కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా స్వచ్ఛారాధనను ఆశీర్వదిస్తాడు

యెహోవా స్వచ్ఛారాధనను ఆశీర్వదిస్తాడు

ఇరవై ఏడవ అధ్యాయం

యెహోవా స్వచ్ఛారాధనను ఆశీర్వదిస్తాడు

యెషయా 66:​1-14

1. యెషయా చివరి అధ్యాయంలో ఏ ఇతివృత్తాలు ఉన్నతపరచబడ్డాయి, ఏ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి?

 యెషయా చివరి అధ్యాయంలో, ఈ ప్రవచన పుస్తకంలోని కొన్ని ప్రధాన ఇతివృత్తాలు సుస్పష్టమైన చరమాంకానికి తీసుకురాబడ్డాయి, ప్రాముఖ్యమైన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి. ఉన్నతపరచబడిన ఇతివృత్తాల్లో కొన్ని ఏవంటే, యెహోవా మహోన్నతత్వం, వేషధారణపట్ల ఆయనకున్న అసహ్యత, దుష్టులను శిక్షించాలని ఆయన చేసుకున్న దృఢనిర్ణయం, నమ్మకమైనవారిపట్ల ఆయనకున్న ప్రేమా శ్రద్ధలు. అంతేగాక, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి: సత్యారాధనకు అబద్ధ ఆరాధనకు ఉన్న తేడాను ఏది చూపిస్తుంది? ఒకవైపు దేవుని ప్రజలను అణచివేస్తూ, తాము పరిశుద్ధులమన్నట్లు నటించే వేషధారులకు యెహోవా ప్రతీకారం చేస్తాడని మనమెలా నిశ్చయత కలిగి ఉండవచ్చు? తనపట్ల నమ్మకంగా ఉండేవారిని యెహోవా ఎలా ఆశీర్వదిస్తాడు?

స్వచ్ఛారాధనకు కీలకం

2. యెహోవా తన మహత్త్వము గురించి ఏమని ప్రకటిస్తున్నాడు, ఆ ప్రకటన దేన్ని సూచించడం లేదు?

2 మొదటిగా, ప్రవచనం యెహోవా మహత్త్వాన్ని నొక్కి చెబుతుంది: “యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు​—⁠ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?” (యెషయా 66:⁠1) యూదులు తమ స్వదేశానికి తిరిగి వచ్చి అక్కడ మళ్ళీ నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు ఆ జనము యెహోవాకు ఆలయాన్ని పునర్నిర్మించడాన్ని ప్రవక్త నిరుత్సాహపరుస్తున్నాడని కొందరు నమ్ముతారు. అయితే అది నిజం కాదు; ఆలయం పునర్నిర్మించబడాలని యెహోవాయే ఆజ్ఞాపిస్తాడు. (ఎజ్రా 1:​1-6; యెషయా 60:​13; హగ్గయి 1:​7, 8) మరి ఈ మాటల భావమేమిటి?

3. భూమి యెహోవా “పాదపీఠము”గా వర్ణించబడడం ఎందుకు సముచితం?

3 మొదటిగా, భూమి యెహోవా “పాదపీఠము”గా ఎందుకు వర్ణించబడిందో మనం పరిశీలించవచ్చు. ఇది కించపరిచే పదమేమీ కాదు. విశ్వంలోని లక్షలకోట్ల అంతరీక్ష దేహాల్లో భూమికి మాత్రమే ఈ ప్రత్యేక హోదా ఇవ్వబడింది. మన గ్రహం నిరంతరం అసమానమైనదిగానే నిలిచి ఉంటుంది, ఎందుకంటే యెహోవా అద్వితీయ కుమారుడు ఇక్కడే విమోచన క్రయధనాన్ని చెల్లించాడు, మెస్సీయ రాజ్యం ద్వారా యెహోవా ఇక్కడే తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకుంటాడు. భూమి యెహోవా పాదపీఠముగా పిలువబడడం ఎంత సముచితమో కదా! ఒక రాజు తన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడు కావడానికి, ఆ తర్వాత తన పాదాలను పెట్టుకోవడానికి అలాంటి పీఠమును ఉపయోగిస్తాడు.

4. (ఎ) భూమిపైనున్న ఏ భవనమైనా యెహోవా దేవునికి విశ్రమ స్థలముగా ఉండడం ఎందుకు అసాధ్యం? (బి) “అవన్నియు” అనే పద భావమేమిటి, యెహోవా ఆరాధన గురించి మనం ఏ ముగింపుకు రావాలి?

