అవిశ్వసనీయ ద్రాక్షతోటకు శ్రమ!
ఏడవ అధ్యాయం
అవిశ్వసనీయ ద్రాక్షతోటకు శ్రమ!
1, 2. ‘ప్రియుడు’ ఏమి నాటించాడు, కానీ అదెలా నిరాశ కలిగించింది?
“విశిష్టమైన భాషాసౌందర్యానికీ, ప్రభావవంతమైన సమగ్ర సంభాషణా నైపుణ్యానికీ ఈ ఉపమానం నిజంగా సాటిలేనిది.” యెషయా ఐదవ అధ్యాయంలోని ప్రారంభ వచనాలను ఉద్దేశించి ఒక బైబిలు వ్యాఖ్యాత అలా అన్నాడు. యెషయా మాటలు సాహితీకృతి కన్నా ఎక్కువే, అవి యెహోవాకు తన ప్రజల పట్లనున్న ప్రేమపూర్వకమైన శ్రద్ధను గురించి కదలింపజేసే వర్ణనను ఇస్తున్నాయి. అదే సమయంలో, ఆ మాటలు ఆయనకు అప్రీతికరమైన పనులు చేయకూడదని మనలను హెచ్చరిస్తున్నాయి.
2 యెషయా ఉపమానం ఇలా ప్రారంభమవుతుంది: “నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొక ద్రాక్షతోట యుండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్షతొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను.”—యెషయా 5:1, 2; మార్కు 12:1 పోల్చండి.
ద్రాక్షతోట గురించి శ్రద్ధ తీసుకోవడం
3, 4. ద్రాక్షతోట గురించి ఏ ప్రేమపూర్వకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది?
3 యెషయా అక్షరార్థంగా ఈ ఉపమానాన్ని తన శ్రోతల కోసం ఆలపిస్తున్నాడో లేదో గానీ అది మాత్రం తప్పకుండా వారిని ఆకట్టుకుంటుంది. బహుశా చాలామందికి ద్రాక్షతోటను నాటేపనితో పరిచయం ఉండవచ్చు, యెషయా ఇస్తున్న వివరణ స్పష్టంగా, వాస్తవికంగా ఉంది. నేటి ద్రాక్ష రైతుల్లాగే, ఈ ద్రాక్షతోట యజమాని కూడా ద్రాక్ష విత్తనాలు కాదుగానీ, మరో ద్రాక్షతీగ నుండి తీయబడిన “శ్రేష్ఠమైన” కొమ్మను నాటుతాడు. సముచితంగానే, ఆయన సాధారణంగా ద్రాక్షతోటలు చక్కగా పెరిగే స్థలమైన “సత్తువ భూమిగల కొండమీద” ఈ ద్రాక్షతోటను నాటుతాడు.
4 ద్రాక్షతోట ఫలించేలా చేయడానికి తీవ్రమైన కృషి అవసరం. యజమాని ‘బాగుగా త్రవ్వి రాళ్లను ఏరడం’ గురించి యెషయా వర్ణిస్తున్నాడు, నిజంగా అది చాలా అలసట కలిగించే, శ్రమతో కూడిన పని! ఆయన పెద్ద రాళ్లను “బురుజు” నిర్మించడానికి ఉపయోగించి ఉంటాడు. ప్రాచీన కాలాల్లో, అలాంటి బురుజులు దొంగల బారినుండి జంతువుల బారినుండి పంటలను కాపాడడానికి కావలికాసే వారికి స్థావరాలుగా ఉండేవి. a అంతేగాక ఆయన ద్రాక్షతోట చుట్టూ కంచెలా రాళ్లతో గోడను నిర్మిస్తాడు. (యెషయా 5:5) సాధారణంగా ఎంతో ఆవశ్యకమైన పైనేల కొట్టుకుపోకుండా ఇలా గోడ నిర్మించడం జరుగుతుంది.
5. ఆ యజమాని సరైన విధంగానే తన ద్రాక్షతోట నుండి ఏమి ఎదురు చూస్తాడు, కాని ఆయనకు ఏమి లభిస్తుంది?
