కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీరు నాకు సాక్షులు’!

‘మీరు నాకు సాక్షులు’!

నాలుగవ అధ్యాయం

‘మీరు నాకు సాక్షులు’!

యెషయా 43:​1-28

1. యెహోవా ప్రవచనాన్ని ఎలా ఉపయోగించుకుంటాడు, నెరవేరిన ప్రవచనానికి ఆయన ప్రజలు ఎలా ప్రతిస్పందించాలి?

 భవిష్యత్తును ముందుగా తెలియజేసే సామర్థ్యం, అబద్ధ దేవుళ్ళందరి నుండి సత్య దేవుడ్ని ప్రత్యేకపరిచే విషయాల్లో ఒకటి. కానీ యెహోవా ప్రవచించేటప్పుడు, తన దైవత్వాన్ని నిరూపించుకోవడం కంటే ఎక్కువే మనస్సులో ఉంచుకుంటాడు. యెషయా 43 వ అధ్యాయంలో ప్రదర్శించబడినట్లుగా, యెహోవా తన దైవత్వానికి, తన నిబంధన ప్రజలపట్ల తనకున్న ప్రేమకు ప్రవచనాన్ని సాక్ష్యాధారంగా ఉపయోగించుకుంటాడు. ఇక ఆయన ప్రజలు, నెరవేరిన ప్రవచనాన్ని గ్రహించి, అలాగే నోరుమెదపకుండా ఉండిపోకూడదు; తాము చూసినవాటి గురించి వారు సాక్ష్యమివ్వాలి. అవును, వారు యెహోవాకు సాక్షులుగా ఉండాలి!

2. (ఎ) యెషయా కాలంలో ఇశ్రాయేలు ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? (బి) యెహోవా తన ప్రజల కళ్ళను ఎలా తెరుస్తాడు?

2 విషాదకరంగా, యెషయా కాలానికల్లా ఇశ్రాయేలు ఎంత శోచనీయమైన స్థితిలో ఉందంటే, యెహోవా ఆ ప్రజలను ఆధ్యాత్మిక వికలాంగులుగా పరిగణిస్తాడు. “కన్నులుండి అంధులైనవారిని, చెవులుండి బధిరులైన వారిని తీసికొని రండి.” (యెషయా 43: 8) ఆధ్యాత్మికంగా అంధులు, బధిరులు అయిన ప్రజలు యెహోవాకు సజీవమైన సాక్షులుగా ఎలా సేవచేయగలరు? ఒకే ఒక మార్గం ఉంది. వారి కన్నులు, చెవులు అద్భుతరీతిగా తెరువబడాలి. యెహోవాయే వాటిని ఖచ్చితంగా తెరుస్తాడు! ఎలా? మొదటిగా, వారికి తీవ్రంగా క్రమశిక్షణనిస్తాడు అంటే, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు నివాసులు సా.శ.పూ. 740 లోనూ యూదా నివాసులు సా.శ.పూ. 607 లోనూ బంధీలుగా తీసుకువెళ్ళబడతారు. ఆ తర్వాత, యెహోవా తన ప్రజలను విడుదల చేసి, ఆధ్యాత్మికంగా నూతనోత్తేజాన్ని పొందిన పశ్చాత్తప్తులైన శేషమును సా.శ.పూ. 537 లో తమ స్వదేశానికి తీసుకురావడం ద్వారా వారి పక్షాన శక్తివంతంగా చర్య తీసుకుంటాడు. వాస్తవానికి, ఈ విషయంలో తన సంకల్పం నిరాటంకంగా నెరవేరుతుందని యెహోవా ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, ఆయన దాదాపు 200 సంవత్సరాల పూర్వమే ఇశ్రాయేలు విడుదల చేయబడినట్లుగా మాట్లాడుతున్నాడు.

3. భవిష్యత్తులో చెరగా కొనిపోబడే వారికి యెహోవా ఏ ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు?

3“యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము. పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును; నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను.”​—యెషయా 43:​1-3ఎ.

4. యెహోవా ఏ విధంగా ఇశ్రాయేలు సృష్టికర్త, తన ప్రజలు తమ స్వదేశానికి తిరిగి రావడం గురించి ఆయన వారికి ఏమని హామీ ఇచ్చాడు?

4 యెహోవాకు ఇశ్రాయేలు పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది, ఎందుకంటే ఆ జనము ఆయనకు చెందినది. అబ్రాహాముతో చేసిన నిబంధన నెరవేర్పుగా ఆయన తానే స్వయంగా దాన్ని సృష్టించుకున్నాడు. (ఆదికాండము 12:​1-3) అందుకే కీర్తన 100:3 ఇలా చెబుతోంది: “యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.” ఇశ్రాయేలు సృష్టికర్తగా, విమోచకునిగా యెహోవా తన ప్రజలను సురక్షితంగా వారి స్వదేశానికి తీసుకువస్తాడు. నీళ్ళు, పొంగిపొర్లే నదులు, మల మల మాడ్చే ఎడారులు వంటి ఆటంకాలేవీ వారిని ఆపవు లేదా వారికి హాని చేయవు, ఇదే విధంగా, వెయ్యి సంవత్సరాల క్రితం వారి పితరులు వాగ్దాన దేశానికి ప్రయాణిస్తుండగా ఇలాంటివేవీ వారిని ఆపలేకపోయాయి.

