కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 26

“క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు

“క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు

1-3.(ఎ)కీర్తనకర్తయైన దావీదు ఎలాంటి భారాన్ని మోశాడు, తన వ్యధాభరిత హృదయానికి ఆయన ఓదార్పునెలా కనుగొన్నాడు? (బి) మనం పాపం చేసినప్పుడు, దాని ఫలితంగా మనమెలాంటి భారాన్ని మోస్తుండవచ్చు, అయితే యెహోవా మనకు ఎలాంటి హామీ ఇస్తున్నాడు?

 “నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను” అని కీర్తనకర్త దావీదు వ్రాశాడు. (కీర్తన 38:4, 8) అపరాధ భావాలతో కృంగిన మనస్సాక్షి ఎంత భారంగా ఉండగలదో దావీదుకు తెలుసు. అయితే ఆయన తన వ్యధాభరిత హృదయానికి ఓదార్పును కనుగొన్నాడు. యెహోవా పాపాన్ని ద్వేషించినా, నిజంగా పశ్చాత్తాపపడి తన పాపిష్టి విధానాన్ని త్యజించినప్పుడు ఆయన పాపిని ద్వేషించడని దావీదు అర్థం చేసుకున్నాడు. పశ్చాత్తప్తులపట్ల కనికరం చూపాలని యెహోవాకు ఉన్న సంసిద్ధతలో పూర్తి నమ్మకంగల దావీదు ఇట్లన్నాడు: “ప్రభువా, నీవు . . . క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు.”—కీర్తన 86:5.

2 మనకు కూడా, పాపం చేసినప్పుడు బాధాతప్త మనస్సాక్షి ఒక పెద్ద భారంలా తయారుకావచ్చు. ఈ పరితాప భావం ప్రయోజనకరమైనది. అది మన తప్పులు సరిదిద్దుకునేందుకు అనుకూల చర్యలు తీసుకోవడానికి మనలను పురికొల్పుతుంది. అయితే, అపరాధ భావపు దుఃఖంలో మునిగిపోయే ప్రమాదముంది. మనమెంత పశ్చాత్తాపపడినా యెహోవా మనలను క్షమించడని మనలను ఖండించే మన సొంత హృదయమే మనపై ఒత్తిడి తీసుకురావచ్చు. మనం ఒకవేళ దోషభావపు దుఃఖంలో ‘మునిగిపోతే’ యెహోవా మనలను విలువలేని వారిగా, ఆయనను సేవించడానికి పనికిరానివారిగా దృష్టిస్తున్నాడని మనం ఆశవదులుకొనేలా చేయడానికి సాతాను ప్రయత్నించవచ్చు.—2 కొరింథీయులు 2:5-11.

3 యెహోవా మనలను అలా దృష్టిస్తున్నాడా? ఎంతమాత్రం లేదు. యెహోవా గొప్ప ప్రేమలో క్షమించడం ఒక అంశం. మనం యథార్థమైన, హృదయపూర్వకమైన పశ్చాత్తాపం కనబరచినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయన వాక్యం మనకు హామీ ఇస్తోంది. (సామెతలు 28:13) యెహోవా క్షమాపణ మనకు దొరకదన్న భావాలను తొలగించుకోవడానికి, ఆయన ఎందుకు, ఎలా క్షమిస్తాడో మనం పరిశీలిద్దాం.

యెహోవా ఎందుకు ‘క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు’

4.మన స్వభావం గురించి యెహోవా ఏమి జ్ఞాపకముంచుకుంటాడు, ఆయన మనతో వ్యవహరించే విధానంపై ఇదెలా ప్రభావం చూపుతుంది?