5 తన ద్రాక్షతోటను కాపాడడానికి ఎంతగానో కష్టపడిన ఆ యజమాని, అది ఫలిస్తుందని ఎదురుచూడడం ఎంతో సహజం. ఫలాల కోసం ఎదురు చూస్తూ ఆయన ఒక ద్రాక్షతొట్టిని తొలిపిస్తాడు. కాని ఎదురు చూసిన ఆ పంట చేతి కొస్తుందా? లేదు, ఆ ద్రాక్షతోట కారు ద్రాక్షలు కాస్తుంది.
ద్రాక్షతోట, దాని యజమాని
6, 7. (ఎ) ద్రాక్షతోట యజమాని ఎవరు, ద్రాక్షతోట అంటే ఏమిటి? (బి) దాని యజమాని ఏ తీర్పు కావాలని కోరుతున్నాడు?
6 యజమాని ఎవరు, ద్రాక్షతోట అంటే ఏమిటి? ఆ ద్రాక్షతోట యజమాని తానే మాట్లాడుతూ ఈ ప్రశ్నలకు సమాధానాలను సూచిస్తున్నాడు: “కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను: నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను.”—యెషయా 5:3-5.
7 అవును, యెహోవాయే ద్రాక్షతోట యజమాని, సూచనార్థకంగా చెప్పాలంటే ఆయన తనను తాను కోర్టుగదిలో ఉంచుకుని, తనకూ, తనను నిరాశపరిచిన తన ద్రాక్షతోటకూ మధ్య తీర్పు తీర్చమని అడుగుతున్నాడు. మరి ద్రాక్షతోట అంటే ఏమిటి? యజమాని ఇలా వివరిస్తున్నాడు: “ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట, యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము.”—యెషయా 5:7 ఎ.
8. యెషయా యెహోవాను ‘నా ప్రియుడు’ అని పిలవడం యొక్క విశేషత ఏమిటి?
8 యెషయా ద్రాక్షతోట యజమానియైన యెహోవాను ‘నా ప్రియుడు’ అని పిలుస్తున్నాడు. (యెషయా 5:1) యెషయాకు దేవునితో అంత సన్నిహితమైన సంబంధం ఉంది గనుకనే ఆయన దేవుని గురించి అంత చనువుగా మాట్లాడగలుగుతున్నాడు. అయితే, ప్రవక్తకు దేవుని పట్ల ఉన్న ప్రేమకన్నా, దేవుడు తాను ‘నాటిన’ జనమగు తన “ద్రాక్షతోట” పట్ల చూపించిన ప్రేమ ప్రగాఢమైనది.—కీర్తన 80:8, 9 పోల్చండి.
9. యెహోవా తన జనాంగాన్ని విలువైన ద్రాక్షతోటలా ఎలా చూసుకున్నాడు?
9 యెహోవా తన జనాంగాన్ని కనాను దేశంలో “నాటి,” వారికి తన కట్టడలను, శాసనాలను ఇచ్చాడు, ఇతర జనాంగాల మూలంగా వారు కలుషితం కాకుండా ఆ గోడ వారికి కాపుదలగా పనిచేసింది. (నిర్గమకాండము 19:5, 6; కీర్తన 147:19, 20; ఎఫెసీయులు 2:14) అంతేగాక, యెహోవా వారికి ఉపదేశించడం కోసం న్యాయాధిపతులను, యాజకులను, ప్రవక్తలను ఇచ్చాడు. (2 రాజులు 17:13; మలాకీ 2:7; అపొస్తలుల కార్యములు 13:20) ఇశ్రాయేలుపై సైనిక దురాక్రమణ జరిగినప్పుడు, యెహోవా వారికి విమోచకులను అనుగ్రహించాడు. (హెబ్రీయులు 11:32, 33) సకారణంగానే, యెహోవా ఇలా అడుగుతున్నాడు: “నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను?”
నేడు దేవుని ద్రాక్షతోటను గుర్తించడం
10. ద్రాక్షతోటను గురించిన ఏ ఉపమానాన్ని యేసు చెప్పాడు?
10 “ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను” అని హంతకులైన కాపుల గురించిన ఉపమానాన్ని చెప్పినప్పుడు యేసు మనస్సులో యెషయా మాటలే ఉండి ఉండవచ్చు. దుఃఖకరంగా, కాపులు చివరికి ద్రాక్షతోట యజమాని కుమారుడ్ని కూడా చంపి ఆయనకు ద్రోహం చేశారు. “దేవుని రాజ్యము మీ [ఇశ్రాయేలీయుల] యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని” చెప్పినప్పుడు, ఈ ఉపమానంలో చేరివున్నది కేవలం అక్షరార్థ ఇశ్రాయేలీయులు మాత్రమే కాదని యేసు చూపించాడు.—మత్తయి 21:33-41, 43.
