అధ్యాయం 30
‘ప్రేమ కలిగి నడుచుకోండి’
1-3.ప్రేమ చూపించడంలో మనం యెహోవా మాదిరిని అనుకరించినప్పుడు ఎలాంటి ఫలితాలొస్తాయి?
“పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:35) యేసు పలికిన ఆ మాటలు ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని నొక్కిచెబుతున్నాయి: నిస్వార్థ ప్రేమ ప్రతిఫలదాయకమైనది. ప్రేమను పుచ్చుకోవడంలో ఎంతో సంతోషమున్నా, దాన్ని ఇతరులకు ఇవ్వడంలో లేదా చూపడంలో మరింత సంతోషం ఉంటుంది.
2 ఈ విషయం మన పరలోకపు తండ్రికంటే ఎక్కువగా మరెవ్వరికీ తెలియదు. ఈ విభాగంలోని ముందరి అధ్యాయాల్లో మనం చూసినట్లుగా, ప్రేమకు యెహోవాయే సర్వోన్నత మాదిరి. ఆయన చూపించినన్ని విశిష్ట విధానాల్లో లేదా ఆయన చూపించినంత సుదీర్ఘ కాలంపాటు ప్రేమను ఎవరూ చూపించలేదు. కాబట్టి యెహోవా ‘సంతోషంగల దేవుడు’ అని పిలువబడడంలో ఆశ్చర్యం ఏమైనా ఉందా?—1 తిమోతి 1:11, NW.
3 మన ప్రేమగల దేవుడు, ప్రత్యేకించి ప్రేమచూపే విషయానికి వచ్చినప్పుడు మనమాయనలా ఉండేందుకు ప్రయత్నించాలని కోరుతున్నాడు. ఎఫెసీయులు 5:1, 2 మనకిలా చెబుతోంది: “మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి. . . . ప్రేమగలిగి నడుచుకొనుడి.” ప్రేమ చూపడంలో మనం యెహోవా మాదిరిని అనుకరించినప్పుడు, ఇవ్వడం వల్ల కలిగే గొప్ప సంతోషాన్ని మనం అనుభవిస్తాం. యెహోవాను సంతోషపరుస్తున్నామని తెలుసుకోవడంలోని సంతృప్తి కూడా మనకుంటుంది, ఎందుకంటే ఆయన వాక్యం ‘ఒకని నొకడు ప్రేమించుకొనుడని’ మనకు ఉద్బోధిస్తోంది. (రోమీయులు 13:8) అయితే మనమెందుకు ‘ప్రేమ కలిగి నడుచుకోవాలి’ అనేదానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
ప్రేమ ఎందుకు ఆవశ్యకం
4, 5.తోటి విశ్వాసులపట్ల మనం స్వయం త్యాగ ప్రేమను చూపడం ఎందుకు ప్రాముఖ్యం?
4 తోటి విశ్వాసులపట్ల మనం ప్రేమ చూపడం ఎందుకు ప్రాముఖ్యం? సరళంగా చెప్పాలంటే, నిజ క్రైస్తవత్వపు సారమే ప్రేమ. ప్రేమ లేకుండా మనకు తోటి క్రైస్తవులతో సన్నిహిత సంబంధం సాధ్యంకాదు, అంతకంటే ముఖ్యంగా యెహోవా దృష్టిలో మనకెలాంటి విలువా ఉండదు. ఈ సత్యాలను దేవుని వాక్యం ఎలా నొక్కిచెబుతోందో పరిశీలించండి.
5 యేసు తన భూజీవితపు చివరి రాత్రి తన అనుచరులకు ఇలా చెప్పాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహాను 13:34, 35) “నేను మిమ్మును ప్రేమించినట్టే”—అవును యేసు కనబరచిన ప్రేమనే మనమూ కనబరచాలని మనకు ఆజ్ఞాపించబడింది. ఇతరుల అవసరాలకు, ఆసక్తులకు ప్రాధాన్యతనిస్తూ స్వయం త్యాగ ప్రేమ చూపడంలో యేసు ఉత్కృష్ట మాదిరి ఉంచాడని మనం 29వ అధ్యాయంలో గమనించాం. మనం కూడా నిస్వార్థ ప్రేమను కనబరచాలి అంతేగాక ఆ ప్రేమ క్రైస్తవ సంఘం వెలుపలివారికి సైతం కనబడేంత స్పష్టంగా కనబరచాలి. అవును స్వయం త్యాగ సహోదర ప్రేమ, మనం క్రీస్తు నిజ అనుచరులమనేందుకు గుర్తు.
