కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తనకు ఘనమైన పేరు కలుగజేసుకుంటాడు

యెహోవా తనకు ఘనమైన పేరు కలుగజేసుకుంటాడు

ఇరవై నాలుగవ అధ్యాయం

యెహోవా తనకు ఘనమైన పేరు కలుగజేసుకుంటాడు

యెషయా 63:​1-14

1, 2. (ఎ) రానున్న ‘దేవుని దినములో’ క్రైస్తవులకు ఏ వ్యక్తిగతమైన ఆసక్తి ఉంది? (బి) యెహోవా దినము రావడంలో ఏ సమున్నతమైన అంశం ఇమిడి ఉంది?

 దాదాపు రెండు వేల సంవత్సరాలుగా క్రైస్తవులు “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు”న్నారు. (2 పేతురు 3:​11-12; తీతు 2:​13) ఆ దినము రావాలని వారు ఆతృతతో ఉన్నారన్నది అర్థం చేసుకోదగినదే. ఎంతైనా, ఆ దినము, అపరిపూర్ణత వల్ల కలిగే వినాశనాల నుండి లభించే ఉపశమనం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. (రోమీయులు 8:​22) ఈ “అపాయకరమైన కాలము”లలో వారు అనుభవిస్తున్న ఒత్తిడులకు అది ముగింపును కూడా సూచిస్తుంది.​—⁠2 తిమోతి 3: 1.

2 అయితే, యెహోవా దినము నీతిమంతులకు ఉపశమనాన్ని తీసుకురావడమే కాక “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని” నాశనాన్ని కూడా తీసుకువస్తుంది. (2 థెస్సలొనీకయులు 1: 6-8) ఇది మనం గంభీరంగా ఆలోచించేలా చేస్తుంది. దేవుడు నిజంగా, తన ప్రజలను వేదనభరితమైన పరిస్థితుల నుండి రక్షించడానికే దుష్టులను నాశనం చేస్తాడా? అంతకంటే ఎంతో సమున్నతమైన అంశం ఇమిడివుందని యెషయా 63 వ అధ్యాయం చూపిస్తోంది అదే, దేవుని పేరును పరిశుద్ధపరచడం.

విజయవంతుడైన యోధుడు వస్తున్నాడు

3, 4. (ఎ) యెషయా 63 వ అధ్యాయంలోని ప్రవచన సందర్భం ఏమిటి? (బి) యెరూషలేము వైపుకు ఎవరు వస్తున్నట్లు యెషయా చూస్తాడు, ఆయన ఎవరని కొంతమంది పండితులు భావిస్తున్నారు?

3యెషయా 62 వ అధ్యాయంలో, యూదులు బబులోను చెర నుండి విడుదల చేయబడి తమ స్వదేశానికి తిరిగి రావడాన్ని గురించి మనం చదివాము. సహజంగానే, ఈ ప్రశ్న తలెత్తుతుంది: ఇతర శత్రు జనములు మళ్ళీ నాశనం చేస్తారని పునఃస్థాపించబడిన యూదుల శేషము భయపడవలసిన అవసరం ఉందా? వారి భయాన్ని పోగొట్టడానికి యెషయా దర్శనం ఎంతో దోహదపడుతుంది. ఆ ప్రవచనం ఇలా ప్రారంభమవుతోంది: “రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవడు?”​—యెషయా 63: 1ఎ.

4 యెరూషలేమువైపుకు వస్తున్న శక్తివంతుడైన, విజయవంతుడైన యోధుడ్ని యెషయా చూస్తున్నాడు. ఆయన ధరించిన మహిమాన్వితమైన వస్త్రాలు ఆయన అత్యున్నతమైన స్థానానికి చెందినవాడని సూచిస్తున్నాయి. ఆయన శత్రురాజ్యమైన ఎదోము యొక్క అత్యంత ప్రముఖ నగరమైన బొస్రా దిశ నుండి రావడం, ఆయన ఆ దేశంపై గొప్ప విజయం సాధించాడని సూచిస్తుంది. ఈ యోధుడు ఎవరై ఉండవచ్చు? కొంతమంది పండితులు ఆయన యేసుక్రీస్తు అని భావిస్తున్నారు. ఆయన యూదా సైనిక నాయకుడైన జూడాస్‌ మక్కబీస్‌ అని ఇతరులు నమ్ముతున్నారు. అయితే, ఆ యోధుడు తన గుర్తింపును తానే సూచిస్తూ ఆ పై ప్రశ్నకు ఇలా సమాధానం ఇస్తున్నాడు: “నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.”​—యెషయా 63:1బి.