11. మొదటి శతాబ్దంలో ఏ ఆధ్యాత్మిక ద్రాక్షతోట ఉనికిలో ఉంది, కానీ అపొస్తలుల మరణం తర్వాత ఏమి జరిగింది?
11 ఆ క్రొత్త “జనము” “దేవుని ఇశ్రాయేలు” అంటే మొత్తం 1,44,000 మంది అభిషిక్త క్రైస్తవులతో కూడిన ఆధ్యాత్మిక జనమని నిరూపించబడింది. (గలతీయులు 6:16; 1 పేతురు 2:9, 10; ప్రకటన 7:3, 4) యేసు ఈ శిష్యులను “నిజమైన ద్రాక్షావల్లి” పైనున్న “తీగెల”తో పోల్చాడు, ఆ ద్రాక్షావల్లి ఆయనే. ఈ తీగెలు ఫలించాలని నిరీక్షించడం సహజమే. (యోహాను 15:1-5) వారు క్రీస్తు వంటి లక్షణాలను కనబరుస్తూ, “ఈ రాజ్య సువార్త”ను ప్రకటించే పనిలో భాగం వహించాలి. (మత్తయి 24:14; గలతీయులు 5:22, 23) అయితే పన్నెండుమంది అపొస్తలులు మరణించిన తర్వాత నుండి, “నిజమైన ద్రాక్షావల్లి” తీగెలమని చెప్పుకునే అత్యధికులు మంచి ఫలాలకు బదులు కారు ద్రాక్షలను కాస్తూ నకిలీవాళ్ళమని నిరూపించుకున్నారు.—మత్తయి 13:24-30, 38, 39.
12. యెషయా మాటలు క్రైస్తవమత సామ్రాజ్యాన్ని ఎలా ఖండిస్తున్నాయి, అవి నిజక్రైస్తవులకు ఏ పాఠాన్ని తెలియజేస్తున్నాయి?
12 కాబట్టి, యెషయా యూదాను ఖండించడం నేడు క్రైస్తవమత సామ్రాజ్యానికి వర్తిస్తుంది. అది చేసిన యుద్ధాలు, ధర్మయుద్ధాలు, మతవిచారణలతో కూడిన దాని చరిత్రను అధ్యయనం చేసినప్పుడు దాని ఫలాలెంత పుల్లనివో వెల్లడవుతుంది! అయినప్పటికీ, నిజమైన ద్రాక్షతోటయైన అభిషిక్త క్రైస్తవులు, వారి సహవాసులైన “గొప్ప సముహము” యెషయా మాటలకు అవధానమివ్వాలి. (ప్రకటన 7:9) వారు ద్రాక్షతోట యజమానిని ప్రీతిపర్చాలంటే, వారు వ్యక్తిగతంగానూ ఒక గుంపుగానూ ఆయనకు ప్రీతికరమైన ఫలాలను ఫలించాలి.
“కారు ద్రాక్షలు”
13. తన ద్రాక్షతోట చెడు ఫలాలను ఫలించినందుకు యెహోవా దానికి ఏమి చేస్తాడు?
13 యెహోవా తన ద్రాక్షతోటను పెంచడానికీ, సాగుచేయడానికీ ఎంతో శ్రమతీసుకుని, న్యాయంగానే అది “ఫలవంతమైన ద్రాక్షతోట” కావాలని ఎదురుచూస్తాడు. (యెషయా 27:2, పరిశుద్ధ గ్రంథం వ్యాఖ్యానసహితం) అయితే, ఉపయోగకరమైన ఫలాలను కాసే బదులు అది “కారుద్రాక్ష”లను అంటే అక్షరార్థంగా “దుర్వాసన కొట్టేవాటిని” లేదా “కుళ్లిన పళ్లను” కాస్తుంది. (యెషయా 5:2; NW అధస్సూచి; యిర్మీయా 2:21) కాబట్టి, ఆ జనము చుట్టూ ఉన్న తన రక్షణ “కంచెను” తీసివేస్తానని యెహోవా తెలియజేస్తున్నాడు. ఆ జనము ‘పాడుచేయబడుతుంది,’ అది విడువబడుతుంది, దానికి క్షామం ఏర్పడుతుంది. (యెషయా 5:6 చదవండి.) వారు దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులు కాకపోతే అలాంటి వాటిని అనుభవిస్తారని మోషే హెచ్చరించాడు.—ద్వితీయోపదేశకాండము 11:17; 28:63, 64; 29:22, 23.