4 మన పరిమితులు యెహోవాకు తెలుసు. “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు” అని కీర్తన 103:14 చెబుతోంది. మనం మంటి ప్రాణులమనీ, అపరిపూర్ణత కారణంగా మనలో లోపాలు లేదా బలహీనతలు ఉంటాయనీ ఆయన మరచిపోడు. “మనము నిర్మింపబడిన రీతి” ఆయనకు తెలుసనే మాటలు, బైబిలు యెహోవాను కుమ్మరితో మనలను ఆయనచేసే పాత్రలతో పోల్చుతోందనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. a (యిర్మీయా 18:2-6) బలహీనమైన మన పాప స్వభావానికి, ఆయన మార్గదర్శకత్వానికి మనం ప్రతిస్పందించే విధానానికి, ప్రతిస్పందించడానికి విఫలమయ్యే విధానానికి తగినట్లుగా ఆ గొప్ప కుమ్మరి తన వ్యవహార పద్ధతిని మార్చుకుంటాడు.

5.పాపపు బలమైన పట్టును రోమీయులకు వ్రాసిన పత్రిక ఎలా వర్ణిస్తోంది?

5 పాపమెంత బలమైనదో యెహోవా అర్థం చేసుకుంటాడు. పాపము మనిషిని మరణకరమైన తన గుప్పిట్లో బిగించే బలమైన శక్తి అని ఆయన వాక్యం వర్ణిస్తోంది. ఆ పాపపు పట్టు ఎంత బలంగా ఉంటుంది? రోమీయులకు వ్రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: సైనికులు సైనికాధికారి క్రిందవున్నట్లుగా మనం “పాపమునకు లోనైయున్నా[ము].” (రోమీయులు 3:9); పాపము మానవాళిపై ఒక రాజుగా ‘ఏలింది.’ (రోమీయులు 5:21); అది మనలో ‘నివసిస్తోంది.’ (రోమీయులు 7:17, 20); దాని “నియమము” మనలో నిర్విరామంగా పనిచేస్తోంది, నిజానికి మన విధానాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది. (రోమీయులు 7:23, 25) మన అపరిపూర్ణ శరీరంపై పాపపు పట్టు ఎంత బలీయంగా ఉందో కదా!—రోమీయులు 7:21, 24.

6, 7.(ఎ)పశ్చాత్తాప హృదయంతో తన కరుణ కోసం వెదికేవారిని యెహోవా ఎలా దృష్టిస్తాడు? (బి) మనం దేవుని కరుణను తేలికగా ఎందుకు తీసుకోకూడదు?

6 కాబట్టి, మనఃపూర్వకంగా విధేయత చూపడానికి మనమెంత పరితపించినా, దానిని పరిపూర్ణంగా చూపడం మనకు సాధ్యంకాదని యెహోవాకు తెలుసు. పరితాపంగల హృదయంతో మనమాయన కనికరం కోసం వెదకినప్పుడు క్షమిస్తానని ఆయన మనకు ప్రేమపూర్వక హామీ ఇస్తున్నాడు. కీర్తన 51:17 ఇలా చెబుతోంది: “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు; దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” దోష భారంతో “విరిగి నలిగిన” హృదయాన్ని యెహోవా ఎన్నడూ తృణీకరించడు లేదా త్రోసిపుచ్చడు.

7 అంటే, మన పాపపు స్వభావాన్ని పాపం చేయడానికి సాకుగా ఉపయోగిస్తూ దేవుని కరుణకోసం ఆశించవచ్చని దీనర్థమా? ఎంతమాత్రం కాదు. యెహోవా కేవలం భావానుబంధంచే ప్రభావితుడు కాడు. ఆయన కరుణకు హద్దులున్నాయి. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా కఠిన హృదయంతో బుద్ధిపూర్వకంగా పాపంచేస్తూనే ఉండేవారిని ఆయనెంతమాత్రం క్షమించడు. (హెబ్రీయులు 10:26) మరోవైపున, ఆయన పశ్చాత్తాప హృదయాన్ని చూసినప్పుడు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. యెహోవా ప్రేమకు సంబంధించిన ఈ అద్భుత అంశాన్ని వర్ణించడానికి బైబిల్లో ఉపయోగించబడిన సుస్పష్టమైన పదాల్లో కొన్నింటిని మనమిప్పుడు పరిశీలిద్దాం.

