కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1వ అధ్యాయం

‘అతను మృతినొందినా మాట్లాడుతున్నాడు’

‘అతను మృతినొందినా మాట్లాడుతున్నాడు’

1. ఆదాము కుటుంబం ఏదెను తోటలోకి ప్రవేశించకుండా ఏది అడ్డుకుంది? హేబెలు ఎక్కువగా కోరుకున్నది ఏమిటి?

 హేబెలు, పర్వత మైదానంలో ప్రశాంతంగా మేత మేస్తున్న గొర్రెల మందవైపు ఒకసారి చూశాడు. మందకు అల్లంత దూరంలో కనబడుతున్న వెలుగుపై అతని చూపు పడివుంటుంది. ఏదెను తోటలోకి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడానికి అక్కడో ఖడ్గజ్వాల అనుక్షణం తిరుగుతూ ఉంటుందని అతనికి తెలుసు. తన తల్లిదండ్రులు ఒకప్పుడు ఆ తోటలోనే నివసించేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లకుగానీ వాళ్ల పిల్లలకుగానీ అందులోకి ప్రవేశం లేదు. ఆ సంధ్యవేళ పిల్లగాలులకు హేబెలు తలవెంట్రుకలు ఎగిరిపడుతుండగా, అతను ఆకాశం వైపు చూస్తూ సృష్టికర్త గురించి ఆలోచిస్తున్నట్టు ఊహించుకోండి. మనిషికీ, దేవునికీ మధ్య ఏర్పడిన అగాధం ఏనాటికైనా కరిగేనా? అలా జరగాలన్నదే అతని కోరిక.

2-4. నేడు హేబెలు మనతో ఎలా మాట్లాడుతున్నాడు?

2 నేడు హేబెలు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం మీకు వినిపిస్తోందా? అది అసాధ్యమని మీరు అంటారేమో. అవును, ఆదాము రెండో కుమారుడైన హేబెలు చనిపోయి దాదాపు 6,000 సంవత్సరాలు కావస్తోంది. ఈపాటికి ఆయన ఎముకలు కూడా పూర్తిగా మట్టిలో కలిసిపోయివుంటాయి. ‘చనిపోయినవాళ్లు ఏమీ ఎరుగరు’ అని బైబిలు చెబుతోంది. (ప్రసం. 9:5, 10) పైగా హేబెలు మాట్లాడిన ఒక్క మాట కూడా బైబిల్లో లేదు. మరి ఆయన మనతో ఎలా మాట్లాడగలడు?

3 హేబెలు గురించి దేవుని ప్రేరణతో పౌలు ఇలా రాశాడు: ‘అతను మృతినొందినా మాట్లాడుతున్నాడు.’ (హెబ్రీయులు 11:4 చదవండి.) ఎలా? విశ్వాసం ద్వారా. ఈ విలక్షణమైన లక్షణాన్ని అలవర్చుకున్న మొట్టమొదటి మనిషి హేబెలే. ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే ఈనాటికీ అది సజీవంగా ఉంది, విశ్వాసానికి సాటిలేని ప్రమాణంగా నిలిచింది. హేబెలును ఆదర్శంగా తీసుకొని ఆయనలా విశ్వాసం చూపిస్తే, ఆయన మన కళ్లముందే ఉండి మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.

4 హేబెలు గురించి బైబిలు చెప్పేది చాలా తక్కువే అయినా ఆయన గురించి, ఆయన విశ్వాసం గురించి ఎంతో నేర్చుకోవచ్చు. ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం.

‘లోకం పుట్టిన’ తొలినాళ్లలో పెరిగి పెద్దయిన హేబెలు

5. హేబెలును ‘లోకం పుట్టుకతో’ ముడిపెడుతూ యేసు మాట్లాడిన మాటలకు అర్థమేమిటి? (అధస్సూచి కూడా చూడండి.)