6, 7.(ఎ)యెహోవా వాక్యం ప్రేమ చూపించడానికి ఎక్కువ విలువిస్తుందని మనకెలా తెలుసు? (బి) 1 కొరింథీయులు 13:4-8లో గ్రంథస్తం చేయబడిన పౌలు మాటలు ప్రేమకు సంబంధించిన ఏ అంశంపై దృష్టి నిలుపుతున్నాయి?
6 ఒకవేళ మనలో ప్రేమ లోపించితే అప్పుడెలా? “నేను . . . ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (1 కొరింథీయులు 13:1) ఒకదానికొకటి కొట్టుకునే తాళాలు చెవులకు ఇంపుకాని శబ్దాన్ని పుట్టిస్తాయి. కంచు శబ్దం మాటేమిటి? ఇతర అనువాదాలు “మ్రోగెడు గంట” లేదా “ప్రతిధ్వనించే గంట” అని చెబుతున్నాయి. ఎంత అనురూపమైన ఉదాహరణలో గదా! ప్రేమలేని వ్యక్తి ఆకర్షించడానికి బదులు కర్ణకఠోరమైన ధ్వనిపుట్టిస్తూ, అపస్వరాలు మ్రోగే సంగీత సాధనంలా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇతరులతో సన్నిహిత సంబంధమెలా అనుభవించగలడు? పౌలు ఇంకా ఇలా అన్నాడు: “కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.” (1 కొరింథీయులు 13:2) ఒక్కసారి ఊహించండి, ప్రేమలేని వ్యక్తి ఎన్ని పనులు చేసినా అతడు ‘వ్యర్థుడే.’ యెహోవా వాక్యం ప్రేమ చూపించడానికి ఎక్కువ విలువిస్తుందనేది స్పష్టం కావడం లేదా?
7 అయితే మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఈ లక్షణాన్ని ఎలా కనబరచవచ్చు? దానికి జవాబివ్వడానికి, 1 కొరింథీయులు 13:4-8లో కనబడే పౌలు మాటలను మనం పరిశీలిద్దాం. ఈ వచనాల్లో నొక్కిచెప్పబడిన విషయం మనపట్ల దేవుని ప్రేమ గురించో దేవునిపట్ల మన ప్రేమ గురించో కాదు. బదులుగా, మనం పరస్పరం చూపించుకోవలసిన ప్రేమపై పౌలు దృష్టి నిలిపాడు. ప్రేమ ఏది అవునో, ఏది కాదో తెలిపే సంగతులను ఆయన వర్ణిస్తున్నాడు.
ప్రేమంటే ఏమిటి?
8.దీర్ఘకాలం సహించడం ఇతరులతో మన వ్యవహారాల్లో మనకెలా సహాయం చేస్తుంది?
8 “ప్రేమ దీర్ఘకాలము సహించును.” దీర్ఘ కాలం సహించడమంటే ఇతరులను ఓపికగా సహించడమని అర్థం. (కొలొస్సయులు 3:13) మనకలాంటి ఓపిక అవసరం కాదంటారా? మనం భుజాలు కలిపి సేవచేసే అపరిపూర్ణ మానవులం కాబట్టి, ఆయా సందర్భాల్లో మన క్రైస్తవ సహోదరులు మనకు కోపం రప్పిస్తారని ఎదురుచూడ్డం వాస్తవికమే, మనం కూడా వారికి చికాకు కలిగిస్తుండవచ్చు. అయితే ఓపిక చూపడం, భరించడం సంఘ సమాధానాన్ని పాడుచేయకుండా, ఇతరులతో మన వ్యవహారాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలను, చికాకులను సహించడానికి మనకు సహాయం చేయగలవు.
