వినయముగలవారి ప్రాణమును యెహోవా పునరుజ్జీవింపజేస్తాడు
పద్దెనిమిదవ అధ్యాయం
వినయముగలవారి ప్రాణమును యెహోవా పునరుజ్జీవింపజేస్తాడు
1. యెహోవా ఏమని హామీ ఇస్తున్నాడు, ఆయన మాటలు ఏ ప్రశ్నలను ఉత్పన్నం చేస్తున్నాయి?
“మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించువాడను, అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.” (యెషయా 57:15) యెషయా ప్రవక్త సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో అలా వ్రాశాడు. ఈ సందేశాన్ని అంత ప్రోత్సాహకరమైనదిగా చేసేలా యూదాలో ఏమి జరుగుతోంది? ఈ ప్రేరేపిత వాక్యాలు నేడు క్రైస్తవులకు ఎలా సహాయం చేస్తాయి? యెషయా 57 వ అధ్యాయాన్ని పరిశీలించడం ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.
“మీరిక్కడికి రండి”
2. (ఎ) యెషయా 57 వ అధ్యాయంలోని మాటలు ఎప్పుడు అన్వయిస్తాయనిపిస్తోంది? (బి) యెషయా కాలంలో నీతిమంతుల పరిస్థితి ఎలా ఉంది?
2 యెషయా ప్రవచనంలోని ఈ భాగం యెషయా కాలానికి వర్తిస్తున్నట్లుగా ఉంది. దుష్టత్వం ఇప్పుడు ఎంత దృఢంగా పాతుకుపోయిందో పరిశీలించండి: “నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు. భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు, కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు; తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.” (యెషయా 57:1, 2) ఒక నీతిమంతుడు పడిపోతే ఎవరూ పట్టించుకోరు. ఆయన అకాల మరణాన్ని ఎవరూ గుర్తించరు. మరణించడం ఆయనకు విశ్రాంతిని, దైవభక్తిలేనివారి వల్ల కలిగే బాధ నుండి విడుదలను, కీడు నుండి విముక్తిని ఇస్తుంది. దేవుడు ఏర్పరచుకున్న జనము శోచనీయమైన స్థితిలో పడిపోయింది. కాని నమ్మకంగా మిగిలి ఉండేవారు, యెహోవా ఏమి జరుగుతోందో చూడడమే గాక వారికి మద్దతు కూడా ఇస్తాడని తెలిసికొని ఎంతగా ప్రోత్సహించబడతారో కదా!
3. యెహోవా దుష్ట యూదా వంశాన్ని ఎలా సంబోధించాడు, ఎందుకు?
3 యెహోవా ఇలా చెబుతూ యూదా దుష్టతరాన్ని రమ్మని ఆహ్వానిస్తున్నాడు: “మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరిక్కడికి రండి.” (యెషయా 57: 3) వారు మంత్రగత్తెల కుమారులు, వ్యభిచారి సంతానము, వేశ్యా సంతానము అనే అవమానకరమైన వర్ణనలను సంపాదించుకున్నారు. వారు చేసే అబద్ధ ఆరాధనలో హేయమైన విగ్రహారాధనా చర్యలు, అభిచార చర్యలు, అలాగే అనైతికమైన లైంగిక ఆచారాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి, యెహోవా ఆ పాపులను ఇలా అడుగుతున్నాడు: ‘మీరెవని ఎగతాళి చేయుచు [“ఆనందించుచు,” NW]న్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా? మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువారలారా!’—యిషయా 57:4, 5.
4. యూదాలోని దుష్టులు ఏ విషయంలో అపరాధులు?
