4వ పాఠం
మేము కొత్త లోక అనువాదం బైబిల్ని ఎందుకు తయారుచేశాం?
కొన్ని దశాబ్దాలపాటు యెహోవాసాక్షులు వేర్వేరు బైబిలు అనువాదాలు ఉపయోగించారు, ముద్రించారు, పంచిపెట్టారు. అయితే దేవుడు కోరుకుంటున్నట్టు ప్రతీ ఒక్కరు “సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని” సంపాదించుకునేలా, ఒక కొత్త అనువాదాన్ని తయారుచేయడం అవసరమని మాకు అనిపించింది. (1 తిమోతి 2:3, 4) అందుకే, 1950 లో మేము బైబిల్లోని కొన్ని పుస్తకాల్ని ఆధునిక ఇంగ్లీషు భాషలో విడుదల చేయడం మొదలుపెట్టాం, అదే కొత్త లోక అనువాదం. దీన్ని ఉన్నదున్నట్టు, జాగ్రత్తగా 160 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించాం.
తేలిగ్గా అర్థమయ్యే అనువాదం అవసరమైంది. కాలం గడిచేకొద్దీ భాషలో మార్పులు వస్తూ ఉంటాయి. చాలా బైబిలు అనువాదాల్లో అర్థంకాని, వాడుకలో లేని పదాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ మధ్య కాలంలో మరింత ఖచ్చితమైన ప్రాచీన రాతప్రతులు దొరికాయి. దానివల్ల బైబిలు రాసినప్పుడు ఉపయోగించిన హీబ్రూ, అరామిక్, గ్రీకు భాషల్ని ఇంకా మెరుగ్గా అర్థం చేసుకోగలిగారు.
దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్టు తెలియజేసే అనువాదం అవసరమైంది. దేవుడు ప్రేరేపించి రాయించిన మాటల్ని బైబిలు అనువాదకులు ఇష్టమొచ్చినట్టు మార్చకుండా ఉన్నదున్నట్టు అనువదించాలి. కానీ చాలా బైబిలు అనువాదాల్లో యెహోవా దేవుని పేరును తీసేశారు.
బైబిలు గ్రంథకర్తను ఘనపర్చే అనువాదం అవసరమైంది. (2 సమూయేలు 23:2) కింది చిత్రంలో చూపించినట్టు, అత్యంత ప్రాచీన బైబిలు రాతప్రతుల్లో యెహోవా పేరు దాదాపు 7,000 సార్లు ఉంది. కాబట్టి కొత్త లోక అనువాదంలో, ఆ పేరు ఉండాల్సిన ప్రతీచోట దాన్ని తిరిగిచేర్చారు. (కీర్తన 83:18) ఎన్నో ఏళ్లు పరిశోధించి తయారుచేసిన ఈ బైబిలు అనువాదం దేవుని ఆలోచనల్ని స్పష్టంగా తెలియజేస్తుంది, చదవడానికి తేలిగ్గా ఉంటుంది. మీ దగ్గర కొత్త లోక అనువాదం ఉన్నా లేక వేరే బైబిలు ఉన్నా, రోజూ యెహోవా వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.—యెహోషువ 1:8; కీర్తన 1:2, 3.
-
ఒక కొత్త బైబిలు అనువాదం అవసరమని మాకు ఎందుకు అనిపించింది?
-
దేవుని ఇష్టం తెలుసుకోవాలనుకునే వాళ్లు రోజూ ఏం చేయడం మంచిది?