113వ కథ
రోమాలో పౌలు
చూడండి, పౌలుకు గొలుసులు వేయబడ్డాయి, రోమా సైనికుడు ఆయనకు కాపలాగా ఉన్నాడు. పౌలు రోమాలో ఖైదీగా ఉన్నాడు. రోమా పరిపాలకుడైన కైసరు తనను ఏమి చేయాలో నిర్ణయించే వరకూ ఆయన వేచివుండాలి. ఖైదీగా ఉన్నప్పుడు ప్రజలు ఆయనను దర్శించడానికి అనుమతి ఇవ్వబడింది.
పౌలు రోమాకు చేరిన మూడు రోజుల తర్వాత, తనను వచ్చి కలవమని కొంతమంది యూదా నాయకులకు కబురు పంపించాడు. ఆ కారణంగా రోమాలోని చాలామంది యూదులు ఆయన చూడడానికి వచ్చారు. పౌలు వాళ్ళకు యేసు గురించి, దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. కొంతమంది నమ్మి క్రైస్తవులయ్యారు, కానీ కొంతమంది నమ్మలేదు.
పౌలు తనను కాపలా కాయడానికి నియమించబడిన వేర్వేరు సైనికులకు కూడా ప్రకటించాడు. ఆయనను ఖైదీగా ఉంచిన రెండు సంవత్సరాలు ఆయన ప్రకటించగలిగిన ప్రతీ ఒక్కరికి ప్రకటించాడు. ఫలితంగా కైసరు ఇంటివాళ్ళు కూడా రాజ్య సువార్తను విన్నారు, వాళ్ళలో కొందరు క్రైస్తవులయ్యారు.
అయితే ఇక్కడ బల్లవద్ద వ్రాస్తూవున్న సందర్శకుడెవరు? ఆయన ఎవరో మీరు ఊహించగలరా? అవును, ఆయన తిమోతి. రాజ్యం గురించి ప్రకటించినందుకు తిమోతి కూడా చెరసాలలో వేయబడ్డాడు, కానీ ఆ తర్వాత విడుదల చేయబడ్డాడు. ఆయన పౌలుకు సహాయం చేయడానికి రోమాకు వచ్చాడు. తిమోతి ఏమి వ్రాస్తున్నాడో మీకు తెలుసా? చూద్దాం.
మీకు 110వ కథలో చెప్పబడిన ఫిలిప్పీ, ఎఫెసు పట్టణాలు గుర్తున్నాయా? ఆ పట్టణాలలో క్రైస్తవ సంఘాలు ప్రారంభించడానికి పౌలు సహాయపడ్డాడు. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఆ క్రైస్తవులకు పత్రికలు వ్రాశాడు. ఆ పత్రికలు బైబిలులో ఉన్నాయి, వాటిని ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక అంటారు. పౌలు ఫిలిప్పీలోని క్రైస్తవ స్నేహితులకు ఏమి వ్రాయాలో తిమోతికి చెబుతున్నాడు.
ఫిలిప్పీయులు పౌలుపట్ల ఎంతో దయగా ప్రవర్తించారు. వాళ్ళు ఆయన కోసం చెరసాలకు ఒక బహుమతి పంపించారు, కాబట్టి పౌలు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆయనకు బహుమతిని తెచ్చిన వ్యక్తి ఎపఫ్రొదితు. ఆయన ఎంతో జబ్బుపడి దాదాపు చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఆ తర్వాత ఆయన బాగుపడి తిరిగి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఫిలిప్పీకి తిరిగి వెళ్ళినప్పుడు పౌలు, తిమోతీలు వ్రాసిన పత్రికను తనతోపాటు తీసుకొని వెళ్ళాడు.
