కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 22

“పైనుండివచ్చు జ్ఞానము”ను మీరు ఆచరణలో పెడుతున్నారా?

“పైనుండివచ్చు జ్ఞానము”ను మీరు ఆచరణలో పెడుతున్నారా?

1-3.(ఎ)మాతృత్వానికి సంబంధించిన ఒక వివాదాన్ని పరిష్కరించడంలో సొలొమోను అసాధారణ జ్ఞానాన్ని ఎలా ప్రదర్శించాడు? (బి) యెహోవా మనకు ఏమి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు, ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి?

 అదొక క్లిష్టమైన సమస్య—ఒకే బిడ్డకోసం ఇద్దరు స్త్రీలు వాదులాడుకుంటున్నారు. ఒకే ఇంట్లోవున్న ఆ స్త్రీలు కొద్దిరోజుల తేడాతో చెరో బిడ్డను కన్నారు. వారిలో ఒక బిడ్డ చనిపోయింది, దాంతో బ్రతికున్న బిడ్డకు తనే తల్లినని ఇద్దరూ వాదులాడుతున్నారు. a జరిగిన దానికి సాక్షులెవరూ లేరు. బహుశా వారి వ్యాజ్యం క్రింది న్యాయస్థాన పరిశీలనకు వచ్చి ఉంటుంది కానీ పరిష్కారం కాలేదు. చివరకు, వారి వివాదం ఇశ్రాయేలు రాజైన సొలొమోను దగ్గరకు వెళ్లింది. సత్యమేమిటో ఆయన తేల్చగలుగుతాడా?

2 ఆ స్త్రీల వాదన కాసేపు విన్న తర్వాత, సొలొమోను ఓ కత్తి తెమ్మని ఆజ్ఞాపించి, ఆ బిడ్డను రెండుగా నరికి ఆ ఇద్దరికీ చేరో సగమిమ్మని చెప్పాడు. వెంటనే నిజమైన తల్లి తన ముద్దుబిడ్డను ఆ రెండవ స్త్రీకే ఇమ్మని రాజును బతిమాలింది. కానీ ఆ రెండవ స్త్రీ బిడ్డను రెండు భాగాలు చేయాల్సిందేనని పట్టుబట్టింది. సొలొమోనుకు సత్యమేమిటో అర్థమయింది. కడుపున పుట్టిన బిడ్డపట్ల తల్లికుండే వాత్సల్యమెలా ఉంటుందో ఆయనకు తెలుసు, అందువల్ల ఆయన తనకున్న ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ వివాదాన్ని పరిష్కరించాడు. సొలొమోను ఆ బిడ్డను నిజమైన తల్లికి అప్పగించి, “దాని తల్లి అదే” అని తీర్మానించినప్పుడు ఆ తల్లికి కలిగిన ఉపశమనాన్ని ఊహించండి.—1 రాజులు 3:16-27.

3 అది అసాధారణమైన జ్ఞానం, కాదంటారా? సొలొమోను ఆ వివాదాన్నెలా పరిష్కరించాడో ప్రజలు విన్నప్పుడు, వారిలో భక్తిపూర్వక భయం ఏర్పడింది ఎందుకంటే వారు, “రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహిం[చారు].” అవును, సొలొమోను జ్ఞానం ఆయనకు దేవుడిచ్చిన వరం. యెహోవా ఆయనకు “బుద్ధి [“జ్ఞాన,” NW] వివేకములు గల హృదయము[ను]” అనుగ్రహించాడు. (1 రాజులు 3:12, 28) మరి మన విషయమేమిటి? మనం కూడా దేవుని జ్ఞానాన్ని పొందే అవకాశముందా? ఉంది, ఎందుకంటే సొలొమోను ప్రేరేపించబడి ఇలా వ్రాశాడు: “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు.” (సామెతలు 2:6) జ్ఞానం కావాలని యథార్థంగా కోరేవారికి జ్ఞానాన్ని అంటే విషయ పరిజ్ఞానాన్ని, అవగాహనను, వివేచనను చక్కగా ఆచరణలోపెట్టే సామర్థ్యాన్ని ఇస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. పైనుండివచ్చు జ్ఞానాన్ని మనమెలా సంపాదించుకోవచ్చు? మన జీవితంలో దానిని మనం ఎలా ఆచరణలో పెట్టవచ్చు?