యెహోవా ఎంత సంపూర్ణంగా క్షమిస్తాడు?

8.యెహోవా మన పాపాలను క్షమించినప్పుడు వాస్తవానికి ఏమిచేస్తాడు, ఇది మనకెలాంటి నమ్మకాన్నిస్తోంది?

8 పశ్చాత్తప్తుడైన దావీదు ఇలా అన్నాడు: ‘నా దోషము కప్పుకొనక నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని . . . నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.’ (కీర్తన 32:5) ‘పరిహరించడం’ అని అనువదించబడిన హీబ్రూ పదానికి ప్రాథమికంగా “ఎత్తివేయు” లేదా “తీసివేయు” అని అర్థం. ఇక్కడ దానిని ఉపయోగించడం “దోషాన్ని, పాపాన్ని, అపరాధాన్ని” తీసివేయడాన్ని సూచిస్తోంది. కాబట్టి, వాస్తవానికి యెహోవా దావీదు పాపాలను ఎత్తివేసి, వాటిని తీసివేశాడు. ఇది నిస్సందేహంగా దావీదు మోస్తున్న దోషభావాలను తుడిచివేసింది. (కీర్తన 32:3) యేసు విమోచన క్రయధన బలియందలి విశ్వాసం ఆధారంగా క్షమాపణ అడిగేవారి పాపాలను తీసివేసే దేవునిపై మనం కూడా పూర్తి నమ్మకంతో ఉండవచ్చు.—మత్తయి 20:28.

9.యెహోవా మన పాపాలను ఎంత దూరంలో ఉంచుతాడు?

9 యెహోవా క్షమాపణను వర్ణించడానికి దావీదు మరో సుస్పష్టమైన మాటను ఉపయోగించాడు: ‘పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు.’ (కీర్తన 103:12) తూర్పు పడమరకు ఎంత దూరాన ఉంది? ఒక విధంగా, తూర్పు ఎప్పుడూ పడమటికి ఊహకందనంత దూరంలో ఉంటుంది; ఈ రెండు దిక్కులు ఎప్పుడూ కలుసుకోవు. ఈ మాటకు అర్థం “సాధ్యమైనంత దూరం; మన ఊహకు అందనంత దూరం” అని ఒక విద్వాంసుడు వ్రాశాడు. యెహోవా మనలను క్షమించినప్పుడు, ఆయన మన పాపాలను మన ఊహకు అందనంత దూరంలో ఉంచుతాడని ప్రేరేపిత దావీదు మాటలు మనకు చెబుతున్నాయి.

“మీ పాపములు . . . హిమమువలె తెల్లబడును”

10.యెహోవా మన పాపాలను క్షమించినప్పుడు, అలాంటి పాపాల మరకలను మనం జీవితాంతం భరించాలని మనమెందుకు భావించనక్కర్లేదు?

10 లేతరంగు వస్త్రంమీది మరకను తొలగించడానికి మీరెప్పుడైనా ప్రయత్నించారా? మీరెంత ప్రయత్నించినా ఆ మరక ఇంకా కనబడుతూనే ఉంటుంది. క్షమించే తన సామర్థ్యాన్ని యెహోవా ఎలా వర్ణిస్తున్నాడో గమనించండి: ‘మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును. కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లనివగును.’ (యెషయా 1:18) “రక్తమువలె ఎఱ్ఱని” అనేమాట స్ఫుటమైన ఎరుపును సూచిస్తుంది. “కెంపు” వన్నె లేదా “రక్తవర్ణం” అద్దకాల్లో ఉపయోగించే ముదురు రంగును సూచిస్తుంది. b (నహూము 2:3) పాపపు మరకల్ని మన సొంత ప్రయత్నాలతో ఎన్నటికీ తొలగించలేము. అయితే, రక్తము వలే ఎఱ్ఱని వర్ణంలో ఉన్న, కెంపువన్నెలో ఉన్న పాపాలను సైతం యెహోవా తొలగించి, వాటిని మంచులాగా, రంగు అద్దని గొఱ్ఱెబొచ్చులా తెల్లగా చేయగలడు. యెహోవా మన పాపాలను క్షమించినప్పుడు, ఆ పాపపు మరకలను మనం జీవితాంతం భరించాలని మనం భావించనక్కర్లేదు.