4 ఎంతైనా, ఒక రాజు తన పాదపీఠముపై నివసించడు అలాగే యెహోవా కూడా ఈ భూమిపై నివసించడు. అంతెందుకు, విస్తారమైన భౌతిక ఆకాశములు సహితం ఆయనను ఇముడ్చుకోలేవు! భూమిపై నిర్మింపబడిన ఏ కట్టడమైనా యెహోవాకు అక్షరార్థమైన గృహముగా ఉపకరిస్తూ ఆయనకు నివాసస్థలముగా ఎంతమాత్రం ఉండలేదు. (1 రాజులు 8:​27) యెహోవా సింహాసనము, ఆయన విశ్రమ స్థలము ఆత్మ సామ్రాజ్యంలో నెలకొని ఉన్నాయి, యెషయా 66:1 లో ఉపయోగించబడినట్లుగా, “ఆకాశము” అనే పదం యొక్క భావం అదే. తర్వాతి వచనం ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది: “అవన్నియు నా హస్తకృత్యములు, అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 66: 2ఎ) “అవన్నియు” అంటే ఆకాశంలోనూ భూమిపైనా ఉన్న ప్రతిదాన్ని సూచిస్తూ యెహోవా చెయ్యిచాపి మొత్తమంతా అన్నట్లుగా చూపించడాన్ని ఊహించుకోండి. (యెషయా 40:​26; ప్రకటన 10: 6) విశ్వమంతటి యొక్క మహా సృష్టికర్తగా ఆయన, కేవలం ఒక భవనం తనకు సమర్పించబడడం కంటే ఎక్కువే పొందడానికి అర్హుడు. కేవలం పైకి కనిపించే విధమైన ఆరాధన కంటే ఎక్కువే పొందడానికి ఆయన పాత్రుడు.

5. మనం ‘దీనులమై నలిగిన హృదయము’ గలవారమని ఎలా చూపిస్తాము?

5 విశ్వ సర్వాధిపతికి ఏ విధమైన ఆరాధన అర్పించడం సముచితం? ఆయనే స్వయంగా మనకు చెబుతున్నాడు: “ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.” (యిషయా 66:2బి) అవును, స్వచ్ఛారాధనకు, ఆరాధకుడు సరైన మనోవైఖరి కలిగి ఉండడం ఆవశ్యకం. (ప్రకటన 4:​10, 11) యెహోవా ఆరాధకుడు “దీనుడై నలిగిన హృదయముగలవాడై” ఉండాలి. అంటే మనం అసంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడని దీని భావమా? కాదు, ఆయన “సంతోషంగల” దేవుడు, తన ఆరాధకులు కూడా ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమోతి 1:​8, NW; ఫిలిప్పీయులు 4: 4) అయితే, మనమందరం తరచుగా పాపాలు చేస్తుంటాము గనుక, మనం మన పాపాలను అల్పమైనవిగా ఎంచకూడదు. యెహోవా నీతియుక్తమైన ప్రమాణాలను పాటించడంలో తప్పిపోతున్నందుకు విచారిస్తూ, మనం వాటిని బట్టి ‘దీనులమై’ ఉండాలి అంటే దుఃఖించాలి. (కీర్తన 51:​17) మనం పశ్చాత్తాపపడి, మన పాపభరితమైన ప్రవృత్తులకు విరుద్ధంగా పోరాడుతూ, క్షమాపణ కోసం యెహోవాను ప్రార్థిస్తూ, మనం “నలిగిన హృదయము” కలిగి ఉన్నామని చూపించవలసిన అవసరం ఉంది.​—⁠లూకా 11: 4; 1 యోహాను 1:​8-10.

6. సత్యారాధకులు ఏ భావంలో ‘దేవుని మాట విని వణకిపోవాలి’?

6 అంతేగాక, యెహోవా ‘తన మాట విని వణకేవారి’ కోసం చూస్తాడు. అంటే దాని భావం మనం ఆయన ప్రకటనలను చదివినప్పుడల్లా మనం భయంతో వణకిపోవాలని ఆయన కోరుకుంటున్నాడనా? కాదు, బదులుగా, ఆయన చెబుతున్న దాన్ని మనం భయభక్తులతో, పూజ్యభావంతో దృష్టించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం యథార్థంగా ఆయన ఉపదేశం కోసం విజ్ఞప్తి చేసి, దాన్ని మన జీవితంలోని వ్యవహారాలన్నిటిలో నిర్దేశం కోసం ఉపయోగించుకుంటాము. (కీర్తన 119:​105) మనం, దేవునికి అవిధేయత చూపించడం, ఆయన సత్యాన్ని మానవ సాంప్రదాయాలతో కలుషితం చేయడం, లేదా దాన్ని తేలిగ్గా దృష్టించడం అనే తలంపుకే భయపడుతూ ‘వణికిపోవచ్చు’ కూడా. అలాంటి అణకువగల దృక్పథం స్వచ్ఛారాధనకు ఆవశ్యకం, కానీ విచారకరంగా అది నేటి ప్రపంచంలో చాలా అరుదుగా కనబడుతుంది.

వేషధారణతో కూడిన ఆరాధనను యెహోవా అసహ్యించుకుంటాడు

7, 8. మతపరమైన వేషధారులు చేసే నామమాత్రపు ఆరాధనను యెహోవా ఎలా దృష్టిస్తాడు?