4 యూదాలోని దుష్టులు “ఆనందించుచు,” విభ్రాంతి కలిగించే రీతిలో అన్యదేవుళ్ళను బహిరంగంగా ఆరాధిస్తారు. వారు అవమానిస్తున్నట్లుగా, అగౌరవపరుస్తున్నట్లుగా తమ నాలుకలు బయటికి పెట్టి వెక్కిరిస్తూ, తమను సరిదిద్దడానికి పంపబడిన దేవుని ప్రవక్తలను తృణీకారభావంతో అపహసిస్తారు. వారు అబ్రాహాము సంతానమే అయినప్పటికీ, వారి తిరుగుబాటు విధానాలు వారిని అతిక్రమము చేసే పిల్లలుగా, అబద్ధపు సంతానంగా చేస్తాయి. (యెషయా 1: 4; 30: 9; యోహాను 8:39, 44) గ్రామీణ ప్రాంతంలోని పెద్ద చెట్ల మధ్య, వారు విగ్రహారాధన చేస్తూ మతపరమైన తీవ్రోద్రేకాన్ని రేకెత్తిస్తారు. ఎంత క్రూరమైన ఆరాధన! అంతెందుకు, తమ హేయమైన విధానాల మూలంగా దేశము నుండి యెహోవాచే తరిమి వేయబడిన జనము చేసినట్లుగా వారు చివరికి తమ సొంత పిల్లలను కూడా వధిస్తారు.—1 రాజులు 14:23; 2 రాజులు 16:3, 4; యెషయా 1:29.
రాళ్ళకు పానీయార్పణము చేయడం
5, 6. (ఎ) యూదా నివాసులు యెహోవాను ఆరాధించే బదులు ఏమి చేయడానికి ఎంపిక చేసుకున్నారు? (బి) యూదా చేసే విగ్రహారాధన ఎంత ఘోరమైనది, ఎంత విస్తృతమైనది?
5 యూదా నివాసులు విగ్రహారాధనలో ఎంత లోతుగా మునిగిపోయారో చూడండి: “నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది. అవియే నీకు భాగ్యము. వాటికే పానీయార్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?” (యెషయా 57: 6) యూదులు దేవుని నిబంధన ప్రజలు, అయినప్పటికీ వారు ఆయనను ఆరాధించే బదులు నదీతలం నుండి రాళ్ళు తీసుకుని వాటిని దేవుళ్ళుగా చేసుకున్నారు. యెహోవాయే తన స్వాస్థ్యభాగమని దావీదు ప్రకటించాడు కానీ ఈ పాపులు జీవములేని రాళ్ళను తమ భాగ్యముగా ఎంచుకొని, వాటికి పానీయార్పణములు అర్పించారు. (కీర్తన 16: 5; హబక్కూకు 2:19) తన నామమునకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలు తప్పుడు ఆరాధన చేస్తుండగా యెహోవా ఎలా ఊరకుండగలడు?
6 పెద్ద చెట్ల క్రింద, లోయల్లో, కొండలపైనా, తమ నగరాల్లో ఎక్కడంటే అక్కడ యూదా విగ్రహారాధన చేస్తోంది. కానీ యెహోవా అదంతా చూస్తాడు, యెషయా ద్వారా ఆయన దాని చెడునడతను వెల్లడి చేస్తాడు: “ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసికొంటివి. బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి. తలుపువెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి.” (యెషయా 57:7) ఉన్నతమైన స్థలాల్లో యూదా తన ఆధ్యాత్మిక అపరిశుభ్రతా పరుపును వేసుకుంటుంది, అక్కడది అన్య దేవుళ్ళకు బలులు అర్పిస్తుంది. a సొంత ఇళ్లలో కూడా తలుపుల వెనుక, ద్వారబంధముల వెనుక విగ్రహాలు ఉన్నాయి.
7. యూదా ఏ స్ఫూర్తితో అనైతికమైన ఆరాధనలో పాల్గొంటుంది?
7 యూదా అశుద్ధమైన ఆరాధనలో ఎందుకు అంతగా నిమగ్నమైందా అని కొందరు ఆశ్చర్యపోవచ్చు. యెహోవాను విడనాడడానికి ఏదైనా బలమైన శక్తి వారిని బలవంతపెట్టిందా? లేదు అన్నది దానికి సమాధానం. ఆమె ఉద్దేశపూర్వకంగా, ఆతురతతో అలా చేసింది. యెహోవా ఇలా పేర్కొంటున్నాడు: ‘నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి; నీ పరుపు వెడల్పు చేసికొని, నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమించితివి [“వారితో పడుకొనుటను నీవు ప్రేమించితివి, పురుషాంగమును నీవు చూచితివి” NW].’ (యెషయా 57: 8) యూదా తన అబద్ధ దేవుళ్ళతో నిబంధన చేసుకుని, వారితో తనకున్న అక్రమ సంబంధాన్ని ఎంతో ప్రేమిస్తోంది. బహుశా లింగముల చిహ్నాల ఉపయోగంతో సహా అది అనైతికమైన లైంగిక ఆచారాలను ప్రాముఖ్యంగా ప్రేమిస్తోంది, అలాంటి లైంగిక ఆచారాలు ఈ దేవుళ్ళ ఆరాధనకు ప్రతీకలు!