5 హేబెలు మానవ చరిత్ర తొలినాళ్లలో పుట్టాడు. చాలా ఏళ్ల తర్వాత యేసు మాట్లాడుతూ హేబెలును ‘లోకం పుట్టుకతో’ ముడిపెట్టాడు. (లూకా 11:50, 51 చదవండి.) యేసు ఇక్కడ లోకం అన్నప్పుడు, పాపం నుండి విముక్తి పొందే అవకాశమున్న వాళ్ల గురించి మాట్లాడుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడున్న మనుషుల్లో హేబెలు నాలుగోవాడైనా, దేవుని దృష్టిలో విమోచనకు అర్హులైనవాళ్లలో హేబెలే మొదటివాడని అనిపిస్తోంది. a అంటే హేబెలు పెరిగింది మంచి వాతావరణంలో కాదని అర్థమౌతోంది.

6. హేబెలు తల్లిదండ్రులు ఎలాంటివాళ్లు?

6 మానవ కుటుంబం మొదలైన కొంతకాలానికే విషాద ఛాయలు అలుముకున్నాయి. హేబెలు తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు అందంగా, బలంగా ఉండివుంటారు. కానీ ఏం లాభం? వాళ్లు తమ జీవితంలో ఒక ఘోరమైన తప్పు చేశారు, ఆ విషయం వాళ్లకీ తెలుసు. ఒకప్పుడు వాళ్లు పరిపూర్ణులు, పైగా నిరంతరం జీవించే సువర్ణావకాశం కూడా వాళ్లకుండేది. కానీ, వాళ్లు యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేశారు, దాంతో ఆయన వాళ్లను సుందరమైన ఏదెను తోటలో నుండి బయటకు పంపించేశాడు. వాళ్లు అన్నిటికన్నా, చివరకు తమ పిల్లల అవసరాల కన్నా కూడా తమ కోరికలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. వాళ్లు పరిపూర్ణతను, నిరంతరం జీవించే అవకాశాన్ని చేజార్చుకున్నారు.—ఆది. 2:15–3:24.

7, 8. కయీను పుట్టినప్పుడు హవ్వ ఏమని అంది? ఆమె మనసులో ఏమి ఉండివుంటుంది?

7 ఏదెను తోట నుండి వచ్చేశాక ఆదాముహవ్వల జీవితం దుర్భరంగా మారింది. అయినా, వాళ్ల మొదటి బిడ్డ కయీను పుట్టినప్పుడు హవ్వ ఇలా అంది: “యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాను.” ఒక స్త్రీకి “సంతానం” కలుగుతుందనీ, ఆ సంతానం ఆదాముహవ్వలను మోసగించిన దుష్టుణ్ణి నాశనం చేస్తుందనీ ఏదెను తోటలో యెహోవా చేసిన వాగ్దానం ఆమె మనసులో ఉన్నట్టు ఆ మాటలను బట్టి తెలుస్తోంది. (ఆది. 3:15; 4:1) ఆ స్త్రీ తనేనని, ఆ “సంతానం” కయీనేనని హవ్వ అనుకుందా?

8 ఒకవేళ అలా అనుకునివుంటే, ఆమె పొరబడినట్టే. దానికితోడు, ఆదాముహవ్వలు కయీను మనసులో కూడా అవే ఆలోచనలు నూరిపోసివుంటే, ఎందుకూ పనికిరాని అహాన్ని అతనిలో పెంచిపోషించినట్టే. కొంతకాలానికి హవ్వకు మరో బిడ్డ పుట్టాడు. కానీ ఈ బిడ్డ గురించి వాళ్లు గొప్పగా అనుకున్న దాఖలాలు బైబిల్లో ఎక్కడా లేవు. ఈ బిడ్డకు వాళ్లు హేబెలు అని పేరు పెట్టారు, ఆ పేరుకు “నిశ్వాసం” లేదా “వ్యర్థం” అనే అర్థాలు ఉండివుండవచ్చు. (ఆది. 4:2) కయీను మీద పెట్టుకున్నన్ని ఆశలు హేబెలు మీద పెట్టుకోకపోవడం వల్లే ఆ పేరు పెట్టివుంటారా? మనకైతే తెలీదు.

9. మన మొదటి తల్లిదండ్రుల నుండి నేటి తల్లిదండ్రులు ఏ పాఠం నేర్చుకోవచ్చు?