7 యెషయా తన సమకాలీనుల గురించి ఆలోచిస్తున్నప్పుడు, యెహోవా తన ఆరాధకులలో ఉండాలని కోరుకునే దృక్పథం చాలా కొద్దిమందిలో మాత్రమే ఉందని ఆయనకు బాగా తెలుసు. ఈ కారణం వల్ల, మతభ్రష్ట యెరూషలేము పైకి రానున్న తీర్పును పొందడానికి అది అర్హురాలు. దానిలో జరుగుతున్న ఆరాధనను యెహోవా ఎలా దృష్టిస్తాడో గమనించండి: “ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే. గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే. నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి, వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగా ఉన్నవి.”​—యెషయా 66: 3.

8 ఈ మాటలు, యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో వ్రాయబడి ఉన్న యెహోవా మాటలను మనకు గుర్తు చేస్తాయి. దారితప్పిన తన ప్రజలు ఆరాధనకు సంబంధించి చేస్తున్న నామమాత్రపు చర్యలు తనను ప్రీతిపరచడంలో విఫలమవ్వడమే గాక, ఆ ఆరాధకులు వేషధారులుగా ఉన్నారు గనుక వారి చర్యలు తన నీతియుక్తమైన ఆగ్రహాన్ని రేకెత్తించాయని యెహోవా వారికి చెప్పాడు. (యెషయా 1:​11-17) అలాగే, యెహోవా ఇప్పుడు వారి అర్పణలను హేయమైన నేరాలతో పోలుస్తున్నాడు. వారు ఒక మానవుడ్ని హత్య చేయడం యెహోవాకు ఎలా అప్రీతికరమైనదో అలాగే వారు ఒక ఖరీదైన ఎద్దును బలి ఇవ్వడం, ఆయనకు ఎంతమాత్రం ప్రీతికరమైనది కాదు! ఇతర బలులు, మోషే ధర్మశాస్త్రం క్రింద అపవిత్రమైనవి, బలి అర్పించడానికి పనికిరాని కుక్కను లేదా పందిని బలి అర్పించడంతో పోల్చబడ్డాయి. (లేవీయకాండము 11:​7, 27) అలాంటి మతపరమైన వేషధారణ శిక్షించబడకుండా పోయేందుకు యెహోవా అనుమతిస్తాడా?

9. యెహోవా యెషయా ద్వారా ఇచ్చిన జ్ఞాపికలకు చాలామంది యూదులు ఎలా ప్రతిస్పందించారు, అనివార్యమైన ఫలితం ఏమై ఉంటుంది?

9 యెహోవా ఇప్పుడిలా చెబుతున్నాడు: “నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేకపోయెను; నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను; నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకిష్టము కానిదాని కోరుకొనిరి; కావున నేనును వారిని మోసములో ముంచుదును; వారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను.” (యెషయా 66: 4) యెషయా నిస్సందేహంగా హృదయపూర్వకమైన నమ్మకంతో ఈ మాటలను పలుకగలుగుతాడు. చాలా సంవత్సరాలుగా ఆయన యెహోవా ప్రజలను ‘పిలుస్తూ,’ వారితో ‘మాటలాడుతూ’ యెహోవా యొక్క ఉపకరణంగా ఉన్నాడు. మొత్తానికి ఎవరూ వినడం లేదని ప్రవక్తకు బాగా తెలుసు. వారు విడువక చెడు చేస్తూనే ఉన్నారు గనుక, ప్రతిదండన అనివార్యం. వాస్తవానికి వారికి ఏ శిక్ష విధించాలో యెహోవాయే ఎంపిక చేసి, తన మతభ్రష్ట ప్రజలకు భయం గొలిపే సంఘటనలు జరిగేలా చేస్తాడు.

10. యూదాతో యెహోవా వ్యవహారాలు, క్రైస్తవమత సామ్రాజ్యాన్ని గురించిన ఆయన దృక్పథం గురించి మనకు ఏమి చెబుతాయి?

10 ఆధునిక దిన క్రైస్తవమత సామ్రాజ్యం కూడా యెహోవాకు ఎంతమాత్రం ఇష్టంలేని వాటిని ఆచరిస్తుంది. దాని చర్చీల్లో విగ్రహారాధన వర్ధిల్లుతోంది, లేఖనవిరుద్ధమైన సిద్ధాంతాలు సంప్రదాయాలు దాని వేదికల మీది నుండి ఉన్నతపరచడం జరుగుతోంది, రాజకీయ అధికారం కోసమైన దాహం అది లోక రాజ్యాలతో ఆధ్యాత్మిక వ్యభిచార సంబంధంలో మరింత లోతుగా కూరుకుపోయేలా చేసింది. (మార్కు 7:​13; ప్రకటన 18:​4, 5, 9) ప్రాచీన యెరూషలేముకు జరిగినట్లుగానే, క్రైస్తవమత సామ్రాజ్యంపైకి దానికి తగిన దండన​—⁠‘భయం’ కలిగించేది​—⁠తప్పనిసరిగా వస్తుంది. దానికి ఖచ్చితంగా దండన రావడానికి గల ఒక కారణం, అది దేవుని ప్రజలతో వ్యవహరించిన విధానమే.

11. (ఎ) యెషయా కాలంనాటి మతభ్రష్టుల పాపాన్ని ఏది అధికం చేస్తుంది? (బి) యెషయా సమకాలీనులు ‘దేవుని నామమును బట్టి’ నమ్మకమైన వారిని ఏ భావంలో త్రోసివేస్తారు?