5. యెషయా చూసిన యోధుడు ఎవరు, మీరెందుకలా సమాధానం ఇస్తారు?

5 ఈ యోధుడు యెహోవా దేవుడే అనేదానిలో ఎలాంటి సందేహం లేదు. మరోచోట, ఆయన “అధికశక్తి” ఉన్నవాడనీ, “న్యాయమైన సంగతులు చెప్పు”వాడనీ వర్ణించబడుతున్నాడు. (యెషయా 40:​26; 45:​19, 23) యోధుని మహిమాన్వితమైన వస్త్రాలు మనకు కీర్తనకర్త వ్రాసిన ఈ మాటలను గుర్తుచేస్తాయి: “యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించినవాడవు. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు.” (కీర్తన 104: 1) యెహోవా ప్రేమాస్వరూపియైన దేవుడే అయినప్పటికీ అవసరమైనప్పుడు ఆయన యోధుని పాత్రను నిర్వహిస్తాడని బైబిలు చూపిస్తోంది.​—⁠యెషయా 34: 2; 1 యోహాను 4:​16.

6. యెహోవా ఎదోములో జరిగిన యుద్ధం నుండి ఎందుకు తిరిగి వస్తున్నాడు?

6 అయితే, యెహోవా ఎదోములో జరిగిన యుద్ధం నుండి ఎందుకు తిరిగి వస్తున్నాడు? తమ పితరుడైన ఏశావుతో ప్రారంభమైన శత్రుత్వాన్ని కొనసాగిస్తున్న ఎదోమీయులు దేవుని నిబంధన ప్రజలకు ప్రాచీనకాలం నుండి శత్రువులు. (ఆదికాండము 25:​24-34; సంఖ్యాకాండము 20:​14-21) యూదాపట్ల ఎదోముకు ఎంత ద్వేషం ఉందో, యెరూషలేము నాశనం సమయంలో బబులోను సైనికులను ప్రోత్సహిస్తూ ఎదోమీయులు కేకలు వేసినప్పుడు ప్రాముఖ్యంగా స్పష్టమయ్యింది. (కీర్తన 137: 7) యెహోవా అలాంటి శత్రుత్వాన్ని, వ్యక్తిగతంగా తనను బాధపెట్టినట్లుగా పరిగణిస్తాడు. ఆయన ఎదోముపైకి తన ప్రతీకార ఖడ్గాన్ని దూయడానికి నిశ్చయించుకున్నాడంటే అందులో ఆశ్చర్యం లేదు.​—⁠యెషయా 34:​5-15; యిర్మీయా 49:​7-22.

7. (ఎ) ఎదోముకు వ్యతిరేకంగా చేయబడిన ప్రవచనం ప్రాథమికంగా ఎలా నెరవేరింది? (బి) ఎదోము దేనికి ప్రతీకగా ఉంది?

