కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 60

ఎప్పటికీ ఉండిపోయే రాజ్యం

ఎప్పటికీ ఉండిపోయే రాజ్యం

ఒకరోజు రాత్రి రాజైన నెబుకద్నెజరుకి ఒక విచిత్రమైన కల వచ్చింది. అది అతన్ని చాలా కలవర పెట్టేసరికి అతనికి నిద్ర పట్టలేదు. అతని దగ్గర ఉన్న మంత్రగాళ్లను పిలిచి ఇలా అన్నాడు: ‘నా కలను నాకు వివరించండి.’ వాళ్లు ‘రాజా మాకు మీ కలను చెప్పండి’ అన్నారు. కానీ నెబుకద్నెజరు వాళ్లతో ‘లేదు, మీరే నాకు వచ్చిన కలను చెప్పండి, లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను’ అన్నాడు. అప్పుడు వాళ్లు మళ్లీ, ‘మీకు వచ్చిన కల మాకు చెప్పండి, అప్పుడు మేము దాన్ని వివరిస్తాము’ అన్నారు. ఆయన ‘మీరందరూ నన్ను మోసం చేయాలని చూస్తున్నారా. నా కల ఏంటో చెప్పండి’ అని అన్నాడు. వాళ్లు రాజుతో ‘ఏ మనిషీ అలా చేయలేడు. మీరు అడిగేది అసాధ్యం’ అన్నారు.

నెబుకద్నెజరుకు చాలా కోపం వచ్చి దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేయమని ఆజ్ఞ ఇస్తాడు. వాళ్లలో దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో కూడా ఉన్నారు. దానియేలు రాజుని కొంత సమయం అడుగుతాడు. అప్పుడు అతను, అతని స్నేహితులు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థన చేస్తారు. మరి యెహోవా ఏమి చేశాడు?

ఒక దర్శనంలో, యెహోవా దేవుడు నెబుకద్నెజరుకు వచ్చిన కలను దానియేలుకు చూపించి, దాని అర్థాన్ని చెప్పాడు. తర్వాత రోజు దానియేలు రాజు సేవకుని దగ్గరకు వెళ్లి, ‘జ్ఞానులెవ్వరినీ చంపకండి. రాజు కల నేను వివరిస్తాను’ అని చెప్తాడు. సేవకుడు దానియేలును నెబుకద్నెజరు దగ్గరకు తీసుకెళ్తాడు. దానియేలు రాజుతో ‘దేవుడు మీకు భవిష్యత్తును చూపించాడు. మీకు వచ్చిన కల ఇది: మీరు ఒక పెద్ద విగ్రహాన్ని చూశారు. దాని తల బంగారంతో, ఛాతి చేతులు వెండితో, పొట్ట తొడలు రాగితో, కాళ్లు ఇనుముతో, పాదాలు ఇనుము మట్టితో ఉన్నాయి. అప్పుడు కొండ నుండి పగలగొట్టిన ఒక రాయి వచ్చి ఆ విగ్రహం పాదాలకు తగిలింది. ఆ విగ్రహం పొడిపొడి అయ్యి గాలికి కొట్టుకుపోయింది. తర్వాత ఆ రాయి పెద్ద కొండ అయ్యి భూమంతా నిండిపోయింది’ అని చెప్పాడు.

దానియేలు ‘మీ కలకు అర్థం ఇది: మీ రాజ్యం బంగారు తల. మీ తర్వాత వచ్చే రాజ్యం వెండి. తర్వాత రాగి లాంటి ఒక రాజ్యం వచ్చి భూమి అంతటినీ పరిపాలిస్తుంది. ఆ తర్వాత వచ్చే రాజ్యం ఇనుములా బలంగా ఉంటుంది. చివరికి ఉండే రాజ్యం కలిసి ఉండకుండా ముక్కలుముక్కలుగా ఉంటుంది. దానిలో కొన్ని భాగాలు ఇనుములా బలంగా, కొన్ని భాగాలు మట్టిలా బలహీనంగా ఉంటాయి. కొండలా పెరిగిపోయే రాయి దేవుని రాజ్యం. మిగతా రాజ్యాలన్నిటినీ దేవుని రాజ్యం పగులగొడుతుంది కానీ అది ఎప్పటికీ ఉంటుంది’ అని చెప్పాడు.

నెబుకద్నెజరు దానియేలు ముందు నేలమీద పడి నమస్కారం చేశాడు. ఆయన ‘నీ దేవుడు నీకు ఈ కలను చెప్పాడు. అలాంటి దేవుడు ఎవరూ లేరు’ అని చెప్తాడు. దానియేలును చంపే బదులు, నెబుకద్నెజరు అతన్ని జ్ఞానులందరిపైన అధికారిగా పెట్టి బబులోనును పరిపాలించే ఒక అధికారిగా చేస్తాడు. యెహోవా దేవుడు దానియేలు ప్రార్థనకు ఎలా జవాబిచ్చాడో చూశారా?

“అవి ఆ రాజుల్ని ఒక చోటికి పోగుచేశాయి. హీబ్రూ భాషలో దాని పేరు హార్‌మెగిద్దోన్‌.”ప్రకటన 16:16