“జ్ఞానము సంపాదించుకొనుము”—ఎలా?

4-7.జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవసరమైన నాలుగు విషయాలేమిటి?

4 దేవుని జ్ఞానాన్ని పొందడానికి మనకు గొప్ప మేధ లేదా అధిక విద్య ఉండాలా? అవసరం లేదు. మన నేపథ్యం, విద్యాస్థాయి ఏదైనప్పటికీ యెహోవా తన జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. (1 కొరింథీయులు 1:26-29) కానీ మనం చొరవ తీసుకోవాలి, ఎందుకంటే ‘జ్ఞానము సంపాదించుకొనమని’ బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. (సామెతలు 4:7) దాన్ని మనమెలా సంపాదించుకోగలం?

5 మొదట మనం దేవునికి భయపడాలి. “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము [“జ్ఞానము సంపాదించుటకు మొదటి మెట్టు,” ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌]” అని సామెతలు 9:10 చెబుతోంది. దేవుని భయం నిజమైన జ్ఞానానికి పునాది. ఎందుకు? జ్ఞానములో విషయ పరిజ్ఞానాన్ని విజయవంతంగా ఉపయోగించే సామర్థ్యం ఇమిడివుందని గుర్తుతెచ్చుకోండి. దేవునికి భయపడడమంటే గజగజలాడుతూ ఆయన ఎదుట కుంచించుకుపోవడం కాదుగానీ భక్తిపూర్వక భయంతో, గౌరవంతో, నమ్మకంతో ఆయనకు లోబడి ఉండడం. అలాంటి భయం ఆరోగ్యదాయకమైనది, అది శక్తిమంతంగా పురికొల్పుతుంది. దేవుని చిత్తం మరియు మార్గాల గురించిన మన పరిజ్ఞానానికి అనుగుణంగా మన జీవితాలు మార్చుకోవడానికి అది మనలను పురికొల్పుతుంది. యెహోవా ప్రమాణాలను అనుసరించేవారికి అవి అన్ని సందర్భాల్లో అత్యధిక ప్రయోజనాలు చేకూరుస్తాయి కాబట్టి మనం చేపట్టగల జ్ఞానయుక్తమైన విధానం మరొకటి లేదు.

6 రెండవది, మనం వినయస్థులుగా, అణకువగలవారిగా ఉండాలి. వినయం, అణకువ లేకుండా దేవుని జ్ఞానం ఉనికిలో ఉండజాలదు. (సామెతలు 11:2) ఎందుకలా? మనం వినయం, అణకువ గలవారమైతే, మన దగ్గర అన్నింటికి జవాబులు లేవనీ, మన అభిప్రాయాలు అన్ని సమయాల్లో సరైనవి కావనీ, విషయాల గురించి యెహోవా మనస్సు ఏమిటో తెలుసుకోవడం అవసరమనీ ఒప్పుకోవడానికి ఇష్టపడతాం. యెహోవా “అహంకారులను ఎదిరి[స్తాడు]” కానీ వినయ హృదయంగల వారికి జ్ఞానం అనుగ్రహించడానికి ఇష్టపడతాడు.—యాకోబు 4:6.

దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం దానికోసం లోతుగా త్రవ్వడానికి కృషిచేయాలి

