కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

108వ అధ్యాయం

మతనాయకులు యేసును చిక్కుల్లో పెట్టలేకపోయారు

మతనాయకులు యేసును చిక్కుల్లో పెట్టలేకపోయారు

మత్తయి 22:15-40 మార్కు 12:13-34 లూకా 20:20-40

  • కైసరువి కైసరుకు చెల్లించాలి

  • పునరుత్థానం అయ్యాక పెళ్లిళ్లు ఉంటాయా?

  • అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ

యేసును వ్యతిరేకిస్తున్న మతనాయకులు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే, ఆయన ఉదాహరణలు చెప్పి వాళ్ల చెడుతనాన్ని బయటపెట్టాడు. దాంతో పరిసయ్యులు ఆయన్ని చిక్కుల్లో పెట్టాలని కుట్రపన్నారు. ఆయన మాటల్లో తప్పులు వెదికి, వాటి ఆధారంగా ఆయన్ని రోమా అధిపతికి అప్పగించాలన్నది వాళ్ల ఉద్దేశం. దానికోసం వాళ్లు తమ అనుచరుల్లో కొంతమందికి డబ్బులిచ్చి మరీ పంపించారు.—లూకా 6:7.

వాళ్లు ఆయన దగ్గరికి వెళ్లి ఇలా అన్నారు: “బోధకుడా, నువ్వు సరిగ్గా మాట్లాడతావని, సరిగ్గా బోధిస్తావని, ఏమాత్రం పక్షపాతం చూపించవని, దేవుని మార్గం గురించిన సత్యాన్ని బోధిస్తావని మాకు తెలుసు. కైసరుకు పన్నులు కట్టడం న్యాయమా, కాదా?” (లూకా 20:21, 22) యేసు వాళ్ల పొగడ్తలకు పడిపోలేదు. ఎందుకంటే వాళ్లు వేషధారణతో, కుయుక్తితో మాట్లాడుతున్నారని ఆయనకు తెలుసు. ఒకవేళ ఆయన ‘పన్నులు కట్టడం న్యాయమైనది కాదు’ అని అంటే, రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటును లేవదీస్తున్నాడనే నింద ఆయన మీద వేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ‘పన్నులు కట్టడం న్యాయమే’ అని అంటే, రోమా పరిపాలన నచ్చని ప్రజలు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుని, వ్యతిరేకించే అవకాశం ఉంది. మరి ఇప్పుడు యేసు ఏమని జవాబిస్తాడు?

యేసు ఇలా అన్నాడు: “వేషధారులారా, మీరు ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు? పన్ను కట్టే నాణేన్ని నాకు చూపించండి.” అప్పుడు వాళ్లు ఒక దేనారం తీసుకొచ్చారు. ఆయన, “దీని మీదున్న బొమ్మ, పేరు ఎవరివి?” అని అడిగాడు. అందుకు వాళ్లు, “కైసరువి” అన్నారు. అప్పుడు ఆయన తెలివిగా ఇలా చెప్పాడు: “అయితే కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి.”—మత్తయి 22:18-21.

వాళ్లు యేసు మాటలకు ఆశ్చర్యపోయారు. ఆయన నేర్పుగా జవాబివ్వడంతో, వాళ్లు ఏమీ మాట్లాడకుండా అక్కడినుండి వెళ్లిపోయారు. కానీ ఆ రోజు గడవకముందే, మతనాయకులు ఆయన్ని చిక్కుల్లో పెట్టాలని చాలాసార్లు ప్రయత్నించారు. పరిసయ్యుల ప్రయత్నం విఫలమైన తర్వాత, మరో మత గుంపుకు చెందిన నాయకులు యేసు దగ్గరికి వచ్చారు.

పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు పునరుత్థానం గురించి, మరిది ధర్మం గురించి యేసును ప్రశ్నించారు. వాళ్లు ఇలా అడిగారు: “బోధకుడా, ‘ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే, అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని అతని కోసం పిల్లల్ని కనాలి’ అని మోషే చెప్పాడు. మా మధ్య ఏడుగురు అన్నదమ్ములు ఉండేవాళ్లు. వాళ్లలో మొదటివాడు ఒకామెను పెళ్లి చేసుకొని, పిల్లలు లేకుండానే చనిపోయాడు. తర్వాత అతని తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రెండోవాడు, మూడోవాడు అలా ఏడోవాడి వరకు అలాగే జరిగింది. చివరికి ఆమె కూడా చనిపోయింది. ఆ ఏడుగురూ ఆమెను పెళ్లి చేసుకున్నారు కదా, మరి చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికినప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?”—మత్తయి 22:24-28.

సద్దూకయ్యులు మోషే రాసిన పుస్తకాల్ని నమ్ముతారు. అందుకే యేసు వాటి ఆధారంగానే జవాబిచ్చాడు: “మీకు లేఖనాలూ తెలియవు, దేవుని శక్తీ తెలీదు. అందుకే మీరు పొరబడుతున్నారు. చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికినప్పుడు స్త్రీలు గానీ పురుషులు గానీ పెళ్లి చేసుకోరు, వాళ్లు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. అయితే చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతకడం విషయానికొస్తే, ముళ్లపొద దగ్గర దేవుడు మోషేతో అన్న మాటలు అతను రాసిన పుస్తకంలో మీరు చదవలేదా? దేవుడు అతనితో, ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అన్నాడు. ఆయన చనిపోయినవాళ్లకు కాదు, బ్రతికున్నవాళ్లకే దేవుడు. మీరు చాలా పొరబడ్డారు.” (మార్కు 12:24-27; నిర్గమకాండం 3:1-6) ఆయన ఇచ్చిన జవాబుకు అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయారు.

యేసు పరిసయ్యుల, సద్దూకయ్యుల నోళ్లు మూయించాడు. కాబట్టి వాళ్లు ఒక గుంపుగా ఆయన దగ్గరికి వచ్చి, ఆయన్ని ఇంకా చిక్కుల్లో పెట్టాలని చూశారు. వాళ్లలో ఒక శాస్త్రి యేసును ఇలా అడిగాడు: “బోధకుడా, ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏది?”—మత్తయి 22:36.

యేసు ఇలా జవాబిచ్చాడు: “అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే, ‘ఓ ఇశ్రాయేలూ, విను. మన దేవుడైన యెహోవా ఒకేఒక్క యెహోవా. నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి.’ రెండో ఆజ్ఞ ఏదంటే, ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని ప్రేమించాలి.’ వీటికి మించిన గొప్ప ఆజ్ఞ ఇంకేదీ లేదు.”—మార్కు 12:29-31.

యేసు ఇచ్చిన జవాబు విని ఆ శాస్త్రి ఇలా అన్నాడు: “బోధకుడా, బాగా చెప్పావు, నిజం చెప్పావు. ‘దేవుడు ఒక్కడే, ఆయన లాంటివాళ్లు ఎవ్వరూ లేరు’; నిండు హృదయంతో, పూర్తి అవగాహనతో, పూర్తి బలంతో ఆయన్ని ప్రేమించడం, మనల్ని మనం ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించడం సంపూర్ణ దహనబలులన్నిటి కన్నా, అర్పణలన్నిటి కన్నా శ్రేష్ఠమైనది.” అతను తెలివైన జవాబు ఇచ్చాడని గమనించి యేసు అతనితో, “నువ్వు దేవుని రాజ్యానికి ఎంతో దూరంలో లేవు” అన్నాడు.—మార్కు 12:32-34.

మూడు రోజులుగా (నీసాను 9, 10, 11) యేసు ఆలయంలో బోధిస్తూ ఉన్నాడు. మతనాయకుల్లా కాకుండా, ఆ శాస్త్రిలా కొంతమంది ప్రజలు యేసు చెప్తున్నవాటిని శ్రద్ధగా విన్నారు. మతనాయకులు ఆయన్ని మళ్లీ ప్రశ్నించే ధైర్యం చేయలేదు.