8. యూదాలో ప్రాముఖ్యంగా ఏ రాజు పాలనలో విగ్రహారాధన వర్ధిల్లింది?
8 ఘోరమైన అనైతికమైన, క్రూరమైన విగ్రహారాధనను గురించిన వర్ణన, మనకు యూదాలోని అనేకమంది దుష్ట రాజుల గురించి తెలిసినదానితో సరిగ్గా సరిపోతుంది. ఉదాహరణకు, మనష్షే ఉన్నత స్థలములను నిర్మించి, బయలుకు బలిపీఠములు కట్టించి, రెండు ఆలయ ఆవరణాల్లోనూ అబద్ధ మతసంబంధమైన బలిపీఠములను పెట్టాడు. అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి, మంత్ర విద్యను వాడుకచేసి, సోదెగాండ్రతో సాంగత్యము చేసి, అభిచార సంబంధమైన ఆచారాలను పెంపొందింపజేశాడు. రాజైన మనష్షే తాను చేయించిన దేవతా స్తంభముల ప్రతిమను యెహోవా ఆలయంలో పెట్టాడు. b “యెహోవా లయముచేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు” అతడు యూదాను తప్పు త్రోవ పట్టించాడు. (2 రాజులు 21:2-9) యెషయా 1:1 లో మనష్షే పేరు కనిపించకపోయినప్పటికీ అతడే యెషయాను చంపించాడని కొందరు నమ్ముతారు.
‘నీ రాయబారులను పంపితివి’
9. యూదా తన రహస్యదూతలను “దూరమునకు” ఎందుకు పంపుతుంది?
9 యూదా చేసిన అతిక్రమము అబద్ధ దేవుళ్ళను సేవించడం కంటే ఎక్కువే. యెషయాను తన ప్రతినిధిగా ఉపయోగించుకుంటూ, యెహోవా ఇలా చెబుతున్నాడు: “నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి, పరిమళద్రవ్యములను విస్తారముగా తీసికొని నీ రాయబారులను దూరమునకు పంపితివి. పాతాళమంత లోతుగా నీవు లొంగితివి.” (యెషయా 57: 9) నమ్మకద్రోహి అయిన యూదా రాజ్యం “రాజు” వద్దకు, బహుశా అన్యుడైన రాజు వద్దకు వెళ్ళి, తైలము, పరిమళద్రవ్యములతో సూచించబడుతున్న ఖరీదైన, ఆకర్షణీయమైన బహుమానాలు అర్పిస్తుంది. యూదా తన రహస్యదూతలను చాలా దూరమునకు పంపిస్తుంది. ఎందుకు? తనతో రాజకీయ సంబంధాలు ఏర్పరచుకోవడానికి అన్య జనములను ఒప్పించడానికే. యెహోవాను నిరాకరించి, ఆమె అన్య రాజులను నమ్ముకుంటుంది.
10. (ఎ) అష్షూరు రాజుతో ఆహాజు రాజు ఎలా ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు? (బి) యూదా, విషయాలను ఏ విధంగా ‘పాతాళమంత లోతుకు’ తీసుకువెళుతుంది?
10 రాజైన ఆహాజు కాలంలో ఇలాంటి ఒక ఉదాహరణను చూడవచ్చు. ఇశ్రాయేలుకు, సిరియాకు మధ్యనున్న సంబంధాన్ని బట్టి భయపడిపోయి నమ్మకద్రోహియైన ఆ యూదా రాజు, “నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను. గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని” చెబుతూ అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు III వద్దకు సందేశకులను పంపుతాడు. ఆహాజు అష్షూరు రాజుకు వెండి బంగారాలను లంచంగా పంపుతాడు, రాజు దానికి ప్రతిస్పందించి, సిరియాపై నాశనకరమైన విధంగా దాడి చేస్తాడు. (2 రాజులు 16:7-9) యూదా అన్య జనములతో తన వ్యవహారాల్లో “పాతాళమంత లోతు”కు వంగుతుంది. ఆ వ్యవహారాలను బట్టి అది మరణిస్తుంది, లేదా ఒక రాజు పరిపాలన క్రింద స్వతంత్రంగా ఉండే రాజ్యంగా ఇక కొనసాగలేకపోతుంది.