7 దేవుని లిఖిత వాక్యాన్ని అధ్యయనం చేయడం, ఆవశ్యకమైన మూడవ సంగతి. యెహోవా జ్ఞానం ఆయన వాక్యంలో వెల్లడించబడింది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే, మనం దానిని త్రవ్వి వెలికితీయడానికి గట్టిగా ప్రయత్నించాలి. (సామెతలు 2:1-5) అవసరమైన నాల్గవది ప్రార్థన. మనం యథార్థంగా జ్ఞానంకోసం దేవుణ్ణి అర్థిస్తే, ఆయన దానిని ధారాళంగా ఇస్తాడు. (యాకోబు 1:5) ఆయన ఆత్మకోసం మనంచేసే ప్రార్థనలకు తప్పక జవాబు లభిస్తుంది. సమస్యల పరిష్కారానికీ, ప్రమాదాలు తప్పించుకోవడానికీ, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికీ మనకు సహాయంచేసే విలువైన సమాచారాన్ని ఆయన వాక్యంలో కనుగొనేందుకు ఆయన ఆత్మ మనకు దోహదపడగలదు.—లూకా 11:13.

8.మనం నిజంగా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే, అది ఎలా స్పష్టమవుతుంది?

8 మనం 17వ అధ్యాయంలో గమనించినట్లుగా, యెహోవా జ్ఞానం ఆచరణాత్మకమైనది. కాబట్టి, మనం నిజంగా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే, మన ప్రవర్తనా విధానంలో అది స్పష్టంగా వ్యక్తమవుతుంది. శిష్యుడైన యాకోబు “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది” అని వ్రాసినప్పుడు ఆయన దేవుని జ్ఞానఫలాలను వర్ణించాడు. (యాకోబు 3:17) దేవుని జ్ఞానానికి సంబంధించిన ఈ అంశాలను ఒక్కొక్కటీ మనం పరిశీలిస్తుండగా, మనల్ని మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను నా జీవితంలో పైనుండివచ్చు జ్ఞానమును ఆచరణలో పెడుతున్నానా?’

“పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది”

9.పవిత్రంగా ఉండడమంటే ఏమిటి, జ్ఞానం యొక్క లక్షణాల్లో పవిత్రత మొదట ప్రస్తావించబడడం ఎందుకు సరైనది?

9 “మొట్టమొదట పవిత్రమైనది.” పవిత్రంగా ఉండడమంటే కేవలం బాహ్యరూపంగా కాదుగానీ అంతరంగంలో స్వచ్ఛంగా, నిష్కల్మషంగా ఉండడమని దానర్థం. బైబిలు జ్ఞానాన్ని హృదయంతో ముడిపెడుతోంది, కానీ దురాలోచనలు, దుష్టకోరికలు, దురుద్దేశాలతో కలుషితమైన హృదయంలోకి పరలోక జ్ఞానం ప్రవేశించడం అసంభవం. (సామెతలు 2:10; మత్తయి 15:19, 20) అయితే, మన హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు అంటే అపరిపూర్ణ మానవులకు సాధ్యమైనంత పవిత్రంగా ఉన్నప్పుడు, మనం ‘కీడు చేయుట మాని మేలు చేస్తాము.’ (కీర్తన 37:27; సామెతలు 3:7) జ్ఞానం యొక్క లక్షణాల్లో పవిత్రత మొదట ప్రస్తావించబడడం యుక్తంగా లేదా? నిజానికి మనం నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా లేనట్లయితే పైనుండివచ్చు జ్ఞానపు ఇతర లక్షణాలను నిజానికి మనమెలా ప్రతిబింబించగలం?

10, 11.(ఎ)మనం సమాధానపరులుగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) మీరు ఒక తోటి ఆరాధకుని మనస్సు నొప్పించారని గ్రహించినప్పుడు, మీరు సమాధానపడేవారని ఎలా నిరూపించుకోవచ్చు? (అధస్సూచి కూడా చూడండి.)