9.ఇతరులపట్ల మనం ఏయే విధాలుగా దయ చూపించవచ్చు?
9 “ప్రేమ . . . దయ చూపించును.” సహాయక చర్యలు, శ్రద్ధాపూర్వక మాటలతో దయ చూపించబడుతుంది. ప్రత్యేకించి ఎక్కువ అవసరంలో ఉన్నవారిపట్ల మనం దయచూపేందుకు మార్గాలు అన్వేషించడానికి ప్రేమ మనలను పురికొల్పుతుంది. ఉదాహరణకు, ఒక తోటి వృద్ధ విశ్వాసి ఒంటరితనంతో బాధపడుతుండవచ్చు, అతనికి ప్రోత్సాహకరమైన సందర్శనం అవసరం కావచ్చు. ఒంటరి తల్లికి లేదా మతపరంగా విభాగించబడిన గృహంలో నివసిస్తున్న సహోదరికి కొంత సహాయం అవసరం కావచ్చు. వ్యాధితోవున్న లేదా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న మరొకరికి విశ్వసనీయ స్నేహితుని నుండి దయగల మాటలు అవసరం కావచ్చు. (సామెతలు 12:25; 17: 17) అలాంటి సందర్భాల్లో దయచూపడానికి మనం చొరవ తీసుకున్నప్పుడు, మన ప్రేమ ఎంత యథార్థమైనదో మనం చూపిస్తాము.—2 కొరింథీయులు 8:8.
10.మనం సత్యాన్ని సమర్థించి, సత్యం మాట్లాడడం అంత సులభం కాని పరిస్థితుల్లో కూడా అలా చేయడానికి ప్రేమ మనకెలా సహాయం చేస్తుంది?
10 “ప్రేమ . . . సత్యమునందు సంతోషించును.” మరో అనువాదం ఇలా చెబుతోంది: “ప్రేమ . . . ఆనందంగా సత్యం పక్షం వహిస్తుంది.” ప్రేమ మనం సత్యాన్ని సమర్థించడానికి ‘పొరుగువానితో సత్యమే మాటలాడటానికి’ మనలను పురికొల్పుతుంది. (జెకర్యా 8:16) ఉదాహరణకు, ఒకవేళ మనకు ప్రియమైన వారొకరు గంభీరమైన పాపం చేసినట్లయితే యెహోవాపట్లా, తప్పిదస్థునిపట్లా ఉన్న ప్రేమ ఆ తప్పును దాచిపెట్టడానికి, సాకులు వెదకడానికి లేదా ఆ తప్పిదం విషయంలో చివరకు అబద్ధం చెప్పడానికి బదులు దేవుని ప్రమాణాలకు కట్టుబడి ఉండడానికి సహాయం చేస్తుంది. నిజమే, వాస్తవాల సత్యాన్ని అంగీకరించడం కష్టంగా ఉండవచ్చు. కానీ మన ప్రియమైనవారి ప్రయోజనాన్ని మనసులో ఉంచుకున్నప్పుడు, అతడు దేవుని ప్రేమపూర్వక క్రమశిక్షణకు ప్రతిస్పందించి, దాన్ని అంగీకరించాలని మనం కోరుకుంటాం. (సామెతలు 3:11, 12) ప్రేమగల క్రైస్తవులుగా మనం ‘అన్ని విషయాల్లో యోగ్యముగా ప్రవర్తించాలని’ కూడా ఇష్టపడతాం.—హెబ్రీయులు 13:18.
11.ప్రేమ ‘అన్నిటికి తాళుకొంటుంది’ కాబట్టి తోటి విశ్వాసుల లోపాలకు సంబంధించి మనమేమి చేయడానికి కృషిచేయాలి?
