కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ పాఠం

కూటాలకు వెళ్లేటప్పుడు మేము ఎందుకు పద్ధతిగా తయారౌతాం?

కూటాలకు వెళ్లేటప్పుడు మేము ఎందుకు పద్ధతిగా తయారౌతాం?

ఐస్‌లాండ్‌

మెక్సికో

గినియా బిస్సావ్‌

ఫిలిప్పీన్స్‌

యెహోవాసాక్షులు సంఘ కూటాలకు వెళ్లేటప్పుడు ఎంత పద్ధతిగా తయారౌతారో ఈ పుస్తకంలోని ఫోటోల్లో మీరు గమనించే ఉంటారు. చక్కగా తయారవ్వడానికి మేము ఎందుకు ప్రాముఖ్యతనిస్తాం?

మా దేవుని మీద గౌరవం చూపించడానికి. నిజమే, దేవుడు పైరూపాన్ని కాదు హృదయాన్ని చూస్తాడు. (1 సమూయేలు 16:7) అయినాసరే, మేము ఆరాధన కోసం కలుసుకున్నప్పుడు మా దేవుని మీద, తోటి విశ్వాసుల మీద గౌరవంతో పద్ధతిగా తయారౌతాం. ఉదాహరణకు, మనం ఒక రాజు ముందు నిలబడాల్సివస్తే, అతని స్థానాన్ని గౌరవిస్తూ పద్ధతిగా బట్టలు వేసుకుంటాం. అదేవిధంగా కూటాల్లో మేము కనబడే తీరు, “యుగయుగాలకు రాజు” అయిన యెహోవా దేవుని మీద, ఆయన ఆరాధనా మందిరం మీద మాకున్న గౌరవాన్ని చూపిస్తుంది.—1 తిమోతి 1:17.

మేము ఎలాంటి విలువలు పాటిస్తామో చూపించడానికి. క్రైస్తవులు “అణకువ, మంచి వివేచన ఉట్టిపడే” బట్టలు వేసుకోవాలని బైబిలు చెప్తుంది. (1 తిమోతి 2:9, 10) “అణకువ” ఉన్నవాళ్లు ఆడంబరంగా, రెచ్చగొట్టేలా, ఒళ్లు కనిపించేలా బట్టలు వేసుకోరు, ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించరు. అలాగే “మంచి వివేచన” ఉన్నవాళ్లు నిర్లక్ష్యంగా, విపరీతంగా కనిపించే బట్టలు కాకుండా చక్కని బట్టలు వేసుకుంటారు. ఈ సూత్రాలు పాటిస్తూ కూడా, నచ్చిన రకరకాల బట్టలు వేసుకోవచ్చు. మేము చక్కగా బట్టలు వేసుకోవడం ద్వారా, మా ‘రక్షకుడైన దేవుని బోధను అలంకరిస్తాం,’ ‘ఆయన్ని మహిమపరుస్తాం.’ (తీతు 2:10; 1 పేతురు 2:12) మేము కూటాలకు వెళ్లేటప్పుడు పద్ధతిగా బట్టలు వేసుకోవడం వల్ల, యెహోవా ఆరాధన మీద వేరేవాళ్లకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

పైన చెప్పిన లాంటి బట్టలు మీ దగ్గర లేకపోయినా, మీరు సంకోచించకుండా రాజ్యమందిరంలో జరిగే కూటాలకు రావచ్చు. సందర్భానికి తగ్గట్టుగా, శుభ్రంగా, చక్కగా తయారవ్వాలంటే ఖరీదైన బట్టలు లేదా ఫ్యాషన్‌ బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు.

  • దేవున్ని ఆరాధించేటప్పుడు ఎందుకు పద్ధతిగా తయారవ్వాలి?

  • చక్కగా తయారయ్యే విషయంలో మేము ఏ సూత్రాలు పాటిస్తాం?