9 ఆదాముహవ్వల నుండి నేటి తల్లిదండ్రులు ఒక పాఠం నేర్చుకోవచ్చు. మీ మాటలతో, చేతలతో మీ పిల్లల మనసుల్లో గర్వం, అధికార దాహం, స్వార్థం వంటి లక్షణాల్ని నూరిపోస్తారా? లేదా యెహోవా దేవుణ్ణి ప్రేమించడం, ఆయనతో స్నేహం చేయడం నేర్పిస్తారా? విచారకరమైన విషయమేమిటంటే, మొదటి తల్లిదండ్రులు తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేదు. అయినాసరే వాళ్ల పిల్లలందరికీ మంచి భవిష్యత్తు పొందే అవకాశం ఉంది.

హేబెలు విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నాడు?

10, 11. కయీను, హేబెలు ఏయే పనులు చేపట్టారు? హేబెలు ఏ లక్షణాన్ని పెంపొందించుకున్నాడు?

10 ఆదాము ఎదిగే తన పిల్లలిద్దరికీ కుటుంబ పోషణ కోసం పనులు నేర్పించివుంటాడు. కయీను వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు, హేబెలు గొర్రెలు కాయడం మొదలుపెట్టాడు.

11 అయితే, హేబెలు ప్రాముఖ్యమైన మరో పని కూడా చేశాడు. సంవత్సరాలు గడుస్తుండగా హేబెలు, “విశ్వాసం” అనే లక్షణాన్ని పెంపొందించుకున్నాడు. ఆ చక్కని లక్షణం గురించే ఆ తర్వాత పౌలు రాశాడు. ఒక్కసారి ఆలోచించండి! ఆ రోజుల్లో, విశ్వాసం విషయంలో హేబెలుకు ఆదర్శంగా ఉన్న మానవులు ఎవరూ లేరు. మరైతే, యెహోవా దేవునిపై విశ్వాసాన్ని ఆయన ఎలా పెంపొందించుకున్నాడు? దేవునిపై బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి హేబెలుకు సహాయపడిన మూడు విషయాలను మనం ఇప్పుడు చూద్దాం.

12, 13. హేబెలు విశ్వాసం మరింతగా పెరగడానికి యెహోవా సృష్టిని గమనించడం ఎలా దోహదపడివుంటుంది?

12 యెహోవా సృష్టి. యెహోవా దేవుని శాపం వల్ల నేలమీద ముండ్లతుప్పలు, గచ్చపొదలు మొలవడంతో వ్యవసాయం కష్టతరంగా మారిన మాట నిజమే. అయినా, హేబెలు ఇంట్లో వాళ్లందరూ బ్రతకడానికి కావాల్సిన ఆహారాన్ని భూమి సమృద్ధిగా ఉత్పత్తి చేసింది. అదీగాక పక్షులు, చేపలతో సహా ఏ జంతువునూ దేవుడు శపించలేదు. అలాగే పర్వతాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, ఆకాశం, మేఘాలు, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవేవీ కూడా దేవుని శాపానికి గురికాలేదు. హేబెలు ఎటుచూసినా, సమస్తాన్ని సృష్టించిన యెహోవా దేవుని అపారమైన ప్రేమకు, జ్ఞానానికి, మంచితనానికి రుజువులే కనిపించాయి. (రోమీయులు 1:20 చదవండి.) సృష్టి కార్యాల గురించి, దేవుని లక్షణాల గురించి ఆలోచించినప్పుడు ఆయన విశ్వాసం ఖచ్చితంగా బలపడివుంటుంది.

