. తన వ్యక్తిత్వంలో అత్యంత సముచిత ముఖరూపాలను ఆయన ప్రదర్శిస్తాడు. ఆ నాలుగు లక్షణాల్లో ప్రబలంగా ఉండేది ప్రేమే. దేవుని సమస్త క్రియల్లో అది కనబడుతుంది. ఆయన తన శక్తిని, న్యాయాన్ని, జ్ఞానాన్ని ప్రేమపూర్వకంగా ప్రదర్శిస్తాడు. నిజానికి దేవుని గురించి, ఈ లక్షణం గురించి ఒక అసాధారణ విషయాన్ని బైబిలు తెలుపుతోంది. అదిలా చెబుతోంది: “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:8) దేవునికి ప్రేమ ఉందని లేదా దేవుడు ప్రేమగలవాడని అది చెప్పడం లేదని గమనించండి. బదులుగా, అది దేవుడు ప్రేమాస్వరూపి అని చెబుతోంది. ఆయన సహజ ప్రవృత్తియైన ప్రేమే ఆయనచేసే పనులన్నింటిలో ఆయనను పురికొల్పుతుంది.
‘ఇదిగో! మన దేవుడు’
21.యెహోవా లక్షణాలను మరింత ఎక్కువగా తెలుసుకునే కొలది మనమెలా భావిస్తాము?
21 ఒక చిన్నపిల్లవాడు తన స్నేహితులకు తన తండ్రిని చూపిస్తూ “అదిగో మా నాన్న” అని అమాయకంగా ఆనందంతో, గర్వంతో చెప్పుకోవడం మీరెప్పుడైనా చూశారా? యెహోవా విషయంలో కూడా అదేవిధంగా భావించే ప్రతి కారణం దేవుని ఆరాధకులకు ఉంది. ‘ఇదిగో మన దేవుడు’ అని నమ్మకమైన ప్రజలు ఉల్లసించే కాలం గురించి బైబిలు ముందుగానే చెబుతోంది. (యెషయా 25:8, 9) యెహోవా లక్షణాలను మీరెంత ఎక్కువగా గ్రహిస్తారో, అంత ఎక్కువగా మీరాయనను శ్రేష్ఠమైన తండ్రిగా భావిస్తారు.
22, 23.బైబిలు మన పరలోకపు తండ్రిని ఎలా వర్ణిస్తోంది, మనం తనకు సన్నిహితం కావాలని ఆయన కోరుకుంటున్నాడని మనకెలా తెలుసు?
22 కఠినాత్ములైన కొందరు మతవాదులు, తత్వవేత్తలు బోధించినట్లుగా ఈ తండ్రి వాత్సల్యం లేకుండా, దూరంగా లేదా ముభావంగా ఉండేవాడు కాదు. వాత్సల్యంలేని దేవునికి సన్నిహితం కావాలని మనం కోరుకోము, పైగా మన పరలోకపు తండ్రిని బైబిలు ఆ విధంగా వర్ణించడంలేదు. దానికి భిన్నంగా, ఆయనను ‘సంతోషంగల దేవుడు’ అని అది పిలుస్తోంది. (1 తిమోతి 1:11, NW) ఆయనకు దృఢమైన, మృదువైన భావాలున్నాయి. బుద్ధిసూక్ష్మతగల తన ప్రాణుల సంక్షేమం కోసం తానిచ్చిన నిర్దేశక సూత్రాలు వారు ఉల్లంఘించినప్పుడు ఆయన ‘హృదయములో నొచ్చుకొంటాడు.’ (ఆదికాండము 6:6; కీర్తన 78:41) కానీ ఆయన వాక్య ప్రకారం జ్ఞానయుక్తంగా ప్రవర్తించినప్పుడు మనమాయన ‘హృదయమును సంతోషపరుస్తాము.’—సామెతలు 27:11.
23 మన పరలోకపు తండ్రి మనం తనకు సన్నిహితంగా ఉండాలని కోరుతున్నాడు. ‘ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు కాబట్టి ఆయనను తడవులాడి కనుగొనమని’ ఆయన వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. (అపొస్తలుల కార్యములు 17:26) అయితే అల్పులైన మానవులు విశ్వ సర్వాధిపతికి సన్నిహితమవడం ఎలా సాధ్యం?