7 అందుకే యెషయా దర్శనం యెరూషలేముకు తిరిగివస్తున్న యూదులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అది వారు తమ క్రొత్త గృహంలో సురక్షితంగా నివసిస్తారని హామీ ఇస్తుంది. వాస్తవానికి, మలాకీ ప్రవక్త కాలానికల్లా, దేవుడు ఎదోము “పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు” చేశాడు. (మలాకీ 1: 3) అంటే యెషయా ప్రవచనం మలాకీ కాలాని కల్లా పూర్తిగా నెరవేరిందని దాని భావమా? కాదు, ఎందుకంటే ఎదోము పాడైన స్థితిలో విడువబడి ఉన్నప్పటికీ, నాశనం చేయబడిన తన స్థలాలను అది పునర్నిర్మించుకోవడానికి నిశ్చయించుకుంది, మలాకీ ఎదోమును “భక్తిహీనుల ప్రదేశమని” మరియు “యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులని” పిలవడం కొనసాగించాడు. a (మలాకీ 1:​4, 5) అయితే, ప్రవచనార్థకంగా ఎదోము సూచిస్తున్నది కేవలం ఏశావు వంశీకులను మాత్రమే కాదు. అది, తమను తాము యెహోవా ఆరాధకుల శత్రువులుగా నిరూపించుకునే అన్ని జనములకు ప్రతీకగా పనిచేస్తుంది. ఈ విషయంలో ప్రాముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్య దేశాలు ప్రధానమైనవిగా ఉన్నాయి. ఈ ఆధునిక దిన ఎదోముకు ఏమి జరుగుతుంది?

ద్రాక్షగానుగ

8, 9. (ఎ) యెషయా చూసిన యోధుడు ఏ పనిలో నిమగ్నుడయ్యాడు? (బి) సూచనార్థక ద్రాక్షగానుగ ఎప్పుడు, ఎలా త్రొక్కబడుతుంది?

8 తిరిగివస్తున్న యోధుడ్ని యెషయా ఇలా అడుగుతాడు: “నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్నవేమి?” యెహోవా ఇలా సమాధానమిస్తాడు: “ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే.”​—యెషయా 63: 2, 3.

9 ఈ స్పష్టమైన పదాలు రక్తపాతాన్ని వర్ణిస్తున్నాయి. అంతెందుకు, చివరికి దేవుని దివ్యమైన వస్త్రాలు సహితం ద్రాక్షగానుగ త్రొక్కేవారి బట్టల్లా డాగులయ్యాయి! యెహోవా దేవుడు తన శత్రువులను నాశనం చేయడానికి కదిలినప్పుడు వారు తాము ఏ స్థితిలో అయితే ఇరుక్కుపోయినట్లు కనుగొంటారో ఆ స్థితికి, ద్రాక్షగానుగ సరైన ప్రతీకగా ఉంది. ఈ సూచనార్థక ద్రాక్షగానుగ ఎప్పుడు త్రొక్కబడుతుంది? యోవేలు, అపొస్తలుడైన యోహానుల ప్రవచనాలు కూడా ఒక సూచనార్థక ద్రాక్షగానుగ గురించి మాట్లాడుతున్నాయి. యెహోవా అర్మగిద్దోనులో తన శత్రువులు నాశనమయ్యేలా వారిని త్రొక్కినప్పుడు ఆ ప్రవచనాల్లోని ద్రాక్షగానుగ త్రొక్కబడుతుంది. (యోవేలు 3:​13; ప్రకటన 14:​18-20; 16:​15) యెషయా చెబుతున్న ప్రవచనార్థక ద్రాక్షగానుగ అదే సమయాన్ని సూచిస్తుంది.

10. ద్రాక్షగానుగను తానే ఒంటరిగా త్రొక్కానని యెహోవా ఎందుకు చెబుతున్నాడు?

10 అయితే, తాను ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కాననీ, జనములలో ఎవడును తనతోకూడ ఉండలేదనీ యెహోవా ఎందుకు చెబుతున్నాడు? దేవుని ప్రతినిధిగా యేసుక్రీస్తు ద్రాక్షగానుగను త్రొక్కడంలో నాయకత్వం వహించడా? (ప్రకటన 19:​11-16) అవును, కానీ యెహోవా ఇక్కడ చెబుతున్నది మానవుల గురించే గానీ ఆత్మ ప్రాణులను గురించి కాదు. భూమిపై నుండి సాతాను అనుచరులను నిర్మూలించే పనిని సాధించడానికి ఏ మానవుడూ సమర్థుడు కాదని ఆయన అంటున్నాడు. (యెషయా 59:​15, 16) వారు పూర్తిగా నలుగగొట్టబడే వరకూ వారిని తన ఆగ్రహంతో త్రొక్కుతూ ఉండడమన్నది సర్వశక్తిమంతుడైన దేవునికే చెందుతుంది.