11. యూదా ఏ విధమైన బూటకపు భద్రతా భావాన్ని ప్రదర్శిస్తుంది?
11 యెహోవా యూదాను ఉద్దేశించి మాట్లాడడాన్ని కొనసాగిస్తాడు: “నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు. నీవు బలము తెచ్చుకొంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు.” (యెషయా 57:10) అవును, ఆ జనము తన మతభ్రష్ట విధానాల్లో ఎంతో ప్రయాసపడింది, అయినా తన ప్రయాసల వల్ల ప్రయోజనమేమీ లేదని అది తెలుసుకోలేకపోతుంది. అందుకు భిన్నంగా, అది తాను తన సొంత శక్తితో విజయం సాధిస్తున్నానని తనను తాను వంచించుకుంటుంది. అది శక్తి పుంజుకున్నట్లు, ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తుంది. ఎంతటి మూర్ఖత్వం!
12 క్రైస్తవమత సామ్రాజ్యంలోని ఏ పరిస్థితులు యూదాలోని పరిస్థితులను పోలివున్నాయి?
12 యెషయా కాలంనాటి యూదా ప్రవర్తనను జ్ఞప్తికి తెప్పించే ప్రవర్తనగల సంస్థ ఒకటి నేడు ఉంది. క్రైస్తవమత సామ్రాజ్యం యేసు నామమును ఉపయోగిస్తుంది గానీ అది వేరే రాజ్యాలతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయాసపడుతూ, తన ఆరాధనా స్థలాలను విగ్రహాలతో నింపేసుకుంది. దాని అనుచరులు తమ స్వంత ఇళ్ళలో కూడా విగ్రహాలను పెట్టుకుంటారు. దేశాల మధ్య జరిగే యుద్ధాల్లో క్రైస్తవమత సామ్రాజ్యం తన యౌవనులను బలి అర్పించింది. “విగ్రహారాధనకు దూరముగా పారిపొండి” అని క్రైస్తవులకు ఆజ్ఞాపించే సత్య దేవునికి ఇదంతా ఎంత అసహ్యతను కలిగించి ఉండవచ్చో కదా! (1 కొరింథీయులు 10:14) క్రైస్తవమత సామ్రాజ్యం రాజకీయాల్లో పాల్గొనడం ద్వారా ‘భూరాజులతో వ్యభిచరించింది.’ (ప్రకటన 17:1, 2) వాస్తవానికి, అది ఐక్యరాజ్య సమితి ప్రధాన మద్దతుదారు. ఈ మతసంబంధమైన వేశ్య కోసం ఏమి వేచివుంది? దానికి నకలుగా ఉన్న నమ్మకద్రోహియైన యూదాకు, ప్రాముఖ్యంగా దాని రాజధాని నగరమైన యెరూషలేముచే ప్రాతినిధ్యం వహించబడుతున్నదానికి యెహోవా ఏమి చెప్పాడు?
‘నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించదు’
13. యూదా ఏమని ‘కల్లలాడింది,’ యెహోవా చూపిన సహనానికి అది ఎలా ప్రతిస్పందించింది?
13 “ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి?” అని యెహోవా అడుగుతున్నాడు. చాలా సముచితమైన ప్రశ్న! “నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి” అని కూడా యెహోవా అంటున్నాడు. యూదా యెహోవా పట్ల ఆరోగ్యదాయకమైన, దైవిక భయాన్ని ఎంతమాత్రం చూపించడం లేదు. అలా చూపించి ఉంటే, అది అబద్ధికుల, అబద్ధ దేవుళ్ళ ఆరాధకుల రాజ్యంగా తయారై ఉండేది కాదు. యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “బహుకాలమునుండి నేను మౌనముగానుండినందుననే గదా, నీవు నాకు భయపడుట లేదు?” (యెషయా 57:11) యెహోవా యూదాపై వెంటనే శిక్ష విధించకుండా మౌనముగా ఉన్నాడు. యూదా దీన్ని కృతజ్ఞతాపూర్వకంగా గుర్తించిందా? లేదు, బదులుగా అది దేవుని సహనాన్ని ఉదాసీనతగా దృష్టిస్తోంది. దానికి దేవుని పట్ల ఏమాత్రం భయం లేకుండాపోయింది.
14, 15. యూదా క్రియల గురించి, దాని “విగ్రహముల గుంపు” గురించి యెహోవా ఏమని చెబుతున్నాడు?