5. (ఎ) ఆధ్యాత్మిక ఇశ్రాయేలును యెహోవా మాటలు ఎలా ఓదారుస్తాయి? (బి) ఆధ్యాత్మిక ఇశ్రాయేలు యొక్క సహవాసులు ఎవరు, వీరికి ఎవరు పూర్వఛాయగా ఉన్నారు?

5 ఆధునిక దిన ఆధ్యాత్మిక ఇశ్రాయేలు శేషమునకు కూడా యెహోవా మాటలు ఓదార్పునిస్తాయి, దాని సభ్యులు ఆత్మాభిషిక్త “నూతన సృష్టి.” (2 కొరింథీయులు 5:​17) మానవజాతి అనే “జలముల” ఎదుట ధైర్యంగా నిలబడిన వీరు సాదృశ్యమైన తుఫానుల సమయంలో దేవుని ప్రేమపూర్వకమైన కాపుదలను అనుభవించారు. తమ శత్రువుల నుండి వస్తున్న అగ్ని వారికి హాని చేయలేదు గానీ, వారిని శుద్ధీకరించడానికి దోహదపడింది. (జెకర్యా 13: 9; ప్రకటన 12:​15-17) దేవుని ఆధ్యాత్మిక జనముతో కలిసిన “వేరే గొఱ్ఱెల”కు చెందిన “గొప్ప సమూహము”కు కూడా యెహోవా కాపుదల ఇవ్వబడింది. (ప్రకటన 7: 9; యోహాను 10:​16) ఇశ్రాయేలీయులతో పాటు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన “అనేకులైన అన్యజనుల సమూహము,” విడుదల చేయబడిన బంధీలతోపాటు బబులోను నుండి తిరిగివచ్చిన యూదేతరులు వీరికి పూర్వఛాయగా ఉన్నారు.​—⁠నిర్గమకాండము 12:​38; ఎజ్రా 2: 1, 43, 55, 58.

6. (ఎ) శారీరక ఇశ్రాయేలుకు బదులుగా విమోచన క్రయధనమును చెల్లించడంలోనూ (బి) ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు బదులుగా విమోచన క్రయధనమును చెల్లించడంలోనూ తాను న్యాయముగల దేవుడనని యెహోవా ఎలా నిరూపించుకున్నాడు?

6 మాదీయ పారసీక సైన్యాల ద్వారా తన ప్రజలను బబులోను నుండి విడుదల చేస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. (యెషయా 13:​17-19; యెషయా 21:​2, 9; యెషయా 44:​28; దానియేలు 5:​27) న్యాయముగల దేవునిగా యెహోవా తన మాదీయ-పారసీక “సేవకులకు,” ఇశ్రాయేలుకు బదులుగా తగిన విమోచన క్రయధనాన్ని చెల్లిస్తాడు. ‘నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను, నీకు బదులుగా కూషును [“ఇతియోపియాను,” NW] సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను.’ (యిషయా 43:​3బి, 4) దేవుడు ముందే తెలియజేసినట్లుగానే పారసీక సామ్రాజ్యం ఐగుప్తును, ఇతియోపియాను, సమీపంలో ఉన్న సెబాను జయించిందని చరిత్ర ధృవీకరిస్తోంది. (సామెతలు 21:​18) అలాగే యెహోవా 1919 లో యేసుక్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక ఇశ్రాయేలు శేషమును చెర నుండి విడిపించాడు. అయితే, అందుకు ప్రతిగా యేసుకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన అన్య పరిపాలకుడు కాదు. ఆయన తన సొంత ఆధ్యాత్మిక సహోదరులను విడుదల చేస్తున్నాడు. అంతేగాక, 1914 లో యెహోవా అప్పటికే ఆయనకు ‘జనములను స్వాస్థ్యముగాను, భూమిని దిగంతములవరకు సొత్తుగాను’ ఇచ్చాడు.​—⁠కీర్తన 2: 8.

7. ప్రాచీనకాలాల్లోనూ, ఆధునిక కాలాల్లోనూ యెహోవా తన ప్రజల పట్ల ఎలాంటి భావాలు కలిగివున్నాడు?