11. (ఎ) యెహోవా “పగతీర్చుకొను దినము”ను ఎందుకు తీసుకువస్తాడు? (బి) ‘విమోచించబడినవారు’ ప్రాచీన కాలాల్లో ఎవరు, నేడు ఎవరు?

11 యెహోవా ఈ కార్యాన్ని తాను వ్యక్తిగతంగా ఎందుకు చేశాననేదాన్ని, ఇలా చెబుతూ మరింతగా వివరిస్తున్నాడు: ‘పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తిచేయదగిన [“విమోచించబడినవారి,” NW] సంవత్సరము వచ్చియుండెను.’ (యెషయా 63: 4) b తన ప్రజలకు హాని చేసేవారిపై పగతీర్చుకునే హక్కు యెహోవాకు మాత్రమే ఉంది. (ద్వితీయోపదేశకాండము 32:​35) ప్రాచీన కాలాల్లో ‘విమోచించబడినవారు,’ బబులోనీయుల చేతుల్లో బాధలు అనుభవించిన యూదులు. (యెషయా 35: 9; 43: 1; 48:​20) ఆధునిక కాలాల్లో వారు అభిషిక్త శేషము. (ప్రకటన 12:​17) తమ ప్రాచీన ప్రతిరూపాల్లాగే, వారు మతసంబంధమైన చెర నుండి విమోచించబడ్డారు. ఆ యూదుల్లాగే, అభిషిక్తులు తమ “వేరే గొఱ్ఱెల” సహచరులతోపాటు హింసకు, వ్యతిరేకతకు బలి అయ్యారు. (యోహాను 10:​16) కాబట్టి యెషయా ప్రవచనం, దేవుని నియమిత సమయంలో ఆయన వారి పక్షాన జోక్యం చేసుకుంటాడని నేడు క్రైస్తవులకు హామీ ఇస్తోంది.

12, 13. (ఎ) యెహోవాకు సహాయం చేసేవారెవరూ లేరన్నది ఏ విధంగా? (బి) యెహోవా బాహువు రక్షణను ఎలా తీసుకువస్తుంది, ఆయన ఉగ్రత ఆయనను ఎలా సమర్థిస్తుంది?

12 యెహోవా ఇలా కొనసాగిస్తున్నాడు: “నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను; ఆదరించువాడెవడును లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకాధారమాయెను. కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని, ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని, వారి రక్తమును నేల పోసివేసితిని.”​—యెషయా 63: 5, 6.

13 యెహోవా పగతీర్చుకొను గొప్ప దినానికి తాము సహాయపడినట్లు ఏ మానవుడూ చెప్పుకోలేడు. తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి యెహోవా ఏ మానవునిపైనా ఆధారపడడు. c ఆ కార్యాన్ని సాధించడానికి, అపారమైన శక్తిగల ఆయన బలమైన బాహువు చాలు. (కీర్తన 44: 3; 98: 1; యిర్మీయా 27: 5) అంతేగాక ఆయన ఉగ్రత ఆయనను సమర్థిస్తుంది. ఎలా? ఎలాగంటే, దేవుని ఉగ్రత అదుపులేని భావోద్రేకం కాదు గానీ నీతియుక్తమైన ఆగ్రహం. యెహోవా ఎల్లప్పుడూ నీతియుక్తమైన సూత్రాలకు అనుగుణంగా చర్య తీసుకుంటాడు గనుక, తన శత్రువులకు అవమానము, అపజయము కలిగేలా వారి “రక్తమును నేల” పోయడంలో ఆయన ఉగ్రత ఆయనను సమర్థించి, పురికొల్పుతుంది.​—⁠కీర్తన 75: 8; యెషయా 25:​10; 26: 5.

