84వ అధ్యాయం
శిష్యులుగా ఉండడం చాలా పెద్ద బాధ్యత
-
శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలి?
పరిసయ్యుల నాయకుని ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు యేసు విలువైన పాఠాలు నేర్పించాడు. తర్వాత యేసు యెరూషలేముకు ప్రయాణం కొనసాగిస్తుండగా చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్తున్నారు. ఎందుకు? ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా సరే, ఆయన నిజమైన శిష్యులుగా ఉండాలని వాళ్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా?
వాళ్లు ప్రయాణిస్తుండగా, యేసు అన్న ఈ మాట కొంతమందికి ఆశ్చర్యం కలిగించి ఉంటుంది: “నా దగ్గరికి వచ్చే వాళ్లెవరైనా సరే తమ తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లల్ని, తోబుట్టువుల్ని, చివరికి తమ ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాళ్లు నా శిష్యులు కాలేరు.” (లూకా 14:26) ఆ మాటలకు అర్థం ఏంటి?
తన అనుచరులయ్యే వాళ్లందరూ తమ కుటుంబ సభ్యుల్ని నిజంగా ద్వేషించాలని యేసు చెప్పట్లేదు. బదులుగా, వాళ్లు తమ కుటుంబ సభ్యుల్ని తన కన్నా ఎక్కువగా ప్రేమించకూడదని చెప్తున్నాడు. యేసు చెప్పిన ఉదాహరణలో, కొత్తగా పెళ్లయిందనే కారణంతో ప్రాముఖ్యమైన ఆహ్వానాన్ని తిరస్కరించిన వ్యక్తిలా వాళ్లు ఉండకూడదు. (లూకా 14:20) యూదుల పూర్వీకుడైన యాకోబు లేయాను ‘ద్వేషించి’ రాహేలును ప్రేమించాడని లేఖనాలు చెప్తున్నాయి. అంటే యాకోబు లేయాను నిజంగా ద్వేషించాడని కాదుగానీ, రాహేలు కన్నా ఆమెను తక్కువగా ప్రేమించాడని అర్థం.—ఆదికాండం 29:31; అధస్సూచి.
తన శిష్యులయ్యే వాళ్లు “చివరికి తమ ప్రాణాన్ని” కూడా ద్వేషించాలని యేసు చెప్పాడు. అంటే నిజమైన శిష్యులు యేసును తమ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాలి, చివరికి తమ ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. నిజంగా, యేసు శిష్యులుగా ఉండడం చాలా పెద్ద బాధ్యత. అది ఏదో ఆషామాషీగా, ఏమాత్రం ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం కాదు.
శిష్యులు కష్టాల్ని, హింసను ఎదుర్కోవాల్సి రావచ్చు. యేసు ఇలా అన్నాడు: “ఒక వ్యక్తి తన హింసాకొయ్యను మోస్తూ నన్ను అనుసరించకపోతే అతను నా శిష్యుడు కాలేడు.” (లూకా 14:27) అవును, యేసు నిజమైన శిష్యులు ఆయన ఎదుర్కొన్నలాంటి కష్టాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. తాను తన శత్రువుల చేతుల్లో చనిపోతానని కూడా యేసు చెప్పాడు.