7 తిరిగి కొనబడిన బంధీల పట్ల యెహోవా తన వాత్సల్యపూరితమైన భావాలను బహిరంగంగా ఎలా వ్యక్తం చేస్తున్నాడో గమనించండి. వారు తనకు ‘ప్రియమైనవారని, ఘనులని,’ తాను వారిని ‘ప్రేమిస్తున్నానని’ ఆయన వారికి చెబుతున్నాడు. (యిర్మీయా 31: 3) ఆయన నేడు తన నమ్మకమైన సేవకులపట్ల కూడా అలాంటి భావాలనే, అంతకంటే ఎక్కువైన భావాలనే కలిగి ఉన్నాడు. అభిషిక్త క్రైస్తవులకు జననం ద్వారా కాదుగానీ తాము తమ సృష్టికర్తకు చేసుకున్న వ్యక్తిగత సమర్పణ తర్వాత దేవుని పరిశుద్ధాత్మ తమపై పనిచేయడంతో వారికి దేవునితో సంబంధం ఏర్పడింది. యెహోవా వారిని తనవద్దకు, తన కుమారునివద్దకు ఆకర్షించి, గ్రహణశక్తిగల వారి హృదయాలపై తన కట్టడలను సూత్రాలను వ్రాశాడు.​—⁠యిర్మీయా 31:​31-34; యోహాను 6:​44.

8. బంధీలకు యెహోవా ఎలా ధైర్యాన్నిస్తున్నాడు, వారు తమ విడుదల గురించి ఎలా భావిస్తారు?

8 బంధీలకు మరింతగా ధైర్యాన్నిస్తూ, యెహోవా ఇంకా ఇలా చెబుతున్నాడు: “భయపడకుము, నేను నీకు తోడైయున్నాను. తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము, నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.” (యెషయా 43:​5-7) తన కుమారులను, కుమార్తెలను విడుదల చేసి, వారిని తమ ప్రియమైన స్వదేశానికి తిరిగి తీసుకువచ్చే సమయం ఆసన్నమైనప్పుడు భూమియొక్క సుదూర ప్రాంతాలు సహితం యెహోవా చేరుకోలేనంత దూరంగా ఉండవు. (యిర్మీయా 30:​10, 11) వారి దృక్కోణం నుండి, జనాంగము మునుపు ఐగుప్తు నుండి విడుదల చేయబడిన దాని కన్నా ఈ విడుదల ఎక్కువ విలువైనదై ఉంటుందనడంలో సందేహం లేదు.​—⁠యిర్మీయా 16:​14, 15.

9. యెహోవా తన విడుదల కార్యాలను ఏ రెండు విధాలుగా తన నామమునకు జతచేస్తున్నాడు?

9 ఇశ్రాయేలువారు తన నామమున పిలువబడుతున్నారని తన ప్రజలకు గుర్తు చేయడం ద్వారా, వారిని విడుదల చేస్తానన్న తన వాగ్దానాన్ని యెహోవా ధృవీకరిస్తున్నాడు. (యెషయా 54:​5, 6) అంతకంటే ఎక్కువగా, విడుదల చేస్తానన్న తన వాగ్దానాలకు యెహోవా తన నామమును జత చేస్తున్నాడు. అలా చేయడంలో ఆయన తన ప్రవచన వాక్యం నెరవేరినప్పుడు తాను మహిమ పొందుతానని ఖచ్చితంగా చెబుతున్నాడు. సజీవుడైన అద్వితీయ దేవునికే చెందవలసిన ఘనత చివరికి బబులోనును జయించే వీరయోధుడు సహితం పొందలేడు.

విచారణలో దేవుళ్ళు

10. జనముల ఎదుట, వారి దేవుళ్ళ ఎదుట యెహోవా ఏ సవాలును ఉంచుతున్నాడు?

10 ఇశ్రాయేలీయులను విడుదల చేస్తానన్న తన వాగ్దానాన్ని యెహోవా ఇప్పుడు విశ్వ న్యాయస్థానంలోని వివాదానికి ఆధారంగా చేస్తున్నాడు, ఆ వివాదంలో ఆయన జనముల దేవుళ్ళను విచారణకు పిలుస్తున్నాడు. మనమిలా చదువుతాము: ‘సర్వజనులారా, గుంపుకూడి రండి, జనములు కూర్చబడవలెను. వారి [దేవుళ్ళలో] ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు [వారి దేవుళ్ళు] తమ సాక్షులను తేవలెను లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.’ (యిషయా 43: 9) ప్రపంచ జనముల ఎదుట యెహోవా భయంకరమైన సవాలును ఉంచుతున్నాడు. ఒక విధంగా, ఆయన ‘భవిష్యత్తును ఖచ్చితంగా ప్రవచించడం ద్వారా మీ దేవుళ్ళు, తాము దేవుళ్ళమని నిరూపించుకోవాలి’ అని అంటున్నాడు. కేవలం సత్య దేవుడు మాత్రమే ఖచ్చితంగా ప్రవచించగలడు గనుక, ఈ పరీక్ష మోసగాళ్ళనందరినీ బయటపెడుతుంది. (యెషయా 48: 5) సర్వశక్తిమంతుడు మరో చట్టబద్ధమైన నిబంధనను జత చేస్తున్నాడు: సత్య దేవుళ్ళమని చెప్పుకుంటున్న వాళ్ళంతా తమ ప్రవచనాలకూ, వాటి నెరవేర్పులకూ సాక్షులను ప్రవేశపెట్టాలి. సహజంగానే, ఈ చట్టబద్ధమైన అవసరత నుండి యెహోవా తనను తాను మినహాయించుకోడు.