11 “ప్రేమ . . . అన్నిటికి తాళుకొనును.” ఆ మాటకు అక్షరార్థంగా “అన్నిటిని కప్పును” అని అర్థం. (అధస్సూచి) మొదటి పేతురు 4:8 ఇలా చెబుతోంది: “ప్రేమ అనేక పాపములను కప్పును.” అవును, ప్రేమచే నడిపించబడే క్రైస్తవుడు తన క్రైస్తవ సహోదరుల సమస్త అపరిపూర్ణతలను, లోపాలను బయటపెట్టడానికి తొందరపడడు. చాలా సందర్భాల్లో తోటి విశ్వాసుల తప్పులు, పొరపాట్లు చాలా అల్పమైనవిగా, ప్రేమతో కప్పబడేవిగా ఉంటాయి.—సామెతలు 10:12; 17:9.
12.ఫిలేమోను విషయంలో ఉత్తమమైనదే తాను నమ్మాడని అపొస్తలుడైన పౌలు ఎలా చూపించాడు, పౌలు మాదిరినుండి మనమేమి నేర్చుకోవచ్చు?
12 “ప్రేమ . . . అన్నిటిని నమ్మును.” ప్రేమ “అన్ని సందర్భాల్లో ఉత్తమమైనదే నమ్మడానికి ఆతురత కలిగి ఉంటుంది” అని మొఫత్ అనువాదం చెబుతోంది. మన తోటి విశ్వాసుల ప్రతీ ఉద్దేశాన్ని శంకిస్తూ, వారిని అనవసరంగా అనుమానించం. మన సహోదరుల గురించి ‘ఉత్తమమైనదే నమ్మడానికి,’ వారిని విశ్వసించడానికి ప్రేమ మనకు సహాయం చేస్తుంది. a ఫిలేమోనుకు పౌలు వ్రాసిన ఉత్తరంలో ఒక ఉదాహరణ గమనించండి. దాసునిగా పారిపోయి క్రైస్తవునిగా మారి తిరిగివస్తున్న ఒనేసిమును దయాపూర్వకంగా ఆహ్వానించమని ఫిలేమోనును ప్రోత్సహించడానికి పౌలు ఆ ఉత్తరం వ్రాస్తున్నాడు. ఫిలేమోనును బలవంతపెట్టడానికి ప్రయత్నించే బదులు, ప్రేమమీద ఆధారపడి పౌలు వేడుకొన్నాడు. “నేను చెప్పినదానికంటే నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను” అని చెబుతూ ఫిలేమోను యోగ్యమైనదే చేస్తాడనే నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశాడు. (21వ వచనం) మనం మన సహోదరుల పట్ల కూడా అలాంటి నమ్మకాన్నే వ్యక్తం చేసేలా ప్రేమ మనల్ని పురికొల్పినప్పుడు, మనం వారిలో ఉత్తమమైనదే వృద్ధి చేస్తాము.
13.మన సహోదరుల విషయంలో మనం ఉత్తమమైనదే నిరీక్షిస్తామని ఎలా చూపవచ్చు?
13 “ప్రేమ . . . అన్నిటిని నిరీక్షించును.” ప్రేమ నమ్మదగినది, అలాగే అది నిరీక్షించదగినది కూడా. ప్రేమచే పురికొల్పబడి మనం మన సహోదరుల కోసం ఉత్తమమైనదే నిరీక్షిస్తాం. ఉదాహరణకు, ఒక సహోదరుడు “ఏ తప్పిదములోనైనను చిక్కుకొనినయెడల” అతడ్ని సరిదిద్దడానికి చేయబడే ప్రేమపూర్వక ప్రయత్నాలకు, అతను ప్రతిస్పందిస్తాడని మనం నిరీక్షిస్తాం. (గలతీయులు 6:1) విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారు తేరుకుంటారని కూడా మనం నిరీక్షిస్తాం. వారు విశ్వాసంలో బలంగా తయారుకావడానికి మనం చేయగల సహాయం చేస్తూ అలాంటివారి విషయంలో మనం ఓపిక చూపిస్తాం. (రోమీయులు 15:1; 1 థెస్సలొనీకయులు 5:14) మనకు ప్రియమైన వారొకరు దారితప్పినా అతడు ఏదోక రోజు తన పొరపాటు గ్రహించి యేసు ఉపమానంలోని తప్పిపోయిన కుమారునివలె యెహోవా దగ్గరకు తిరిగి వస్తాడనే మన నిరీక్షణను విడిచిపెట్టము.—లూకా 15:17, 18.