ప్రేమగల సృష్టికర్త మీద విశ్వాసముంచడానికి బలమైన ఆధారాన్ని హేబెలు సృష్టిలో చూశాడు

13 యెహోవా గురించి ఆలోచించడానికి హేబెలు తప్పకుండా సమయం వెచ్చించివుంటాడు. ఆయన గొర్రెలను కాయడం ఊహించుకోండి. కాపరులు ఎక్కువగా నడవాల్సి ఉంటుంది. గొర్రెల కోసం పచ్చని గడ్డి, మంచినీరు, సేదదీర్పునిచ్చే నీడ ఉండే ప్రదేశాలను వెదుకుతూ ఆ సాధు జంతువులను కొండల మీద, లోయల్లోనూ, నదుల గుండా ఆయన నడిపించేవాడు. దేవుడు సృష్టించిన ప్రాణులన్నిటిలోకి గొర్రెలు నిస్సహాయమైనవి. వాటిని చూసినప్పుడు మనిషి కాపుదల, నడిపింపు లేకపోతే అవి మనుగడ సాగించలేవేమో అనిపిస్తుంది. అది గమనించిన హేబెలు తనకు కూడా మనుషుల కంటే ఎంతో తెలివైన, శక్తిమంతుడైనవాని నడిపింపు, కాపుదల, శ్రద్ధ అవసరమని గ్రహించాడా? ఆయన ప్రార్థనల్లో తప్పకుండా అలాంటివాటి గురించి ప్రస్తావించివుంటాడు, దానివల్ల ఆయన విశ్వాసం మరింతగా పెరుగుతూ వచ్చింది.

14, 15. యెహోవా వాగ్దానం చేసిన ఏయే విషయాల గురించి హేబెలు ధ్యానించాడు?

14 యెహోవా వాగ్దానాలు. దేవుడు తమను ఏదెను తోట నుండి వెళ్లగొట్టడానికి దారితీసిన సంఘటనల గురించి ఆదాముహవ్వలు తమ కుమారులకు చెప్పివుంటారు. అలా, ధ్యానించడానికి హేబెలుకు బోలెడు సమాచారం దొరికింది.

15 నేల శాపానికి గురౌతుందని యెహోవా చెప్పాడు. ముండ్ల తుప్పలను, గచ్చపొదలను చూసిన హేబెలుకు యెహోవా చెప్పిన మాట నెరవేరిందని అర్థమైంది. హవ్వ వేదనతో గర్భం ధరించి, పిల్లలను కంటుందని కూడా యెహోవా చెప్పాడు. తనకు తమ్ముళ్లూ, చెల్లెళ్లూ పుట్టినప్పుడు ఆ మాట కూడా నిజమేనని హేబెలుకు తెలిసింది. హవ్వ తన భర్త ప్రేమను, శ్రద్ధను అతిగా కోరుకుంటుందనీ, ఆదాము ఆమెపై ఆధిపత్యం చెలాయిస్తాడనీ యెహోవాకు ముందే తెలుసు. తన తల్లిదండ్రుల విషయంలో అలా జరగడం హేబెలు చూశాడు. ఇలా ప్రతీ విషయంలో, యెహోవా చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరడం హేబెలు చూశాడు. ఏదెను తోటలో జరిగిన తప్పువల్ల మొదలైన సమస్యలన్నిటినీ సరిదిద్దే “సంతానము” గురించి దేవుడు చేసిన వాగ్దానంపై హేబెలు విశ్వాసముంచడానికి అవన్నీ తిరుగులేని కారణాలుగా నిలిచాయి.—ఆది. 3:15-19.

16, 17. కెరూబులను చూసి హేబెలు ఏమి నేర్చుకునివుంటాడు?

16 యెహోవా సేవకులు. విశ్వాసం విషయంలో ఆదర్శప్రాయులైన మనుషులెవరూ హేబెలుకు కనిపించలేదు, అయితే ఆ కాలంలో భూమ్మీద ఉన్న తెలివైన ప్రాణులు మనుష్యులు మాత్రమే కాదు. ఆదాముహవ్వలను ఏదెను తోట నుండి వెళ్లగొట్టిన తర్వాత వాళ్లుగానీ, వాళ్ల పిల్లలుగానీ ఆ అందమైన ఉద్యానవనంలోకి రాకుండా యెహోవా ఓ కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాడు. ఎప్పుడూ తిరుగుతూ ఉండే ఖడ్గజ్వాలతోపాటు, దేవదూతల్లో ఎంతో ఉన్నత శ్రేణికి చెందిన కెరూబులను ఆ తోట ముఖద్వారం దగ్గర కాపలాగా యెహోవా నియమించాడు.—ఆదికాండము 3:24 చదవండి.