11.ఏ భావంలో యెహోవా మన పాపాలను తన వీపు వెనుకకు విసిరి వేస్తాడు?

11 మరణకరమైన వ్యాధినుండి తప్పించబడిన తర్వాత హిజ్కియా కృతజ్ఞతతో భావగర్భితంగా కూర్చిన పాటలో, ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: ‘నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి.’ (యెషయా 38:17) యెహోవా ఇక్కడ, పశ్చాత్తాపపడే తప్పిదస్థుని పాపాలను తన వెనుకకు, అంటే తానిక ఎన్నడూ తిరిగిచూడని, గమనించని స్థలంలోకి వాటిని విసిరివేస్తున్నట్లుగా వర్ణించబడ్డాడు. ఒక కోశ గ్రంథం ప్రకారం, దాని అర్థం ఇలా చెప్పవచ్చు: “వాటిని [నా పాపాలను] నీవు జరుగలేదన్నట్టే చేశావు.” అది ఓదార్పునివ్వడం లేదా?

12.యెహోవా ఒకసారి క్షమిస్తే, ఆయన మన పాపాలను శాశ్వతంగా తొలగిస్తాడని మీకా ప్రవక్త మాటలెలా సూచిస్తున్నాయి?

12 పునరుద్ధరణకు సంబంధించిన ఒక వాగ్దానంలో, పశ్చాత్తాపం చూపిన తన ప్రజల్ని యెహోవా క్షమిస్తాడనే తన నమ్మకాన్ని మీకా ప్రవక్త ఇలా వ్యక్తంచేశాడు: ‘తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.’ (మీకా 7:18, 19) బైబిలు కాలాల్లో జీవిస్తున్న ప్రజలకు ఆ మాటలు ఏ భావం ఇచ్చివుంటాయో ఊహించండి. “సముద్రపు అగాధములలో” పడవేయబడినదాన్ని మళ్ళీ వెనక్కితీసే అవకాశం అప్పట్లో ఉందా? ఆ విధంగా, యెహోవా ఒకసారి క్షమిస్తే, ఆయన మన పాపాలను శాశ్వతంగా తొలగిస్తాడని మీకా మాటలు సూచిస్తున్నాయి.

13.“మా ఋణములు క్షమించుము” అనే యేసు మాటల భావమేమిటి?

13 యెహోవా క్షమాపణను ఉదహరించడానికి యేసు అప్పిచ్చువారికి ఋణస్థులకు మధ్యవుండే సంబంధాన్ని ఆధారంగా తీసుకున్నాడు. ‘మా ఋణములు క్షమించుము’ అని ప్రార్థించమని యేసు మనకు ఉద్బోధించాడు. (మత్తయి 6:12) ఆ విధంగా యేసు పాపాలను అచ్చియున్న వాటితో పోల్చాడు. (లూకా 11:4) మనం పాపం చేసినప్పుడు, మనం యెహోవాకు ‘ఋణస్థులమవుతాము.’ “క్షమించుము” అని అనువదించబడిన గ్రీకు క్రియా పదానికి “ఋణాన్ని అడగకుండా విడిచిపెట్టడం ద్వారా దాన్ని వదిలివేయడం, వదులుకోవడం” అనే అర్థాలున్నాయని ఒక కోశ గ్రంథం చెబుతోంది. ఒక విధంగా చెప్పాలంటే, యెహోవా క్షమించినప్పుడు మనపై మోపబడవలసిన ఋణాన్ని ఆయన రద్దు చేస్తున్నాడని దాని భావం. ఆ విధంగా పశ్చాత్తాపం చూపే పాపులు ఓదార్పు పొందవచ్చు. తాను రద్దు చేసిన ఋణం చెల్లించమని యెహోవా ఎన్నటికీ అడగడు.—కీర్తన 32:1, 2.