14. యెహోవా తన జనము నుండి ఏ ఫలాలను ఆశిస్తున్నాడు, కానీ అది ఏమి ఉత్పన్నం చేస్తుంది?
14 జనము మంచి ఫలాలను ఫలించాలని దేవుడు నిరీక్షిస్తాడు. యెషయా సమకాలీనుడైన మీకా ఇలా ప్రకటిస్తున్నాడు: “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు?” (మీకా 6:8; జెకర్యా 7:9) అయితే, ఆ జనము యెహోవా ఉద్బోధను వినడంలో విఫలమైంది. “[దేవుడు] న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను; నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.” (యెషయా 5:7 బి) అవిశ్వాస జనము, “సొదొమ ద్రాక్షావల్లి” నుండి విషపూరితమైన ద్రాక్షలను ఉత్పన్నం చేస్తుందని మోషే ప్రవచించాడు. (ద్వితీయోపదేశకాండము 32:32) కాబట్టి స్వలింగ సంయోగంతో సహా లైంగిక దుర్నీతికి పాల్పడడం, వారు దేవుని ధర్మశాస్త్రం నుండి వైదొలగి పోవడంలో భాగమై ఉండవచ్చు. (లేవీయకాండము 18:22) “బలాత్కారము” అనే పదాన్ని “రక్తాన్ని చిందించడం” అని కూడా అనువదించవచ్చు. అలాంటి క్రూరమైన వ్యవహారానికి గురైన వారు చేసిన “రోదనము” ద్రాక్షతోట యజమాని చెవులను చేరింది.—యోబు 34:28 పోల్చండి.
15, 16. ఇశ్రాయేలీయులు ఉత్పన్నం చేసిన చెడు ఫలాలు, తమలో ఉత్పన్నం కాకుండా నిజక్రైస్తవులు ఎలా నివారించవచ్చు?
15 యెహోవా దేవుడు “నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు.” (కీర్తన 33:5) “అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను” అని ఆయన యూదులకు ఆజ్ఞాపించాడు. (లేవీయకాండము 19:15) కాబట్టి మనం ఒకరితో ఒకరం వ్యవహరించేటప్పుడు జాతి, వయస్సు, సంపద లేక పేదరికం వంటివి ప్రజల గురించి మనం ఏర్పరచుకునే అభిప్రాయంపై ప్రభావాన్ని చూపించడానికి ఎన్నడూ అనుమతించకూడదు, పక్షపాతాన్ని ఎంతమాత్రం చూపించకూడదు. (యాకోబు 2:1-4) ప్రాముఖ్యంగా, పర్యవేక్షణా స్థానాల్లో సేవచేస్తున్న వారు ‘పక్షపాతముతో ఏమియు చేయక,’ ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఇరుపక్షాల వారూ చెప్పుకునేది వినడం ఎంతో ఆవశ్యకం.—1 తిమోతి 5:21; సామెతలు 18:13.
16 అంతేగాక, నీతిలేని ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవులు దైవిక ప్రమాణాల పట్ల ప్రతికూలమైన లేక తిరుగుబాటు చేసే దృక్పథాన్ని వృద్ధి చేసుకోవడం సులభం. కానీ నిజక్రైస్తవులు దేవుని కట్టడలకు ‘సులభముగా లోబడేవారై’ ఉండాలి. (యాకోబు 3:17) “ప్రస్తుతపు దుష్టకాలములో” లైంగిక దుర్నీతి, దౌర్జన్యము ఉన్నప్పటికీ, వారు ‘తాము అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనవలసిన’ అవసరం ఉంది. (గలతీయులు 1:4; ఎఫెసీయులు 5:15) వారు లైంగిక విషయాల్లో విచ్చలవిడి దృక్పథాలకు దూరంగా ఉంటూ, భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు “కోపము, క్రోధము, అల్లరి, దూషణ” వంటివి లేకుండా వాటిని సరిచేసుకోవాలి. (ఎఫెసీయులు 4:31) నీతిని అలవరచుకోవడం ద్వారా నిజక్రైస్తవులు దేవునికి ఘనతను తెచ్చి, ఆయన అనుగ్రహాన్ని పొందుతారు.