యెహోవా కృపాతిశయము

14. యెషయా ఇప్పుడు ఏ సముచితమైన జ్ఞాపికలను ఇస్తున్నాడు?

14 గతకాలాల్లో, యూదులు యెహోవా తమ పక్షాన చేసిన వాటి పట్ల కృతజ్ఞత లేకుండా అయ్యారు. కాబట్టి సముచితంగానే, యెహోవా అలాంటి కార్యాలు ఎందుకు చేశాడనేది యెషయా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమునుబట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.​—⁠[“నిశ్చయంగా,” NW] వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని, ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.’​—యెషయా 63:​7-9.

15. యెహోవా ఐగుప్తులో అబ్రాహాము సంతానానికి ఎలా, ఎందుకు కృపాతిశయము చూపించాడు?

15 కృపాతిశయమును లేదా యథార్థమైన ప్రేమను చూపించడంలో యెహోవా ఎంత విశేషమైన మాదిరిని ఉంచుతున్నాడో కదా! (కీర్తన 36: 7; 62:​12) యెహోవా అబ్రాహాముతో ప్రేమపూర్వకమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. (మీకా 7:​20) ఆ పితరుని సంతానము మూలంగా భూలోకములోని జనములన్నీ ఆశీర్వదించబడతాయని యెహోవా ఆయనకు వాగ్దానం చేశాడు. (ఆదికాండము 22:​17, 18) యెహోవా ఇశ్రాయేలు ఇంటివారిపట్ల అపారమైన మంచితనాన్ని చూపించి ఆ వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు. అబ్రాహాము సంతానాన్ని ఐగుప్తులోని దాసత్వం నుండి తప్పించడమన్నది ఆయన చేసిన యథార్థ కార్యములలో విశేషమైనది.​—⁠నిర్గమకాండము 14:​30.

16. (ఎ) యెహోవా ఇశ్రాయేలుతో నిబంధన చేసినప్పుడు ఆయనకు ఏ దృక్కోణం ఉంది? (బి) దేవుడు తన ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నాడు?

16 నిర్గమనం తర్వాత, యెహోవా ఇశ్రాయేలును సీనాయి పర్వతం వద్దకు తీసుకుని వచ్చి, “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు . . . నాకు స్వకీయ సంపాద్యమగుదురు. . . . మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని” వారికి వాగ్దానం చేశాడు. (నిర్గమకాండము 19:​5, 6) ఈ ప్రతిపాదన చేయడంలో యెహోవా ఏమైనా మోసకరంగా ఉన్నాడా? లేదు, ఎందుకంటే “నిశ్చయంగా వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు” యెహోవా తనకు తాను అనుకున్నాడని యెషయా వెల్లడిచేస్తున్నాడు. ఒక పండితుడు ఇలా పేర్కొంటున్నాడు: “ఈ లేఖనంలో ‘నిశ్చయంగా’ అన్న పదం ఉపయోగించబడినది, ఆ ఆజ్ఞను జారీ చేసింది సర్వాధిపత్యంగల యెహోవా అయినందువల్ల కాదు లేదా తన ప్రజల గురించి ముందే తెలుసుకునేందుకు ఆయనకు సామర్థ్యం ఉన్నందువల్ల కాదు: ఆయనకు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను బట్టి వారి మీద ఆయనకు ఆశ, నమ్మకం ఉన్నాయి గనుకనే.” అవును, యెహోవా తన ప్రజలు విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మంచి నమ్మకంతో తన నిబంధనను చేశాడు. వారి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆయన వారి మీద నమ్మకం ఉంచాడు. తన ఆరాధకులపై అలాంటి నమ్మకాన్ని ఉంచే దేవుడ్ని ఆరాధించడం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! పెద్దలు నేడు, దేవుని ప్రజల్లో ఉన్న ప్రాథమికమైన మంచితనంలో అలాంటి నమ్మకాన్ని చూపించినప్పుడు, తమకు అప్పగించబడిన వారిని బలపర్చడానికి వారు ఎంతగానో దోహదపడగలుగుతారు.​—⁠2 థెస్సలొనీకయులు 3: 4; హెబ్రీయులు 6:​9, 10.

