కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 39

ఇశ్రాయేలు మొదటి రాజు

ఇశ్రాయేలు మొదటి రాజు

ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి యెహోవా న్యాయాధిపతులను ఇచ్చాడు. కానీ వాళ్లు రాజు కావాలని అన్నారు. వాళ్లు సమూయేలుతో, ‘మన చుట్టు ప్రక్కల ఉన్న దేశాల వాళ్లందరికీ రాజులు ఉన్నారు. మాకు కూడా కావాలి’ అని అన్నారు. సమూయేలుకు అది తప్పుగా అనిపించింది, అందుకే అతను దాని గురించి యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవా అతనితో ఇలా అన్నాడు: ‘ప్రజలు నిన్ను కాదు నన్ను ఒద్దు అంటున్నారు. వాళ్లకు కావాలంటే రాజును నియమించుకోవచ్చు, కానీ ఆ రాజు వాళ్ల చేత చాలా సేవలు చేయించుకుంటాడు అని చెప్పు.’ అయినా కూడా ప్రజలు, ‘మరేం పర్వాలేదు, మాకు ఒక రాజు కావాలి’ అన్నారు.

యెహోవా సమూయేలుతో సౌలు అనే అతను మొదటి రాజుగా ఉంటాడు అని చెప్పాడు. సౌలు సమూయేలుని కలవడానికి రామాకు వెళ్లినప్పుడు సమూయేలు సౌలు తల మీద నూనె పోసి రాజుగా అభిషేకిస్తాడు.

తర్వాత సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి వాళ్ల కొత్త రాజుని చూపించాలని అనుకుంటాడు. కానీ వాళ్లకు సౌలు ఎక్కడా కనపడడు. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే అతను సామాన్ల మధ్యలో దాక్కుని ఉంటాడు. వాళ్లకు సౌలు దొరకగానే వాళ్లు అతనిని తీసుకొచ్చి ప్రజల మధ్యలో నిలబెడతారు. సౌలు అందరికన్నా పొడవుగా ఉన్నాడు, అతను చాలా అందంగా ఉన్నాడు. సమూయేలు ఇలా అంటాడు: ‘యెహోవా ఎన్నుకున్న అతన్ని చూడండి.’ అప్పుడు ప్రజలు రాజుని చూసి చాలా సంతోషిస్తారు.

మొదట్లో రాజైన సౌలు సమూయేలు మాట వింటూ యెహోవాకు లోబడుతూ ఉన్నాడు. కానీ తర్వాత మారిపోయాడు. ఉదాహరణకు ఒకసారి, సమూయేలు తను వచ్చేదాకా ఉండమని సౌలుతో చెప్తాడు కానీ అతను రావడం ఆలస్యం అయ్యింది. అప్పుడు సౌలు సొంతగా బలులు అర్పించేయాలని అనుకుంటాడు. కానీ సౌలు అలా చేయకూడదు. అందుకు సమూయేలు సౌలుతో ఇలా చెప్తాడు: ‘నువ్వు యెహోవాకు లోబడి ఉండి ఉండాల్సింది.’ చేసిన తప్పు నుండి సౌలు ఏమైనా నేర్చుకున్నాడా?

తర్వాత సౌలు అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, సమూయేలు ఎవర్నీ బ్రతకనివ్వొద్దు అని సౌలుతో చెప్తాడు. కానీ సౌలు రాజైన అగగును చంపకూడదని అనుకున్నాడు. యెహోవా సమూయేలుతో: ‘సౌలు నన్ను విడిచిపెట్టాడు, అతను నా మాట వినలేదు’ అని అన్నాడు. సమూయేలు చాలా బాధపడి సౌలుతో ఇలా చెప్పాడు: ‘నువ్వు యెహోవా మాట వినడం మానేశావు కాబట్టి యెహోవా ఇంకో రాజును ఎన్నుకుంటాడు.’ సమూయేలు వెళ్లిపోవడానికి వెనక్కు తిరుగుతాడు, కానీ సౌలు అతన్ని లాగినప్పుడు సమూయేలు అంగీ కుట్టు చిరిగిపోతుంది. అప్పుడు సమూయేలు: ‘యెహోవా నీ రాజ్యాన్ని ఇలానే నీ దగ్గర నుండి చించేస్తాడు’ అని చెప్పాడు. యెహోవా మాట వింటూ ఆయనను ప్రేమించే మరొకరికి రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు.

“బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది.”—1 సమూయేలు 15:22