దురాశ మూల్యం
17. యెషయా చెప్పిన మొదటి శ్రమలో, ఏ దుష్ట ప్రవర్తన ఖండించబడింది?
17 ఎనిమిదవ వచనంలో యెషయా ఇక యెహోవా మాటలను ఎత్తి చెప్పడం లేదు. యూదాలో ఉత్పన్నం చేయబడిన కొన్ని “కారు ద్రాక్షలను” ఖండిస్తూ ఆరు శ్రమల్లో మొదటిదాన్ని ఆయన వ్యక్తిగతంగా ప్రకటిస్తున్నాడు: “స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను—నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును. పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రసమిచ్చును, తూమెడుగింజల పంట ఒక పడి యగును.”—యెషయా 5:8-10.
18, 19. ఆస్తికి సంబంధించిన యెహోవా చట్టాలను యెషయా సమకాలీనులు ఎలా అలక్ష్యం చేస్తారు, అందుకు వాళ్ళు ఎలాంటి పర్యవసానాన్ని ఎదుర్కొంటారు?
18 ప్రాచీన ఇశ్రాయేలులో భూమి అంతా యెహోవాకే చెందేది. ప్రతి కుటుంబానికీ దేవుడిచ్చిన స్వాస్థ్యం ఉండేది, దాన్ని వారు కౌలుకివ్వవచ్చు, లేదా తాకట్టు పెట్టవచ్చు అంతేగానీ దాన్ని ఎన్నడూ “శాశ్వత విక్రయము” చేయకూడదు. (లేవీయకాండము 25:23) ఈ చట్టం, స్థిరాస్థి గుత్తాధిపత్యం వంటి దుర్వినియోగాలను నివారించేది. కుటుంబాలు కడుపేదరికంలో మునిగిపోకుండా కూడా అది కాపాడేది. అయితే, యూదాలో కొందరు దురాశతో, ఆస్థి విషయాల్లో దేవుడిచ్చిన చట్టాలను మీరేవారు. మీకా ఇలా వ్రాశాడు: “వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.” (మీకా 2:2) కానీ, సామెతలు 20:21 ఇలా హెచ్చరిస్తోంది: “మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.”
19 ఈ దురాశాపరులు అన్యాయంగా సంపాదించుకున్న లాభాలను వారివద్దనుండి తీసివేస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. వారు ఆక్రమించుకున్న ఇండ్లు “నివాసులులేక పాడైపోవును.” వారు ఆశించే పొలాలు, అంతంత మాత్రమే పండుతాయి. ఈ శాపం కచ్చితంగా ఎప్పుడు, ఎలా నెరవేరుతుందో చెప్పబడలేదు. కనీసం కొంతమేరకు అది, భవిష్యత్తులో బబులోనుకు చెరగా కొనిపోబడడం ద్వారా ఏర్పడే పరిస్థితులను సూచిస్తుండవచ్చు.—యెషయా 27:10.
20. ఇశ్రాయేలులోని కొందరు చూపించిన దురాశతో కూడిన దృక్పథాన్ని క్రైస్తవులు నేడు ఎలా నివారించవచ్చు?
20 పూర్వం కొంతమంది ఇశ్రాయేలీయులు చూపించినటువంటి అంతులేని దురాశను నేడు క్రైస్తవులు అసహ్యించుకోవాలి. (సామెతలు 27:20) వస్తుదాయక విషయాలు విపరీతమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పుడు, అక్రమమైన మార్గాల్లో డబ్బు సంపాదించుకోవడానికి దిగజారిపోవడం సులభం. అవినీతికరమైన వ్యాపార వ్యవహారాల్లో లేక త్వరగా ధనవంతులు కావచ్చని చెప్పబడుతున్న అవాస్తవికమైన పథకాల్లో ఒకరు సులభంగా చిక్కుకుపోవచ్చు. “ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు.” (సామెతలు 28:20) కాబట్టి మనకున్న వాటితో సంతృప్తి కలిగివుండడం ఎంత ప్రాముఖ్యమో కదా!—1 తిమోతి 6:7, 8.
