13వ అధ్యాయం
యేసులా ప్రలోభాల్ని తిప్పికొట్టండి
మత్తయి 4:1-11 మార్కు 1:12, 13 లూకా 4:1-13
-
సాతాను యేసును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు
యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్న వెంటనే, దేవుని పవిత్రశక్తి యేసును యూదయ ఎడారిలోకి నడిపించింది. ఆయన ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యేసు బాప్తిస్మమప్పుడు “ఆకాశం తెరుచుకుంది.” (మత్తయి 3:16) దాంతో తాను పరలోకంలో ఉన్నప్పుడు నేర్చుకున్నవి, చేసినవి ఆయనకు గుర్తొచ్చాయి. అవును, ఆయన ధ్యానించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి!
యేసు ఎడారిలో 40 పగళ్లు, 40 రాత్రులు గడిపాడు. ఆ సమయంలో ఆయన ఏమీ తినలేదు. యేసుకు చాలా ఆకలిగా ఉన్నప్పుడు, అపవాదియైన సాతాను ఆయన దగ్గరికి వచ్చి, “నువ్వు దేవుని కుమారుడివైతే, ఈ రాళ్లను రొట్టెలుగా మారమని ఆజ్ఞాపించు” అంటూ ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు. (మత్తయి 4:3) సొంత అవసరాలు తీర్చుకోవడానికి తన అద్భుత శక్తుల్ని వాడడం తప్పని యేసుకు తెలుసు. కాబట్టి, ఆయన ఆ ప్రలోభాన్ని తిప్పికొట్టాడు.
అపవాది అంతటితో ఊరుకోలేదు. యేసును మరో విధంగా ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు. ఆలయం గోడ మీదనుండి దూకమని అతను యేసుకు సవాలు విసిరాడు. కానీ యేసు ఆ ప్రలోభానికి లొంగిపోలేదు, తనను తాను గొప్పగా చూపించుకోవాలని అనుకోలేదు. యేసు లేఖనాల్ని ఉపయోగిస్తూ, దేవుణ్ణి అలా పరీక్షించడం తప్పని చెప్పాడు.
అపవాది మూడోసారి కూడా యేసును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు. అతను ఏదోక విధంగా లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమనూ ఆయనకు చూపించి, “నువ్వు సాష్టాంగపడి ఒక్కసారి నన్ను పూజిస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను” అన్నాడు. యేసు వెంటనే, “సాతానా, వెళ్లిపో!” అంటూ తిరస్కరించాడు. (మత్తయి 4:8-10) యెహోవాకు మాత్రమే పవిత్రసేవ చేయాలని యేసుకు తెలుసు కాబట్టి, ఆయన ఆ ప్రలోభానికి లొంగిపోలేదు. అవును, ఆయన దేవునికి నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఈ ప్రలోభాల నుండి, వాటికి యేసు స్పందించిన తీరు నుండి మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. యేసుకు ఆ ప్రలోభాలు నిజంగానే ఎదురయ్యాయి. కాబట్టి కొంతమంది అనుకుంటున్నట్లు అపవాది ఒక చెడు లక్షణం కాదుగానీ ఒక నిజమైన వ్యక్తి, అతను మన కంటికి కనిపించడు. అంతేకాదు, లోకంలోని ప్రభుత్వాలన్నీ నిజానికి అపవాది సొత్తు అని, అతను వాటిని అదుపు చేస్తున్నాడని ఈ వృత్తాంతాన్ని బట్టి తెలుస్తుంది. ఒకవేళ అవి అపవాది అధీనంలో లేకపోతే, వాటిని ఇస్తాననడం యేసును ప్రలోభపెట్టినట్టు ఎలా అవుతుంది?
తనను ఒక్కసారి ఆరాధించినా యేసుకు బహుమానం ఇవ్వడానికి, చివరికి లోక రాజ్యాలన్నిటినీ ఇవ్వడానికి అపవాది సిద్ధపడ్డాడు. అపవాది మనల్ని కూడా అదేవిధంగా ప్రలోభపెట్టవచ్చు. ఆస్తిపాస్తుల్ని, అధికారాన్ని, హోదాను సంపాదించుకునే ఆకర్షణీయమైన అవకాశాలు సాతాను మన ముందు పెట్టవచ్చు. అతను ఏ విధంగా ప్రలోభపెట్టినా, మనం మాత్రం యేసులా దేవునికి నమ్మకంగా ఉండడం తెలివైన పని. అయితే, అపవాది యేసును ఆ సమయంలో వదిలివెళ్లినా “ఇంకో మంచి అవకాశం దొరికే వరకు” ఎదురుచూశాడని గుర్తుంచుకోండి. (లూకా 4:13) మన విషయంలో కూడా అదే జరగవచ్చు. అందుకే మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.