90వ కథ
బావి దగ్గర స్త్రీతో మాట్లాడడం
యేసు సమరయలోని ఒక బావి దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి ఆగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి పట్టణంలోకి వెళ్ళారు. ఇక్కడ యేసు మాట్లాడుతున్న స్త్రీ నీళ్ళు చేదుకోవడానికి బావి దగ్గరకు వచ్చింది. ఆయన ఆమెతో, ‘నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు’ అని అడిగాడు.
యేసు తనతో మాట్లాడడాన్ని చూసి ఆ స్త్రీ ఎంతో ఆశ్చర్యపోయింది. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే యేసు యూదుడు, ఆమె సమరయ స్త్రీ. చాలామంది యూదులు సమరయులను ఇష్టపడేవారు కాదు. కనీసం వాళ్ళతో మాట్లాడేవారు కాదు! కానీ యేసు ప్రజలందరినీ ప్రేమించేవాడు. అందుకే ఆయన, ‘నీళ్ళు ఇవ్వమని నిన్ను అడుగుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిసివుంటే, నువ్వు ఆయనను జీవజలములు ఇమ్మని అడిగేదానివి, ఆయన నీకు వాటిని ఇచ్చివుండేవాడు’ అని అన్నాడు.
అప్పుడు ఆ స్త్రీ ‘అయ్యా, బావి లోతుగా ఉంది, మీ దగ్గర చేద కూడా లేదు. మీరు ఆ జీవజలాన్ని ఎక్కడ నుండి తెస్తారు?’ అని అడిగింది.
‘నువ్వు ఈ బావిలోని నీళ్ళు త్రాగితే మళ్ళీ దాహం వేస్తుంది. కానీ నేనిచ్చే నీళ్ళు ఒక వ్యక్తి నిరంతరం జీవించేలా చేస్తాయి’ అని యేసు వివరించాడు.
అప్పుడు ఆ స్త్రీ ‘అయ్యా, నాకు ఆ నీళ్ళు ఇవ్వండి! అప్పుడు నాకు ఎన్నటికీ దాహం వేయదు. నేను మళ్ళీ నీళ్ళు చేదుకోవడానికి ఈ బావి దగ్గరకు రావలసిన అవసరముండదు’ అని అంది.
యేసు నిజమైన నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడని ఆ స్త్రీ అనుకుంది. కానీ ఆయన దేవునికి, ఆయన రాజ్యానికి సంబంధించిన సత్యం గురించి మాట్లాడాడు. ఆ సత్యం జీవజలంవంటిది. అది ఒక వ్యక్తికి నిత్యజీవాన్ని ఇవ్వగలదు.
అప్పుడు యేసు ఆ స్త్రీతో, ‘నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకొనిరా’ అని చెప్పాడు.
ఆమె ‘నాకు భర్త లేడు’ అని సమాధానమిచ్చింది.
‘నువ్వు సరిగ్గానే చెప్పావు. గతంలో నీకు ఐదుగురు భర్తలు ఉండేవారు, అయితే ఇప్పుడు నువ్వు ఎవరితోనైతే జీవిస్తున్నావో ఆ వ్యక్తి నీ భర్త కాదు’ అని యేసు అన్నాడు.
యేసు తన గురించి చెప్పినదంతా నిజమే కాబట్టి ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. యేసుకు ఆ విషయాలన్నీ ఎలా తెలుసు? యేసు, దేవుడు పంపిన వాగ్దానం చేయబడిన వ్యక్తి, దేవుడే ఆయనకు ఆ సమాచారాన్ని అందించాడు. ఆ సమయంలో యేసు శిష్యులు తిరిగి వచ్చారు, ఆయన సమరయ స్త్రీతో మాట్లాడడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు.
ఈ విషయమంతటి నుండి మనమేమి నేర్చుకోవచ్చు? యేసు అన్ని జాతుల ప్రజలతో దయగా వ్యవహరిస్తాడని అది చూపిస్తోంది. మనం కూడా అలాగే ఉండాలి. కొంతమంది ప్రజలు వేరే జాతికి చెందినవారు కాబట్టి వాళ్ళు చెడ్డవాళ్ళు అని మనం తలంచకూడదు. నిత్యజీవానికి నడిపించే సత్యాన్ని అన్ని జాతుల ప్రజలు తెలుసుకోవాలని యేసు ఇష్టపడుతున్నాడు. మనం కూడా ప్రజలు సత్యం నేర్చుకోవడానికి సహాయపడేందుకు ఇష్టపడాలి.