కాబట్టి యేసుతోపాటు యెరూషలేముకు ప్రయాణిస్తున్న ప్రజలు, ఆయన శిష్యులుగా ఉండడం ఎంత పెద్ద బాధ్యతో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. యేసు ఒక ఉదాహరణ ద్వారా ఆ విషయాన్ని నొక్కిచెప్పాడు: “మీలో ఒక వ్యక్తి భవనం కట్టాలనుకుంటే, దాన్ని పూర్తిచేయడానికి కావాల్సినంత డబ్బు తన దగ్గర ఉందో లేదో చూడడానికి ముందుగా కూర్చొని లెక్కలు వేసుకోడా? అలా లెక్కలు వేసుకోకపోతే, అతను పునాది వేసినా దాన్ని పూర్తి చేయలేకపోవచ్చు.” (లూకా 14:28, 29) కాబట్టి ఆ ప్రజలు, ఆయన శిష్యులవ్వడానికి ముందే, ఆ బాధ్యతను పూర్తిగా నెరవేర్చగలరో లేదో ఆలోచించుకోవాలి. యేసు ఆ విషయాన్ని మరో ఉదాహరణ ద్వారా స్పష్టం చేశాడు:
“ఒక రాజు ఇంకో రాజుతో యుద్ధానికి వెళ్తున్నాడనుకోండి. అప్పుడు అతను 20,000 మంది సైన్యంతో తన మీదికి వస్తున్న రాజును తన దగ్గరున్న 10,000 మంది సైన్యంతో ఎదుర్కోగలడా లేదా అని ముందు కూర్చొని సలహా తీసుకోడా? ఒకవేళ ఎదుర్కోలేడంటే, అవతలి రాజు చాలా దూరంలో ఉన్నప్పుడే ఇతను రాయబారుల్ని పంపి ఆ రాజుతో సంధి చేసుకుంటాడు.” తాను చెప్పాలనుకున్న విషయాన్ని యేసు ఇలా నొక్కి చెప్పాడు: “అదేవిధంగా, లూకా 14:31-33.
మీలో ఎవరైనా తనకు ఉన్నవన్నీ వదులుకోకపోతే అతను నా శిష్యుడు కాలేడు.”—యేసు తనతోపాటు వస్తున్న ప్రజల్ని ఉద్దేశించి మాత్రమే ఆ మాట చెప్పలేదు. క్రీస్తు గురించి తెలుసుకునే వాళ్లందరూ ఆ సలహాను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన శిష్యులుగా ఉండాలనుకునేవాళ్లు తమకు ఉన్నవన్నీ అంటే వస్తువుల్ని, చివరికి తమ ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి అది బాగా ఆలోచించి, ప్రార్థన చేసి తీసుకోవాల్సిన నిర్ణయం.
తర్వాత, కొండమీది ప్రసంగంలో చెప్పిన ఒక అంశాన్ని యేసు మళ్లీ చెప్పాడు. తన శిష్యులు “లోకానికి ఉప్పు లాంటివాళ్లు” అని ఆయన ఆ ప్రసంగంలో అన్నాడు. (మత్తయి 5:13) ఉప్పు ఆహారపదార్థాల్ని పాడవ్వకుండా కాపాడుతుంది. అదేవిధంగా, తన శిష్యులు ప్రజల్ని ఆధ్యాత్మికంగా, నైతికంగా పాడవ్వకుండా కాపాడతారనే ఉద్దేశంతో యేసు అలా అనివుంటాడు. ఇప్పుడు తన పరిచర్య ముగింపుకు వస్తుండగా ఆయన మళ్లీ ఇలా అన్నాడు: “నిజంగానే ఉప్పు చాలా మంచిది. కానీ ఉప్పు దాని రుచి కోల్పోతే, దానికి మళ్లీ ఉప్పదనం ఎలా వస్తుంది?” (లూకా 14:34) యేసు మాటలు వింటున్నవాళ్లకు ఆ కాలంలో దొరికే కల్తీ ఉప్పు గురించి తెలుసు. దానిలో ఎక్కువగా ఇసుక ఉండేది. ఆ ఉప్పు ఎందుకూ పనికిరాదు.
చాలాకాలంగా తన శిష్యులుగా ఉన్నవాళ్లు కూడా తమ దృఢ నిశ్చయం బలహీనపడకుండా చూసుకోవాలని యేసు తెలియజేస్తున్నాడు. ఒకవేళ అలా బలహీనపడితే, సారం కోల్పోయిన ఉప్పులాగే వాళ్ల వల్ల కూడా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అప్పుడు లోకం వాళ్లను ఎగతాళి చేయవచ్చు. అంతకన్నా ముఖ్యంగా, వాళ్లు దేవుని ఆమోదం కోల్పోయి, చివరికి ఆయన పేరుకు మచ్చ తెచ్చిన వాళ్లవుతారు. అలా జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని చెప్తూ, యేసు ఈ మాట అన్నాడు: “చెవులు ఉన్నవాడు వినాలి.”—లూకా 14:35.