14.మన సహనం సంఘంలోనే ఏయే విధాలుగా పరీక్షించబడవచ్చు, ప్రతిస్పందించడానికి ప్రేమ మనకెలా సహాయం చేస్తుంది?
14 “ప్రేమ . . . అన్నిటిని ఓర్చును.” నిరుత్సాహాలు లేదా కష్టాలు ఎదురైనప్పటికీ మనం స్థిరంగా నిలబడడానికి ఓరిమి మనకు సహాయం చేస్తుంది. ఓరిమి సంబంధిత పరీక్షలు కేవలం సంఘం బయటనుండి మాత్రమే రావు. కొన్నిసార్లు సంఘంలోనే మనం పరీక్షించబడవచ్చు. అపరిపూర్ణత కారణంగా మన సహోదరులు ఆయా సందర్భాల్లో మనకు నిరుత్సాహం కలిగించవచ్చు. అనాలోచితంగా మాట్లాడడం మన భావాలను గాయపరచవచ్చు. (సామెతలు 12:18) సంఘానికి సంబంధించిన ఒకానొక విషయం బహుశా మనం అనుకున్న రీతిలో నిర్వహించబడకపోవచ్చు. గౌరవనీయుడైన ఒక సహోదరుని ప్రవర్తన, ‘ఒక క్రైస్తవుడు ఆ విధంగా ఎలా ప్రవర్తించగలడు?’ అని మనం అనుకునేలా చేస్తూ మనకు బాధ కలిగించవచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, సంఘం నుండి వైదొలగి, యెహోవాను సేవించడం మానుకుంటామా? మనలో ప్రేమ ఉంటే మనమలా చేయము. అవును, ఆ సహోదరునిలో లేదా సంఘమంతటిలో ఇక ఏ మాత్రం మంచి చూడలేనంతగా అతని వైఫల్యాలతో అంధులం కాకుండా ప్రేమ మనలను అడ్డుకొంటుంది. మరో అపరిపూర్ణ మానవుడు పలికినది లేదా చేసినది ఏమైనప్పటికీ, దేవునికి నమ్మకంగా ఉండేందుకు, సంఘానికి మద్దతునిచ్చేందుకు ప్రేమ మనలను బలపరుస్తుంది.—కీర్తన 119:165.
ప్రేమంటే ఏమికాదు
15.మత్సరమంటే ఏమిటి, నాశనకరమైన ఈ భావావేశాన్ని తప్పించుకోవడానికి ప్రేమ మనకెలా సహాయం చేస్తుంది?
15 “ప్రేమ మత్సరపడదు.” మత్సరం ఇతరులకున్న వస్తువులు, ఆధిక్యతలు లేదా సామర్థ్యాలు చూసి ఈర్ష్యపడేలా చేస్తుంది. అలాంటి మత్సరం స్వార్థపూరితమైన, నాశనకరమైన భావావేశం. దానిని అదుపుచేసుకోకుంటే సంఘ సమాధానాన్ని అది పాడుచేస్తుంది. మత్సరపడే స్వభావాన్ని ఎదుర్కోవడానికి మనకేది సహాయం చేస్తుంది? ఒక్కమాటలో చెప్పాలంటే, అది ప్రేమే. ఈ ప్రశస్తమైన లక్షణం, మనకులేని కొన్ని అనుకూలతలు ఇతరుల జీవితాల్లో ఉన్నట్లు కనిపించే వారితో కూడా సంతోషించేందుకు మనకు సహాయం చేస్తుంది. (రోమీయులు 12:15) తమకున్న అపురూప సామర్థ్యాన్నిబట్టి లేదా తాము సాధించిన అసాధారణ ఘనకార్యాన్నిబట్టి ఎవరైనా ప్రశంసలు అందుకున్నప్పుడు మనకేదో అవమానం జరిగినట్లు దృష్టించకుండా ప్రేమ మనకు సహాయం చేస్తుంది.
