కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 14

దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు

దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు

యెహోవా తన తీర్పుల గురించి, సత్యారాధన గురించి, మెస్సీయ రాక గురించి తెలియజేయడానికి ప్రవక్తలను నియమించాడు

ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను రాజులు పరిపాలించే కాలంలో ప్రవక్తలు ఉండేవాళ్లు. గొప్ప విశ్వాసం, ధైర్యం ఉన్న వీళ్లు ప్రజలకు దేవుని సందేశాలను తెలియజేసేవాళ్లు. వీళ్లు ప్రకటించిన నాలుగు ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం.

1. యెరూషలేము నాశనం. దేవుని ప్రవక్తలు, ముఖ్యంగా యెషయా యిర్మీయాలు యెరూషలేము నాశనం చేయబడుతుందని, నిర్జనమైపోతుందని ఎన్నో సంవత్సరాల ముందునుండే ప్రజలను హెచ్చరిస్తూ వచ్చారు. ఇశ్రాయేలీయులు యెహోవా ప్రజలమని చెప్పుకుంటూనే ఆయనకు ఇష్టంలేని మతాచారాలను పాటిస్తూ అక్రమాలు చేస్తూ హింసలకు పాల్పడ్డారు. అందుకే దేవునికి వాళ్లపై కోపం వచ్చిందని ఈ ప్రవక్తలు చాలా స్పష్టంగా తెలియజేశారు.—2 రాజులు 21:10-15; యెషయా 3:1-8, 16-26; యిర్మీయా 2:1–3:13.

2. సత్యారాధన మళ్లీ మొదలవడం. దేవుని ప్రజలు 70 సంవత్సరాలపాటు బబులోనులో బంధీలుగా ఉండి, తర్వాత విడుదలై నిర్జనంగావున్న తమ స్వదేశానికి తిరిగివచ్చి యెరూషలేములో యెహోవా ఆలయాన్ని తిరిగి కడతారని ప్రవక్తలు ముందే చెప్పారు. (యిర్మీయా 46:27; ఆమోసు 9:13-15) కోరెషు రాజు బబులోనును జయించి యూదులు మళ్లీ యెహోవాను ఆరాధించడానికి పంపిస్తాడని 200 సంవత్సరాల పూర్వమే యెషయా ప్రవచించాడు. కోరెషు బబులోనును ఎంత తెలివిగా జయిస్తాడనే విషయాన్ని కూడా యెషయా స్పష్టంగా వివరించాడు.—యెషయా 44:24–45:3.

3. మెస్సీయ రాక, ఆయన జీవితం. మెస్సీయ బేత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవక్త చెప్పాడు. (మీకా 5:2) ఆయన వినయంగల వ్యక్తి అని, గాడిదపిల్లమీద యెరూషలేముకు వస్తాడని జెకర్యా ప్రవచించాడు. (జెకర్యా 9:9) ఆయన ఎంతో సాత్వికుడూ దయగలవాడూ అయినా సరే ప్రజలు ఆయనను ఆదరించరనీ చాలామంది ఆయనను తిరస్కరిస్తారనీ యెషయా చెప్పాడు. (యెషయా 42:1-3; 53:1, 3) ఆయన క్రూరంగా చంపబడతాడని కూడా ప్రవచించబడింది. మెస్సీయగా ఆయన పాత్ర అంతవరకేనా? లేదు, ఆయన తన ప్రాణాల్ని బలిగా ఇవ్వడంవల్లే అనేకమంది పాపాలు క్షమించబడతాయని యెషయా చెప్పాడు. (యెషయా 53:4, 5, 9-12) దేవుడు ఆయనను పునరుత్థానం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది.

4. భూమ్మీద మెస్సీయ పరిపాలన. అపరిపూర్ణ మానవులు శాంతియుతంగా పరిపాలించలేరు, దానికి భిన్నంగా మెస్సీయ రాజు పరిపాలిస్తే పూర్తి స్థాయిలో శాంతి సమాధానాలుంటాయి కాబట్టి బైబిలు ఆయనను సమాధానకర్తయైన అధిపతి అని పిలుస్తోంది. (యెషయా 9:6, 7; యిర్మీయా 10:23) ఆయన పరిపాలనలో మనుషులందరూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటారు. జంతువులపట్ల మనుషులు క్రూరంగా ప్రవర్తించరు, అవి వాళ్లకు ఏ హానీ చేయవు. (యెషయా 11:3-7) మనుషులు ఇక ఎన్నడూ రోగాల బారినపడరు. (యెషయా 33:24) మరణం ఇక ఉండదు. (యెషయా 25:8) మెస్సీయ పరిపాలనలో దేవుడు చనిపోయినవాళ్ళని తిరిగి బ్రతికిస్తాడు, వాళ్ళు ఇదే భూమ్మీద జీవిస్తారు.—దానియేలు 12:13.

—యెషయా; యిర్మీయా; దానియేలు; ఆమోసు; మీకా; జెకర్యా.