మత్తయి 5-7 అధ్యాయాలు
5 యేసు ఆ ప్రజల్ని చూసినప్పుడు ఒక కొండ మీదికి వెళ్లి కూర్చున్నాడు; ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. 2 అప్పుడు యేసు వాళ్లకు ఇలా బోధించడం మొదలుపెట్టాడు:
3 “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది.
4 “దుఃఖించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు ఓదార్చబడతారు.
5 “సౌమ్యులు a సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు భూమికి వారసులౌతారు.
6 “నీతి కోసం ఆకలిదప్పులు గలవాళ్లు b సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు తృప్తిపర్చబడతారు.
7 “కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లమీద ఇతరులు కరుణ చూపిస్తారు.
8 “స్వచ్ఛమైన హృదయం గలవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు దేవుణ్ణి చూస్తారు.
9 “శాంతిని నెలకొల్పేవాళ్లు c సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు దేవుని పిల్లలు అనబడతారు.
10 “నీతి కోసం హింసించబడేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది.
11 “మీరు నా శిష్యులు అనే కారణంతో ప్రజలు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ గురించి అబద్ధంగా అన్నిరకాల చెడ్డమాటలు మాట్లాడినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. 12 పరలోకంలో మీకోసం గొప్ప బహుమానం వేచివుంది కాబట్టి సంతోషించండి, ఆనందంతో గంతులు వేయండి; ఎందుకంటే వాళ్లు అంతకుముందున్న ప్రవక్తల్ని d కూడా ఇలాగే హింసించారు.
13 “మీరు లోకానికి ఉప్పు లాంటివాళ్లు, కానీ ఉప్పు దాని రుచి కోల్పోతే, దానికి మళ్లీ ఉప్పదనం ఎలా వస్తుంది? అది మనుషులు తొక్కేలా బయట పారేయడానికి తప్ప దేనికీ పనికిరాదు.
14 “మీరు లోకానికి వెలుగు లాంటివాళ్లు. కొండమీద ఉన్న నగరం అందరికీ కనిపిస్తుంది. 15 ప్రజలు దీపాన్ని వెలిగించి గంప కింద పెట్టరు కానీ దీపస్తంభం మీద పెడతారు, అప్పుడది ఇంట్లో ఉన్న వాళ్లందరికీ వెలుగిస్తుంది. 16 అలాగే, మీ వెలుగును మనుషుల ముందు ప్రకాశించనివ్వండి, అప్పుడు వాళ్లు మీ మంచిపనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరుస్తారు.
17 “నేను ధర్మశాస్త్రాన్ని e గానీ, ప్రవక్తల మాటల్ని గానీ రద్దు చేయడానికి వచ్చానని అనుకోకండి. నేను వాటిని రద్దు చేయడానికి కాదు, నెరవేర్చడానికే వచ్చాను. 18 నేను నిజంగా మీతో చెప్తున్నాను. ఆకాశం, భూమి నాశనమైనా, ధర్మశాస్త్రమంతా పూర్తిగా నెరవేరేవరకు దానిలోని చిన్న అక్షరంగానీ, పొల్లుగానీ తప్పిపోదు. 19 కాబట్టి ఎవరైనా దీనిలోని అతిచిన్న ఆజ్ఞల్లో ఒకదాన్ని మీరి, అలా చేయమని ఇతరులకు బోధిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో అందరికన్నా తక్కువవాడిగా ఎంచబడతాడు. అయితే ఎవరైనా ఈ ఆజ్ఞలు పాటిస్తూ, వాటిని ఇతరులకు బోధిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఎంచబడతాడు. 20 మీరు శాస్త్రుల కన్నా, పరిసయ్యుల f కన్నా ఎక్కువ నీతిగా ఉండకపోతే, మీరు పరలోక రాజ్యంలోకి అస్సలు ప్రవేశించరని నేను మీతో చెప్తున్నాను.
21 “‘హత్య చేయకూడదు, ఎవరైనా హత్య చేస్తే అతను న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది’ అని పూర్వీకులకు చెప్పబడిందని మీరు విన్నారు కదా. 22 అయితే నేను మీతో చెప్తున్నాను, తన సహోదరుని మీద మనసులో కోపం పెట్టుకునే ప్రతీ వ్యక్తి న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది; తన సహోదరుణ్ణి ఘోరంగా అవమానిస్తూ మాట్లాడేవాడు అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది; తన సహోదరుణ్ణి ‘పనికిమాలిన మూర్ఖుడా’ అని తిట్టేవాడు మండే గెహెన్నాలో g పడేయబడతాడు.