పౌలు చెరసాలలో ఉన్నప్పుడు, మనకు బైబిల్లో కనిపించే మరో రెండు పత్రికలను కూడా వ్రాశాడు. ఒకటి కొలొస్సయి పట్టణంలో ఉన్న క్రైస్తవులకు వ్రాశాడు. దానిని ఏమని పిలుస్తారో మీకు తెలుసా? కొలొస్సయులకు వ్రాసిన పత్రిక అంటారు. మరొకటి కొలొస్సయిలో ఉండే ఫిలేమోను అనే సన్నిహిత స్నేహితునికి వ్రాసిన వ్యక్తిగత పత్రిక. ఆ పత్రికను ఫిలేమోను సేవకుడైన ఒనేసిము గురించి వ్రాశాడు.
ఒనేసిము ఫిలేమోను దగ్గరనుంచి పారిపోయి రోమాకు వచ్చాడు. పౌలు చెరసాలలో ఉన్నట్లు ఒనేసిముకు తెలిసింది. కాబట్టి ఆయన పౌలును దర్శించడానికి వచ్చాడు, అప్పుడు పౌలు ఒనేసిముకు ప్రకటించాడు. కొద్దికాలానికే ఒనేసిము కూడా క్రైస్తవుడయ్యాడు. ఆ తర్వాత ఒనేసిము తాను పారిపోయి వచ్చినందుకు చింతించాడు. కాబట్టి పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రికలో ఏమి వ్రాశాడో మీకు తెలుసా?
పౌలు ఒనేసిమును క్షమించమని ఫిలేమోనును కోరాడు. ‘నేను అతనిని తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను. అయితే ఇప్పుడు అతను కేవలం నీ సేవకుడే కాదు. అతను ఒక మంచి క్రైస్తవ సహోదరుడు కూడా’ అని పౌలు వ్రాశాడు. ఒనేసిము కొలొస్సయికు తిరిగి వెళ్ళినప్పుడు, పౌలు కొలస్సయులకు వ్రాసిన పత్రికను, ఫిలేమోనుకు వ్రాసిన పత్రికను తనతోపాటు తీసుకొని వెళ్ళాడు. తన సేవకుడు ఒక క్రైస్తవుడిగా తిరిగి వచ్చాడని తెలుసుకున్నప్పుడు ఫిలేమోను ఎంత సంతోషించి ఉంటాడో మనం ఊహించవచ్చు.
పౌలు ఫిలిప్పీయులకు, ఫిలేమోనుకు పత్రికలు వ్రాసినప్పుడు ఎంతో సంతోషకరమైన సమాచారం వ్రాశాడు. పౌలు ఫిలిప్పీయులకు, ‘నేను మీ దగ్గరకు తిమోతిని పంపిస్తున్నాను. త్వరలో నేను కూడా మిమ్మల్ని దర్శిస్తాను’ అని వ్రాశాడు. ఫిలేమోనుకేమో ‘నేను అక్కడ ఉండడానికి స్థలం సిద్ధం చెయ్యి’ అని వ్రాశాడు.
పౌలు విడుదల చేయబడినప్పుడు ఆయన అనేక స్థలాల్లో క్రైస్తవ సహోదర సహోదరీలను దర్శించాడు. కానీ పౌలు తరువాత రోమాలో మళ్ళీ చెరసాలలో వేయబడ్డాడు. ఈసారి తాను చంపబడతాడని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన తిమోతిని త్వరగా రమ్మని కోరుతూ ఉత్తరం వ్రాశాడు. ‘నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను, దేవుడు నాకు ప్రతిఫలమిస్తాడు’ అని పౌలు వ్రాశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు చంపబడ్డాడు. యెరూషలేము మళ్ళీ నాశనం చేయబడింది, కానీ ఈసారి దానిని రోమా దేశస్థులు నాశనం చేశారు.
అయితే బైబిల్లో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. యెహోవా దేవుడు అపొస్తలుడైన యోహాను ద్వారా బైబిలులోని ప్రకటన గ్రంథంతో సహా మిగిలిన చివరి పుస్తకాలను వ్రాయించాడు. ప్రకటన గ్రంథం భవిష్యత్తు గురించి చెబుతోంది. భవిష్యత్తులో ఏమి జరగబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.