11 యెషయా ఇలా కొనసాగింపజేస్తున్నాడు: “యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి​—⁠మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు​—⁠మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు. వారే సిగ్గునొందుదురు.” (యిషయా 66: 5) యెహోవా దేవునికి ప్రాతినిధ్యం వహిస్తూ, ఆయన సర్వాధిపత్యానికి లోబడివుండడమనే దేవుడిచ్చిన బాధ్యత యెషయా “స్వజనుల”కు ఉంది. అలా చేయడంలో విఫలమవ్వడం వాస్తవానికి గంభీరమైన పాపం. కానీ వారి పాపాన్ని అధికం చేసేదేమిటంటే, వారు యెషయా వంటి నమ్మకమైన, అణకువగల వ్యక్తులను ద్వేషిస్తున్నారు. ఈ నమ్మకమైన వారు యెహోవా దేవునికి సత్యవంతంగా ప్రాతినిధ్యం వహిస్తారు గనుక ఈ మతభ్రష్టులు వారిని ద్వేషిస్తూ, వారిని త్రోసివేస్తారు. ఆ భావంలోనే, ‘దేవుని నామమును బట్టి’ త్రోసివేయడం జరుగుతుంది. అదే సమయంలో, యెహోవా యొక్క ఈ అబద్ధ సేవకులు “యెహోవా మహిమనొందును గాక!” వంటి, మతసంబంధమైనవిగా ధ్వనించే పదాలను భక్తిపూర్వకంగా అన్నట్లుగా ఉపయోగిస్తూ ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్నారు. a

12. యెహోవా నమ్మకమైన సేవకులను మతసంబంధమైన వేషధారులు హింసించారనేందుకు కొన్ని ఉదాహరణలు ఏవి?

12 స్వచ్ఛారాధనను హత్తుకునే వారిపట్ల అబద్ధ మతానికి ఉన్న ద్వేషం క్రొత్తదేమీ కాదు. అది, సాతాను సంతానానికి, దేవుని స్త్రీ సంతానానికి మధ్యన ఎంతోకాలం శత్రుత్వం ఉంటుందని ముందే తెలియజేసిన ఆదికాండము 3:15 లోని ప్రవచనం యొక్క అదనపు నెరవేర్పు. మొదటి శతాబ్దంలోని తన అభిషిక్త అనుచరులు కూడా తమ తోటి దేశస్థుల చేతుల్లో బాధలు అనుభవిస్తారనీ అంటే సమాజమందిరాల్లో నుండి బహిష్కరణను, మరణించేంతటి హింసను అనుభవిస్తారనీ యేసు వారికి చెప్పాడు. (యోహాను 16: 2) మరి ఆధునిక కాలాల మాటేమిటి? “అంత్యదినముల” ప్రారంభంలో, అలాంటి హింసే రాబోతోందని దేవుని ప్రజలు గ్రహించారు. (2 తిమోతి 3: 1) మునుపు 1914 లో, కావలికోట యెషయా 66:5 ను ఎత్తివ్రాసి, ఇలా పేర్కొన్నది: “దేవుని ప్రజలకు వచ్చిన దాదాపు అన్ని హింసలు నామకార్థ క్రైస్తవుల నుండే వచ్చాయి.” అదే ఆర్టికల్‌ ఇలా కూడా చెప్పింది: “వారు మన కాలంలో మనల్ని సామాజికంగా, మతపరంగా, భౌతికంగా చంపేంత విపరీతానికి వెళతారా అన్నది మనకు తెలియదు.” ఆ మాటలు ఎంత నిజమని తేలాయో కదా! ఆ మాటలు ప్రచురించబడి ఎంతో కాలం గడువక ముందే, మత నాయకులు రేకెత్తించిన హింస మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో తీవ్ర స్థాయికి చేరుకుంది. కానీ ప్రవచించబడినట్లుగానే, క్రైస్తవమత సామ్రాజ్యం అవమానం పాలైంది. ఎలా?

శీఘ్రమైన, హఠాత్‌ పునఃస్థాపన

13. ప్రాథమిక నెరవేర్పులో, ‘పట్టణములో పుట్టిన అల్లరిధ్వని’ ఏమిటి?

13 యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది, దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది! తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది.” (యిషయా 66: 6) ఈ పదాల ప్రాథమిక నెరవేర్పులో, “పట్టణము” యెహోవా ఆలయం నెలకొని ఉన్న యెరూషలేము. “అల్లరిధ్వని,” ఆక్రమిస్తున్న బబులోను సైన్యాలు సా.శ.పూ. 607 లో ఆ నగరంపై దాడి చేసినప్పుడు దానిలో వినిపించిన యుద్ధ కలకలాన్ని సూచిస్తుంది. అయితే మరి ఆధునిక దిన నెరవేర్పు మాటేమిటి?

