భాగం 6
కష్టాలొచ్చినా యోబు దేవునికి నమ్మకంగా ఉన్నాడు
కష్టాలొచ్చినా యోబు నమ్మకంగా ఉంటాడా అని సాతాను దేవుణ్ణి సవాలు చేశాడు. అయితే యోబు యెహోవాపట్ల నమ్మకంగా ఉన్నాడు
తీవ్రమైన పరీక్షలు ఎదురైనప్పుడు లేదా దేవుని మాట వింటే తనకేం ప్రయోజనం లేదనుకున్నప్పుడు కూడా ఏ మనిషైనా దేవునికి నమ్మకంగా ఉంటాడా? యోబు విషయంలో ఈ ప్రశ్నే తలెత్తింది, దానికి జవాబు కూడా ఇవ్వబడింది.
ఇశ్రాయేలీయులు ఇంకా ఐగుప్తులో ఉండగానే, అబ్రాహాము బంధువైన యోబు ఇప్పుడు మనం అరేబియా అని పిలిచే ప్రాంతంలో నివసించేవాడు. ఒకసారి పరలోకంలో దేవదూతలు దేవుని ముందు సమావేశమయ్యారు. వారిలో దేవునికి ఎదురు తిరిగిన సాతాను కూడా ఉన్నాడు. యెహోవా వాళ్లముందు తన సేవకుడైన యోబు తనకెంత నమ్మకంగా ఉంటున్నాడో చెప్పాడు. నిజానికి, యోబు అంత నమ్మకమైన వ్యక్తి భూమ్మీద మరొకరు లేరని యెహోవా అన్నాడు. అయితే, దేవుడు యోబును ఆశీర్వదించి కాపాడుతున్నందుకే ఆయన దేవుణ్ణి సేవిస్తున్నాడని సాతాను అన్నాడు. యోబుకు ఏమీ లేకుండా చేస్తే ఆయన దేవుణ్ణి దూషిస్తాడని కూడా అన్నాడు.
దేవుని అనుమతితో సాతాను ముందుగా యోబు ఆస్తిని, పిల్లలను లేకుండా చేశాడు. తర్వాత ఆయనకు ఘోరమైన వ్యాధి రప్పించాడు. అదంతా సాతానే చేస్తున్నాడని తెలియక, ఆ బాధల్ని దేవుడు ఎందుకు రానిచ్చాడో అర్థంకాక యోబు ఎంతో సతమతమయ్యాడు. అయినా, యోబు ఎన్నడూ దేవుణ్ణి దూషించలేదు.
యోబు కపట స్నేహితులు ముగ్గురు ఆయనను చూడ్డానికి వచ్చి ఒకరి తర్వాత ఒకరు ఆయనతో మాట్లాడారు. యోబు రహస్యంగా పాపాలు చేసినందుకే దేవుడు ఆయనను శిక్షిస్తున్నాడని ఒప్పించడానికి ప్రయత్నించారు. దేవుని దృష్టిలో మనుషులకు అసలు విలువ లేదని, ఆయనకు వారిమీద నమ్మకం లేదని కూడా వాళ్లు అన్నారు. యోబు వాళ్ల తప్పుడు వాదనను అంగీకరించలేదు. తను చనిపోయేంతవరకు దేవునికి నమ్మకంగానే ఉంటానని యోబు దృఢంగా చెప్పాడు. యోబు గ్రంథంలోని చాలా భాగంలో వీళ్లందరి మధ్య జరిగిన సంభాషణే ఉంది.
అయితే, యోబు ఒక పొరపాటు చేశాడు. ఆయన తనను తాను సమర్థించుకోవడానికే ప్రయత్నించాడు. వయసులో చిన్నవాడైన ఎలీహు అప్పటివరకు వాళ్ల వాదనలను విన్నాడు. తర్వాత వాళ్లను సరిచేయడానికి ప్రయత్నించాడు. మనుషులు నీతిమంతులని నిరూపించుకోవడం కాదుగానీ యెహోవా పరిపాలనా హక్కు సరైనదని నిరూపించబడడమే ఎంతో ప్రాముఖ్యమనే విషయం యోబు గ్రహించలేదు. అందుకే ఎలీహు ఆయనను సరిదిద్దాడు. ఎలీహు యోబు కపట స్నేహితులను కూడా గట్టిగా మందలించాడు.
ఆ తర్వాత, యోబును సరిదిద్దుతూ యెహోవా దేవుడు ఆయనతో మాట్లాడాడు. సృష్టిలోని అనేక అద్భుతాల గురించి చెప్పి తన ముందు మనుషులు ఎంత అల్పులో యోబుకు చూపించాడు. దేవుడు సరిదిద్దినప్పుడు యోబు వినయంగా తన తప్పు ఒప్పుకున్నాడు. యెహోవా ‘జాలి, కనికరం గలవాడు’ కాబట్టి యోబు వ్యాధిని నయం చేసి ఆయనకు అంతకుముందున్న దానికంటే రెండింతలు ఎక్కువ ఆస్తినిచ్చి, పదిమంది పిల్లలతో ఆశీర్వదించాడు. (యాకోబు 5:11) తీవ్రమైన పరీక్షలు ఎదురైనా యోబు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. అలా ఆయన, పరీక్షలు ఎదురైతే మనుషులు దేవునికి నమ్మకంగా ఉండరని సాతాను విసిరిన సవాలుకు ధీటైన జవాబిచ్చాడు.
—యోబు గ్రంథము.