10 “తరువాత సమాధానకరమైనది.” దేవుని ఆత్మ ఫలాల్లో ఒకటైన సమాధానాన్ని వెంబడించడానికి పరలోక జ్ఞానం మనలను పురికొల్పుతుంది. (గలతీయులు 5:22) యెహోవా ప్రజలను ఐక్యపరిచే ‘సమాధాన బంధానికి’ విఘాతం కలిగించకుండా ఉండడానికి మనం కృషిచేస్తాం. (ఎఫెసీయులు 4:1) అలాంటి విఘాతం ఏర్పడినప్పుడు సమాధానాన్ని పునరుద్ధరించేందుకు కూడా మనం పట్టుదలతో కృషిచేస్తాం. ఇదెందుకు ప్రాముఖ్యం? బైబిలు ఇలా చెబుతోంది: “సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.” (2 కొరింథీయులు 13:11) అందువల్ల మనం సమాధానంగా జీవిస్తున్నంత కాలం, సమాధానకర్తయైన దేవుడు మనతో కూడా ఉంటాడు. మనం మన తోటి విశ్వాసులతో వ్యవహరించే విధానం యెహోవాతో మనకున్న సంబంధంపై నేరుగా ప్రభావం చూపుతుంది. మనం సమాధానపరచు వారమని ఎలా నిరూపించుకోవచ్చు? ఒక ఉదాహరణను పరిశీలించండి.

11 మీరు ఒక తోటి విశ్వాసి మనస్సు నొప్పించారని మీరు గ్రహించినప్పుడు మీరేమి చేయాలి? యేసు ఇలా చెప్పాడు: “కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.” (మత్తయి 5:23, 24) మీ సహోదరుని దగ్గరకు వెళ్లేందుకు చొరవ తీసుకోవడం ద్వారా మీరు ఆ ఉపదేశాన్ని అన్వయించుకోవచ్చు. ఎలాంటి ఉద్దేశంతో? ఆయనతో ‘సమాధానపడడానికి.’ b అది సాధించడానికి మీరు అతని బాధను త్రోసిపుచ్చడం కాదు, అంగీకరించవలసి ఉంటుంది. అతనితో సమాధానపడి అదే దృక్పథాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీరతని దగ్గరకెళితే, ఏవైనా అపార్థాలు జరిగివుంటే వాటిని తొలగించుకొని, సముచితంగా క్షమాపణలు అడగడానికీ క్షమించడానికీ అవకాశం ఉంటుంది. సమాధానపడడానికి మీరు చొరవ తీసుకొని వెళ్లినప్పుడు, మీరు దేవుని జ్ఞానంచేత నిర్దేశించబడ్డారని చూపిస్తారు.

“మృదువైనది, సులభముగా లోబడునది”

12, 13.(ఎ)యాకోబు 3:17​లో “మృదువైనది” అని అనువదించబడిన పదానికి అర్థమేమిటి? (బి) మనం సహేతుకతగల వారమని మనమెలా ప్రదర్శించవచ్చు?

12 “మృదువైనది.” మృదువుగా ఉండడమంటే అర్థమేమిటి? విద్వాంసుల అభిప్రాయం ప్రకారం, యాకోబు 3:17​లో “మృదువైనది” అని భాషాంతరం చేయబడిన గ్రీకు మూలపదాన్ని అనువదించడం కష్టం. అనువాదకులు “సాధువైన,” “సహనంగల,” “దయగల” వంటి మాటలను ఉపయోగించారు. ఆ గ్రీకు పదానికి అక్షరార్థంగా “పరిస్థితులకు తగినవిధంగా మారడం” అని అర్థం. పైనుండివచ్చు జ్ఞానం యొక్క ఈ లక్షణాన్ని మనం ఆచరణలో పెడుతున్నామని మనమెలా ప్రదర్శించవచ్చు?