14 అయితే, దేవుడు దీర్ఘశాంతం చూపించే సమయం ముగుస్తుంది. ఆ సమయాన్ని దృష్టిస్తూ, యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్‌ప్రయోజనములగును. నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో! గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును.” (యెషయా 57:12, 13ఎ) యెహోవా యూదా బూటకపు నీతిని బయలుపరుస్తాడు. దాని వేషధారణా చర్యల వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. దాని “విగ్రహముల గుంపు” దాన్ని కాపాడదు. విపత్తు వచ్చినప్పుడు, అది నమ్ముకునే దేవుళ్లు వట్టి గాలికి ఎగిరిపోతారు.
15 యెహోవా మాటలు సా.శ.పూ. 607 లో నెరవేరాయి. అప్పుడే బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేసి, ఆలయాన్ని కాల్చివేసి, దాదాపు దాని ప్రజలందరినీ బంధీలుగా తీసుకుని వెళ్ళింది. “ఈ రీతిగా యూదా వారు తమ దేశములోనుండి ఎత్తికొని పోబడిరి.”—2 రాజులు 25:1-21.
16. క్రైస్తవమత సామ్రాజ్యం కోసం, “మహా బబులోను”లోని మిగతా భాగమంతటి కోసం ఏమి వేచి ఉంది?
16 అలాగే, క్రైస్తవమత సామ్రాజ్యపు విగ్రహాల గుంపు, యెహోవా ఉగ్రత దినాన దాన్ని కాపాడలేదు. (యెషయా 2:19-22; 2 థెస్సలొనీకయులు 1:6-10) ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను”లోని మిగతా భాగంతో పాటు, క్రైస్తవమత సామ్రాజ్యం నిర్మూలించబడుతుంది. సూచనార్థకమైన ఎఱ్ఱని క్రూరమృగము, దాని పది కొమ్ములు, ‘[మహా బబులోనును] దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేస్తాయి.’ (ప్రకటన 17:3, 16, 17) “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి” అనే ఆజ్ఞకు విధేయులమైనందుకు మనం ఎంతగా సంతోషిస్తున్నామో కదా! (ప్రకటన 18:4, 5) మనం మరెన్నడూ దానివైపుకు లేదా దాని మార్గాలవైపుకు మరలకుండా ఉందాము.
“నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు”
17. ‘యెహోవాను నమ్ముకునే వారికి’ ఏమి వాగ్దానం చేయబడుతోంది, అది ఎప్పుడు నెరవేరింది?
17 అయితే, యెషయా ప్రవచనంలోని తర్వాతి మాటల విషయమేమిటి? “నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు.” (యెషయా 57:13బి) యెహోవా ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన రానున్న విపత్తును మించి చూస్తూ, తన ప్రజలు బబులోను నుండి విడుదల చేయబడడం గురించి, తన పరిశుద్ధ పర్వతమైన యెరూషలేములో స్వచ్ఛారాధనను పునఃస్థాపించడాన్ని గురించి ప్రవచిస్తున్నాడు. (యెషయా 66:20; దానియేలు 9:16) నమ్మకంగా మిగిలి ఉండే యూదులెవరికైనా ఇది ఎంతటి ప్రోత్సాహాన్నిస్తుందో కదా! అంతేగాక, యెహోవా ఇలా చెబుతున్నాడు: “ఎత్తుచేయుడి! ఎత్తుచేయుడి! త్రోవను సిద్ధపరచుడి. అడ్డు చేయుదానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.” (యెషయా 57:14) దేవుడు తన ప్రజలను విడుదల చేసే సమయం వచ్చినప్పుడు, అన్ని అడ్డంకులు తొలగించబడి మార్గం సిద్ధంగా ఉంటుంది.—2 దినవృత్తాంతములు 36:22, 23.
18. యెహోవా మహోన్నతత్వం ఎలా వర్ణించబడింది, అయినప్పటికీ ఆయన ఏ ప్రేమపూర్వకమైన శ్రద్ధని చూపిస్తున్నాడు?