11. యెహోవా తన సేవకునికి ఏ నియామకాన్ని ఇచ్చాడు, తన దైవత్వం గురించి ఏమి బయలుపరిచాడు?

11 అబద్ధ దేవుళ్ళు అశక్తులు గనుక వారు సాక్షులను ప్రవేశపెట్టలేరు. కాబట్టి, సాక్షులు నిలబడే బోను సిగ్గుకరమైన విధంగా ఖాళీగా ఉండిపోతుంది. ఇప్పుడు యెహోవా తన దైవత్వాన్ని నిరూపించుకునే సమయం వస్తుంది. తన ప్రజల వైపు చూస్తూ ఆయనిలా అంటాడు: “మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవతయు మీలో నుండియుండలేదు. నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; . . . ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు. నేను కార్యము చేయగా, త్రిప్పివేయువాడెవడు?”​—యెషయా 43:​10-13.

12, 13. (ఎ) యెహోవా ప్రజలు విస్తారమైన ఏ సాక్ష్యాధారాన్ని అందజేయాలి? (బి) ఆధునిక కాలాల్లో యెహోవా నామము ఎలా అగ్రస్థానానికి చేరుకుంది?

12 యెహోవా మాటలకు జవాబుగా, సాక్షులు నిలబడే బోను ఆనందభరితమైన సాక్షుల గుంపుతో నిండిపోతుంది. వారి సాక్ష్యం స్పష్టంగా, అనాక్షేపణీయంగా ఉంది. యెహోషువలాగే, ‘యెహోవా సెలవిచ్చిన మాటలన్నీ నిజమయ్యాయి. ఒక్కటియైనను తప్పిపోలేదు’ అని వారు సాక్ష్యమిస్తారు. (యెహోషువ 23:​14) యూదావారి చెరను, చెరనుండి వారి అద్భుతమైన విడుదలను ముక్త కంఠంతో పలికినట్లుగా ప్రవచించిన యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, ఇతర ప్రవక్తల మాటలు ఇప్పటికీ యెహోవా ప్రజల చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. (యిర్మీయా 25:​11, 12) యూదావారి విమోచకుడైన కోరెషుకు, ఆయనింకా జన్మించక ముందే పేరు పెట్టబడింది.​—⁠యెషయా 44:26-45: 1.

13 ఈ విస్తారమైన సాక్ష్యం దృష్ట్యా, యెహోవా మాత్రమే ఏకైక సత్య దేవుడనే విషయాన్ని ఎవరు కాదనగలరు? అన్య దేవుళ్ళకు భిన్నంగా, యెహోవా మాత్రమే ఎవరిచేతనూ సృష్టించబడలేదు; ఆయన మాత్రమే సత్య దేవుడు. a తత్ఫలితంగా, ఆయన అద్భుతమైన కార్యాలను భవిష్యద్‌ తరాలవారికి, ఆయన గురించి విచారణ చేసేవారికి తెలియజేసే విశేషమైన, ఉత్తేజవంతమైన ఆధిక్యత యెహోవా నామమును కలిగి ఉండే ప్రజలకు ఉంది. (కీర్తన 78:​5-7) అదే విధంగా, యెహోవా ఆధునిక దిన సాక్షులకు యెహోవా నామమును భూమి అంతటా ప్రకటించే ఆధిక్యత ఉంది. బైబిలు విద్యార్థులు 1920లలో, యెహోవా అనే దేవుని నామానికి ఉన్న లోతైన ప్రాముఖ్యతను అత్యధికంగా గ్రహించారు. ఆ తర్వాత, 1931 జూలై 26న ఒహాయోలోని కొలంబస్‌లో జరిగిన ఒక సమావేశంలో, సంస్థ అధ్యక్షుడైన జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ “ఒక క్రొత్త నామము” అనే పేరుగల తీర్మానాన్ని ప్రతిపాదించాడు. “యెహోవాసాక్షులు అని తెలియబడాలనీ, ఆ పేరుతో పిలువబడాలనీ మనం కోరుకుంటున్నాము” అనే మాటలు సమావేశానికి హాజరైన వారిని పులకరింపజేశాయి, వారు “అవును” అని మారుమ్రోగేలా చెప్పడం ద్వారా ఆ తీర్మానాన్ని ఆమోదించారు! అప్పటి నుండి యెహోవా నామము ప్రపంచవ్యాప్తంగా ఆధిక్యతను పొందింది.​—⁠కీర్తన 83:​18.