13 “మీ సహనమును [“సహేతుకతను,” NW] సకల జనులకు తెలియబడనియ్యుడి” అని ఫిలిప్పీయులు 4:5 చెబుతోంది. మరో అనువాదం ఇలా చెబుతోంది: “సహేతుకతగల వారనే మంచిపేరు కలిగి ఉండండి.” (జె. బి. ఫిలిప్స్‌ అనువదించిన, ద న్యూ టెస్ట్‌మెంట్‌ ఇన్‌ మోడర్న్‌ ఇంగ్లీష్‌) మనల్ని మనమెలా దృష్టించుకుంటామనేది కాదుగానీ, ఇతరులు మనల్ని ఎలా దృష్టిస్తారు, మనమెలాంటి వారమని అందరికీ తెలుసు అనేదే ప్రాముఖ్యమైనదని గమనించండి. సహేతుకతగల వ్యక్తి అన్ని సందర్భాల్లో తన మాటే చెల్లుబాటు కావాలనో తన పద్ధతే నడవాలనో పంతం పట్టడు. బదులుగా, అతను ఇతరులు చెప్పేది వినడానికి, సముచితమైనప్పుడు వారి అభీష్టాలకు అనుగుణంగా మారడానికి సుముఖంగా ఉంటాడు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు అతను దురుసుగా, కఠినంగా కాదు మృదుస్వభావిగా కూడా ఉంటాడు. ఇది క్రైస్తవులందరికీ ఆవశ్యకమైనా ప్రత్యేకించి పెద్దలుగా సేవచేస్తున్న వారికిది మరింత ప్రాముఖ్యమైనది. మృదుస్వభావం ఆకర్షిస్తూ పెద్దలను సమీపించేవారిగా చేస్తుంది. (1 థెస్సలొనీకయులు 2:7, 8) మనమందరం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘నాకు దయగలవాడు, పరిస్థితులకు అనుగుణంగా మారేవాడు, మృదుస్వభావి అనే మంచిపేరు ఉందా?’

14.మనం ‘సులభముగా లోబడేవారమని’ మనమెలా ప్రదర్శించవచ్చు?

14 “సులభముగా లోబడునది.” “సులభముగా లోబడునది” అని అనువదించబడిన గ్రీకు పదం క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో మరెక్కడా కనిపించదు. ఒక విద్వాంసుని ప్రకారం, ఈ పదం “తరచూ సైనిక క్రమశిక్షణకు సంబంధించి ఉపయోగించబడుతుంది.” ఇది “సులభముగా ఒప్పించబడడం,” “లోబడివుండడం” అనే భావాలను అందజేస్తుంది. పైనుండివచ్చు జ్ఞానంచే నడిపించబడే వ్యక్తి లేఖనాలు చెప్పే విషయాలకు సంసిద్ధంగా లోబడతాడు. అతను తనకు తోచిన నిర్ణయం తీసుకొని, దానికి భిన్నమైన ఏ వాస్తవాలతోనైనా ప్రభావితం కావడానికి నిరాకరించే వ్యక్తిగా ఉండడు. బదులుగా, అతను తప్పటడుగు వేశాడని లేదా తప్పు నిర్ణయాలు తీసుకున్నాడని స్పష్టమైన లేఖన రుజువులను చూపినప్పుడు, అతను వెంటనే తన పద్ధతిని మార్చుకొనే వ్యక్తిగా ఉంటాడు. ఇతరుల మధ్య మీకలాంటి మంచి పేరే ఉందా?

“కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది”

15.కనికరమంటే ఏమిటి మరియు యాకోబు 3:17​లో “కనికరము,” “మంచి ఫలములు” కలిపి ప్రస్తావించబడడం ఎందుకు సముచితం?

15 “కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది.” c పైనుండివచ్చు జ్ఞానంలో కనికరం ఓ ముఖ్య భాగం, ఎందుకంటే అలాంటి జ్ఞానం ‘కనికరముతో నిండుకొనినది’ అని చెప్పబడింది. “కనికరము,” “మంచి ఫలములు” కలిపి ప్రస్తావించబడ్డాయని గమనించండి. ఇది యుక్తమైనదే, ఎందుకంటే బైబిల్లో కనికరం తరచూ ఇతరులపట్ల చూపే చురుకైన శ్రద్ధను, దయాక్రియల్ని సమృద్ధిగా ఉత్పన్నం చేసే జాలిగుణాన్ని సూచిస్తోంది. కనికరాన్ని ఓ కోశ గ్రంథం “వేరొకరి ఇబ్బందికర పరిస్థితిని బట్టి బాధపడుతూ దాని గురించి ఏదైనా చేయడానికి ప్రయత్నించడం” అని నిర్వచిస్తోంది. కాబట్టి, దేవుని జ్ఞానం ఆసక్తిలేనిది, హృదయంలేనిది లేదా కేవలం మేధా సంబంధమైనది కాదు. బదులుగా అది వాత్సల్యపూరితమైనదీ, హృదయపూర్వకమైనదీ, సున్నితమైనదీ. మనం కనికరంతో నిండి ఉన్నామని మనమెలా చూపవచ్చు.