14.‘మీ పాపములు తుడిచివేయబడు’ అనే మాట ఎలాంటి దృశ్యాన్ని మనస్సుకు తెస్తుంది?

14 యెహోవా చూపే క్షమాగుణం అపొస్తలుల కార్యములు 3:20​లో ఇంకా ఇలా వర్ణించబడింది: ‘మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారుమనస్సునొంది తిరుగుడి.’ తుడిచివేయడం అని అనువదించబడిన ఆ గ్రీకు క్రియా పదం “చెరిపివేయు, . . . రద్దుచేయు లేదా నిరుపయోగం చేయు” అనే అర్థం ఇవ్వగలదు. కొందరు విద్వాంసుల అభిప్రాయం ప్రకారం, చేవ్రాతను తుడిచివేయడం అనే భావం దానిలో వ్యక్తం చేయబడింది. ఇదెలా సాధ్యం? ప్రాచీన కాలాల్లో సాధారణంగా ఉపయోగించబడిన సిరా కర్బనం, జిగురు, నీళ్లు కలిపిన మిశ్రమంతో తయారుచేయబడేది. అలాంటి సిరాతో వ్రాసిన తర్వాత, తడి స్పంజితో ఆ రాతను ఒక వ్యక్తి తుడిచివేయడానికి వీలుండేది. యెహోవా కరుణకు చక్కని ఉదాహరణ అందులో ఉంది. ఆయన మన పాపాలను క్షమించినప్పుడు, ఆయన ఒక స్పంజి తీసుకొని వాటిని తుడిచివేసినట్టుగా ఉంటుంది.

తాను ‘క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడని’ మనం తెలుసుకోవాలని యెహోవా కోరుతున్నాడు

15.యెహోవా తన గురించి మనమేమి తెలుసుకోవాలని కోరుతున్నాడు?

15 ఈ వివిధ రకాల దృష్టాంతాలను మనం ధ్యానించినప్పుడు, మనం యథార్థంగా పశ్చాత్తాపపడుతున్నామని యెహోవా చూసినంత వరకు క్షమించడానికి ఆయన నిజంగా సిద్ధంగా ఉన్నాడని మనం తెలుసుకోవాలని కోరుతున్నట్లు స్పష్టం కావడంలేదా? అలాంటి పాపాలను బట్టి ఆయన భవిష్యత్తులో మనలను దండిస్తాడని మనం భయపడవలసిన అవసరంలేదు. యెహోవా మహా కరుణ గురించి బైబిలు వెల్లడిస్తున్న మరో విషయంలో ఇది చూపబడింది: ఆయన క్షమించినప్పుడు, ఆయన దానిని మరచిపోతాడు.

“వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను”

16, 17.యెహోవా మన పాపాలను మరచిపోతాడని బైబిలు చెప్పినప్పుడు దాని భావమేమిటి, అలాని మీరెందుకు జవాబిస్తారు?