16.మనం నిజంగా మన సహోదరులను ప్రేమిస్తున్నట్లయితే, యెహోవా సేవలో మనం చేస్తున్న దాని గురించి మనమెందుకు గొప్పలు చెప్పుకోము?
16 “ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు.” మన ప్రతిభను లేదా ఘనకార్యాలను గర్వంగా చెప్పుకోకుండా ప్రేమ మనలను అడ్డగిస్తుంది. మనం నిజంగా మన సహోదరులను ప్రేమిస్తున్నట్లయితే పరిచర్యలో మన సఫలత గురించి లేదా సంఘంలో మనకున్న ఆధిక్యతల గురించి మనమెలా అదేపనిగా గొప్పలు చెప్పుకోగలము? అలా డాబుగా చెప్పుకోవడం, ఇతరులను తక్కువగా అంచనావేస్తున్నామనే భావాన్ని వ్యక్తం చేసి వారిని నిరుత్సాహపరుస్తుంది. దేవుడు తన సేవలో మనం చేయడానికి అనుమతించే దాని గురించి గొప్పలు చెప్పుకునేందుకు ప్రేమ అనుమతించదు. (1 కొరింథీయులు 3:5-9) అంతేకాకుండా, ప్రేమ “ఉప్పొంగదు” లేదా మరో అనువాదం చెబుతున్నట్లుగా అది “తన సొంత ప్రాముఖ్యతను గురించిన ఆడంబరమైన తలంపులను బట్టి సంతోషించదు.” మన గురించి మనమే గొప్పగా భావించకుండా ప్రేమ మనలను ఆపుజేస్తుంది.—రోమీయులు 12:3.
17.మనం ఇతరుల విషయంలో దేనిని ఆలోచించడానికి ప్రేమ పురికొల్పుతుంది, అందువల్ల మనమెలాంటి ప్రవర్తనను విసర్జిస్తాం?
17 “ప్రేమ . . . అమర్యాదగా నడువదు.” అమర్యాదగా నడిచే వ్యక్తి అనుచితంగా లేదా అసహ్యంగా ప్రవర్తిస్తాడు. అలాంటి వైఖరి ప్రేమరహితమైనది, ఎందుకంటే అది ఇతరుల భావాలను, సంక్షేమాన్ని పూర్తిగా ఉపేక్షిస్తుంది. దానికి భిన్నంగా, ప్రేమలోవున్న దాక్షిణ్యం ఇతరుల కష్టసుఖాలు ఆలోచించేలా మనలను పురికొల్పుతుంది. ప్రేమ మంచి సంస్కారాన్ని, దైవభక్తిగల ప్రవర్తనను, తోటి విశ్వాసులపట్ల గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి, ప్రేమ ‘అసభ్య ప్రవర్తనను’ అంటే మన క్రైస్తవ సహోదరులను వ్యాకులపరిచే లేదా అభ్యంతరపరిచే ఏ ప్రవర్తననూ అనుమతించదు.—ఎఫెసీయులు 5:3, 4, NW.
18.ప్రేమగల వ్యక్తి ప్రతీదీ తన పద్ధతి చొప్పునే జరగాలని ఎందుకు పట్టుబట్టడు?
18 “ప్రేమ . . . స్వప్రయోజనమును విచారించుకొనదు.” మరో అనువాదం దానిని ఇలా చెబుతోంది: “ప్రేమ తన సొంత పద్ధతినే బలవంతపెట్టదు.” ప్రేమగల వ్యక్తి తన అభిప్రాయాలే అన్ని సందర్భాల్లో సరైనవన్నట్లు ప్రతీదీ తన పద్ధతిలోనే జరగాలని పట్టుబట్టడు. భిన్నాభిప్రాయం గలవారు ఎలాగైనా తన మాట వినేలా అతడు తన ఒప్పించే శక్తిని నేర్పుగా ఉపయోగిస్తూ ఇతరులపై ప్రభావం చూపడు. అలాంటి మొండిపట్టు అతనిలోవున్న గర్వాన్ని వెల్లడి చేస్తుంది, బైబిలు ఇలా చెబుతోంది: “నాశనమునకు ముందు గర్వము నడచును.” (సామెతలు 16:18) మనం నిజంగా మన సహోదరులను ప్రేమిస్తే, మనం వారి అభిప్రాయాలను గౌరవించి, సాధ్యమైనచోట లోబడడానికి సుముఖంగా ఉంటాము. పరిస్థితులకు తగిన విధంగా మారే స్వభావం పౌలు పలికిన ఈ మాటలకు అనుగుణంగా ఉంటుంది: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.”—1 కొరింథీయులు 10:24.
