కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 49

దుష్ట రాణికి శిక్ష పడింది

దుష్ట రాణికి శిక్ష పడింది

యెజ్రెయేలులో రాజైన అహాబు తన రాజభవనం కిటికీ నుండి చూసినప్పుడు ఒక ద్రాక్షతోట కనిపించేది. అది నాబోతు అనే అతనిది. అహాబు ఆ ద్రాక్షతోట కోరుకుని నాబోతునుండి దాన్ని కొనాలనుకున్నాడు. కానీ ఆ స్థలం అతనికి వారసత్వంగా వచ్చింది. యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం వారసత్వంగా వచ్చిన స్థలాన్ని అమ్మకూడదు కాబట్టి నాబోతు అమ్మడానికి ఒప్పుకోలేదు. నాబోతు సరైన పని చేసినందుకు అహాబు అతన్ని గౌరవించాడా? లేదు. అహాబుకు చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, తన గదిలో నుండి బయటకు రాకుండా, ఆహారం తినకుండా ఉన్నాడు.

అహాబు భార్య దుష్ట రాణి యెజెబెలు. ఆమె అతనితో ఇలా అంది: ‘నువ్వు ఇశ్రాయేలుకు రాజువు. నీకేది కావాలంటే అది తీసుకోవచ్చు. నేను నీ కోసం ఆ స్థలం తెచ్చిస్తా.’ ఆమె నగర పెద్దలకు ఉత్తరాలు రాసి నాబోతు, దేవున్ని శపించాడనే నింద వేసి ఆయనను రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది. యెజెబెలు చెప్పినట్లే ఆ పెద్దలు చేశారు. తర్వాత యెజెబెలు అహాబుతో ఇలా అంది: ‘నాబోతు చచ్చిపోయాడు. ఆ ద్రాక్షతోట ఇక నీదే.’

యెజెబెలు చంపిన అమాయకుల్లో నాబోతు ఒకడే లేడు. యెహోవాను ప్రేమించే చాలామందిని ఆమె చంపేసింది. ఆమె విగ్రహాలను ఆరాధించేది, ఇంకా వేరే చెడ్డ పనులు చేసేది. యెజెబెలు చేసిన చెడ్డ పనులన్నిటిని యెహోవా చూశాడు. ఆయన ఆమెకు ఏ శిక్ష వేస్తాడు?

అహాబు చనిపోయాక, అతని కొడుకు యెహోరాము రాజయ్యాడు. యెహోవా యెజెబెలును, ఆమె కుటుంబాన్ని శిక్షించడానికి యెహూ అనే అతన్ని పంపించాడు.

యెజెబెలు ఉంటున్న యెజ్రెయేలుకు యెహూ తన రథంలో వెళ్లాడు. యెహోరాము రథం ఎక్కి యెహూను కలవడానికి వచ్చి ఇలా అడిగాడు: ‘మన మధ్య శాంతి ఉందా?’ యెహూ ఇలా చెప్పాడు: ‘నీ తల్లి యెజెబెలు చెడ్డ పనులు చేసినంత కాలం శాంతి ఉండదు.’ యెహోరాము తన రథాన్ని వెనక్కి తిప్పి పారిపోవడానికి చూశాడు కానీ యెహూ యెహోరాము మీద బాణం వేశాడు. అప్పుడు అతను చనిపోయాడు.

తర్వాత యెహూ యెజెబెలు అంతఃపురానికి వెళ్లాడు. ఆయన వస్తున్నాడని వినగానే ఆమె మేకప్‌ వేసుకుని, జుట్టు అలంకరించుకుని పైనున్న తన కిటికీ దగ్గర ఎదురుచూస్తూ ఉంది. యెహూ రాగానే, ఆయనను మర్యాద లేకుండా పలకరించింది. యెహూ ఆమె పక్కన నిలబడి ఉన్న ఆమె సేవకులతో అరుస్తూ ఇలా చెప్పాడు: ‘ఆమెను కిందకి పడేయండి!’ వాళ్లు యెజెబెలును కిటికీ నుండి బయటికి పడేశారు. ఆమె నేలమీద పడి చచ్చిపోయింది.

ఆ తర్వాత, యెహూ అహాబు 70 మంది కొడుకులను చంపేసి, దేశంలో బయలు ఆరాధన లేకుండా చేశాడు. దీనిబట్టి యెహోవాకు అన్నీ తెలుసని, సరైన సమయంలో చెడు పనులు చేసేవాళ్లను ఆయన శిక్షిస్తాడని మీరు తెలుసుకున్నారా?

“మొదట్లో అత్యాశతో సంపాదించిన ఆస్తి చివరికి దీవెనగా ఉండదు.”—సామెతలు 20:21