14. యెహోవా ఇశ్రాయేలీయులకు దేని గురించి గుర్తుచేస్తాడు, ఈ జ్ఞాపిక ఎందుకు సమయోచితమైనది?

14 యెహోవా తన నామమును ఘనంగా ధరించినవారిని తన “కనుపాప”గా దృష్టిస్తూ వారి గురించి శ్రద్ధ తీసుకుంటాడు. తాను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి ఎలా విడుదల చేశాడో, అరణ్యంగుండా వారిని ఎలా సురక్షితంగా తీసుకువెళ్ళాడో చెప్పడం ద్వారా ఆయన వారికి దీన్ని గుర్తు చేస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 32:​10, 12) ఆ సమయంలో వారి మధ్యన ఏ అన్య దేవుడు లేడు, ఎందుకంటే ఐగుప్తు దేవుళ్ళందరికీ ఘోరమైన అవమానం జరగడాన్ని వారు కళ్ళారా చూశారు. ఐగుప్తు దేవుళ్ళ సమూహమంతా ఐగుప్తును కాపాడనూ లేకపోయింది, ఇశ్రాయేలీయులు వెళ్ళిపోవడాన్ని ఆపనూ లేకపోయింది. (నిర్గమకాండము 12:​12) అలాగే శక్తివంతమైన బబులోను, దాని పట్టణ ప్రాంతాల్లో కనీసం 50 అబద్ధ దేవుళ్ళ ఆలయాలతో నిండిపోయినప్పటికీ, సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలను విడుదల చేసేటప్పుడు ఆయనను ఆపలేదు. స్పష్టంగా, యెహోవా తప్ప “వేరొక రక్షకుడు లేడు.”

యుద్ధాశ్వాలు పడిపోతాయి, చెరసాలలు తెరుచుకుంటాయి

15. బబులోను గురించి యెహోవా ఏమి ప్రవచించాడు?

15“ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదను, వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును, రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి.”​—యెషయా 43:​14-17.

16. కల్దీయులైన వర్తకులకైనా, బబులోనుకైనా, దానికి కాపుదలనివ్వగల వారెవరికైనా ఏమి సంభవిస్తుంది?

16 బంధీలకు బబులోను ఒక చెరసాలలా ఉంది, ఎందుకంటే వారు యెరూషలేముకు తిరిగిరాకుండా అది ఆపుతోంది. కానీ మునుపు ‘[ఎఱ్ఱ సముద్రములో] త్రోవ కలుగజేసిన, వడిగల జలములలో మార్గము కలుగజేసిన’ సర్వశక్తిమంతునికి బబులోను రక్షణ ఏర్పాట్లు ఏమాత్రం ఒక అడ్డంకు కావు. వడిగల జలములన్నది యొర్దాను జలములని స్పష్టమవుతోంది. (నిర్గమకాండము 14:​16; యెహోషువ 3:​13) అదే విధంగా, యెహోవా ప్రతినిధియైన కోరెషు తన యుద్ధశూరులు నగరంలోకి ప్రవేశించేలా శక్తివంతమైన యూఫ్రటీసు జలాలు తగ్గిపోయేలా చేస్తాడు. వేలాది వాణిజ్య ఓడలకు, బబులోను దేవుళ్ళను తీసుకువెళ్లే నావలకు జలమార్గాలైన బబులోను కాలువలపై ప్రయాణించే కల్దీయులైన వర్తకులు, శక్తివంతమైన తమ రాజధాని పడిపోయినప్పుడు దుఃఖంతో ఏడుస్తారు. ఎఱ్ఱసముద్రంలో నాశనమైన ఫరో రథాల్లా, వేగవంతమైన బబులోను రథాలు నిస్సహాయమైనవైపోతాయి. అవి దాన్ని కాపాడవు. దాడి చేస్తున్నవాడు, కాపుదలనివ్వబోయే ఎవరి జీవితాలనైనా నూనె దీపంలోని జనుపనార వత్తిని ఆర్పేసినంత సులభంగా ఆర్పేస్తాడు.

యెహోవా తన ప్రజలను సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తాడు

17, 18. (ఎ) యెహోవా ఏ “నూతన” విషయాలను ప్రవచించాడు? (బి) ప్రజలు మునుపటి విషయాలను గుర్తు తెచ్చుకోకూడదన్నది ఏ భావంలో, ఎందుకు?