16, 17.(ఎ)దేవునిపట్ల ప్రేమకు తోడుగా, ప్రకటనా పనిలో భాగం వహించేందుకు మనలను ఏది పురికొల్పుతోంది, ఎందుకు? (బి) మనం కనికరంతో నిండివున్నామని మనం ఏయే విధాలుగా చూపించవచ్చు?

16 దేవుని రాజ్య సువార్తను ఇతరులతో పంచుకోవడం నిశ్చయంగా ఒక ప్రాముఖ్యమైన విధానం. ఈ పనిచేయడానికి మనలను ఏది పురికొల్పుతోంది? ప్రాథమికంగా, దేవునిపట్ల మనకున్న ప్రేమే. అలాగే ఇతరులపట్ల కనికరం లేదా జాలి చేత కూడా మనం పురికొల్పబడతాం. (మత్తయి 22:37-39) నేడు చాలామంది “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరి” ఉన్నారు. (మత్తయి 9:36) అబద్ధ మతవర్గ కాపరులచే వారు నిర్లక్ష్యం చేయబడ్డారు, ఆధ్యాత్మిక అంధులుగా చేయబడ్డారు. ఫలితంగా, దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానయుక్త నిర్దేశం గురించి, లేదా ఆ రాజ్యం త్వరలో ఈ భూమిపైకి తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి వారికి తెలియదు. కాబట్టి మనమీ విధంగా మనచుట్టూ ఉన్న వారి ఆధ్యాత్మిక అవసరాల గురించి యోచించినప్పుడు, వారికి యెహోవా ప్రేమపూర్వక సంకల్పం గురించి చెప్పడానికి శాయశక్తులా కృషిచేసేలా మన హృదయపూర్వక కనికరం మనలను పురికొల్పుతుంది.

మనం ఇతరులపట్ల కనికరం లేదా జాలి చూపినప్పుడు మనం “పైనుండివచ్చు జ్ఞానమును” ప్రతిబింబిస్తాం

17 మనం కనికరంతో నిండివున్నామని ఇంకా ఏ ఇతర విధాలుగా చూపించవచ్చు? దొంగల బారినపడి, దెబ్బలుతిని రహదారి ప్రక్కన పడివున్న ఓ యాత్రికుణ్ణి చూసిన సమరయుని గురించి యేసుచెప్పిన ఉపమానాన్ని గుర్తుతెచ్చుకోండి. ఆ సమరయుడు కనికరంతో కదిలించబడి, ఆ యాత్రికునిపై “జాలిపడి” అతని గాయాలకు కట్లుకట్టి అతడ్ని పరామర్శించాడు. (లూకా 10:29-37) కనికరం చూపడంలో, అవసరతలో ఉన్నవారికి ఆచరణాత్మక సహాయాన్ని అందించడమూ ఒక భాగమేనని ఈ ఉపమానం చూపడం లేదా? “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయు[ము]” అని బైబిలు మనకు చెబుతోంది. (గలతీయులు 6:10) కొన్ని సాధ్యతలను పరిశీలించండి. ఒక వృద్ధ ఆరాధకునికి క్రైస్తవ కూటాలకు వెళ్లిరావడానికి వాహన సదుపాయం అవసరం కావచ్చు. సంఘంలోని ఓ విధవరాలికి ఇల్లు మరమ్మత్తు చేసుకోవడానికి సహాయం అవసరం కావచ్చు. (యాకోబు 1:27) నిరుత్సాపడిన వ్యక్తిని ప్రోత్సహించడానికి “దయగల మాట” అవసరం కావచ్చు. (సామెతలు 12:25) అలాంటి విధాల్లో మనం కనికరం చూపినప్పుడు, పైనుండివచ్చు జ్ఞానాన్ని మనం ఆచరణలో పెడుతున్నామని నిరూపిస్తాం.