19.మనకు ఇతరులు బాధ కలిగించినప్పుడు మనమెలా ప్రతిస్పందించడానికి ప్రేమ సహాయం చేస్తుంది?
19 “ప్రేమ . . . త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.” ఇతరులు చెప్పే లేదా చేసే వాటినిబట్టి ప్రేమ సులభంగా కోపపడదు. నిజమే, ఇతరులు మనకు బాధ కలిగించినప్పుడు మనస్సు నొచ్చుకోవడం సహజమే. న్యాయసమర్థమైన కోపం మనకొచ్చినా, ఆ కోపం అలాగే ఉంచుకోవడానికి ప్రేమ మనలను అనుమతించదు. (ఎఫెసీయులు 4:26, 27) మనల్ని గాయపరచిన మాటలను లేదా క్రియలను మరచిపోవడానికి వీల్లేని విధంగా ఒక ఖాతా పుస్తకంలో వ్రాసికొన్నట్లుగా జ్ఞాపకం ఉంచుకోము. బదులుగా, మన ప్రేమగల దేవుని అనుకరించడానికి ప్రేమ మనలను పురికొల్పుతుంది. మనం 26వ అధ్యాయంలో చూసినట్లుగా, సరైన కారణమున్నప్పుడు యెహోవా క్షమిస్తాడు. ఆయన మనల్ని క్షమించినప్పుడు, ఇక వాటిని మరచిపోతాడు అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ పాపాలను ఆయన మనమీద మళ్ళీ మోపడు. యెహోవా అపకారమును మనస్సులో ఉంచుకోనందుకు మనం కృతజ్ఞులం కాదా?
20.తోటి విశ్వాసి ఒకరు తప్పులో చిక్కుబడి, ఫలితంగా బాధపడుతుంటే మనమెలా ప్రతిస్పందించాలి?
20 ‘ప్రేమ . . . దుర్నీతి విషయమై సంతోషపడదు.’ మరో అనువాదంలో ఆ వచనం ఇలా ఉంది: “ప్రేమ . . . పరుల పాపాలనుబట్టి దుర్బుద్ధితో సంతోషపడదు.” మొఫత్ అనువాదం ఇలా చెబుతోంది: “ఇతరులు తప్పు చేస్తే ప్రేమ ఎన్నడూ సంతోషించదు.” దుర్నీతిలో ప్రేమకు సంతోషం లేదు, కాబట్టి ఎలాంటి లైంగిక దుర్నీతినైనా మనం కన్నెత్తి చూడం. తోటి విశ్వాసి ఒకరు పాపపు చిక్కులోపడి దాని ఫలితంగా బాధననుభవిస్తుంటే మనమెలా ప్రతిస్పందిస్తాం? ‘మంచిగా జరిగింది! అతనికలా జరగాల్సిందే!’ అన్నట్లుగా సంతోషించేలా ప్రేమ మనలను అనుమతించదు. (సామెతలు 17:5) అయితే తప్పుచేసిన సహోదరుడు తన ఆధ్యాత్మిక పాటునుండి తేరుకోవడానికి సానుకూల చర్యలు తీసుకున్నప్పుడు మనం సంతోషిస్తాం.
“సర్వోత్తమమైన మార్గము”
21-23.(ఎ)“ప్రేమ శాశ్వతకాలముండును” అని చెప్పినప్పుడు పౌలు భావమేమిటి? (బి) చివరి అధ్యాయంలో ఏమి పరిశీలించబడుతుంది?
