కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

యేసుక్రీస్తు—వాగ్దానం చేయబడిన మెస్సీయ

యేసుక్రీస్తు—వాగ్దానం చేయబడిన మెస్సీయ

మెస్సీయను గుర్తించేలా మనకు సహాయం చేయడానికి యెహోవా దేవుడు ఆ వాగ్దత్త విమోచకుని జననం, పరిచర్య, మరణం గురించిన వివరాలు తెలియజేయడానికి అనేకమంది బైబిలు ప్రవక్తలను ప్రేరేపించాడు. ఆ బైబిలు ప్రవచనాలన్నీ యేసుక్రీస్తులో నెరవేరాయి. అవి ఆశ్చర్యం కలిగించేంత ఖచ్చితమైనవి, వివరణాత్మకమైనవి. ఉదాహరణకు, మెస్సీయ జననం, బాల్యం గురించిన కొన్ని ప్రవచనాలను మనం పరిశీలిద్దాం.

మెస్సీయ రాజైన దావీదు వంశంలో పుడతాడని యెషయా ప్రవక్త ముందే చెప్పాడు. (యెషయా 9:7) యేసు నిజంగా దావీదు వంశంలోనే జన్మించాడు.—మత్తయి 1:1, 6-17.

దేవుని మరో ప్రవక్త అయిన మీకా ఆ బాలుడు “బేత్లెహేము ఎఫ్రాతా”లో జన్మిస్తాడనీ, ఆయన చివరకు పరిపాలకుడు అవుతాడనీ ప్రవచించాడు. (మీకా 5:2) యేసు జన్మించిన సమయంలో ఇశ్రాయేలులో బేత్లెహేము అనే పేరుగల రెండు పట్టణాలు ఉన్నాయి. ఒకటి ఆ దేశపు ఉత్తర ప్రాంతంలో నజరేతుకు దగ్గర్లో ఉంటే, మరొకటి యూదయలో యెరూషలేముకు సమీపంలో ఉంది. యెరూషలేముకు సమీపంగా ఉన్న బేత్లెహేమును ఇదివరకు ఎఫ్రాతా అని పిలిచేవారు. ప్రవచనంలో చెప్పబడినట్లుగా యేసు ఆ పట్టణంలోనే జన్మించాడు!—మత్తయి 2:1.

దేవుని కుమారుడు “ఐగుప్తు దేశములో నుండి” పిలువబడతాడని మరో బైబిలు ప్రవచనం చెప్పింది. బాలుడైన యేసు ఐగుప్తుకు తీసుకువెళ్ళబడ్డాడు. హేరోదు మరణించిన తర్వాత ఆయన వెనక్కి తీసుకురాబడ్డాడు, ఆ విధంగా ఆ ప్రవచనం నెరవేరింది.—హోషేయ 11:1; మత్తయి 2:15.

200వ పేజీలోని చార్టులో “ప్రవచనం” అనే శీర్షిక క్రింద ఇవ్వబడిన లేఖనాల్లో  మెస్సీయ గురించిన వివరాలు ఉన్నాయి. దయచేసి వాటిని “నెరవేర్పు” అనే శీర్షిక క్రింద ఇవ్వబడిన లేఖనాలతో పోల్చండి. అలా పోల్చి చూడడం ద్వారా దేవుని వాక్యం సత్యం అనే మీ విశ్వాసం బలోపేతమవుతుంది.

మీరు ఈ లేఖనాలను పరిశీలిస్తున్నప్పుడు, ఆ ప్రవచనాత్మక విషయాలు యేసు జన్మించడానికి వందల సంవత్సరాల పూర్వమే వ్రాయబడ్డాయని గుర్తుంచుకోండి. యేసు ఇలా చెప్పాడు: “మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెను.” (లూకా 24:44) బైబిలు స్పష్టంగా చూపిస్తున్నట్లుగా ఆ ప్రవచనాలన్నీ ప్రతీ చిన్న వివరంతో సహా నిజంగా నెరవేరాయి!