17 తాను మునుపు చేసిన విడుదల కార్యాలను, తాను చేయబోయే విడుదల కార్యాలతో పోలుస్తూ, యెహోవా ఇలా అంటున్నాడు: “మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో! నేనొక నూతనక్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు.”​—యెషయా 43:​18-21.

18 “మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి” అని చెప్పడంలో యెహోవా తన సేవకులు తన మునుపటి రక్షణ కార్యాలను మనస్సులలో నుండి చెరిపేసుకోవాలని సూచించడం లేదు. వాస్తవానికి, ఈ కార్యాల్లో అనేకం ఇశ్రాయేలు యొక్క దైవ ప్రేరేపిత చరిత్రలో భాగమే, ప్రతి సంవత్సరం పస్కాను ఆచరించేటప్పుడు ఐగుప్తు నుండి తాము విడుదల చేయబడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని యెహోవా ఆజ్ఞాపించాడు. (లేవీయకాండము 23: 5; ద్వితీయోపదేశకాండము 16:​1-4) అయితే, ఇప్పుడు తన ప్రజలు “నూతన క్రియ” ఆధారంగా అంటే, వారు స్వయంగా అనుభవించేదాన్ని బట్టి తనను ఘనపర్చాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆ నూతన క్రియలో వారు బబులోను నుండి విడుదల చేయబడడం మాత్రమే కాదు గానీ బహుశా మరింత సూటియైన ఎడారి మార్గం గుండా స్వదేశానికి తిరిగి రావడానికి వారు చేసిన అద్భుతమైన ప్రయాణం కూడా ఇమిడి ఉంది. ఆ ఎడారి ప్రాంతంలో, యెహోవా వారి కోసం ఒక “త్రోవ” సిద్ధం చేసి, మోషే కాలంలో ఆయన ఇశ్రాయేలీయులకు చేసిన దాన్ని జ్ఞప్తికి తెప్పించేలాంటి శక్తివంతమైన కార్యాలు చేస్తాడు, వాస్తవానికి, ఆయన తిరిగి వస్తున్నవారికి ఎడారిలో ఆహారం అందజేస్తాడు, నిజమైన నదులతో వారి దాహాన్ని తీరుస్తాడు. యెహోవా చేసే ఏర్పాట్లు ఎంత ధారాళంగా ఉంటాయంటే చివరికి క్రూర జంతువులు కూడా మనుష్యులపై దాడి చేయకుండా ఉండి, దేవుడ్ని ఘనపరుస్తాయి.

19. ఆధ్యాత్మిక ఇశ్రాయేలు శేషము, వారి సహచరులు ‘పరిశుద్ధ మార్గము’పై ఎలా నడుస్తారు?

19 అలాగే, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు శేషము 1919 లో బబులోను సంబంధిత చెరనుండి విడుదల చేయబడింది, వారు యెహోవా తమ కోసం సిద్ధం చేసిన మార్గమైన, ‘పరిశుద్ధ మార్గములో’ బయలుదేరారు. (యెషయా 35: 8) వారు ఇశ్రాయేలీయుల వలె ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మండుటెండలో ఎడారి గుండా ప్రయాణించనవసరం లేదు, వారి ప్రయాణం యెరూషలేముకు చేరుకోవడంతోనే కొద్ది నెలల్లో ముగిసిపోదు. అయితే, ‘పరిశుద్ధ మార్గము’ అభిషిక్త క్రైస్తవుల శేషమును ఆధ్యాత్మిక పరదైసులోకి తీసుకువెళ్ళింది. వారు ఆ ‘పరిశుద్ధ మార్గము’పైనే నిలిచి ఉంటారు, ఎందుకంటే వారు ఇంకా ఈ విధానం గుండా ప్రయాణించాల్సి ఉంది. వారు ఆ రాజమార్గంపై ఉన్నంత వరకు అంటే, పవిత్రత పరిశుద్ధతలలో దేవుని ప్రమాణాలను అనుసరించినంత వరకు వారు ఆధ్యాత్మిక పరదైసులోనే ఉంటారు. ‘ఇశ్రాయేలీయులు కాని’ గొప్ప సమూహపు సహచరులు తమతో కలవడం వారికి ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో కదా! సాతాను విధానంవైపు చూసే వారికి పూర్తి భిన్నంగా, శేషము వారి సహచరులు యెహోవా ఏర్పాటు చేసిన పుష్టికరమైన ఆధ్యాత్మిక విందును ఆరగిస్తూనే ఉంటారు. (యెషయా 25: 6; యెషయా 65:​13, 14) యెహోవా ప్రజలపై ఆయన ఆశీర్వాదం ఉండడాన్ని గ్రహించిన మృగంవంటి అనేకులు తమ మార్గాలను మార్చుకొని, సత్య దేవుడ్ని ఘనపరిచారు.​—⁠యెషయా 11:​6-9.