“పక్షపాతమైనను వేషధారణయైనను లేనిది”

18.పైనుండివచ్చు జ్ఞానంతో మనం నడిపించబడితే, మన హృదయంలో నుండి దేనిని పెరికివేయడానికి మనం కృషిచేయాలి, ఎందుకు కృషిచేయాలి?

18 ‘పక్షపాతము లేనిది.’ దేవుని జ్ఞానంలో జాతి వివక్ష, జాత్యహంకారం మచ్చుకైనా ఉండవు. మనం అలాంటి జ్ఞానంతో నడిపించబడినప్పుడు, పక్షపాతం చూపే ఎలాంటి స్వభావాన్నైనా మన హృదయంలో నుండి పెరికివేయడానికి కృషిచేస్తాం. (యాకోబు 2:9) విద్యా నేపథ్యం, ఆర్థిక స్తోమత లేదా సంఘ బాధ్యతలనుబట్టి మనం ఇతరులను ప్రత్యేకంగా చూడము లేదా మన తోటి ఆరాధకుల్లో ఎవరైనా ఎంత పేదవారైనప్పటికీ మనం వారిని చిన్నచూపు చూడం. యెహోవా అలాంటి వారు తన ప్రేమను పొందేలా చేసినప్పుడు, మన ప్రేమను పొందడానికి కూడా వారు అర్హులేనని మనం భావించాలి.

19, 20.(ఎ)“వేషధారి” కొరకైన గ్రీకు పదానికున్న నేపథ్యమేమిటి? (బి) “నిష్కపటమైన సహోదరప్రేమ”ను మనమెలా ప్రదర్శిస్తాము, ఇది ఎందుకు ప్రాముఖ్యం?

19 ‘వేషధారణ లేనిది.’ “వేషధారి” కొరకైన గ్రీకు పదం “నాటకంలో ఓ పాత్ర పోషించే నటుణ్ణి” సూచించగలదు. ప్రాచీన కాలాల్లో, గ్రీసు, రోమాదేశపు నటులు రంగస్థల ప్రదర్శన చేసేటప్పుడు పెద్ద ముసుగులు ధరించేవారు. కాబట్టి, “వేషధారి” అనే గ్రీకు పదం కపటంగా నటించే లేదా బూటకపు వేషాలు వేసేవారికి అన్వయించడం ఆరంభమైంది. దేవుని జ్ఞానం యొక్క ఈ లక్షణం తోటి ఆరాధకులను ఎలా చూస్తామనే దానిమీదే కాక వారి గురించి మనమెలా భావిస్తామనే దానిమీద కూడా ప్రభావం చూపాలి.

20 మనం ‘సత్యానికి విధేయులమవడం’ ఫలితంగా ‘నిష్కపటమైన సహోదరప్రేమ కలగాలని’ అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (1 పేతురు 1:22) అవును, మన సహోదరులపట్ల మనకున్న ప్రేమ పైపైన చూపించేదిగా మాత్రమే ఉండకూడదు. ఇతరులను మోసగించడానికి మనం ముసుగులు ధరించం లేదా వేషాలు వేయం. మన ప్రేమ నిజమైనదిగా, హృదయపూర్వకమైనదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు, మన తోటి విశ్వాసుల నమ్మకాన్ని చూరగొంటాం, ఎందుకంటే మనమెలా కనిపిస్తామో అలాంటివారమేనని వారు గ్రహిస్తారు. అలాంటి నిష్కపటం క్రైస్తవుల మధ్య దాపరికంలేని, నిజాయితీగల సంబంధాలకు మార్గాన్ని సుగమంచేసి సంఘంలో నమ్మకత్వపు వాతావరణం ఏర్పడడానికి దోహదపడుతుంది.

‘ఆచరణాత్మక జ్ఞానమును భద్రము చేసికొనుము’

21, 22.(ఎ)జ్ఞానాన్ని కాపాడుకోవడంలో సొలొమోను ఎలా విఫలమయ్యాడు? (బి) జ్ఞానాన్ని మనమెలా కాపాడుకోవచ్చు, అలాచేయడం మనకెలాంటి ప్రయోజనమిస్తుంది?