17 చిన్నవాడైన హేబెలుకు, ఆ కెరూబులను చూస్తున్నప్పుడు ఏమనిపించి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మనిషి రూపంలో ఉన్న ఆ దేవదూతలు హేబెలు కళ్లకు అత్యంత బలాఢ్యుల్లా కనిపించారు. నిరంతరం జ్వలిస్తూ, తిరుగుతూ ఉన్న ఆ ‘ఖడ్గం’ ఆయనలో ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించింది. హేబెలు పెరిగి పెద్దవాడౌతున్నప్పుడు, ఆ కెరూబులు విసుగు చెంది తమ పనిని వదిలి పెట్టడం ఎప్పుడైనా చూశాడా? లేదు. తెలివైన, శక్తిమంతమైన ఆ ప్రాణులు రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నా రాత్రీపగలూ అనే తేడా లేకుండా నమ్మకంగా తమ విధిని నిర్వర్తిస్తూనే ఉన్నాయి. అది చూసిన హేబెలుకు యెహోవా దేవుణ్ణి నీతిగా, స్థిరంగా సేవించేవాళ్లు ఉన్నారని అర్థమైంది. యెహోవా పట్ల తన కుటుంబంలో ఎవరికీ లేని విశ్వసనీయత, విధేయత వంటి లక్షణాలను హేబెలు ఆ కెరూబుల్లో చూడగలిగాడు. ఆ దూతల ఆదర్శం అతని విశ్వాసాన్ని తప్పక బలపర్చివుంటుంది.

తాను జీవించినంతకాలం కెరూబులు నమ్మకంగా, విధేయతతో యెహోవా సేవ చేయడం హేబెలు గమనించాడు

18. విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి నేడు మనకు లెక్కలేనన్ని ఆధారాలున్నాయని ఎలా చెప్పవచ్చు?

18 యెహోవా దేవుడు తన సృష్టి ద్వారా, తన వాగ్దానాల ద్వారా, తన దేవదూతల ప్రవర్తన ద్వారా తన గురించి ఎన్నో విషయాలు వెల్లడిచేశాడు. వాటి గురించి లోతుగా ఆలోచించడం వల్ల హేబెలు విశ్వాసం అంతకంతకూ బలపడింది. ఆయన నుండి మనం ఎంత నేర్చుకోవచ్చో కదా! ప్రత్యేకించి యువతీయువకులు, ఇంట్లోవాళ్లు ఎలా ఉన్నా తాము యెహోవా పట్ల నిజమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని తెలుసుకోవడం వాళ్లలో ధైర్యాన్ని నింపుతుంది. విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనందరికీ లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. సృష్టిలో మన చుట్టూ ఉన్న ఎన్నో అద్భుతాలు, మన దగ్గరున్న పూర్తి బైబిలు, విశ్వాసం విషయంలో అనేకమంది ఉదాహరణలు ఆ కోవలోకే వస్తాయి.

హేబెలు అర్పణ ఎందుకు శ్రేష్ఠమైనది?

19. కాలక్రమంలో హేబెలుకు అర్థమైన గొప్ప సత్యమేమిటి?

19 హేబెలు తనకు యెహోవా మీద విశ్వాసం పెరిగే కొద్దీ దాన్ని ఎలాగైనా చేతల్లో చూపించాలనుకున్నాడు. అయితే విశ్వాన్నే సృష్టించిన దేవునికి ఓ మామూలు మనిషి ఏమి ఇవ్వగలడు? మానవుని సహాయంగానీ బహుమానాలుగానీ దేవునికి అవసరం లేదన్నది తెలిసిందే. కాలం గడుస్తుండగా, హేబెలుకు ఈ గొప్ప సత్యం అర్థమైంది: మంచి మనసుతో, ఉన్నవాటిలో శ్రేష్ఠమైనది ఇస్తే తన ప్రేమగల తండ్రి ఎంతో సంతోషిస్తాడు.

హేబెలు విశ్వాసంతో బలి అర్పించాడు, కయీను అలా చేయలేదు

20, 21. కయీను, హేబెలు యెహోవాకు ఏమి అర్పించారు? దానికి ఆయన ఎలా స్పందించాడు?