యెహోవా తన వేదనను వెలిబుచ్చుతాడు

20. యెషయా కాలంనాటి ఇశ్రాయేలు యెహోవా కోరినది చేయడంలో ఎలా విఫలమయ్యారు?

20 యెషయా కాలంనాటి దుష్టతరంతో పోలిస్తే, ప్రాచీన కాలాల్లో పునఃస్థాపించబడిన ఇశ్రాయేలు శేషము, మార్పు చెందిన ప్రజలు. యెషయా కాలంనాటి వారి గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు: “యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా. దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు, నీ బలులచేత నన్ను ఘనపరచలేదు. నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంతపెట్టలేదు, ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు; నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి; నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి.”​—యెషయా 43:​22-24.

21, 22. (ఎ) యెహోవా కోరేవి భారమైనవి కావని ఎందుకు చెప్పవచ్చు? (బి) ప్రజలు యెహోవాను ఎలా విసిగిస్తున్నారు?

21 “నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంతపెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు” అని చెప్పడంలో యెహోవా నైవేద్యము, ధూపము (సాంబ్రాణి) అవసరం లేదనేమీ సూచించడం లేదు. వాస్తవానికి, ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం ఇవి సత్యారాధనలో అంతర్గతమైన భాగం. అభిషేకించే పరిశుద్ధ తైలంలో ఉపయోగించే సువాసనగల పదార్థమైన “లవంగపు చెక్క” కూడా సత్యారాధనలో అంతర్గత భాగమే. ఆలయ సేవలో వీటిని ఉపయోగించడాన్ని ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అవేమైనా భారమైనవా? ఎంతమాత్రం కాదు! అబద్ధ దేవుళ్ళు కోరేవాటితో పోల్చి చూస్తే యెహోవా కోరేవి తేలికైనవే. ఉదాహరణకు, అబద్ధ దేవుడైన మోలెకు చిన్నపిల్లలను బలి ఇవ్వమని కోరాడు, యెహోవా ఎన్నడూ అలా కోరలేదు!​—⁠ద్వితీయోపదేశకాండము 30:​11; మీకా 6:​3, 4, 8.

22 ఇశ్రాయేలీయులకు ఆధ్యాత్మిక గ్రహింపు గనుక ఉంటే, వారు ఎన్నడూ ‘యెహోవాను బట్టి విసుగు చెందరు.’ ఆయన ధర్మశాస్త్రములోకి చూడడం ద్వారా, ఆయనకు తమ పట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమను వారు చూడగలుగుతారు, ఆయనకు “క్రొవ్వు”ను అంటే తమ బలులలో శ్రేష్ఠమైన భాగాన్ని అర్పిస్తారు. బదులుగా, వారు అత్యాశతో క్రొవ్వును తమకే ఉంచుకుంటారు. (లేవీయకాండము 3:​9-11, 16) ఈ దుష్ట జనము తమ పాపాల భారంతో యెహోవాను బాధపెడుతూ, తమ పాపములతో ఆయనను ఎంత విసిగిస్తుందో కదా!​—⁠నెహెమ్యా 9:​28-30.

క్రమశిక్షణకు తగిన ప్రతిఫలం

23. (ఎ) యెహోవా ఇచ్చే క్రమశిక్షణ ఎందుకు తగినది? (బి) దేవుడు ఇశ్రాయేలుకు క్రమశిక్షణనివ్వడంలో ఏమి ఇమిడి ఉంది?

23 యెహోవా ఇచ్చే క్రమశిక్షణ కష్టంగానే ఉన్నప్పటికీ, అది తగినదే, అంతేగాక అది కనికరం చూపించడానికి అవకాశమిస్తూ, కోరుకున్న ఫలితాలను సాధిస్తుంది. ‘నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను. నాకు జ్ఞాపకము చేయుము; మనము కూడి వాదింతము; నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము. నీ మూలపితరుడు పాపముచేసినవాడే, నీ మధ్యవర్తులు నామీద తిరుగుబాటు చేసినవారే. కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్రపరచితిని, యాకోబును శపించితిని [“నాశనానికి గురిచేసి,” పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం] ఇశ్రాయేలును దూషణపాలు చేసితిని.’ (యెషయా 43:​25-28) ప్రపంచంలోని అన్ని జనముల్లా, ఇశ్రాయేలు కూడా ‘మూలపితరుడైన’ ఆదాము సంతానమే. కాబట్టి ఏ ఇశ్రాయేలీయుడూ తాను ‘నీతిమంతుడనని’ నిరూపించుకోలేడు. ఇశ్రాయేలు “మధ్యవర్తులు” సహితం, అంటే దాని ధర్మశాస్త్ర బోధకులు లేక వ్యాఖ్యాతలు యెహోవాకు విరుద్ధంగా పాపం చేసి, అబద్ధాలు బోధించారు. తత్ఫలితంగా, యెహోవా మొత్తం జనాంగాన్ని “నాశనమునకు,” “దూషణ”కు అప్పగిస్తాడు. ఆయన తన “ప్రతిష్ఠిత” స్థలంలో అంటే పరిశుద్ధ స్థలంలో సేవచేసే వారందరినీ అపవిత్రపరుస్తాడు కూడా.