సమస్యాత్మకమైన వినోదపు ఉరి
21. యెషయా చెబుతున్న రెండవ శ్రమలో ఏ పాపాలు ఖండించబడ్డాయి?
21 తర్వాత యెషయా చెప్పిన రెండవ శ్రమ ఇలా ఉంది: “మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.”—యెషయా 5:11, 12.
22. ఇశ్రాయేలులో ఏ విచ్చలవిడితనం కనిపిస్తుంది, అందుకు ఎలాంటి ఫలితాన్ని జనం ఎదుర్కొంటుంది?
22 యెహోవా “సంతోషముగల దేవుడు,” తన సేవకులు సహేతుకమైనంత మేరకు వినోదాన్ని ఆనందిస్తే ఆయనేమీ ఆగ్రహించడు. (1 తిమోతి 1:11, NW) అయితే, ఈ ఆనందాన్వేషకులు అన్ని హద్దులనూ దాటిపోతారు! “మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు” అని బైబిలు చెబుతోంది. (1 థెస్సలొనీకయులు 5:7) కానీ ఈ ప్రవచనంలో పేర్కొనబడిన త్రాగుబోతులు తమ త్రాగుడు పార్టీలను ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకూ కొనసాగిస్తారు! వారు, దేవుడు ఉనికిలోనే లేడన్నట్లు, తమ చర్యలకు ఆయన తమను బాధ్యులనుగా ఎంచడన్నట్లు ప్రవర్తిస్తారు. అలాంటి వారికి యెషయా అంధకారమైన భవిష్యత్తును ప్రవచిస్తున్నాడు. “కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు; వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.” (యెషయా 5:13) నిజమైన జ్ఞానానుసారంగా ప్రవర్తించడానికి నిరాకరించడం మూలంగా దేవుని నిబంధన ప్రజలు—ఘనులు, సామాన్యులు—సమాధికి వెళ్తారు.—యెషయా 5:14-17 చదవండి.
23, 24. క్రైస్తవులు ఏ విషయాల్లో నిగ్రహాన్ని, మితాన్ని పాటించవలసిన అవసరం ఉంది?
23 మొదటి శతాబ్దంలో కొంతమంది క్రైస్తవుల మధ్య, “అల్లరితోకూడిన ఆటపాటల”నే సమస్య కూడా ఉండేది. (గలతీయులు 5:21; 2 పేతురు 2:13) కాబట్టి నేడు కూడా కొంతమంది సమర్పిత క్రైస్తవులు వినోద కార్యకలాపాల విషయానికి వచ్చేసరికి వివేచనను చూపించకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కొంతమంది విపరీతంగా మద్యం త్రాగిన మత్తులో గోలగా, అల్లరిగా ప్రవర్తించారు. (సామెతలు 20:1) అంతేగాక, మరి కొంతమంది అతిగా త్రాగి మైకంలో లైంగిక దుర్నీతికి కూడా పాల్పడ్డారు, కొన్ని పార్టీలు మొత్తం రాత్రంతా జరగడంతో కొందరు మరునాడు క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోయారు.
24 అయితే సమతూకంగల క్రైస్తవులు, దైవిక ఫలాలను ఫలిస్తారు, తాము వినోదాన్ని ఎంపిక చేసుకునే విషయంలో నిగ్రహాన్ని, మితాన్ని పాటిస్తారు. వారు రోమీయులు 13:13 లో పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అనుసరిస్తారు: “అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేక . . . పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము.”
పాపాన్ని ద్వేషించడం, సత్యాన్ని ప్రేమించడం
25, 26. మూడవ, నాలుగవ శ్రమల్లో యెషయా ఇశ్రాయేలీయుల ఏ దుష్ట ఆలోచనా విధానాన్ని బహిర్గతం చేస్తున్నాడు?
25 ఇప్పుడు యెషయా చెబుతున్న మూడవ, నాలుగవ శ్రమలను వినండి: “భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు—ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా యెదుట కనబడనిమ్ము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొనువారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ.”—యెషయా 5:18-20.