17. (ఎ) యెహోవా ఇశ్రాయేలీయుల పట్ల తనకున్న ప్రేమకు ఏమి నిదర్శనాన్ని ఇచ్చాడు? (బి) నేడు మనం ఏ నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు?

17 అయినప్పటికీ, ఇశ్రాయేలీయుల గురించి కీర్తనకర్త ఇలా చెబుతున్నాడు: ‘వారు ఐగుప్తులో గొప్ప కార్యములు చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.’ (కీర్తన 106:​21, 22) వారి అవిధేయమైన, లోబడనొల్లని దృక్పథం మూలంగా వారు తరచూ నాశనకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. (ద్వితీయోపదేశకాండము 9: 6) యెహోవా వారిపట్ల కృపాతిశయము చూపించడం మానేశాడా? లేదుగానీ “వారి యావద్బాధలో ఆయన బాధనొందెను” అని యెషయా చెబుతున్నాడు. యెహోవాకు ఎంత తదనుభూతి ఉందోకదా! తన పిల్లలు తమ స్వంత మూర్ఖత్వం వల్లనే అయినప్పటికీ బాధను అనుభవిస్తుంటే చూడడం, ఏ ప్రేమగల తండ్రికైనా ఎలా బాధ కలిగిస్తుందో అలాగే దేవునికి కూడా బాధకలిగించింది. ప్రవచించబడినట్లుగా, ఆయన ప్రేమకు నిదర్శనంగా, వారిని వాగ్దాన దేశంలోకి నడిపించడానికి ఆయన తన “సన్నిధి దూత”ను, అంటే బహుశా మానవునిగా రాక మునుపటి యేసును పంపించాడు. (నిర్గమకాండము 23:​20) అలా యెహోవా, “మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు” ఆ జనమును ఎత్తికొని మోశాడు. (ద్వితీయోపదేశకాండము 1:​31; కీర్తన 106:​10) యెహోవాకు మన బాధల గురించి కూడా తెలుసుననీ, మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మనలను అర్థం చేసుకుంటాడనీ నేడు మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు. ‘ఆయన మన గురించి చింతిస్తున్నాడు గనుక’ మనం సంపూర్ణ నిశ్చయతతో ‘మన చింత యావత్తు ఆయనమీద వేయవచ్చు.’​—⁠1 పేతురు 5: 7.

దేవుడు విరోధి అవుతాడు

18. యెహోవా తన ప్రజలకు ఎందుకు విరోధి అయ్యాడు?

18 అయితే, దేవుని కృపాతిశయమును మనం తేలికగా తీసుకోకూడదు. యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “వారు తిరుగుబాటుచేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను. తానే వారితో యుద్ధము చేసెను.” (యెషయా 63:​10) యెహోవా తాను కనికరము, దయ గల దేవుడే అయినప్పటికీ ‘దోషులను నిర్దోషులుగా ఏమాత్రము ఎంచనని’ హెచ్చరించాడు. (నిర్గమకాండము 34:​6, 7) ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తూనే ఉండడం ద్వారా తమను తాము శిక్షకు పాత్రులనుగా చేసుకున్నారు. మోషే వారికిలా గుర్తుచేశాడు: “అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని . . . మరువవద్దు. నీవు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిన దినము మొదలుకొని యీ స్థలమందు మీరు ప్రవేశించువరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి.” (ద్వితీయోపదేశకాండము 9: 7) దేవుని ఆత్మ యొక్క ఆరోగ్యదాయకమైన ప్రభావాలను ఎదిరించడం ద్వారా, వారు దానిని దుఃఖపరిచారు. (ఎఫెసీయులు 4:​30) వారు యెహోవా తమ విరోధి అయ్యేలా ఆయనను బలవంతపెట్టారు.​—⁠లేవీయకాండము 26:​17; ద్వితీయోపదేశకాండము 28:​63.

