63వ కథ
జ్ఞానియైన సొలొమోను రాజు
సొలొమోను యౌవనస్థుడిగా ఉన్నప్పుడే రాజయ్యాడు. ఆయన యెహోవాను ప్రేమించాడు, తన తండ్రియైన దావీదు తనకిచ్చిన మంచి సలహాను అనుసరించాడు. యెహోవా సొలొమోనును చూసి సంతోషపడ్డాడు, కాబట్టి ఒకరాత్రి కలలో ఆయన సొలొమోనుతో, ‘సొలొమోనూ, నేను నీకేమివ్వాలి?’ అని అడిగాడు.
అప్పుడు సొలొమోను, ‘యెహోవా, నా దేవా, నేను చాలా చిన్నవాడను. ఎలా పరిపాలించాలో నాకు తెలియదు. కాబట్టి నేను నీ ప్రజలను సరైన రీతిగా పాలించడానికి నాకు వివేకమును అనుగ్రహించు’ అని సమాధానమిచ్చాడు.
సొలొమోను అడిగిన దానినిబట్టి యెహోవా సంతోషించాడు. ఆయన సొలొమోనుతో, ‘నీవు దీర్ఘాయువును, ఐశ్వర్యాన్ని అడగకుండా వివేకమును అనుగ్రహించమని అడిగావు, జీవించిన వారిలోకెల్లా అత్యధికమైన వివేకమును నేను నీకిస్తాను. అంతేగాక నీవు అడగని ఐశ్వర్యమును, ఘనతను కూడా నీకిస్తాను’ అని చెప్పాడు.
కొంతకాలం తర్వాత ఇద్దరు స్త్రీలు ఒక కఠినమైన సమస్యతో సొలొమోను దగ్గరకు వచ్చారు. ‘నేను, ఈ స్త్రీ ఒకే ఇంట్లో ఉంటున్నాము. నేను ఒక బిడ్డను ప్రసవించాను. రెండు రోజుల తర్వాత ఆమె కూడా ఒక మగబిడ్డను ప్రసవించింది. ఒక రాత్రి ఆమె బాబు చనిపోయాడు. అయితే నేను నిద్రిస్తున్నప్పుడు ఆమె తన చనిపోయిన బాబును నా ప్రక్కన పెట్టి నా బాబును తీసుకుంది. నేను నిద్ర లేచి నా ప్రక్కనున్న చనిపోయిన బిడ్డను చూసినప్పుడు వాడు నా బాబు కాదని తెలిసింది’ అని ఒక స్త్రీ వివరించింది.
అప్పుడు రెండో స్త్రీ, ‘కాదు! బ్రతికి ఉన్నది నా బాబు, చనిపోయినది ఆమె బాబు!’ అన్నది. దానికి మొదటి స్త్రీ, ‘కాదు! చనిపోయినది నీ బిడ్డే, బ్రతికి ఉన్నది నా బిడ్డ!’ అని అన్నది. అలా ఆ ఇద్దరూ వాదించుకున్నారు. మరి సొలొమోను ఏమి చేశాడు?
ఆయన ఒక ఖడ్గము తెప్పించాడు, తర్వాత ‘ఆ బిడ్డను రెండు ముక్కలు చేసి ఇద్దరికీ చెరో ముక్కను ఇవ్వండి’ అని చెప్పాడు.
‘వద్దు! దయచేసి బిడ్డను చంపవద్దు. బాబును ఆమెకే ఇవ్వండి!’ అని నిజమైన తల్లి కేక వేసింది. అయితే రెండో స్త్రీ, ‘బిడ్డను మా ఇద్దరిలో ఎవరికీ ఇవ్వొద్దు; ఆ బిడ్డను రెండు ముక్కలుగా చేయండి’ అంది.
చివరకు సొలొమోను, ‘బిడ్డను చంపవద్దు! వాడిని మొదటి స్త్రీకే ఇవ్వండి. ఆమె నిజమైన తల్లి’ అన్నాడు. నిజమైన తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమించిందంటే తన బిడ్డ చంపబడకుండా ఉండేలా వాడిని మరో స్త్రీకి ఇవ్వడానికి కూడా సిద్ధపడింది, కాబట్టి ఆమె నిజమైన తల్లి అని సొలొమోనుకు తెలిసింది. సొలొమోను సమస్యను ఎలా పరిష్కరించాడో ప్రజలు విన్నప్పుడు తమకు అలాంటి జ్ఞానియైన రాజు ఉన్నందుకు వాళ్ళు సంతోషించారు.
సొలొమోను పరిపాలనా కాలమంతటిలో భూమి విస్తారంగా గోధుమలు, యవలు, ద్రాక్ష, అంజూరాలు మరితర ఆహార పదార్థాలను ఇచ్చేలా చేయడం ద్వారా దేవుడు ప్రజలను ఆశీర్వదించాడు. ప్రజలు మంచి వస్త్రాలు ధరించి, మంచి ఇండ్లలో నివసించారు. మంచివన్ని అందరికి అవసరమైన దానికంటే అధికంగా ఉండేవి.