18 ప్రారంభంలో పేర్కొన్న మాటలను యెషయా ప్రవక్త పలికింది ఈ సందర్భంలోనే: “మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించువాడను, అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.” (యిషయా 57:15) యెహోవా సింహాసనం మహోన్నతమైన ఆకాశంలో ఉంది. అంతకన్నా ఎత్తైన లేక ఉన్నతమైన స్థానం ఏదీ లేదు. అక్కడి నుండి ఆయన అన్నింటినీ అంటే దుష్టుల పాపాలనే గాక ఆయన సేవ చేయడానికి ప్రయత్నించేవారి నీతియుక్తమైన కార్యాలను కూడా చూస్తాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పునిస్తుందో కదా! (కీర్తన 102:19; 103: 6) అంతేగాక, ఆయన అణచివేయబడినవారి మూల్గులను విని, నలిగినవారి హృదయాలను పునరుజ్జీవింపజేస్తాడు. ఈ మాటలు ప్రాచీన కాలాల్లోని, పశ్చాత్తప్తులైన యూదుల హృదయాలను కదిలించి ఉండవచ్చు. అవి నేడు మన హృదయాలను కూడా తప్పక తాకుతాయి.
19. యెహోవా ఆగ్రహం ఎప్పుడు తగ్గిపోతుంది?
19 యెహోవా పలికిన ఈ తర్వాతి మాటలు కూడా ఓదార్పుకరమైనవే: “నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడును కోపించువాడను కాను; ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.” (యిషయా 57:16) యెహోవా గనుక అంతం లేకుండా నిరంతరం ఆగ్రహిస్తే దేవుని సృష్టి ప్రాణుల్లో ఏదీ తప్పించుకోలేదు. అయితే సంతోషకరంగా, దేవుని ఆగ్రహం పరిమిత సమయం పాటే ఉంటుంది. అది దాని సంకల్పాన్ని నెరవేర్చిన తర్వాత, తగ్గిపోతుంది. ఈ ప్రేరేపిత అంతర్దృష్టి, తన సృష్టి అంటే యెహోవాకున్న ప్రేమపట్ల ప్రగాఢమైన మెప్పును వృద్ధి చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.
20. (ఎ) పశ్చాత్తాపపడని తప్పిదస్థునితో యెహోవా ఎలా వ్యవహరిస్తాడు? (బి) పశ్చాత్తాపపడే వ్యక్తిని యెహోవా ఎలా ఓదారుస్తాడు?
20 యెహోవా తన మాటలను కొనసాగిస్తుండగా మనం మరింత అంతర్దృష్టిని పొందుతాము. మొదట ఆయనిలా చెబుతున్నాడు: “వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని, నేను నా ముఖము మరుగు చేసికొని కోపించితిని. వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచు వచ్చిరి.” (యెషయా 57:17) దురాశతో చేసిన తప్పిదములు తప్పక దేవుని ఉగ్రతకు గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి. ఒకరు హృదయమందు తిరుగుబాటుదారుడిగా ఉన్నంత వరకు, యెహోవా ఆగ్రహంతోనే ఉంటాడు. కానీ అతను తనకు ఇవ్వబడుతున్న క్రమశిక్షణకు ప్రతిస్పందిస్తే అప్పుడేమిటి? అప్పుడు యెహోవా తన ప్రేమ, దయ ఎలా చర్య తీసుకోవడానికి తనను కదిలిస్తాయో చూపిస్తాడు: “నేను వారి ప్రవర్తనను చూచితిని; వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.” (యెషయా 57:18) యెహోవా క్రమశిక్షణా చర్య తీసుకున్న తర్వాత, పశ్చాత్తాపపడే వ్యక్తిని స్వస్థపరిచి, అతడినీ అతడితోపాటు దుఃఖిస్తున్నవారినీ ఓదారుస్తాడు. అందుకే సా.శ.పూ. 537 లో యూదులు తమ స్వదేశానికి తిరిగి రాగలిగారు. నిజమే, యూదా ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ దావీదు వంశపు రాజు పాలన క్రింద స్వతంత్ర రాజ్యం కాలేదు. అయినప్పటికీ, యెరూషలేములోని ఆలయం పునర్నిర్మించబడింది, సత్యారాధన పునఃస్థాపించబడింది.
21. (ఎ) యెహోవా 1919 లో అభిషిక్త క్రైస్తవుల ప్రాణమును ఎలా ఉజ్జీవింపజేశాడు? (బి) మనం వ్యక్తిగతంగా ఏ లక్షణాన్ని అలవరచుకోవడం మంచిది?
