131వ అధ్యాయం
యేసును కొయ్యకు వేలాడదీశారు
మత్తయి 27:33-44 మార్కు 15:22-32 లూకా 23:32-43 యోహాను 19:17-24
-
యేసును హింసాకొయ్యకు వేలాడదీశారు
-
యేసు తల పైన బిగించిన పలకను చూసి ఎగతాళి చేశారు
-
భూపరదైసు మీద జీవించే అవకాశం గురించి యేసు చెప్పాడు
యేసును గొల్గొతా లేదా కపాల స్థలం అని పిలవబడే చోటుకు తీసుకెళ్లారు. అది నగరానికి దగ్గర్లోనే ఉంది. కాస్త దూరం నుండి చూసేవాళ్లకు ఆ స్థలం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ యేసుకు, ఇద్దరు బందిపోటు దొంగలకు మరణశిక్ష విధించబోతున్నారు.—మార్కు 15:40.
ఆ ముగ్గురి వస్త్రాలను తీసేశారు. తర్వాత బోళం, చేదు మొక్కలు కలిపిన ద్రాక్షారసాన్ని వాళ్లకు ఇచ్చారు. బహుశా, యెరూషలేము స్త్రీలు దాన్ని తయారు చేసివుంటారు. దాన్ని తాగితే నొప్పి తెలీకుండా ఉంటుంది కాబట్టి, మరణశిక్ష అనుభవించబోయే వాళ్లకు దాన్ని ఇవ్వడానికి రోమన్లు ఒప్పుకున్నారు. కానీ యేసు దాన్ని రుచి చూసి, తాగడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే, ఈ పెద్ద పరీక్షను ఎదుర్కొంటుండగా తాను పూర్తి తెలివితో, స్పృహతో ఉండాలనీ మరణం వరకు నమ్మకంగా ఉండాలనీ ఆయన కోరుకున్నాడు.
సైనికులు యేసును కొయ్య మీద పడుకోబెట్టారు. (మార్కు 15:25) ఆయన చేతుల్లో, పాదాల్లో మేకులు దిగగొట్టారు. ఆ మేకులు ఆయన కండను, స్నాయువులను (ఎముకల్ని లేదా అవయవాల్ని పట్టివుంచే ఒకలాంటి నరం) చీలుస్తూ విపరీతమైన నొప్పి కలిగిస్తున్నాయి. ఆ కొయ్యను నిలబెట్టినప్పుడు, యేసు బరువంతా మేకులపై పడుతుంటే, అవి కండను ఇంకా చీలుస్తూ భరించలేని నొప్పి కలిగిస్తున్నాయి. అయినప్పటికీ యేసు ఆ సైనికుల్ని దూషించలేదు. బదులుగా ఆయన ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, వీళ్లను క్షమించు. వీళ్లు ఏంచేస్తున్నారో వీళ్లకు తెలీదు.”—లూకా 23:34.
రోమన్లు నేరస్తులకు మరణశిక్ష విధించేటప్పుడు, వాళ్లు ఏ నేరం చేశారో ఒక పలక మీద రాసి, దాన్ని కొయ్యకు బిగించేవాళ్లు. యేసు విషయానికొస్తే, పిలాతు ఒక పలక మీద “నజరేయుడైన యేసు యూదుల రాజు” అని రాయించి పెట్టాడు. అందరూ చదవగలిగేలా దాన్ని హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషల్లో రాయించాడు. యేసును చంపాలని పట్టుబట్టిన యూదుల మీద కోపంతో పిలాతు అలా చేశాడు. అది నచ్చని ముఖ్య యాజకులు ఇలా అన్నారు: “‘యూదుల రాజు’ అని రాయవద్దు, ‘నేను యూదుల రాజుని’ అని అతను చెప్పుకున్నాడు అన్నట్టు రాయి.” కానీ మరోసారి వాళ్ల చేతుల్లో కీలుబొమ్మ అవ్వడం ఇష్టంలేక, పిలాతు ఇలా అన్నాడు: “నేను రాసిందేదో రాశాను.”—యోహాను 19:19-22.