20 హేబెలు తన మందలో నుండి కొన్ని గొర్రెలను అర్పించాలనుకున్నాడు. అందుకు అత్యంత శ్రేష్ఠమైన, తొలిచూలు గొర్రెలను, వాటి శరీరంలోని మంచి భాగాలను ఎంపిక చేశాడు. ఓ పక్క కయీను కూడా యెహోవా ఆశీర్వాదం, అనుగ్రహం కోసం తన పంటలో కొంత భాగాన్ని అర్పించాడు. కానీ అతడు మంచి మనసుతో అలా చేయలేదు. వాళ్లు తమ అర్పణలను దేవునికి అందించినప్పుడు వాళ్లిద్దరి ఉద్దేశాల్లో తేడా స్పష్టంగా కనబడింది.

21 ఆదాము కుమారులిద్దరూ బహుశా బలిపీఠం మీద, నిప్పుతో తమ అర్పణలను అర్పించివుంటారు. వాళ్లు కెరూబుల కనుచూపుమేరలో వాటిని అర్పించివుంటారు. అప్పట్లో భూమ్మీద యెహోవా ప్రతినిధులుగా ఉన్నది ఆ కెరూబులు మాత్రమే. ఆ అర్పణలకు యెహోవా స్పందించాడు! ‘యెహోవా హేబెలును, అతని అర్పణను లక్ష్యపెట్టాడు’ అని బైబిలు చెబుతోంది. (ఆది. 4:4) అయితే, ఆ అర్పణను అంగీకరించినట్లు యెహోవా ఎలా చూపించాడో బైబిలు చెప్పడంలేదు.

22, 23. యెహోవా ఎందుకు హేబెలు అర్పణను లక్ష్యపెట్టాడు?

22 హేబెలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు? ఆ అర్పణలో విశేషమేమైనా ఉందా? హేబెలు సజీవమైన ఒక జంతువును తీసుకుని దాని అమూల్యమైన రక్తాన్ని చిందించి, అర్పించాడు. అలాంటి అర్పణకు ఎంతో విలువుంటుందని ఆయన గ్రహించాడా? ఆ తర్వాత చాలా శతాబ్దాలకు, నిర్దోషమైన గొర్రెపిల్లను బలి ఇచ్చే ఏర్పాటు దేవుడు చేశాడు. ఆయన దాన్ని తన పరిపూర్ణ కుమారుని బలికి సూచనగా ఉపయోగించాడు. నిష్కళంకమైన తన రక్తాన్ని ధారపోసే ఆ కుమారుణ్ణి బైబిలు ‘దేవుని గొర్రెపిల్ల’ అంటోంది. (యోహా. 1:29; నిర్గ. 12:5-7) అయితే, వాటిలో చాలా విషయాలు హేబెలు అవగాహనకు అందనివి.

23 కానీ మనకు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు, హేబెలు ఉన్నవాటిలో శ్రేష్ఠమైనవి అర్పించాడు. యెహోవా హేబెలు అర్పణపైనే కాదు, అతనిపై కూడా అనుగ్రహం చూపించాడు. ఎందుకంటే యెహోవా మీద ప్రేమతో, నిజమైన విశ్వాసంతో హేబెలు దాన్ని అర్పించాడు.

24. (ఎ) కయీను అర్పణలో లోపం లేదని మనం ఎందుకు చెప్పవచ్చు? (బి) కయీను, ఈ రోజుల్లో జీవిస్తున్న చాలామందిలాగే ఉన్నాడని ఎందుకు చెప్పవచ్చు?

24 కానీ కయీను అలా కాదు. యెహోవా ‘కయీనును, అతని అర్పణను లక్ష్యపెట్టలేదు.’ (ఆది. 4:5) అంటే, కయీను అర్పణలో ఏదో లోపం ఉందని కాదు. చాలాకాలం తర్వాత, దేవుడు ధర్మశాస్త్రంలో పంటను కూడా అర్పణగా ఇవ్వవచ్చని చెప్పాడు. (లేవీ. 6:14, 15) అయితే కయీను “క్రియలు చెడ్డవి” అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 3:12 చదవండి.) ఈ రోజుల్లో జీవిస్తున్న చాలామందిలాగే కయీను కూడా భక్తిగా ఉన్నట్లు కనిపిస్తే చాలనుకున్నాడు. అతడికి దేవుని మీద నిజమైన విశ్వాసం, ప్రేమ లేవని అతడి పనుల్లో తేటతెల్లమైంది.