21 “మహా ఘనుడును మహోన్నతుడును” అయిన యెహోవా, 1919 లో అభిషిక్త శేషము యొక్క సంక్షేమం పట్ల శ్రద్ధ చూపించాడు. వారి పశ్చాత్తప్త, వినయ స్ఫూర్తి మూలంగా, గొప్ప దేవుడైన యెహోవా కనికరంతో వారి బాధను గమనించి, వారిని బబులోను చెరనుండి విడిపించాడు. ఆయన అన్ని అడ్డంకులను తొలగించి, వారు ఆయనకు స్వచ్ఛారాధనను అర్పించగలిగేలా వారిని స్వతంత్రులను చేశాడు. అలా, యెషయా ద్వారా యెహోవా పలికిన మాటలు అప్పుడు నెరవేరాయి. ఆ మాటల వెనుక మనలో ప్రతి ఒక్కరికీ వర్తించే నిత్య సూత్రాలున్నాయి. కేవలం వినయమనస్కుల నుండే యెహోవా ఆరాధనను అంగీకరిస్తాడు. దేవుని సేవకులలో ఎవరైనా పాపం చేస్తే, అతడు తన తప్పిదమును వెంటనే ఒప్పుకుని, గద్దింపును అంగీకరించి, తన మార్గాలను సరిచేసుకోవాలి. యెహోవా దీనులను స్వస్థపరిచి, ఓదారుస్తాడు గానీ ‘అహంకారులను ఎదిరిస్తాడని’ మనం ఎన్నడూ మరచిపోకూడదు.—యాకోబు 4: 6.
“దూరస్థులకును సమీపస్థులకును సమాధానము”
22. యెహోవా పశ్చాత్తప్తులకు, దుష్టులకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందని ప్రవచించాడు?
22 పశ్చాత్తాపపడే వారి భవిష్యత్తుకు, దుష్ట మార్గాల్లో కొనసాగేవారి భవిష్యత్తుకు మధ్యనున్న తేడాను చూపిస్తూ, యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘వారిలో కృతజ్ఞతాబుద్ధి [“జిహ్వాఫలము,” NW] పుట్టించుచు, దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదను. భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకివేయును. దుష్టులకు నెమ్మదియుండదు.’—యెషయా 57:19-21.
23. జిహ్వాఫలము అంటే ఏమిటి, యెహోవా ఈ ఫలమును ఎలా ‘పుట్టిస్తున్నాడు’?
23 జిహ్వాఫలము అంటే దేవునికి అర్పించబడే స్తుతియాగము, ఆయన నామమును బహిరంగంగా ప్రకటించడం. (హెబ్రీయులు 13:15) యెహోవా ఆ బహిరంగ ప్రకటనను ఎలా ‘పుట్టిస్తున్నాడు’? స్తుతియాగమును అర్పించాలంటే ఒక వ్యక్తి మొదట దేవుని గురించి తెలుసుకుని, ఆయనయందు విశ్వాసం ఉంచాలి. ఆ వ్యక్తి తాను విన్నదాన్ని ఇతరులకు చెప్పడానికి దేవుని అత్మ ఫలమైన విశ్వాసము అతడిని పురికొల్పుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే, అతడు బహిరంగంగా ప్రకటిస్తాడు. (రోమీయులు 10:13-15; గలతీయులు 5:22) తన స్తుతిని ప్రకటింపజేయమని తన సేవకులకు ఆజ్ఞాపించేది యెహోవాయేనని కూడా గుర్తుంచుకోవాలి. తన ప్రజలను స్వతంత్రులను చేసి, వారు అలాంటి స్తుతి యాగాలను అర్పించడాన్ని సాధ్యం చేసేదీ యెహోవాయే. (1 పేతురు 2: 9) కాబట్టి, యెహోవాయే జిహ్వాఫలమును పుట్టిస్తాడని చెప్పడం సబబు.
24. (ఎ) దేవుని సమాధానమును ఎవరు తెలుసుకుంటారు, ఏ ఫలితముతో? (బి) ఎవరు సమాధానమును తెలుసుకోలేరు, వారికి ఫలితమేమై ఉంటుంది?