24. యెహోవా ప్రాచీనకాలం నాటి తన ప్రజలనూ, అలాగే ఆధునిక కాలానికి చెందిన వారినీ ఏ ప్రధాన కారణాన్ని బట్టి క్షమిస్తాడు, అయినప్పటికీ వారిపట్ల ఆయన భావాలు ఎలా ఉన్నాయి?

24 అయితే, దైవిక కనికరం చూపించబడేది ఇశ్రాయేలు పశ్చాత్తాపం చెందినందుకు మాత్రమే కాదని గమనించండి; అది యెహోవా కోసమే. అవును, ఆయన నామము ఇమిడి ఉంది. ఇశ్రాయేలును ఆయన గనుక శాశ్వతంగా చెరలోనే విడిచిపెట్టేస్తే, చూసేవారు ఆయన నామమునే దూషిస్తారు. (కీర్తన 79: 9; యెహెజ్కేలు 20:​8-10) అలాగే నేడు, మానవుల రక్షణ కన్నా యెహోవా నామము పరిశుద్ధపరచబడడమూ, ఆయన సర్వోన్నతాధిపత్య నిరూపణా ప్రాముఖ్యమైనవి. అయినప్పటికీ, తానిచ్చే క్రమశిక్షణను నిరభ్యంతరంగా స్వీకరించి, తనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారిని యెహోవా ప్రేమిస్తాడు. వారు అభిషిక్తులైనా లేక వేరే గొఱ్ఱెలవారైనా సరే యేసుక్రీస్తు బలి ఆధారంగా వారి తప్పిదములను తుడిచి వేయడం ద్వారా ఆయన వారిపట్ల తన ప్రేమను ప్రదర్శిస్తాడు.​—⁠యోహాను 3:​16; 4:​23, 24.

25. సమీప భవిష్యత్తులో యెహోవా సంభ్రమాశ్చర్యాలను కలిగించే ఏ సంగతులను చేస్తాడు, ఇప్పుడు మనం మన మెప్పును ఎలా ప్రదర్శించవచ్చు?

25 అంతేగాక, యెహోవా తన నమ్మకమైన ఆరాధకుల గొప్ప సమూహమును “మహా శ్రమల” గుండా, పరిశుభ్రపరచబడిన “క్రొత్త భూమి”లోకి ప్రవేశపెట్టడం ద్వారా వారి పక్షాన నూతన క్రియ జరిగించినప్పుడు వారి ఎడల తన ప్రేమను ప్రదర్శిస్తాడు. (ప్రకటన 7:​14; 2 పేతురు 3:​13) మానవులు ఎన్నడూ చూడని విధంగా యెహోవా శక్తి సంభ్రమాశ్చర్యాలను కలిగించే విధంగా ప్రదర్శించబడడాన్ని వాళ్ళు చూస్తారు. ఆ సంఘటన ఖచ్చితంగా జరుగుతుందన్న దృఢమైన విశ్వాసం, అభిషిక్త శేషమూ గొప్ప సమూహానికి చెందినవారందరూ ఆనందించేలా, ‘మీరే నాకు సాక్షులు’ అనే ఉన్నతమైన నియామకానికి అనుగుణంగా ప్రతిరోజు జీవించేలా చేస్తుంది.​—⁠యెషయా 43:​10.

[అధస్సూచి]

a అన్యజనాంగాల పురాణగాధల్లో, అనేక మంది దేవుళ్ళు “జన్మించారు,” అనేకమందికి “పిల్లలు” ఉన్నారు.

[అధ్యయన ప్రశ్నలు]

[48, 49 వ పేజీలోని చిత్రం]

యూదులు యెరూషలేముకు తిరిగివచ్చేందుకు యెహోవా వారికి మద్దతు ఇస్తాడు

[52 వ పేజీలోని చిత్రాలు]

తమ దేవుళ్ళకు సాక్షులను ప్రవేశపెట్టమని యెహోవా జనములను సవాలు చేస్తాడు

1. బయలు యొక్క కంచు విగ్రహం 2. అష్టారోతు మట్టి విగ్రహాలు 3. హోరస్‌, ఒసిరిస్‌, ఇసిస్‌ల ఐగుప్తు త్రిత్వం 4. గ్రీకు దేవుళ్ళయిన ఎథెనా (ఎడమ), అఫ్రొడైట్‌

[58 వ పేజీలోని చిత్రాలు]

‘మీరు నాకు సాక్షులు.’​—⁠యెషయా 43: 10