25, 26. యెహోవా కయీనును ఏమని హెచ్చరించాడు? అయినా కయీను ఏమి చేశాడు?

25 యెహోవా అనుగ్రహం తనకు దక్కలేదని తెలుసుకున్న కయీను హేబెలును చూసి నేర్చుకున్నాడా? లేదు. పైగా తమ్ముడి మీద ద్వేషం పెంచుకున్నాడు. కయీను హృదయంలో ఏముందో గ్రహించిన యెహోవా అతనికి ఓపిగ్గా నచ్చచెప్పి చూశాడు. కయీను అలాగే ఉంటే గంభీరమైన పాపంలో చిక్కుకుంటాడని, తన పద్ధతి మార్చుకుంటేనే “తలెత్తుకొనే” పరిస్థితి ఉంటుందని యెహోవా హెచ్చరించాడు.—ఆది. 4:6, 7.

26 కయీను దేవుని మాట లెక్కచేయలేదు. అమాయకుడైన తన తమ్ముడికి మాయమాటలు చెప్పి పొలానికి తీసుకువెళ్లాడు. అక్కడ కయీను హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపేశాడు. (ఆది. 4:8) ఒక విధంగా హేబెలే మొట్టమొదటి హతసాక్షి, అంటే మత హింసకు బలైన మొదటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఆయన చనిపోయాడు, కానీ ఆయన కథ అక్కడితో ముగిసిపోలేదు.

27. (ఎ) హేబెలును దేవుడు పునరుత్థానం చేస్తాడని మనం ఎందుకు పూర్తిగా నమ్మవచ్చు? (బి) హేబెలును కలుసుకోవాలంటే మనం ఏమి చేయాలి?

27 ఒకరకంగా చెప్పాలంటే, హేబెలు రక్తం ప్రతీకారం లేదా న్యాయం కోసం యెహోవా దేవునికి మొరపెట్టింది. అప్పుడు దేవుడు, దుష్టుడైన కయీనుకు శిక్ష విధించి, న్యాయం జరిగేలా చూశాడు. (ఆది. 4:9-12) అంతకంటే ముఖ్యంగా, హేబెలు విశ్వాసానికి సంబంధించిన వృత్తాంతం నేడు మనతో మాట్లాడుతోంది. ఆయన దాదాపు వందేళ్లు జీవించివుంటాడు, ఆ రోజుల్లోని మానవుల ఆయుష్షుతో పోలిస్తే అది చాలా తక్కువే. అయినా జీవితాంతం దేవునికి నచ్చినట్టు నడుచుకున్నాడు. తన పరలోక తండ్రి యెహోవా ప్రేమ, అనుగ్రహం తన మీద ఉన్నాయనే నమ్మకంతో ఆయన కన్నుమూశాడు. (హెబ్రీ. 11:4) అంతులేని యెహోవా జ్ఞాపకంలో ఆయన పదిలంగా ఉన్నాడనీ, రమణీయమైన భూపరదైసులో జీవించడానికి దేవుడు ఆయనను పునరుత్థానం చేస్తాడనీ మనం పూర్తిగా నమ్మవచ్చు. (యోహా. 5:28, 29) అక్కడ మీరు హేబెలును కలుసుకుంటారా? హేబెలు చెప్పేది వింటూ, ఆయనలా గొప్ప విశ్వాసం చూపించాలని దృఢంగా నిశ్చయించుకుంటే అది సాధ్యమౌతుంది.

a మానవ తొలి సంతానం పుట్టుకతో ‘లోకం పుట్టడం’ ఆరంభమైంది. అయితే మొదట పుట్టింది కయీను కదా అలాంటప్పుడు యేసు, ‘లోకము పుట్టుకను’ హేబెలుతో ఎందుకు ముడిపెట్టాడు? కయీను తీసుకున్న నిర్ణయాలను, చేసిన పనులను చూస్తే అతడు యెహోవా దేవుని మీద కావాలనే తిరుగుబాటు చేశాడని అర్థమౌతుంది. తన తల్లిదండ్రుల్లాగే కయీను కూడా పునరుత్థానం అయ్యేవాళ్లలో, పాపవిముక్తి పొందేవాళ్లలో బహుశా ఉండకపోవచ్చు.