కోపంతో రగిలిపోతున్న యాజకులు, అంతకుముందు మహాసభలో చెప్పిన అబద్ధ సాక్ష్యాన్నే మళ్లీ చెప్పారు. అందుకే, దారిన వెళ్తున్నవాళ్లు కూడా తలలాడిస్తూ, యేసును ఎగతాళి చేస్తూ ఇలా దూషించారు: “అబ్బో, నువ్వు ఆలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కడతావా? హింసాకొయ్య మీద నుండి దిగొచ్చి నిన్ను నువ్వు రక్షించుకో!” ముఖ్య యాజకులు, శాస్త్రులు కూడా ఆయన్ని ఎగతాళి చేస్తూ ఇలా మాట్లాడుకున్నారు: “ఈ క్రీస్తును, ఈ ఇశ్రాయేలు రాజును హింసాకొయ్య మీద నుండి దిగి రమ్మనండి చూద్దాం, అప్పుడు నమ్మవచ్చు.” (మార్కు 15:29-32) యేసుకు కుడివైపున, ఎడమవైపున వేలాడుతున్న దొంగలు కూడా ఆయన్ని దూషించారు. కానీ ఆ ముగ్గురిలో యేసు మాత్రమే నిర్దోషి.
నలుగురు రోమా సైనికులు కూడా యేసును ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. బహుశా వాళ్లు పుల్లటి ద్రాక్షారసాన్ని తాగుతూ, దానిలో కొంచెం తీసి ఆయన ముందు పెట్టారు. ఆయన ఎలాగూ కొయ్యమీద నుండి దిగి దాన్ని తాగలేడని తెలిసి కావాలనే అలా చేశారు. వాళ్లు ఆయన తల పైన ఉన్న పలకను చూసి, “నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వు రక్షించుకో” అంటూ ఎగతాళి చేశారు. (లూకా 23:36, 37) ఒక్కసారి ఆలోచించండి! ఏ వ్యక్తయితే మార్గం, సత్యం, జీవమో, ఆయన్నే ఇప్పుడు అన్యాయంగా దూషిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అయినప్పటికీ, యేసు మౌనంగా వాటన్నిటినీ భరించాడు. తనను గమనిస్తున్న యూదుల్ని గానీ, ఎగతాళి చేస్తున్న రోమా సైనికుల్ని గానీ, తన పక్కన కొయ్యపై వేలాడుతున్న ఇద్దరు నేరస్తుల్ని గానీ యేసు దూషించలేదు.
ఆ నలుగురు సైనికులు యేసు పైవస్త్రాల్ని తీసి, నాలుగు భాగాలు చేశారు. ఎవరికి ఏ భాగం వస్తుందో తెలుసుకోవడానికి చీట్లు వేశారు. యేసు వేసుకున్న లోపలి వస్త్రం మాత్రం చాలా నాణ్యమైనది. అది “కుట్టులేకుండా పైనుండి కిందివరకు నేయబడింది.” అందుకే వాళ్లు, “మనం దీన్ని చింపకుండా, చీట్లు వేసి ఎవరికి వస్తుందో చూద్దాం” అని చెప్పుకున్నారు. ఆ విధంగా, “వాళ్లు నా వస్త్రాల్ని పంచుకున్నారు, నా లోపలి వస్త్రం కోసం చీట్లు వేసుకున్నారు” అనే లేఖనం నెరవేరింది.—యోహాను 19:23, 24; కీర్తన 22:18.
కాసేపటికి, ఆ ఇద్దరు నేరస్తుల్లో ఒకతను యేసు నిజంగా రాజైవుంటాడని గుర్తించాడు. తనతోపాటు వేలాడదీయబడిన మరో దొంగను అతను ఇలా గద్దించాడు: “నువ్వు దేవునికి ఏమాత్రం భయపడవా? నీకూ అదే శిక్ష పడింది కదా? మనకు ఈ శిక్ష పడడం న్యాయమే. ఎందుకంటే, మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు.” తర్వాత అతను యేసును ఇలా వేడుకున్నాడు: “నువ్వు రాజ్యాధికారం పొందినప్పుడు నన్ను గుర్తుచేసుకో.”—లూకా 23:40-42.
అప్పుడు యేసు, “ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు” అన్నాడు. అతను తన రాజ్యంలో ఉంటాడని యేసు అనలేదు కానీ, పరదైసులో ఉంటాడని ఆయన అన్నాడు. (లూకా 23:43) ఆ మాటకు, అంతకుముందు యేసు తన అపొస్తలులకు ఇచ్చిన మాటకు తేడా ఉంది. అపొస్తలులు తన రాజ్యంలో తనతోపాటు సింహాసనాలపై కూర్చుంటారని యేసు మాటిచ్చాడు. (మత్తయి 19:28; లూకా 22:29, 30) అయితే, ఆ నేరస్తుడు ఒక యూదుడు కాబట్టి యెహోవా ఆదాముహవ్వలకు, వాళ్ల పిల్లలకు ఇవ్వాలనుకున్న భూపరదైసు గురించి వినేవుంటాడు. ఇప్పుడు అతను ఆ నిరీక్షణతో చనిపోవచ్చు.