14. (ఎ) యెహోవా తన ఆలయానికి రావడాన్ని గురించి మలాకీ ఏమి ప్రవచించాడు? (బి) యెహెజ్కేలు ప్రవచనం ప్రకారం, యెహోవా తన ఆలయానికి వచ్చినప్పుడు ఏమి జరిగింది? (సి) యెహోవా, యేసు ఆధ్యాత్మిక ఆలయాన్ని ఎప్పుడు తనిఖీ చేశారు, స్వచ్ఛారాధనకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే వారికి ఏమి జరిగింది?

14 యెషయా గ్రంథంలోని ఈ మాటలు రెండు ఇతర ప్రవచనాలతో పొందిక కలిగి ఉన్నాయి, ఒకటి యెహెజ్కేలు 43: 4, 6-9 వచనాల్లోనూ, మరొకటి మలాకీ 3:1-5 వచనాల్లోనూ వ్రాయబడి ఉన్నాయి. యెహోవా దేవుడు తన ఆలయానికి వచ్చే సమయాన్ని గురించి యెహెజ్కేలు, మలాకీ ఇద్దరూ ప్రవచిస్తున్నారు. యెహోవా తనకు తప్పుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని నిరాకరిస్తూ, తన స్వచ్ఛారాధనా మందిరాన్ని తనిఖీ చేయడానికీ, శుద్ధిచేసే వానిగా చర్య తీసుకోవడానికీ వస్తాడని మలాకీ ప్రవచనం చూపిస్తోంది. యెహోవా ఆలయంలోకి ప్రవేశించి, సమస్త విధములైన లైంగిక దుర్నీతి, విగ్రహారాధనల జాడలు నిర్మూలించబడాలని అధికారంతో శాసించడాన్ని యెహెజ్కేలు దర్శనం వర్ణిస్తోంది. b ఈ ప్రవచనాల ఆధునిక దిన నెరవేర్పులో, యెహోవా ఆరాధనకు సంబంధించి 1918 లో ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక అభివృద్ధి జరిగింది. స్వచ్ఛారాధనకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే వారందరినీ యెహోవా, యేసు తనిఖీ చేశారని స్పష్టమవుతోంది. ఆ తనిఖీ, భ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యమును పూర్తిగా విడిచిపెట్టడానికి దారితీసింది. క్రీస్తు అభిషిక్త అనుచరులకు, తనిఖీ స్వల్పకాలిక శుద్ధీకరణకు, దాని తర్వాత 1919 లో శీఘ్రమైన ఆధ్యాత్మిక పునఃస్థాపనకు దారితీసింది.​—⁠1 పేతురు 4:​17.

15 ఏ జననం గురించి ప్రవచించబడింది, సా.శ.పూ. 537 లో ఇది ఎలా నెరవేరింది?

15 యెషయా తర్వాతి వచనాల్లో ఈ పునఃస్థాపన సముచితంగా చిత్రీకరించబడింది: “ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది. నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది. అట్టివార్త యెవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను.” (యెషయా 66:7, 8) బబులోనులో బంధీలుగా ఉన్న యూదులకు సంబంధించి ఈ మాటలు ఉత్తేజకరమైన విధంగా మొదటిసారి నెరవేరాయి. సీయోను లేదా యెరూషలేము పిల్లలను కంటున్న స్త్రీగా మరోసారి చిత్రీకరించబడింది, కానీ ఎంతటి అసాధారణమైన ప్రసవం! అది ఎంత శీఘ్రంగా, ఎంత హఠాత్తుగా జరుగుతుందంటే నొప్పులు ప్రారంభం కాకముందే కనడం జరుగుతుంది! ఇది చాలా సముచితమైన చిత్రణ. సా.శ.పూ. 537 లో దేవుని ప్రజలు ఒక ప్రత్యేకమైన జనముగా తిరిగి జన్మించడం ఎంత శీఘ్రంగా, ఎంత హఠాత్తుగా జరుగుతుందంటే అది అద్భుతంలా అనిపిస్తుంది. అంతెందుకు, కోరెషు యూదులను చెర నుండి విడుదల చేసినప్పటి నుండి నమ్మకమైన శేషము తిరిగి తమ స్వదేశానికి తిరిగి రావడానికి కేవలం కొన్ని నెలలే పట్టింది! ఇశ్రాయేలు జనాంగపు అసలైన జననానికి నడిపించే సంఘటనలకు ఎంత భిన్నమో కదా! సా.శ.పూ. 537 లో, ఎదిరిస్తున్న చక్రవర్తిని స్వేచ్ఛ కోసం వేడుకోవలసిన అవసరం రాలేదు, శత్రుభావంగల సైన్యం నుండి పారిపోవలసిన అవసరం రాలేదు, 40 సంవత్సరాల పాటు అరణ్యములో నివసించాల్సిన అవసరం రాలేదు.

16. యెషయా 66:​7, 8 వచనాల ఆధునిక దిన నెరవేర్పులో, సీయోను దేన్ని చిత్రీకరిస్తుంది, ఆమె సంతానము ఎలా పునర్జన్మను పొందింది?

