లెసన్ 17
మోషే యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకున్నాడు
ఐగుప్తులో యాకోబు కుటుంబం వాళ్లని ఇశ్రాయేలీయులని పిలిచేవాళ్లు. యాకోబు, యోసేపు చనిపోయాక ఒక కొత్త ఫరో పరిపాలించడం మొదలు పెట్టాడు. ఐగుప్తీయుల కన్నా ఇశ్రాయేలీయులు ఎక్కువ బలవంతులై పోతున్నారని ఆ ఫరో భయపడ్డాడు. అందుకే అతను ఇశ్రాయేలీయుల్ని పనివాళ్లుగా మార్చాడు. వాళ్లతో బలవంతంగా ఇటుకలు చేయించేవాడు, పొలాల్లో కష్టమైన పనులు చేయించేవాడు. ఐగుప్తీయులు వాళ్లను ఎంత ఎక్కువగా కష్టపెడితే ఇశ్రాయేలీయులు అంత ఎక్కువగా పెరిగిపోయారు. అది ఫరోకి నచ్చలేదు కాబట్టి పుట్టిన మగ పిల్లలందరిని చంపేయమని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎంత భయపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి.
యోకెబెదు అనే ఇశ్రాయేలు స్త్రీకి ఒక అందమైన బాబు పుట్టాడు. ఆమె ఆ బాబును కాపాడడానికి ఒక బుట్టలో పెట్టి, నైలు నది ఒడ్డున జమ్ముగడ్డిలో దాచింది. ఏం జరుగుతుందో చూడడానికి ఆ బాబు అక్క మిర్యాము దగ్గరలో నిలబడింది.
ఫరో కూతురు నదిలో స్నానం చేయడానికి వచ్చి ఆ బుట్టను చూసింది. లోపల చిన్న బాబు ఏడుస్తూ కనిపించాడు, అతన్ని
చూసి ఆమెకు జాలి వేసింది. మిర్యాము వచ్చి: ‘బాబును పెంచడానికి ఎవరినైనా తీసుకుని రానా?’ అని ఆమెను అడిగింది. ఫరో కూతురు అందుకు ఒప్పుకోగానే, మిర్యాము వాళ్ల అమ్మ యోకెబెదును తీసుకొచ్చింది. ఫరో కూతురు: ‘ఈ బాబును తీసుకెళ్లి నా కోసం పెంచు, నేను నీకు డబ్బులు ఇస్తాను’ అని చెప్పింది.బాబు పెద్దవాడు అయ్యాక, యోకెబెదు అతన్ని ఫరో కూతురు దగ్గరకు తీసుకొచ్చింది, ఆమె అతనికి మోషే అని పేరు పెట్టి, తన కొడుకులా చూసుకుంది. మోషే రాజు కొడుకులా పెరిగాడు, కావాలనుకున్నవన్నీ ఆయనకు ఉన్నాయి. కానీ మోషే యెహోవాను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయన ఇశ్రాయేలీయుడని, ఐగుప్తీయుడు కాడని అతనికి తెలుసు. ఆయన యెహోవాకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు.
మోషేకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు తన ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడైన పనివాడిని కొట్టడం చూసి, మోషే ఆ ఐగుప్తు అతనిని చాలా గట్టిగా కొట్టాడు, అప్పుడతను చనిపోయాడు. చనిపోయిన వాడిని మోషే ఇసుకలో దాచి పెట్టాడు. ఫరోకు ఆ విషయం తెలిసినప్పుడు మోషేను చంపాలని అనుకుంటాడు. కానీ మోషే మిద్యాను దేశానికి పారిపోతాడు. అక్కడ యెహోవా మోషేకు తోడుగా ఉంటాడు.
‘విశ్వాసం వల్ల మోషే ఫరో కూతురి కుమారుణ్ణని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని ప్రజలతో కలిసి హింసలు అనుభవించడాన్ని అతను ఎంచుకున్నాడు.’—హెబ్రీయులు 11:24, 25