23 “కాబట్టి, నువ్వు బలిపీఠం h దగ్గరికి నీ అర్పణను తెస్తున్నప్పుడు, నీ సహోదరుడు నీ వల్ల నొచ్చుకున్నాడని అక్కడ నీకు గుర్తొస్తే, 24 బలిపీఠం ఎదుటే నీ అర్పణను విడిచిపెట్టి వెళ్లి ముందు నీ సహోదరునితో సమాధానపడు; తర్వాత తిరిగొచ్చి నీ అర్పణను అర్పించు.
25 “నువ్వు నీ ప్రతివాదితో న్యాయస్థానానికి వెళ్లే దారిలో ఉన్నప్పుడే, త్వరగా అతనితో రాజీపడు. లేకపోతే అతను నిన్ను న్యాయమూర్తికి అప్పగిస్తాడు, న్యాయమూర్తి భటుడికి అప్పగిస్తాడు; నిన్ను చెరసాలలో వేస్తారు. 26 నువ్వు చివరి నాణెం చెల్లించేంత వరకు అక్కడి నుండి బయటికి రానేరావని నేను నిజంగా నీతో చెప్తున్నాను.
27 “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పబడిందని మీరు విన్నారు కదా. 28 కానీ నేను మీతో చెప్తున్నాను, ఒక స్త్రీ మీద కోరిక కలిగేలా అదేపనిగా ఆమెను చూస్తూ ఉండేవాడు అప్పటికే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేశాడు. 29 కాబట్టి నీ కుడి కన్ను నీతో పాపం చేయిస్తుంటే, దాన్ని పీకేసి దూరంగా పడేయి. నీ శరీరమంతా గెహెన్నాలో i పడేయబడడం కన్నా నీ అవయవాల్లో ఒకదాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు. 30 అలాగే, నీ కుడిచెయ్యి నీతో పాపం చేయిస్తుంటే, దాన్ని నరికేసి దూరంగా పడేయి. నీ శరీరమంతా గెహెన్నాలో j పడేయబడడం కన్నా నీ అవయవాల్లో ఒకదాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు.
31 “అంతేకాదు, ‘తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రతీ వ్యక్తి, ఆమెకు విడాకుల పత్రం ఇవ్వాలి’ అని చెప్పబడింది కదా. 32 అయితే నేను మీతో చెప్తున్నాను, లైంగిక పాపం k అనే కారణాన్ని బట్టి కాకుండా వేరే కారణంతో తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రతీ వ్యక్తి, ఆమెను వ్యభిచారం చేసే ప్రమాదంలోకి నెడుతున్నాడు. ఈ విధంగా విడాకులు ఇవ్వబడిన స్త్రీని పెళ్లి చేసుకునే వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు.
33 “అంతేకాదు, ‘నువ్వు ప్రమాణం చేస్తే దాన్ని తప్పకూడదు, నువ్వు యెహోవాకు l చేసుకున్న మొక్కుబళ్లు చెల్లించాలి’ అని పూర్వీకులతో చెప్పబడిందని మీరు విన్నారు కదా. 34 అయితే నేను మీతో చెప్తున్నాను, అసలు ఒట్టే వేయొద్దు; పరలోకం తోడు అని ఒట్టు వేయొద్దు, అది దేవుని సింహాసనం; 35 భూమి తోడు అని ఒట్టు వేయొద్దు, అది ఆయన పాదపీఠం; యెరూషలేము తోడు అని ఒట్టు వేయొద్దు, అది మహారాజు నగరం. 36 నీ ప్రాణం తోడు అని ఒట్టుపెట్టుకోవద్దు, నువ్వు ఒక్క వెంట్రుకను కూడా తెల్లగానైనా నల్లగానైనా చేయలేవు. 37 మీ మాట “అవును” అంటే అవును, “కాదు” అంటే కాదు అన్నట్టే ఉండాలి. వీటికి మించింది ఏదైనా, అది దుష్టుని a నుండి వచ్చేదే.