16 ఆధునిక దిన నెరవేర్పులో, సీయోను, యెహోవా పరలోక ‘స్త్రీకి’ అంటే ఆత్మ ప్రాణులతో కూడిన ఆయన పరలోక సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ “స్త్రీ” 1919 లో, భూమిపైనున్న తన అభిషిక్త కుమారులు సంస్థీకృత ప్రజలుగా, “ఒక జనము”గా జన్మించడం చూసి ఆనందించింది. అలా తిరిగి జన్మించడం శీఘ్రంగా, హఠాత్తుగా జరిగింది. c కేవలం నెలల సమయంలో, అభిషిక్తులు ఒక గుంపుగా మరణం వంటి నిష్క్రియా స్థితి నుండి తమ “దేశము”లో అంటే దేవుడిచ్చిన తమ ఆధ్యాత్మిక కార్యకలాపాల పరిధిలో ఉత్తేజవంతమైన, చురుకైన సజీవ స్థితికి వచ్చారు. (ప్రకటన 11:​8-12) వారు 1919 శరదృతువుకల్లా కావలికోట పత్రికకు సహపత్రికగా ఒక క్రొత్త పత్రికను ప్రచురించడాన్ని కూడా ప్రకటించారు. ద గోల్డెన్‌ ఏజ్‌ (ఇప్పుడు తేజరిల్లు!) అని పిలువబడే ఆ క్రొత్త ప్రచురణ, దేవుని ప్రజలు పునరుజ్జీవింపజేయబడి, సేవ కోసం మరోసారి సంస్థీకరించబడ్డారనే దానికి నిదర్శనం.

17. ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు సంబంధించి తన సంకల్పాన్ని నెరవేర్చడంలో తనను ఏదీ ఆపలేదని యెహోవా తన ప్రజలకు ఎలా హామీ ఇస్తున్నాడు?

17 విశ్వంలోని ఏ శక్తీ ఈ ఆధ్యాత్మికంగా తిరిగి జన్మించడాన్ని ఆపలేకపోయింది. ఈ విషయాన్ని తర్వాతి వచనం చక్కగా వర్ణిస్తోంది: “నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా? అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని నీ దేవుడడుగుచున్నాడు.” (యెషయా 66: 9) ప్రసవం మొదలైన తర్వాత ఎలాగైతే ఆపడం అసాధ్యమో, అలాగే ఆధ్యాత్మిక ఇశ్రాయేలు తిరిగి జన్మించడం ఒకసారి ప్రారంభమైన తర్వాత ఇక ఆపడం అసాధ్యం. నిజమే, వ్యతిరేకత ఉండినది, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఉండవచ్చు. కానీ యెహోవా ప్రారంభించేదాన్ని కేవలం ఆయన మాత్రమే ఆపగలడు, అయితే ఆయన అలా ఎన్నడూ చేయడు! పునరుజ్జీవింపజేయబడిన తన ప్రజలతో యెహోవా ఎలా వ్యవహరిస్తాడు?

యెహోవా ప్రేమపూర్వకమైన శ్రద్ధ

18, 19. (ఎ) యెహోవా కదిలింపజేసే ఏ ఉపమానాన్ని ఉపయోగించాడు, బంధీలుగా ఉన్న ఆయన ప్రజలకు అది ఎలా అన్వయిస్తుంది? (బి) అభిషిక్త శేషము నేడు ప్రేమపూర్వకమైన పోషణ నుండి, శ్రద్ధ నుండి ఎలా ప్రయోజనం పొందింది?

18 తర్వాతి నాలుగు వచనాలు యెహోవా ప్రేమపూర్వకమైన శ్రద్ధను గురించిన హృదయోత్తేజకరమైన వర్ణనను ఇస్తున్నాయి. మొదట, యెషయా ఇలా చెబుతున్నాడు: “యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి; ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తినొందెదరు; ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు.” (యిషయా 66:​10, 11) యెహోవా ఇక్కడ, తన పసిబిడ్డకు స్తన్యమిచ్చే స్త్రీ ఉదాహరణను ఉపయోగిస్తున్నాడు. పసిబిడ్డకు ఆకలైనప్పుడు అది ఏడుస్తుంది. కానీ పాలు త్రాగడానికి తల్లి స్తన్యమును సమీపించినప్పుడు, ఆ పసిబిడ్డ దుఃఖం పోయి సంతోషభరితమై సంతుష్టిగా, సంతృప్తిగా ఉంటుంది. అదే విధంగా, విడుదల పునఃస్థాపనల సమయం వచ్చినప్పుడు, బబులోనులో ఉన్న నమ్మకమైన యూదుల శేషము ప్రలాపిస్తున్న స్థితి నుండి, సంతోషభరితమైన, సంతృప్తికరమైన స్థితికి శీఘ్రంగా తీసుకురాబడుతుంది. వారు ఆనందంగా ఉంటారు. యెరూషలేము పునర్నిర్మించబడి, ప్రజలు అక్కడ తిరిగి నివసించడం ప్రారంభించినప్పుడు దాని మహిమ పునర్నూతనం చేయబడుతుంది. ఫలితంగా, నగర మహిమలో దాని నమ్మకమైన నివాసులు కూడా భాగమే. మరోసారి, వారు చురుకైన యాజకత్వం ద్వారా ఆధ్యాత్మికంగా పోషించబడతారు.​—⁠యెహెజ్కేలు 44:​15, 23.