16 కొత్త నిబంధనలో ఉన్నవారి గురించి యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నేను వారి దోషములను క్షమించి, వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను.” (యిర్మీయా 31:34) అంటే యెహోవా క్షమించినప్పుడు ఆ పాపాలను ఆయనిక జ్ఞాపకం తెచ్చుకోలేడని దాని భావమా? అలా కానేకాదు. దావీదుతోసహా యెహోవా క్షమించిన చాలామంది చేసిన పాపాల గురించి బైబిలు మనకు చెబుతోంది. (2 సమూయేలు 11:1-17; 12:13) వారు చేసిన పొరపాట్లు యెహోవాకు ఇప్పటికీ తెలుసనడంలో సందేహం లేదు. వారి పాపాల చిట్టాతోపాటు వారి పశ్చాత్తాపం, దేవుని క్షమాపణ మన ప్రయోజనం కోసం భద్రంగా గ్రంథస్తం చేయబడ్డాయి. (రోమీయులు 15:4) అట్లయితే యెహోవా తాను క్షమించిన వారి పాపాలను ‘జ్ఞాపకముంచుకొనడని’ బైబిలు చెప్పినప్పుడు దానర్థమేమిటి?

17‘జ్ఞాపకము చేసుకోవడం’ అని అనువదించబడిన హీబ్రూ క్రియా పదానికి కేవలం గతాన్ని గుర్తుతెచ్చుకోవడం కంటే ఇంకా ఎక్కువ భావమే ఉంది. దానిలో “సరైన చర్య తీసుకోవడానికి సంబంధించిన అదనపు సూచితార్థం” ఇమిడివుందని థియొలాజికల్‌ వర్డ్‌బుక్‌ ఆఫ్‌ ది ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ వ్యాఖ్యానిస్తోంది. కాబట్టి ఈ భావంలో, పాపాన్ని ‘జ్ఞాపకముంచుకోవడంలో’ పాపులకు విరుద్ధంగా చర్య తీసుకోవడం కూడా ఇమిడివుంది. (హోషేయ 9:9) కానీ “వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను” అని దేవుడు చెప్పినప్పుడు, పశ్చాత్తాపపడే పాపులను తాను ఒకసారి క్షమించాడంటే, ఆ పాపాలనుబట్టి భవిష్యత్తులో వారిపై తాను చర్య తీసుకోనని ఆయన మనకు హామీ ఇస్తున్నాడు. (యెహెజ్కేలు 18:21, 22) ఆ విధంగా యెహోవా మరచిపోతాడంటే మనలను పదే పదే నిందించడానికో లేదా మళ్లీ మళ్లీ శిక్షించడానికో మన పాపాలను గుర్తుచేసుకోడని దాని భావం. మన దేవుడు క్షమించి, మరచిపోతాడని తెలుసుకోవడం ఓదార్పుకరంగా లేదా?

పర్యవసానాల సంగతేమిటి?

18.క్షమించడం అంటే పశ్చాత్తప్త పాపి తన అపరాధ విధానపు పర్యవసానాలన్నింటి నుండి మినహాయించబడతాడని దానర్థం ఎందుకు కాదు?

18 యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడంటే పశ్చాత్తప్త తప్పిదస్థుడు అతని దోషభరిత విధానపు పర్యవసానాలన్నింటి నుండి మినహాయించబడతాడని దానర్థమా? ఎంతమాత్రం కాదు. పాపంచేసి మనం శిక్షను తప్పించుకోలేము. పౌలు ఇలా వ్రాశాడు: “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.” (గలతీయులు 6:7) మన క్రియలకు మనం కొన్ని పర్యవసానాలు ఎదుర్కోవచ్చు. అంటే క్షమించిన తర్వాత యెహోవా మనకు ప్రతికూల పరిస్థితులు కలిగిస్తాడని దీనర్థం కాదు. కష్టాలొచ్చినప్పుడు, ‘బహుశా నా గత పాపాలనుబట్టి యెహోవా నన్ను శిక్షిస్తున్నాడని’ ఒక క్రైస్తవుడు భావించకూడదు. (యాకోబు 1:13) మరో వైపున, మన అపరాధ క్రియల ప్రభావాలన్నింటి నుండి యెహోవా మనలను కాపాడడు. విడాకులు, అవాంఛిత గర్భధారణ, సుఖరోగాలు, నమ్మకం లేదా గౌరవం పోవడం వంటివన్నీ పాపపు విషాదరకమైన తప్పించుకోలేని పర్యవసానాలై ఉండవచ్చు. బత్షెబ ఊరియాల సంబంధంగా దావీదు చేసిన పాపాలను క్షమించిన తర్వాత కూడా యెహోవా ఆ తర్వాత కలిగిన విపత్కర పర్యవసానాల నుండి దావీదును కాపాడలేదని గుర్తుతెచ్చుకోండి.—2 సమూయేలు 12:9-12.

