కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

31వ అధ్యాయం

విశ్రాంతి రోజున ధాన్యం వెన్నులు తుంచడం

విశ్రాంతి రోజున ధాన్యం వెన్నులు తుంచడం

మత్తయి 12:1-8 మార్కు 2:23-28 లూకా 6:1-5

  • శిష్యులు విశ్రాంతి రోజున ధాన్యం వెన్నులు తుంచారు

  • యేసు “విశ్రాంతి రోజుకు ప్రభువు”

యేసు, ఆయన శిష్యులు ఉత్తర దిశగా గలిలయ వైపు వెళ్తున్నారు. అది వసంత కాలం, పంటచేలలో ధాన్యం వెన్నులు వచ్చాయి. శిష్యులకు ఆకలేసి కొన్ని ధాన్యం వెన్నులు తుంచుకొని తిన్నారు. అయితే అది విశ్రాంతి రోజు. వాళ్లు చేసిన పనిని పరిసయ్యులు గమనించారు.

ఈ మధ్యే యెరూషలేములో కొంతమంది యూదులు, విశ్రాంతి రోజు గురించిన నియమాన్ని యేసు మీరాడని నిందిస్తూ, ఆయన్ని చంపాలనుకున్నారు. ఇప్పుడు శిష్యులు చేసిన పని వల్ల పరిసయ్యులు మరో నింద వేస్తూ ఇలా అన్నారు: “ఇదిగో! నీ శిష్యులు విశ్రాంతి రోజున చేయకూడని పని చేస్తున్నారు.”—మత్తయి 12:2.

ధాన్యాన్ని తుంచి చేతులతో నలుపుకొని తినడం, కోత కోసి పంట నూర్చడంతో సమానమని పరిసయ్యులు చెప్పేవాళ్లు. (నిర్గమకాండం 34:21) విశ్రాంతి రోజున ఏం చేస్తే పనిచేసినట్టు అవుతుందో, ఏం చేస్తే పనిచేసినట్టు అవ్వదో చెప్తూ పరిసయ్యులు కఠినమైన నియమాలు పెట్టేవాళ్లు. వాటివల్ల విశ్రాంతి రోజును పాటించడం ప్రజలకు భారంగా తయారైంది. నిజానికి ప్రజలు సంతోషంగా గడుపుతూ ఆధ్యాత్మికంగా బలపడాలని దేవుడు విశ్రాంతి రోజును ఏర్పాటు చేశాడు. కాబట్టి, యేసు కొన్ని ఉదాహరణలు చెప్పి పరిసయ్యుల తప్పుడు అభిప్రాయాన్ని ఖండించాడు. విశ్రాంతి రోజు గురించిన నియమాన్ని వాళ్లు చెప్తున్న విధంగా పాటించాలన్నది యెహోవా దేవుని ఉద్దేశం కానేకాదని యేసు చూపించాడు.

యేసు ముందుగా దావీదు, అతని మనుషుల ఉదాహరణ చెప్పాడు. వాళ్లు ఆకలితో ఉన్నప్పుడు గుడారం దగ్గర ఆగి, సముఖపు రొట్టెలు తిన్నారు. యెహోవా సన్నిధి నుండి పాత రొట్టెల్ని తీసేసి కొత్త రొట్టెల్ని పెట్టాక, ఆ పాత రొట్టెల్ని యాజకులు మాత్రమే తినాలి. అయినా దావీదు, అతని మనుషులు ఉన్న పరిస్థితిని బట్టి ఆ రొట్టెలు తిన్నందుకు దేవుడు వాళ్లను శిక్షించలేదు.—లేవీయకాండం 24:5-9; 1 సమూయేలు 21:1-6.

రెండో ఉదాహరణ చెప్తూ యేసు ఇలా అన్నాడు: “విశ్రాంతి రోజున యాజకులు ఆలయంలో పని చేస్తారని, అయినా వాళ్లు తప్పు చేసినట్టు అవదని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా?” విశ్రాంతి రోజున కూడా యాజకులు బలుల కోసం జంతువుల్ని వధిస్తారని, ఆలయంలో ఇతర పనులు చేస్తారని యేసు చెప్పాలనుకున్నాడు. తర్వాత యేసు ఇలా అన్నాడు: “అయితే నేను మీతో చెప్తున్నాను, ఆలయంకన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.”—మత్తయి 12:5, 6; సంఖ్యాకాండం 28:9.

యేసు తాను చెప్పాలనుకున్న విషయాన్ని మళ్లీ లేఖనాలతో వివరిస్తూ ఇలా అన్నాడు: “‘నేను కరుణనే కోరుకుంటున్నాను కానీ బలిని కాదు’ అనే మాటకు అర్థం ఏంటో మీకు తెలిసుంటే, ఏ తప్పూ చేయనివాళ్లను దోషులని అనేవాళ్లు కాదు.” చివర్లో ఆయన ఇలా అన్నాడు: “మానవ కుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు.” భవిష్యత్తులో శాంతి విలసిల్లే తన వెయ్యేళ్ల పరిపాలనను ఉద్దేశించి యేసు ఆ మాట అన్నాడు.—మత్తయి 12:7, 8; హోషేయ 6:6.

మనుషులు ఎంతోకాలంగా సాతాను కఠినమైన బానిసత్వంలో మగ్గుతున్నారు. హింస, యుద్ధాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే, గొప్ప విశ్రాంతి రోజైన క్రీస్తు పరిపాలన దానికి ఎంత భిన్నంగా ఉంటుందో కదా! అప్పుడు యేసు మనం ఎంతో కోరుకుంటున్న, మనకు ఎంతో అవసరమైన విశ్రాంతిని దయచేస్తాడు.