19 ఆధ్యాత్మిక ఇశ్రాయేలు కూడా 1919 లో పునఃస్థాపించబడిన తర్వాత పుష్కలమైన పోషణతో ఆశీర్వదించబడింది. అప్పటి నుండి, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా క్రమం తప్పక ఆధ్యాత్మిక ఆహారం అందజేయబడుతూనే ఉంది. (మత్తయి 24:​45-47) ఇది వాస్తవంగా అభిషిక్త శేషముకు ఓదార్పుకరమైన, ఆనందకరమైన సమయం. కానీ ఇంకా అదనపు ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి.

20. యెరూషలేము ప్రాచీన కాలాల్లోనూ, ఆధునిక కాలాల్లోనూ “పొర్లిపారుతున్న జలప్రవాహముతో” ఎలా ఆశీర్వదించబడింది?

20 ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.” (యెషయా 66:​12) ఇక్కడ స్తన్యమిచ్చే స్త్రీని గురించిన వర్ణన, “నది,” “పొర్లిపారు జలప్రవాహము” అయిన సమృద్ధికరమైన ఆశీర్వాదాల ప్రవాహపు వర్ణనతో జతచేయబడింది. యెరూషలేము యెహోవా నుండి వచ్చే సమృద్ధికరమైన సమాధానముతోనే గాక, దేవుని ప్రజలవైపుకు ప్రవహించే, వారిని ఆశీర్వదించే “జనముల ఐశ్వర్యము”తో కూడా ఆశీర్వదించబడుతుంది. అంటే దాని భావం అన్యజనములు యెహోవా ప్రజల వద్దకు ప్రవాహంలా వస్తారు. (హగ్గయి 2: 7) ప్రాచీన నెరవేర్పులో, వివిధ జనములకు చెందిన అనేకమంది ప్రజలు యూదా మతప్రవిష్టులై ఇశ్రాయేలుతో కలిశారు. అయితే, ‘ప్రతి జనములోనుండి, ప్రజలలోనుండి, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండి వచ్చిన,’ నిజంగా మానవజాతి యొక్క పొర్లిపారుతున్న జలప్రవాహము అయిన ‘ఒక గొప్ప సమూహము’ ఆధ్యాత్మిక యూదుల శేషముతో కలిసినప్పుడు మన కాలంలో మరింత గొప్పగా నెరవేరింది.​—⁠ప్రకటన 7: 9; జెకర్యా 8:​23.

21. ఆకర్షణీయమైన పద చిత్రణలో, ఏ విధమైన ఓదార్పు ప్రవచించబడింది?

21యెషయా 66:​12, చిన్నబిడ్డను మోకాళ్ల మీద ఆడించడం, చంకన ఎత్తుకోవడం వంటి మాతృప్రేమ యొక్క చర్యలను గురించి కూడా మాట్లాడుతుంది. తర్వాతి వచనంలో, దృక్కోణంలో ఆసక్తికరమైన మార్పుతో అటువంటి తలంపే వ్యక్తపరచబడింది. “ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.” (యిషయా 66:​13) ఆదిమ భాషా మూలప్రతి ప్రకారం పిల్లవాడు ఇప్పుడు వయోజనుడయ్యాడు. అయినా అతని తల్లి, అతడు బాధలో ఉన్నప్పుడు అతడిని ఓదార్చాలనే కోరికను కోల్పోలేదు.

22. యెహోవా తన ప్రేమ మృదువైనదని బలమైనదని ఎలా చూపించాడు?

22 ఈ ఆకర్షణీయమైన విధానంలో, యెహోవా తన ప్రజలపట్ల తనకున్న ప్రేమ ఎంత మృదువైనదో ఎంత బలమైనదో సోదాహరణంగా తెలియజేస్తున్నాడు. బలమైన మాతృప్రేమ కూడా యెహోవాకు తన నమ్మకమైన ప్రజలపట్ల ఉన్న లోతైన ప్రేమ యొక్క అస్పష్టమైన ప్రతిబింబం మాత్రమే. (యెషయా 49:​15) క్రైస్తవులందరూ తమ పరలోక తండ్రి యొక్క ఈ లక్షణాన్ని ప్రతిబింబింపజేయడం ఎంత ఆవశ్యకమో కదా! అపొస్తలుడైన పౌలు అలాగే చేసి, క్రైస్తవ సంఘంలోని పెద్దలకు ఒక చక్కని మాదిరిని ఉంచాడు. (1 థెస్సలొనీకయులు 2: 7) సహోదర ప్రేమ తన అనుచరుల ప్రధాన గుర్తింపు చిహ్నమై ఉంటుందని యేసు చెప్పాడు.​—⁠యోహాను 13:​34, 35.

23. పునఃస్థాపించబడిన యెహోవా ప్రజల సంతోషకరమైన స్థితిని వర్ణించండి.