38 “‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పబడిందని మీరు విన్నారు కదా. 39 అయితే నేను మీతో చెప్తున్నాను, చెడ్డవాణ్ణి ఎదిరించవద్దు, బదులుగా నిన్ను కుడి చెంప మీద కొట్టేవాడికి ఎడమ చెంప కూడా చూపించు. 40 ఎవరైనా నిన్ను న్యాయస్థానానికి తీసుకెళ్లి నీ లోపలి వస్త్రాన్ని తీసుకోవాలని అనుకుంటే, అతనికి నీ పైవస్త్రాన్ని కూడా ఇచ్చేయి. 41 అధికారంలో ఉన్న వ్యక్తి ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో పాటు రెండు మైళ్లు వెళ్లు. 42 ఎవరైనా నిన్ను ఏదైనా అడిగితే ఇవ్వు, నిన్ను అప్పు అడగాలనుకునే b వాళ్లకు ముఖం చాటేయకు.
43 “‘నీ సాటిమనిషిని ప్రేమించాలి, నీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పబడిందని మీరు విన్నారు కదా. 44 అయితే నేను మీతో చెప్తున్నాను, మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి, మిమ్మల్ని హింసించేవాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉండండి, 45 అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి పిల్లలుగా ఉంటారు. ఎందుకంటే ఆయన దుష్టుల మీద, మంచివాళ్ల మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు; నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. 46 మిమ్మల్ని ప్రేమించేవాళ్లనే మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం దొరుకుతుంది? పన్ను వసూలుచేసే వాళ్లు కూడా అలా చేస్తున్నారు కదా? 47 మీ సహోదరులకు మాత్రమే మీరు నమస్కారం చేస్తే, మీరేం గొప్ప పని చేస్తున్నట్టు? అన్యజనులు కూడా అలా చేస్తున్నారు కదా? 48 మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా ఆయనలా పరిపూర్ణులుగా ఉండాలి. c
6 “మనుషులకు కనిపించాలని వాళ్ల ముందు మీ నీతికార్యాలు చేయకుండా జాగ్రత్తపడండి; లేకపోతే పరలోకంలో ఉన్న మీ తండ్రి నుండి మీకు ఏ ప్రతిఫలమూ దక్కదు. 2 కాబట్టి నువ్వు దానధర్మాలు d చేస్తున్నప్పుడు నీ ముందు బాకా ఊదించుకోవద్దు, వేషధారులు మనుషులచేత మహిమ పొందడం కోసం సమాజమందిరాల్లో, వీధుల్లో అలా చేస్తుంటారు. వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను. 3 కానీ నువ్వు దానధర్మాలు చేస్తున్నప్పుడు, నీ కుడిచెయ్యి చేసేది నీ ఎడమచేతికి తెలియనివ్వకు. 4 అలాచేస్తే నీ దానధర్మాలు రహస్యంగా ఉంటాయి. అప్పుడు ప్రతీది చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు.
5 “అంతేకాదు, మీరు ప్రార్థించేటప్పుడు వేషధారుల్లా ఉండకండి; మనుషులకు కనిపించేలా సమాజమందిరాల్లో, ముఖ్య వీధుల మూలల్లో నిలబడి ప్రార్థించడం వాళ్లకు ఇష్టం. వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను. 6 నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, నీ గదిలోకి వెళ్లి, తలుపులు వేసుకుని, ఎవరూ చూడలేని నీ తండ్రికి ప్రార్థించు. అప్పుడు ప్రతీది చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 7 నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, అన్యజనుల్లా చెప్పిన మాటలే మళ్లీమళ్లీ చెప్పకు; ఎక్కువ మాటలు ఉపయోగిస్తే దేవుడు తమ ప్రార్థన వింటాడని వాళ్లు అనుకుంటారు. 8 కానీ మీరు వాళ్లలా ఉండకండి; ఎందుకంటే మీరు అడగకముందే మీకేమి అవసరమో మీ తండ్రికి తెలుసు.
9 “కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థించాలి:
“‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి. e 10 నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి. 11 మాకు ఈ రోజుకు అవసరమైన ఆహారం ఇవ్వు; 12 మాకు అప్పుపడిన వాళ్లను మేము క్షమించినట్టే, మా అప్పులు f కూడా క్షమించు. 13 మమ్మల్ని ప్రలోభానికి లొంగిపోనివ్వకు, దుష్టుని నుండి మమ్మల్ని కాపాడు.’