26 పాపం చేస్తూనే ఉండేవారి గురించి ఇది ఎంత స్పష్టమైన చిత్రాన్ని చిత్రిస్తుందో కదా! బరువులు మోసే జంతువులు బండ్లకు కట్టబడినట్లు వారు పాపానికి కట్టివేయబడ్డారు. ఈ పాపులు రానున్న తీర్పు దినానికి ఎంతమాత్రం భయపడరు. వారు ఎగతాళిగా ఇలా అంటారు: “[దేవుడు] కార్యమును . . . వెంటనే చేయనిమ్ము!” దేవుని చట్టానికి లోబడి ఉండే బదులు, వారు “కీడు మేలనియు మేలు కీడనియు” చెబుతూ విషయాలను వక్రీకరించి చెబుతారు.—యిర్మీయా 6:15; 2 పేతురు 3:3-7 పోల్చండి.
27. ఇశ్రాయేలీయులకు ఉండినటువంటి దృక్పథాన్ని క్రైస్తవులు నేడు ఎలా నివారించవచ్చు?
27 క్రైస్తవులు నేడు అలాంటి దృక్పథాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా విసర్జించాలి. ఉదాహరణకు, వ్యభిచారము, స్వలింగ సంయోగము అంగీకారయోగ్యమైనవేననే ఈ లోకపు దృక్పథాన్ని వారు తిరస్కరిస్తారు. (ఎఫెసీయులు 4:18, 19) నిజమే, ఒక క్రైస్తవుడు గంభీరమైన పాపానికి నడిపే ‘తప్పటడుగు’ వేయవచ్చు. (గలతీయులు 6:1) తప్పిదంలో పడిపోయిన వారికి అవసరమైన సహాయం చేసేందుకు సంఘ పెద్దలు సంసిద్ధంగా ఉంటారు. (యాకోబు 5:14, 15) ప్రార్థనలూ, బైబిలు ఆధారిత ఉపదేశాల సహాయంతో ఆధ్యాత్మికంగా తిరిగి కోలుకోవడం సాధ్యమే. లేకపోతే, “పాపమునకు దాసు”డయ్యే ప్రమాదం ఉంటుంది. (యోహాను 8:34) దేవుడ్ని అపహాస్యం చేస్తూ రానున్న తీర్పు దినాన్ని మరచిపోయే బదులు, క్రైస్తవులు యెహోవా ఎదుట “నిష్కళంకులుగాను నిందారహితులుగాను” నిలిచి ఉండడానికి కృషి చేస్తారు.—2 పేతురు 3:14; గలతీయులు 6:7, 8.
28. యెషయా చెబుతున్న చివరి శ్రమల్లో ఏ పాపాలు ఖండించబడ్డాయి, క్రైస్తవులు నేడు అలాంటి పాపాలను ఎలా నివారించవచ్చు?
28 తగిన విధంగానే, యెషయా ఈ చివరి శ్రమలను తెలియజేస్తున్నాడు: “తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొనువారికి శ్రమ. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.” (యెషయా 5:21-23) ఈ మాటలు ఆ దేశంలో న్యాయాధిపతులుగా సేవచేస్తున్న వారిని ఉద్దేశించి చెప్పబడివుండవచ్చు. సంఘ పెద్దలు నేడు ‘తమ దృష్టికి తాము జ్ఞానులమనే’ తలంపును కూడా రానివ్వరు. వారు తమ తోటి పెద్దల నుండి వినయంగా ఉపదేశాన్ని స్వీకరించి, సంస్థాపరమైన ఉపదేశాలను సన్నిహితంగా అంటిపెట్టుకొని ఉంటారు. (సామెతలు 1:5; 1 కొరింథీయులు 14:33) వారు మద్యం మితంగా తీసుకుంటారు, సంఘ బాధ్యతలను నిర్వహించబోయే ముందైతే అసలే తీసుకోరు. (హోషేయ 4:11) పెద్దలు పక్షపాత వైఖరిని సంపూర్ణంగా నివారిస్తారు. (యాకోబు 2:9) క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకుల నుండి ఎంత భిన్నమో కదా! వీరిలో చాలామంది తమ మధ్యనున్న పలుకుబడిగల, సంపన్నులైన పాపుల పాపాలను కప్పిపెడతారు, అది రోమీయులు 1:18, 26, 27; 1 కొరింథీయులు 6:9, 10; ఎఫెసీయులు 5:3-5 వచనాల్లో అపొస్తలుడైన పౌలు ఇచ్చిన హెచ్చరికలకు పూర్తి విరుద్ధమైనది.
29. యెహోవా యొక్క ఇశ్రాయేలు ద్రాక్షతోట కోసం ఎటువంటి విపత్కరమైన అంతం వేచివుంది?