19-21.(ఎ)లేవీయకాండము 6:1-7​లో వ్రాయబడిన నియమం ఇటు బాధితునికి అటు అపరాధికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? (బి) మన పాపములనుబట్టి ఇతరులు గాయపడితే మనమెలాంటి చర్య తీసుకున్నప్పుడు యెహోవా సంతోషిస్తాడు?

19 ప్రత్యేకించి మన క్రియల ద్వారా ఇతరులు గాయపడితే, మన పాపాలకు అదనపు పర్యవసానాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, లేవీయకాండము 6వ అధ్యాయంలోని వృత్తాంతమే పరిశీలించండి. తోటి ఇశ్రాయేలీయుని వస్తువులను దొంగతనంగా, బలవంతంగా లేదా మోసంచేసి తీసుకుని గంభీరమైన తప్పుచేసిన వ్యక్తికి సంబంధించిన పరిస్థితిని మోషే ధర్మశాస్త్రం పేర్కొంటోంది. ఆ పాపి అందరికి వినబడేలా కపట ప్రమాణం కూడా చేస్తూ తన తప్పు ఒప్పుకోవడం లేదు. ఇది ఒక వ్యక్తి మరో వ్యక్తిని నిందించడం. అయితే ఆ తర్వాత, అపరాధం చేసిన వ్యక్తి మనస్సాక్షి అతడిని గద్దించినప్పుడు అతడు బాధపడి తన తప్పు ఒప్పుకుంటాడు. దేవుని క్షమాపణ పొందేందుకు అతడు మరో మూడు సంగతులు జరిగించాలి: తను తీసుకున్నవి తిరిగి ఇచ్చేయాలి, దొంగిలించిన వస్తువుల మొత్తం విలువలో 20 శాతాన్ని జరిమానాగా చెల్లించాలి, అపరాధ పరిహారార్థ బలిగా పొట్టేలును అర్పించాలి. అప్పుడు, ధర్మశాస్త్రమిలా చెబుతోంది: “యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా . . . అతనికి క్షమాపణ కలుగును.”—లేవీయకాండము 6:1-7.

20 ఆ నియమం దేవుని కరుణాపూరిత ఏర్పాటు. అది బాధితునికి ప్రయోజనం చేకూర్చేది, ఎందుకంటే అతని వస్తువులు అతనికి తిరిగి దొరికేవి, అంతేకాదు అపరాధి చివరకు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నిస్సందేహంగా ఆ బాధితుని ప్రాణం కుదుటపడి ఉంటుంది. అదే సమయంలో, చివరకు తన మనస్సాక్షి ప్రేరణతో తన తప్పు ఒప్పుకొని ఆ తప్పు సరిదిద్దుకొనేలా ధర్మశాస్త్రం అపరాధికి ప్రయోజనం కలుగజేసింది. నిజం చెప్పాలంటే, అతనలా చేయడానికి నిరాకరించివుంటే అతనికి దేవునినుండి క్షమాపణ ఉండదు.