14 “మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమిస్తే, మీ పరలోక తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు; 15 మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమించకపోతే, మీ పరలోక తండ్రి కూడా మీ పాపాల్ని క్షమించడు.
16 “మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు, వేషధారుల్లా బాధగా ముఖం పెట్టుకోకండి; తాము ఉపవాసం ఉంటున్నట్టు మనుషులకు కనబడాలని వాళ్లు తమ ముఖాన్ని వికారంగా పెట్టుకుంటారు. g వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను. 17 అయితే నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ తలకు నూనె రాసుకో, నీ ముఖం కడుక్కో. 18 అలాచేస్తే నువ్వు ఉపవాసం ఉంటున్నట్టు మనుషులకు కాదుగానీ, ఎవరూ చూడలేని నీ తండ్రికి మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ప్రతీది చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు.
19 “భూమ్మీద మీ కోసం సంపదలు కూడబెట్టుకోవడం ఆపండి; ఇక్కడ చెదలు, తుప్పు వాటిని తినేస్తాయి; దొంగలు కన్నం వేసి దోచుకుంటారు. 20 బదులుగా, పరలోకంలో మీ కోసం సంపదలు కూడబెట్టుకోండి; అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ వాటిని తినవు; దొంగలు కన్నం వేసి దోచుకోరు. 21 నీ సంపద ఎక్కడ ఉంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది.
22 “శరీరానికి దీపం కన్నే కాబట్టి, నీ కన్ను ఒకేదానిపై దృష్టి నిలిపితే నీ శరీరమంతా ప్రకాశవంతంగా h ఉంటుంది. 23 అయితే నీ కన్ను ఈర్ష్యతో నిండిపోతే i నీ శరీరమంతా చీకటౌతుంది. నీలో ఉన్న వెలుగు చీకటిగా మారితే, ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా!
24 “ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండలేడు. అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు, లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు. మీరు ఒకే సమయంలో దేవునికీ సంపదలకూ దాసులుగా ఉండలేరు.
25 “అందుకే నేను మీతో చెప్తున్నాను. ఏమి తినాలా, ఏమి తాగాలా అని మీ ప్రాణం గురించి గానీ, ఏమి వేసుకోవాలా అని మీ శరీరం గురించి గానీ ఆందోళన పడడం మానేయండి. ఆహారంకన్నా ప్రాణం, బట్టలకన్నా శరీరం విలువైనవి కావా? 26 ఆకాశపక్షుల్ని బాగా గమనించండి; అవి విత్తవు, కోయవు, గోదాముల్లో పోగుచేసుకోవు, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికన్నా విలువైనవాళ్లు కారా? 27 మీలో ఎవరైనా ఆందోళన పడడం వల్ల మీ ఆయుష్షును కాస్తయినా పెంచుకోగలరా? 28 అలాగే, బట్టల గురించి మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారు? గడ్డిపూలు ఎలా పెరుగుతాయో జాగ్రత్తగా గమనించండి; అవి కష్టపడవు, వడకవు; j 29 కానీ తన పూర్తి వైభవంతో ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒకదానంత అందంగా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. 30 ఇవాళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డిమొక్కలనే దేవుడు అలా అలంకరిస్తున్నాడంటే, అల్పవిశ్వాసులారా, ఆయన మీకు తప్పకుండా బట్టలు ఇస్తాడు కదా? 31 కాబట్టి ‘ఏమి తినాలి?’ ‘ఏమి తాగాలి?’ ‘ఏమి వేసుకోవాలి?’ అనుకుంటూ ఎన్నడూ ఆందోళన పడకండి. 32 అన్యజనులు వీటి వెనకే ఆత్రంగా పరుగెత్తుతున్నారు. అయితే మీకు ఇవన్నీ అవసరమని మీ పరలోక తండ్రికి తెలుసు.
33 “కాబట్టి మీరు ఆయన రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు. 34 అందుకే రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి, ఏ రోజు సమస్యలు ఆ రోజుకు చాలు.