29 ‘యెహోవాయొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టి,’ నీతి ఫలాలను ఫలించడంలో విఫలమైనవారి విపత్కరమైన అంతాన్ని వర్ణిస్తూ యెషయా ఈ ప్రవచనార్థక సందేశాన్ని ముగిస్తున్నాడు. (యెషయా 5:24, 25; హోషేయ 9:16; మలాకీ 4:1) ఆయనిలా ప్రకటిస్తున్నాడు: “[యెహోవా] దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును భూమ్యంతమునుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు.”—యెషయా 5:26; ద్వితీయోపదేశకాండము 28:49, 50; యిర్మీయా 5:15.
30. యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా “జనములను” ఎవరు సమకూరుస్తారు, దాని ఫలితమెలా ఉంటుంది?
30 ప్రాచీన కాలాల్లో ఎత్తైన స్థలం మీదున్న ఒక స్తంభం, ‘ధ్వజముగా’ లేక ప్రజలుగానీ సైన్యాలుగానీ సమకూడవలసిన స్థలానికి గుర్తుగా పనిచేసేది. (యెషయా 18:3; యిర్మీయా 51:27 పోల్చండి.) ఇప్పుడు యెహోవా తన తీర్పును అమలు చేయడానికి పేరుతెలపని ఈ “జనములను” తానే స్వయంగా సమకూరుస్తాడు. b ఆయన దాన్ని రప్పించడానికి ‘ఈల వేస్తాడు,’ అంటే, దారితప్పిన తన ప్రజలు ఓడించవలసిన వారన్నట్లుగా ఆయన దాని అవధానాన్ని వారివైపుకు మళ్లిస్తాడు. ప్రవక్త ఆ తర్వాత, సింహం వంటి విజయయోధుల వేగవంతమైన, భయంకరమైన దాడిని వర్ణిస్తున్నాడు, ఆ యోధులు “వేటను” అంటే దేవుని జనములను “పట్టుకొని అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొని పోవుదురు.” (యెషయా 5:27-30ఎ చదవండి.) యెహోవా ప్రజల దేశానికి ఎంత దుఃఖకరమైన ఫలితం! “ఒకడు భూమివైపు చూడగా అంధకారమును బాధయు కనబడును; అంతట ఆ దేశముమీది వెలుగు మేఘములచేత చీకటియగును.”—యెషయా 5:30 బి.
31. యెహోవా యొక్క ఇశ్రాయేలు ద్రాక్షతోటపై విధించబడిన శిక్షను నిజక్రైస్తవులు ఎలా తప్పించుకోవచ్చు?
31 అవును దేవుడు అంత ప్రేమపూర్వకంగా నాటిన ద్రాక్షతోట, నాశనం చేయబడడానికే అర్హమైన బంజరు భూమిగా మారుతుంది. నేడు యెహోవా సేవ చేస్తున్న వారందరికీ యెషయా మాటలు ఎంత శక్తిమంతమైన పాఠాన్ని బోధిస్తున్నాయో కదా! వారు యెహోవాకు స్తుతీ, తమకు రక్షణా కలిగే విధంగా ఎల్లప్పుడూ నీతియుక్తమైన ఫలాన్నే ఫలించడానికి కృషి చేయుదురు గాక!
[అధస్సూచీలు]
a సాధారణంగా రాతి బురుజుల కంటే పర్ణశాలలు లేదా పాకల వంటి నాసిరకమైన తాత్కాలిక కట్టడాలే ఎక్కువగా నిర్మించబడేవని కొంతమంది పండితులు విశ్వసిస్తారు. (యెషయా 1:8) ఆ యజమాని తన “ద్రాక్షతోట” కోసం అసాధారణమైన కృషిని సల్పాడని ఆ బురుజు సూచిస్తోంది.
b యూదాపై యెహోవా నాశనకరమైన తీర్పును అమలు చేసే జనము, బబులోనని యెషయా ఇతర ప్రవచనాల్లో స్పష్టం చేశాడు.
[అధ్యయన ప్రశ్నలు]
[83 వ పేజీలోని చిత్రం]
బరువులుమోసే జంతువులు బండ్లకు కట్టబడినట్లుగా పాపి పాపానికి కట్టివేయబడతాడు
[85 వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]