19, 20. యూదులు ఏ విషయాలు గుర్తు చేసుకుంటారు, ఎందుకు?

19 కొంతమంది యూదులు తాము దుఃఖంలో ఉన్నప్పుడు గతం గురించి తలంచేలా కదిలించబడ్డారు. యెషయా ఇలా చెబుతున్నాడు: “అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చినవాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతివైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించినవాడేడి? యనుకొనిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు, యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను.”​—యెషయా 63:11-14ఎ.

20 అవును, అవిధేయతా పర్యవసానాలను అనుభవించిన యూదులు యెహోవా తమ విరోధిగా కాక తమ విమోచకునిగా ఉన్న దినాలకోసం ఎంతగానో ఆశిస్తారు. తమ “మందకాపరు”లైన మోషే అహరోనులు తమను ఎఱ్ఱ సముద్రము గుండా ఎలా సురక్షితంగా నడిపించారో వారు గుర్తు చేసుకుంటారు. (కీర్తన 77:​20; యెషయా 51:​10) దేవుని ఆత్మను దుఃఖపరిచే బదులు, మోషే మరియు ఆత్మచే నియమించబడిన ఇతర పెద్దలు ఇచ్చిన నిర్దేశం ప్రకారం తాము దేవుని ఆత్మచేత నడిపించబడిన సమయాన్ని వారు గుర్తు చేసుకుంటారు. (సంఖ్యాకాండము 11:​16, 17) యెహోవా యొక్క ‘మహిమగల’ బలమైన ‘బాహువు’ మోషే ద్వారా తమ పక్షాన ఉపయోగించబడడాన్ని తాము చూడడాన్ని కూడా వారు గుర్తు తెచ్చుకుంటారు! కొంతకాలానికి, దేవుడు వారిని భయంగొలిపే మహారణ్యం నుండి బయటికి తీసుకువచ్చి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, నెమ్మదిగల స్థలానికి నడిపించాడు. (ద్వితీయోపదేశకాండము 1:​19; యెహోషువ 5: 6; 22: 4) అయితే ఇప్పుడు, దేవునితో తమకుగల అనుగ్రహ సంబంధాన్ని పోగొట్టుకున్నందుకు ఇశ్రాయేలీయులు బాధలు అనుభవిస్తున్నారు!

‘తన కోసం ఒక ఘనమైన పేరు’

21. (ఎ) దేవుని పేరుకు సంబంధించి ఇశ్రాయేలు ఏ గొప్ప ఆధిక్యతను కలిగి ఉండగలిగేది? (బి) దేవుడు తాను అబ్రాహాము వంశీయులను ఐగుప్తు నుండి విడుదల చేయడానికి గల ప్రాథమిక కారణం ఏమిటి?

21 అయినప్పటికీ ఇశ్రాయేలీయులు, దేవుని పేరును మహిమపరచడంలో భాగం వహించడమనే తమకున్న ఆధిక్యతను పోగొట్టుకోవడం వల్ల వచ్చిన నష్టంతో పోలిస్తే వారు అనుభవించిన వస్తుపరమైన నష్టం చాలా స్వల్పమైనది. మోషే యూదులకు ఇలా వాగ్దానం చేశాడు: “నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠితజనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు.” (ద్వితీయోపదేశకాండము 28:​9, 10) యెహోవా అబ్రాహాము వంశీయులను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి వారిని కాపాడడానికి చర్య తీసుకున్నప్పుడు, ఆయనలా చేసింది కేవలం వారికి జీవితం మరింత సౌకర్యవంతంగా లేక ఆహ్లాదకరంగా ఉండేలా చేయడానికి మాత్రమే కాదు. ఆయన ఇంకా ఎంతో ప్రాముఖ్యమైన దాని కోసం అంటే తన పేరు కోసం చర్య తీసుకుంటున్నాడు. అవును, ఆయన తన పేరు “భూలోకమందంతట . . . ప్రచురము” చేయబడేలా నిశ్చయపరచుకుంటున్నాడు. (నిర్గమకాండము 9:​15, 16) ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరుగుబాటు చేసిన తర్వాత వారిపట్ల దేవుడు కనికరం చూపించడానికి కారణం కేవలం భావావేశం కాదు. “అన్యజనులయెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు” చేసితిని అని యెహోవా తానే చెబుతున్నాడు.​—⁠యెహెజ్కేలు 20:​8-10.