24 యూదులు యెహోవాకు స్తుతి గీతాలు పాడుతూ తమ స్వదేశానికి తిరిగి రావడం ద్వారా ఎంత అద్భుతమైన జిహ్వాఫలమును అర్పిస్తుండవచ్చో కదా! వారు ‘దూరస్థులు’ అంటే యూదా నుండి ఎంతో దూరంలో ఉండి తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నవారైనా, లేక ‘సమీపస్థులు’ అంటే అప్పటికే తమ స్వదేశంలో ఉన్న వారైనా, వారు దేవుని సమాధానమును తెలుసుకోగలిగినందుకు ఆనందంగా ఉండి ఉంటారు. దానికి పూర్తి భిన్నంగా, దుష్టులకు పరిస్థితులు ఎంత వేరుగా ఉన్నాయో కదా! యెహోవా ఇచ్చే క్రమశిక్షణా చర్యలకు ప్రతిస్పందించని దుష్టులు ఎవరైనా ఎక్కడున్నవారైనా, వారికి సమాధానము ఎంత మాత్రం ఉండదు. నిమ్మళింపని సముద్రంలా కదులుతూ వారు జిహ్వాఫలమును కాదు గానీ “బురదను మైలను” అంటే అపరిశుభ్రమైన దానినంతటినీ ఉత్పన్నం చేస్తూనే ఉంటారు.
25. సర్వత్రా ఉన్న అనేకులు సమాధానమును ఎలా తెలుసుకుంటున్నారు?
25 నేడు కూడా సర్వత్రా ఉన్న యెహోవా ఆరాధకులూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. సర్వత్రా ఉన్న క్రైస్తవులు, 230 కన్నా ఎక్కువ దేశాల్లో ఏకైక సత్య దేవుడిని స్తుతిస్తూ, జిహ్వాఫలమును అర్పిస్తున్నారు. వారు పాడే స్తుతి గీతాలు “భూదిగంతముల” వరకు వినిపిస్తున్నాయి. (యెషయా 42:10-12) వారు చెప్పేవాటిని విని ప్రతిస్పందించేవారు దేవుని వాక్య సత్యమైన బైబిలును హత్తుకుంటున్నారు. అలాంటి వారు ‘సమాధాన కర్తయగు దేవుని’ సేవ చేయడం ద్వారా లభించే సమాధానమును తెలుసుకుంటున్నారు.—రోమీయులు 16:20.
26. (ఎ) దుష్టుల కోసం ఏమి వేచి ఉంది? (బి) దీనులకు ఏ గొప్ప వాగ్దానం చేయబడుతోంది, మన నిశ్చయం ఏమై ఉండాలి?
26 నిజమే, దుష్టులు రాజ్య సందేశాన్ని లక్ష్యపెట్టరు. అయితే త్వరలోనే, వారు నీతిమంతుల సమాధానమును పాడు చేయడానికి అనుమతించబడరు. “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు” అని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించేవారు అద్భుతమైన విధంగా దేశమును స్వతంత్రించుకుంటారు. “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:10, 11, 29) అప్పుడు మన భూమి ఎంత సుందరమైన స్థలంగా మారుతుందో కదా! మనం నిరంతరం దేవునికి స్తుతి గీతములు పాడగలిగేలా, ఎన్నడూ దేవుని సమాధానమును కోల్పోకుండా ఉండడానికి నిశ్చయించుకుందాము.
[అధస్సూచీలు]
a “పరుపు” అనే పదం బహుశ బలిపీఠమును గానీ లేదా అన్యదేవుళ్ళ ఆరాధనా స్థలాన్ని గానీ సూచిస్తుండవచ్చు. దాన్ని పరుపు అనడం అలాంటి ఆరాధన ఆధ్యాత్మిక వ్యభిచారం అనేదానికి ఒక జ్ఞాపిక.
b దేవతా స్తంభములు స్త్రీ మర్మాంగమును సూచిస్తుండవచ్చు, విగ్రహములంటే లింగములై ఉండవచ్చు. నమ్మకద్రోహులైన యూదా నివాసులు రెండింటిని ఉపయోగించేవారు.—2 రాజులు 18: 4; 23:14.
[అధ్యయన ప్రశ్నలు]
[263 వ పేజీలోని చిత్రం]
యూదా పచ్చని ప్రతి చెట్టు క్రింద అవినీతికరమైన ఆరాధనను చేస్తుంది
[267 వ పేజీలోని చిత్రం]
దేశమంతటా యూదా బలిపీఠములను కట్టిస్తుంది
[275 వ పేజీలోని చిత్రం]
‘జిహ్వాఫలమును పుట్టించుచున్నాను’