53వ అధ్యాయం
ప్రకృతి శక్తుల్ని నియంత్రించగల పరిపాలకుడు
మత్తయి 14:22-36 మార్కు 6:45-56 యోహాను 6:14-25
-
ప్రజలు యేసును రాజుగా చేయాలనుకున్నారు
-
యేసు నీళ్లమీద నడిచాడు, గాలిని నిమ్మళింపజేశాడు
యేసు అద్భుతరీతిలో వేలమందికి ఆహారం పెట్టడం ప్రజల్ని ఎంతో ఆకట్టుకుంది. “లోకంలోకి రావాల్సిన ప్రవక్త” అంటే మెస్సీయ నిజంగా ఆయనే అని, ఆయన తప్పకుండా మంచి పరిపాలకుడు అవుతాడని వాళ్లు అనుకున్నారు. (యోహాను 6:14; ద్వితీయోపదేశకాండం 18:18) కాబట్టి వాళ్లు యేసును పట్టుకుని రాజుగా చేయాలనుకున్నారు.
అయితే, ప్రజల ఆలోచన యేసుకు అర్థమైంది. ఆయన ఆ ప్రజల్ని పంపించేసి, పడవ ఎక్కమని శిష్యులకు చెప్పాడు. ఆయన శిష్యుల్ని ఎక్కడికి వెళ్లమన్నాడు? వాళ్లను బేత్సయిదా మీదుగా కపెర్నహూముకు వెళ్లమన్నాడు. యేసు మాత్రం ఆ రాత్రి ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి ఒక కొండ మీదికి వెళ్లాడు.
తెల్లవారడానికి కాస్త ముందు వెన్నెల వెలుగులో, యేసు దూరం నుండి ఆ పడవను చూశాడు. బలమైన గాలుల వల్ల సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. ‘ఎదురుగాలి వీస్తున్నందువల్ల శిష్యులు పడవ నడపడానికి చాలా కష్టపడుతున్నారు.’ (మార్కు 6:48) యేసు కొండ దిగి, నీళ్లమీద నడుస్తూ వాళ్ల వైపు వెళ్లడం మొదలుపెట్టాడు. అప్పటికే వాళ్లు “దాదాపు ఐదారు కిలోమీటర్లు” ప్రయాణించారు. (యోహాను 6:19, అధస్సూచి) ఆయన సముద్రం మీద నడుచుకుంటూ రావడం చూసి, శిష్యులు భయంతో “అమ్మో, అదేదో వస్తోంది!” అని కేకలు వేశారు.—మార్కు 6:49.
యేసు వాళ్లకు ధైర్యం చెప్తూ, “భయపడకండి, నేనే!” అన్నాడు. అప్పుడు పేతురు, “ప్రభువా, నువ్వే అయితే, నన్ను నీళ్లమీద నడుచుకుంటూ నీ దగ్గరికి రానివ్వు” అన్నాడు. అందుకు యేసు, “రా!” అని చెప్పాడు. పేతురు పడవ దిగి నీళ్లమీద నడుస్తూ యేసు వైపుగా వెళ్లాడు. కానీ అతను తుఫానును చూసినప్పుడు భయపడి, మునిగిపోసాగాడు. దాంతో అతను, “ప్రభువా, రక్షించు!” అని అరిచాడు. యేసు వెంటనే చేయి చాపి పేతురును పట్టుకొని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు.—మత్తయి 14:27-31.
యేసు, పేతురులు పడవలోకి ఎక్కిన తర్వాత గాలి సద్దుమణిగింది. అది చూసి శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. నిజానికి వాళ్లు అలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉందా? కొన్ని గంటల క్రితమే యేసు ‘రొట్టెలతో అద్భుతం’ చేసి వేలమందికి ఆహారం పెట్టాడు. వాళ్లు దాని అర్థాన్ని గ్రహించివుంటే ఇప్పుడు యేసు నీళ్లమీద నడవడం, గాలిని నిమ్మళింపజేయడం చూసి ఆశ్చర్యపోయేవాళ్లు కాదు. వాళ్లు ఆయనకు వంగి నమస్కారం చేసి, “నువ్వు నిజంగా దేవుని కుమారుడివి” అన్నారు.—మార్కు 6:52; మత్తయి 14:33.
కాసేపటి తర్వాత వాళ్లు కపెర్నహూముకు దక్షిణాన ఉన్న అందమైన, సారవంతమైన గెన్నేసరెతు మైదానానికి చేరుకున్నారు. వాళ్లు పడవకు లంగరు వేసి, ఒడ్డుకు వచ్చారు. అక్కడి ప్రజలు యేసును గుర్తుపట్టారు. వాళ్లు, చుట్టుపక్కల ప్రాంతాలవాళ్లు ఆయన దగ్గరికి రోగుల్ని తీసుకొచ్చారు. వాళ్లు కేవలం యేసు పైవస్త్రం అంచును ముట్టుకుని, పూర్తిగా బాగయ్యారు.
ఈలోగా, యేసు అద్భుతరీతిలో పెట్టిన ఆహారాన్ని తిన్నవాళ్లు ఆయన అక్కడి నుండి వెళ్లిపోయాడని తెలుసుకున్నారు. తిబెరియ నుండి చిన్న పడవలు వచ్చినప్పుడు, వాళ్లు ఆ పడవలెక్కి యేసు కోసం కపెర్నహూముకు వచ్చారు. వాళ్లు యేసును చూడగానే, “రబ్బీ, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు?” అని అడిగారు. (యోహాను 6:25) అప్పుడు యేసు ఒక మంచి కారణంతోనే వాళ్లను గద్దించాడు. అదేంటో తర్వాతి అధ్యాయంలో చూస్తాం.