22. (ఎ) భవిష్యత్తులో, దేవుడు మరోసారి తన ప్రజల పక్షాన ఎందుకు పోరాడతాడు? (బి) దేవుని పేరంటే మనకున్న ప్రేమ మన చర్యలను ఏ యే విధాలుగా ప్రభావితం చేస్తుంది?

22 తర్వాత యెషయా ఈ ప్రవచనానికి ఎంత శక్తివంతమైన ముగింపును ఇస్తున్నాడో కదా! ఆయనిలా అంటున్నాడు: “నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి.” (యెషయా 63:14బి) యెహోవా తన ప్రజల ఆసక్తుల కోసం శక్తివంతంగా ఎందుకు పోరాడుతాడో ఇప్పుడు స్పష్టమవుతోంది. తన కోసం ఘనమైన పేరును కలుగజేసుకోవడానికే. కాబట్టి యెషయా ప్రవచనం, యెహోవా పేరును ధరించడం అద్భుతమైన ఆధిక్యత, గొప్ప బాధ్యత అనేదానికి శక్తివంతమైన జ్ఞాపికగా పనిచేస్తుంది. నిజ క్రైస్తవులు నేడు యెహోవా పేరును తమ స్వంత జీవితాల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. (యెషయా 56: 6; హెబ్రీయులు 6:​10) ఆ పరిశుద్ధమైన పేరుపైకి నిందను తీసుకురాగలదేదైనా దాన్ని చేయడాన్ని వారు అసహ్యించుకుంటారు. వారు దేవుని పట్ల యథార్థంగా ఉండడం ద్వారా ఆయన యథార్థమైన ప్రేమకు ప్రతిస్పందిస్తారు. వారు యెహోవా ఘనమైన పేరును ప్రేమిస్తారు గనుక ఆయన తన శత్రువులను తన ఉగ్రత అనే ద్రాక్షగానుగలో త్రొక్కే దినము కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తారు, వారలా ఎదురు చూడడానికి కారణం, అది వారికి ప్రయోజనం చేకూరుస్తుందన్నదే కాదు గానీ అది తాము ప్రేమించే దేవుని పేరు మహిమపరచబడడానికి నడిపిస్తుందన్నది కూడా ఒక కారణమే.​—⁠మత్తయి 6: 9.

[అధస్సూచీలు]

a సా.శ. మొదటి శతాబ్దానికి చెందిన హేరోదులు ఎదోమీయులు.

b “విమోచించబడినవారి సంవత్సరము” అనే పదాలు “పగతీర్చుకొను దినము” అనే పదాలు సూచిస్తున్న కాలాన్నే సూచించవచ్చు. దీనికి సాదృశ్యంగా యెషయా 34:8 లో అటువంటి పదాలే ఎలా ఉపయోగించబడ్డాయో గమనించండి.

c ఎవరూ తనను ఆదరించలేదని యెహోవా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. యేసు మరణించిన దాదాపు 2,000 సంవత్సరాల తర్వాత, మానవజాతిలోని శక్తివంతులు ఇప్పటికీ దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నారన్నది నిశ్చయంగా ఆశ్చర్యకరమైనదిగా తలంచబడవచ్చు.​—⁠కీర్తన 2:​2-12; యెషయా 59:​16.

[అధ్యయన ప్రశ్నలు]

[359 వ పేజీలోని చిత్రం]

యెహోవా తన ప్రజలపై చాలా ఉన్నతమైన ఆశలు పెట్టుకున్నాడు