7 “తీర్పు తీర్చడం ఆపేయండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు; 2 మీరు ఎలా తీర్పు తీరుస్తారో, మీకూ అలాగే తీర్పు తీర్చబడుతుంది; మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకూ అదే కొలతతో కొలవబడుతుంది. 3 అలాంటిది, నీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించుకోకుండా నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును ఎందుకు చూస్తున్నావు? 4 నీ కంట్లోనే దూలాన్ని పెట్టుకుని, నీ సహోదరునితో, ‘నన్ను నీ కంట్లో ఉన్న నలుసును తీసేయనివ్వు’ అని ఎలా అంటావు? 5 వేషధారీ! ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును ఎలా తీసేయాలో నీకు స్పష్టంగా కనిపిస్తుంది.
6 “పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి, మీ ముత్యాలు పందుల ముందు వేయకండి; అలాచేస్తే అవి వాటిని కాళ్లతో తొక్కేసి, మీ వైపుకు తిరిగి మిమ్మల్ని చీల్చేస్తాయి.
7 “అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది; తడుతూ ఉండండి, మీ కోసం తెరవబడుతుంది; 8 అడిగే ప్రతీ వ్యక్తి పొందుతాడు, వెతికే ప్రతీ వ్యక్తికి దొరుకుతుంది, తట్టే ప్రతీ వ్యక్తి కోసం తెరవబడుతుంది. 9 మీలో ఎవరైనా, మీ కుమారుడు రొట్టెను అడిగితే రాయిని ఇస్తారా? 10 చేపను అడిగితే పామును ఇస్తారా? 11 మీరు చెడ్డవాళ్లయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వడం మీకు తెలుసు, అలాంటిది పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవాళ్లకు ఇంకెంతగా మంచి బహుమతులు ఇస్తాడో కదా!
12 “కాబట్టి ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి. నిజానికి ధర్మశాస్త్రం, ప్రవక్తల పుస్తకాలు బోధించేది అదే.
13 “ఇరుకు ద్వారం గుండా వెళ్లండి; ఎందుకంటే నాశనానికి నడిపించే ద్వారం వెడల్పుగా, ఆ దారి విశాలంగా ఉంది; చాలామంది దాని గుండా వెళ్తున్నారు. 14 అయితే జీవానికి నడిపించే ద్వారం ఇరుకుగా, ఆ దారి కష్టంగా ఉంది; కొంతమందే దాన్ని కనుక్కుంటున్నారు.
15 “గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరికి వచ్చే అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి, లోలోపల వాళ్లు క్రూరమైన తోడేళ్లు. 16 వాళ్ల పనుల్ని బట్టి మీరు వాళ్లను గుర్తుపడతారు. ప్రజలు ముళ్లపొదల నుండి ద్రాక్షపండ్లు గానీ అంజూర పండ్లు గానీ ఏరుకుంటారా? 17 ప్రతీ మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, ప్రతీ చెడ్డ చెట్టు పనికిరాని ఫలాలు ఇస్తుంది. 18 మంచి చెట్టు పనికిరాని ఫలాలు ఇవ్వలేదు, చెడ్డ చెట్టు మంచి ఫలాలు ఇవ్వలేదు. 19 మంచి ఫలాలు ఇవ్వని ప్రతీ చెట్టు నరకబడి, అగ్నిలో పడేయబడుతుంది. 20 కాబట్టి, మీరు వాళ్ల పనుల్ని బట్టి వాళ్లను గుర్తుపడతారు.
21 “‘ప్రభువా, ప్రభువా,’ అని నన్ను పిలిచే ప్రతీ ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి కోరేవాటిని చేసేవాళ్లే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ పేరున చెడ్డదూతల్ని వెళ్లగొట్టలేదా? నీ పేరున చాలా అద్భుతాలు చేయలేదా?’ అని అంటారు. 23 అయితే అప్పుడు నేను వాళ్లతో, ‘అక్రమంగా నడుచుకునే వాళ్లారా, మీరు ఎవరో నాకు అస్సలు తెలీదు, నా దగ్గర నుండి వెళ్లిపోండి!’ అని అంటాను.