21 మనం మోషే ధర్మశాస్త్రం క్రింద లేకపోయినా, క్షమాపణపై యెహోవా ఆలోచనతోపాటు ఆయన మనస్సును గురించిన అంతర్దృష్టిని ఆ ధర్మశాస్త్రం మనకిస్తోంది. (కొలొస్సయులు 2:13, 14) మన పాపముల వలన ఇతరులు గాయపడితే, ఆ తప్పును సరిదిద్దడానికి మనం చేయగలిగినది మనం చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. (మత్తయి 5:23, 24) దీనిలో మన పాపాన్ని అంగీకరించడం, మన అపరాధాన్ని ఒప్పుకోవడం, బాధితుణ్ణి క్షమాపణ అడగడం ఉంటాయి. ఆ పిమ్మట యేసు బలి ఆధారంగా యెహోవాకు విన్నపం చేస్తే దేవుడు మనల్ని క్షమించాడనే హామీని మనం పొందవచ్చు.—హెబ్రీయులు 10:21, 22.

22.యెహోవా క్షమాపణతోపాటు ఏదికూడా ఇవ్వవచ్చు?

22 ప్రేమగల ఒక తండ్రి చేసినట్లే యెహోవా క్షమాపణతోపాటు కొంతమేరకు క్రమశిక్షణ కూడా ఇవ్వవచ్చు. (సామెతలు 3:11, 12) పశ్చాత్తప్త క్రైస్తవుడు పెద్దగా, పరిచర్య సేవకునిగా లేదా పూర్తికాల సువార్తికునిగా సేవచేసే తన ఆధిక్యతను వదులుకోవలసి రావచ్చు. తనకు ప్రశస్తమైన ఆధిక్యతలు కొంతకాలం వరకు పోగొట్టుకోవడం అతనికి బాధగా ఉండవచ్చు. అయితే అలాంటి క్రమశిక్షణ యెహోవా క్షమాపణ ఉపసంహరించుకున్నాడని అర్థం కాదు. యెహోవా ఇచ్చే క్రమశిక్షణ మనపై ఆయనకు ఉన్న ప్రేమకు రుజువని మనం గుర్తుంచుకోవాలి. దానిని అంగీకరించి అన్వయించుకోవడం మనకే ప్రయోజనకరం.—హెబ్రీయులు 12:5-11.

23.యెహోవా కరుణా పాత్రులం కాలేమని మనమెందుకు ఎన్నటికీ ఒక ముగింపుకు రాకూడదు, ఆయన క్షమాగుణాన్ని మనమెందుకు అనుకరించాలి?

23 మన దేవుడు ‘క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడని’ తెలుసుకోవడం ఎంత ఉపశమనాన్నిస్తుందో కదా! మనం తప్పులు చేసినప్పటికీ, యెహోవా కరుణా పాత్రులం కాలేమని మనమెన్నడూ ఒక ముగింపుకు రాకూడదు. మనం నిజంగా పశ్చాత్తాపపడి, చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి చర్యలు తీసుకుంటూ యేసు చిందించిన రక్తం ఆధారంగా క్షమాపణ కోసం మనఃపూర్వకంగా ప్రార్థిస్తే యెహోవా మనలను క్షమిస్తాడనే పూర్తి నమ్మకంతో మనం ఉండవచ్చు. (1 యోహాను 1:9) ఇతరులతో మన వ్యవహారాల్లో ఆయన క్షమాగుణాన్ని మనం అనుకరిద్దాం. నిజానికి పాపం చేయని యెహోవాయే అంత ప్రేమపూర్వకంగా మనలను క్షమించగలిగితే పాపులమైన మనం పరస్పరం క్షమించుకోవడానికి మనకు చేతనైనంత మనం చేయవద్దా?

a “మనము నిర్మింపబడిన రీతి” అని అనువదించబడిన హీబ్రూ పదం ఒక కుమ్మరి తయారుచేసే మంటి పాత్రలకు సంబంధించి కూడా ఉపయోగించబడుతుంది.—యెషయా 29:16.

b రక్తమువలే ఉన్న ఎఱ్ఱని రంగు “వదలని లేదా వెలిసిపోని రంగు. మంచు, వర్షం, ఉతకడం, ఎక్కువకాలం వాడడంలాంటివేవీ దానిని తొలగించలేవని” ఒక విద్వాంసుడు చెబుతున్నాడు.