21 “ప్రేమ శాశ్వతకాలముండును.” ఆ మాటలకు పౌలు భావమేమిటి? సందర్భానుసారంగా చూస్తే ఆయన తొలి క్రైస్తవుల్లో ఉన్న ఆత్మ వరాల గురించి చర్చిస్తున్నాడు. ఆ వరాలు కొత్తగా రూపొందిన సంఘంపై దేవుని అనుగ్రహం ఉందనడానికి సూచనలుగా పనిచేశాయి. అయితే క్రైస్తవులందరూ స్వస్థత చేకూర్చడం, ప్రవచించడం లేదా భాషల్లో మాట్లాడడం చేయలేకపోయారు. అయితే అది పెద్ద విషయమేమీ కాదు, ఎందుకంటే ఆ అద్భుతవరాలు చివరకు ఎలాగూ నిలిచిపోతాయి. కానీ ప్రతీ క్రైస్తవుడు అలవరచుకోగల ఒకటి మాత్రం నిలిచివుంటుంది. అది ఇతర అద్భుత వరాలన్నింటికన్నా ఎంతో అసాధారణమైనదీ, మరింత శాశ్వతమైనదీ. నిజానికి పౌలు దానిని “సర్వోత్తమమైన మార్గము” అని పిలిచాడు. (1 కొరింథీయులు 12:31) ఇంతకూ ఆ “సర్వోత్తమమైన మార్గము” ఏమిటి? అదే ప్రేమ మార్గం.
యెహోవా ప్రజలు పరస్పర ప్రేమచే గుర్తించబడతారు
22 అవును, పౌలు వర్ణించిన క్రైస్తవ ప్రేమ “శాశ్వతకాలముండును,” అంటే అదెన్నటికీ అంతంకాదు. నేటికీ స్వయం త్యాగపూరిత సహోదర ప్రేమ యేసు నిజ అనుచరులకు గుర్తింపు చిహ్నంగా ఉంది. భూవ్యాప్తంగా యెహోవా ఆరాధకుల సంఘాల్లో అలాంటి ప్రేమకు రుజువును మనం చూడడం లేదా? ఆ ప్రేమ నిరంతరం ఉంటుంది, ఎందుకంటే యెహోవా తన నమ్మకమైన సేవకులకు నిత్యజీవాన్ని వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 37:9-11, 29) ‘ప్రేమ కలిగి నడుచుకోవడానికి’ శాయశక్తులా కృషిచేయడంలో కొనసాగుదము గాక. తద్వారా ఇవ్వడంలోని అధిక సంతోషాన్ని మనం అనుభవించవచ్చు. అంతకంటే ఎక్కువగా మనం మన ప్రేమగల దేవుడైన యెహోవాను అనుకరిస్తూ నిరంతరం జీవించడంలో, అవును నిరంతరం ప్రేమించడంలో కొనసాగవచ్చు.
23 ప్రేమకు సంబంధించిన విభాగపు ఈ ముగింపు అధ్యాయంలో, ప్రేమను పరస్పరం ఎలా చూపించుకోవచ్చో మనం పరిశీలించాం. అయితే యెహోవా ప్రేమనుండి అలాగే ఆయన శక్తి, న్యాయం, జ్ఞానం నుండి ప్రయోజనం పొందగల అనేక మార్గాల దృష్ట్యా, ‘యెహోవాను నిజంగా ప్రేమిస్తున్నానని ఆయనకు నేను ఎలా చూపించగలను?’ అని మనం ప్రశ్నించుకోవడం మంచిది. ఆ ప్రశ్న మన చివరి అధ్యాయంలో పరిశీలించబడుతుంది.
a అయితే క్రైస్తవ ప్రేమ సులభంగా మోసగించబడేది కాదనేది నిజం. బైబిలు మనల్ని ఇలా హెచ్చరిస్తోంది: “భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి . . . వారిలోనుండి తొలగిపోవుడి.”—రోమీయులు 16:17, 18.