23 యెహోవా తన ప్రేమను చర్యల రూపంలో వ్యక్తపరుస్తున్నాడు. అందుకే, ఆయనిలా కొనసాగిస్తున్నాడు: ‘మీరు చూడగా [“మీరు చూస్తారు,” ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌] మీ హృదయము ఉల్లసించును, మీ యెముకలు లేతగడ్డివలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కనుపరచబడును, ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.’ (యెషయా 66:​14) “మీరు చూస్తారు” అనే పదాలు, తిరిగివస్తున్న యూదులు తమ పునఃస్థాపిత దేశంలో ఎటు చూసినా “వారి కళ్ళకు ఆనందం కనిపిస్తుంది” అని సూచిస్తాయని ఒక హీబ్రూ భాషా వ్యాకరణ పండితుడు సూచిస్తున్నాడు. వారు నిజంగా ఆనందిస్తారు, తాము తమ ప్రియమైన స్వదేశంలో పునఃస్థాపించబడ్డామని, మాటలకందని రీతిలో ఉత్తేజితులవుతారు. వసంత కాలంలో నూతన బలాన్ని పొందే గడ్డిలా, వారి ఎముకలు మళ్ళీ బలం పుంజుకుంటున్నట్లుగా వారు తిరిగి శక్తిని పొందుతారు. ఈ ఆశీర్వాదకరమైన స్థితికి కారణం, ఏ మానవ ప్రయత్నమూ కాదు గానీ “యెహోవా హస్తబలము” మాత్రమే అని అందరూ తెలుసుకుంటారు.

24. (ఎ) నేడు యెహోవా ప్రజలపై ప్రభావం చూపిస్తున్న సంఘటనలను పరిశీలించినప్పుడు మీరు ఏ ముగింపుకు చేరుకుంటారు? (బి) మన తీర్మానం ఏమై ఉండాలి?

24 నేడు యెహోవా ప్రజల మధ్యన ఆయన హస్తబలము పని చేయడాన్ని మీరు గుర్తిస్తున్నారా? ఏ మానవుడూ స్వచ్ఛారాధనను పునఃస్థాపించగలిగి ఉండేవాడు కాదు. అన్ని జనములకు చెందిన లక్షలాదిమంది అమూల్యమైన ప్రజల ప్రవాహం నమ్మకమైన శేషము యొక్క ఆధ్యాత్మిక దేశములో వారితో కలవడాన్ని ఏ మానవుడూ సాధ్యంచేసి ఉండేవాడు కాదు. కేవలం యెహోవా దేవుడు మాత్రమే అలాంటివి చేయగలడు. యెహోవా ప్రేమను గూర్చిన ఈ వ్యక్తీకరణలు అపరిమితమైన ఆనందాన్ని పొందడానికి మనకు కారణాన్ని ఇస్తాయి. మనం ఆయన ప్రేమను ఎన్నడూ తక్కువగా ఎంచకుందాము. మనం ‘ఆయన మాట విని వణకడంలో’ కొనసాగుదుము గాక. బైబిలు సూత్రాలకు అనుసారంగా జీవించడానికి, యెహోవా సేవలో ఆనందాన్ని కనుగొనడానికి మనం తీర్మానించుకుందాము.

[అధస్సూచీలు]

a నేడు క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేకులు యెహోవా వ్యక్తిగత నామమును ఉపయోగించడానికి నిరాకరిస్తున్నారు. దానిని అనేక బైబిలు అనువాదములలో నుండి తొలగిస్తున్నారు కూడా. కొందరైతే, దేవుని వ్యక్తిగత నామమును ఉపయోగిస్తున్నందుకు ఆయన ప్రజలను ఎగతాళిచేస్తారు. అయితే, వారిలో చాలామంది “యెహోవాను స్తుతించుడి” అనే భావంగల “హల్లెలూయా” అనే పదాన్ని భక్తిపూర్వకంగా అంటున్నట్లు ఉపయోగిస్తారు.

b యెహెజ్కేలు 43:7, 9 వచనాల్లో ఉపయోగించబడిన ‘రాజుల కళేబరములు’ అనే మాట విగ్రహాలను సూచిస్తుంది. యెరూషలేము యొక్క తిరుగుబాటుదారులైన నాయకులు, ప్రజలు దేవుని ఆలయాన్ని విగ్రహాలతో కలుషితం చేసి, తద్వారా వాటిని తమ రాజులుగా చేసుకున్నారు.

c ఇక్కడ ప్రవచించబడిన జననము, ప్రకటన 12:​1, 2, 5 వచనాల్లో వర్ణించబడిన జననము, ఒకటే కాదు. ప్రకటన గ్రంథంలోని ఆ అధ్యాయంలో, “మగశిశువు” 1914 లో కార్యనిర్వహణ ప్రారంభించిన మెస్సీయ రాజ్యాన్ని సూచిస్తుంది. అయితే, రెండు ప్రవచనాల్లోని “స్త్రీ” మాత్రం ఒకరే.

[అధ్యయన ప్రశ్నలు]

[395 వ పేజీలోని చిత్రం]

“అవన్నియు నా హస్తకృత్యములు”

[402 వ పేజీలోని చిత్రం]

“జనముల ఐశ్వర్యము”ను యెహోవా సీయోనుకు విస్తరింపజేస్తాడు