24 “కాబట్టి, నేను చెప్పే ఈ మాటలు విని వాటిని పాటించే ప్రతీ వ్యక్తి, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిగల వ్యక్తి లాంటివాడు. 25 పెద్ద వర్షం కురిసి, వరదలు వచ్చి, భయంకరంగా గాలులు వీచినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది. 26 అయితే, నేను చెప్పే ఈ మాటలు విని వాటిని పాటించని ప్రతీ వ్యక్తి, ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివితక్కువ వ్యక్తి లాంటివాడు. 27 పెద్ద వర్షం కురిసి, వరదలు వచ్చి, భయంకరంగా గాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది, పూర్తిగా ధ్వంసమైపోయింది.”
28 యేసు ఈ మాటలు చెప్పడం పూర్తయినప్పుడు, ప్రజలు ఆయన బోధించిన తీరును చూసి చాలా ఆశ్చర్యపోయారు, 29 ఎందుకంటే ఆయన వాళ్ల శాస్త్రుల్లా కాకుండా అధికారంగల వ్యక్తిలా బోధించాడు.
a లేదా “సాత్వికులు.”
b లేదా “నీతిని బలంగా కోరుకునేవాళ్లు.”
c లేదా “శాంత స్వభావం గలవాళ్లు.”
d దేవుని ఉద్దేశాల్ని తెలియజేసే వ్యక్తి. ప్రవక్తలు దేవుని తరఫున మాట్లాడుతూ ప్రవచనాలు చెప్పేవాళ్లు, యెహోవా బోధల్ని, ఆజ్ఞల్ని, తీర్పుల్ని ప్రజలకు తెలియజేసేవాళ్లు.
e బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాల్ని తరచూ ధర్మశాస్త్రం అని పిలుస్తారు.
f శాస్త్రులు అంటే ధర్మశాస్త్రంలో ఆరితేరిన వాళ్లు, పరిసయ్యులు అంటే యూదా మత నాయకులు.
g యెరూషలేము బయట చెత్తను కాల్చే స్థలం. ప్రాచీన యెరూషలేముకు దక్షిణాన, నైరుతి వైపున ఉన్న హిన్నోము లోయను గ్రీకు భాషలో గెహెన్నా అని పిలుస్తారు. జంతువుల్ని, మనుషుల్ని కాల్చేందుకు లేదా బాధించేందుకు సజీవంగా అందులో పారేసేవాళ్లు అని చెప్పడానికి ఎలాంటి రుజువులూ లేవు. కాబట్టి గెహెన్నా, అక్షరార్థమైన మంటల్లో మనుషుల ఆత్మల్ని శాశ్వతంగా బాధించే అదృశ్యమైన చోటును సూచించదు. బదులుగా, శాశ్వత శిక్షను లేదా నిత్యనాశనాన్ని సూచించడానికి యేసు, ఆయన శిష్యులు గెహెన్నా అనే పదాన్ని ఉపయోగించారు.
h కాస్త ఎత్తులో నిర్మించిన కట్టడం లేదా వేదిక. ఆరాధనలో భాగంగా దానిమీద బలుల్ని, ధూపాన్ని అర్పించేవాళ్లు.
k ఇది పోర్నియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దేవుని నియమాలకు విరుద్ధమైన లైంగిక సంబంధాలన్నిటి గురించి చెప్పడానికి ఉపయోగించే పదం. వ్యభిచారం, వేశ్యావృత్తి, పెళ్లికానివాళ్ల మధ్య లైంగిక సంబంధాలు, స్వలింగ సంపర్కం, జంతువులతో సంపర్కం వంటివన్నీ దీని కిందికి వస్తాయి.
l లేఖనాల్లో, సర్వశక్తిగల దేవుని పేరు “యెహోవా.”
a అంటే, సాతాను.
b అంటే, వడ్డీ లేకుండా అప్పు అడిగే.
c అంటే, సంపూర్ణ ప్రేమ చూపించాలి.
d లేదా “పేదవాళ్లకు దానధర్మాలు.”
e లేదా “పవిత్రంగా ఎంచబడాలి; పవిత్రంగా చూడబడాలి.”
f లేదా “మా తప్పులు.”
g లేదా “తాము కనిపించే తీరును పట్టించుకోరు.”
h లేదా “వెలుగుమయంగా.”
i అక్ష., “చెడ్డదైతే; దుష్టమైనదైతే.” అంటే, చాలా విషయాల కోసం చూస్తుంటే.
j లేదా “నేయవు.”