21 దేవుని జ్ఞానం యెహోవా ఇచ్చిన వరం, దానిని మనం కాపాడుకోవాలి. సొలొమోను ఇలా అన్నాడు: “నా కుమారుడా, లెస్సయైన [‘ఆచరణాత్మక,’ NW] జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము.” (సామెతలు 3:21) విషాదకరంగా, సొలొమోను తానే అలా భద్రం చేసుకోవడంలో తప్పిపోయాడు. విధేయతా హృదయం కలిగి ఉన్నంతకాలం ఆయన జ్ఞానిగా నిలబడ్డాడు. కానీ చివరకు, పరస్త్రీలైన అతని అనేకమంది భార్యలు యెహోవా స్వచ్ఛారాధన నుండి అతని హృదయాన్ని త్రిప్పివేశారు. (1 రాజులు 11:1-8) సొలొమోనుకు కలిగిన పరిణామం, జ్ఞానాన్ని సరిగా ఉపయోగించకపోతే దానికి విలువ ఉండదని స్పష్టంగా తెలియజేస్తోంది.

22 ఆచరణాత్మక జ్ఞానాన్ని మనమెలా కాపాడుకోవచ్చు? మనం క్రమంగా బైబిలును, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” సిద్ధం చేసిన బైబిలు ఆధారిత ప్రచురణలను చదవడమే కాదు, మనం నేర్చుకుంటున్నది అన్వయించుకోవడానికి కూడా కృషిచేయాలి. (మత్తయి 24:45) దేవుని జ్ఞానాన్ని అన్వయించుకోవడానికి ప్రతీ కారణం మనకుంది. అది ఇప్పుడే ఒక చక్కని జీవిత విధానాన్ని మనకిస్తుంది. ‘వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి’ అంటే దేవుని నూతనలోకంలో జీవితాన్ని సంపాదించుకోవడానికి అది మనకు సహాయం చేస్తుంది. (1 తిమోతి 6:18) అంతకంటే ప్రాముఖ్యంగా, పైనుండివచ్చు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం సర్వ జ్ఞానానికి మూలాధారుడైన యెహోవా దేవునికి మనలను సన్నిహితుల్ని చేస్తుంది.

a 1 రాజులు 3:16 ప్రకారం, ఆ ఇద్దరు స్త్రీలు వేశ్యలు. లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) ఇలా చెబుతోంది: “ఈ స్త్రీలు వాణిజ్య భావంలో వేశ్యలు కాకపోవచ్చు, అయితే ఆ స్త్రీలు జారత్వం చేసిన, యూదామత స్త్రీలో లేదా విదేశీ వారసత్వంగల స్త్రీలో అయివుంటారు.”—యెహోవాసాక్షులు ప్రచురించినది.

b “సమాధానపడుము” అని తర్జుమా చేయబడిన గ్రీకు మాట, “‘పరిస్థితిలో మార్పు తేవడం, ఇచ్చిపుచ్చుకోవడం,’ అనే అర్థమున్న క్రియా పదంనుండి వచ్చింది కాబట్టి ‘రాజీ పడడం’ అని దాని భావం.” అందువల్ల పరిస్థితిలో మార్పు తేవడం, శక్యమైతే మనస్సు నొచ్చుకున్న వ్యక్తి హృదయంలో నుండి ఆ విరోధ భావాన్ని తొలగించడం మీ లక్ష్యంగా ఉండాలి.—రోమీయులు 12:18.

c మరో అనువాదం ఈ పదాలను “జాలితో, సత్క్రియలతో నిండినది” అని అనువదిస్తోంది.—ఛార్లెస్‌ బి. విలియమ్స్‌ అనువదించిన, ఎ ట్రాన్స్‌లేషన్‌ ఇన్‌ ద లాంగ్వేజ్‌ ఆఫ్‌ ద పీపుల్‌.