పరిపాలక సభ నుండి ఉత్తరం
ప్రియమైన సహోదరసహోదరీలకు:
మీరు బ్రూక్లిన్ బెతెల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉన్నట్లు ఊహించుకోండి. అది 1914 అక్టోబరు 2, శుక్రవారం. ఎప్పటిలాగే ఆ రోజు ఉదయం కూడా మీరు మీ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అక్కడ కూర్చుని సహోదరుడు సి. టి. రస్సెల్ కోసం ఎదురుచూస్తున్నారు. కాసేపటికే, సహోదరుడు రస్సెల్ డైనింగ్ హాలులోకి అడుగుపెట్టాడు. రోజూలాగే బెతెల్ కుటుంబ సభ్యులకు చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పాడు. తర్వాత, తన టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చునే బదులు, చప్పట్లు కొట్టి ఈ ఉత్కంఠభరితమైన ప్రకటన చేశాడు: “అన్యజనులకు నియమించిన కాలాలు ముగిశాయి; ఆ రాజులకు ఇక కాలం చెల్లింది!” అది వినగానే మీరు ఆనందం పట్టలేకపోయారు. ఎందుకంటే, ఈ క్షణం కోసమే మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు! ఆ శుభవార్త విని బెతెల్ సభ్యులందరూ ఆగకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు.
సహోదరుడు రస్సెల్ ఆ ఉత్తేజకరమైన ప్రకటన చేసి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. మరి అప్పటినుండి ఇప్పటివరకు రాజ్యం ఏదైనా సాధించిందా? చాలా సాధించింది! రాజ్యం ద్వారా యెహోవా తన ప్రజలకు శిక్షణ ఇస్తూ, వాళ్లను క్రమక్రమంగా శుద్ధీకరించాడు. 1914లో ఉన్న కొన్ని వేలమందికి, అలాగే ఇప్పుడున్న దాదాపు 80 లక్షలమందికి ఆయన శిక్షణ ఇస్తూనే ఉన్నాడు. ఆ శిక్షణ నుండి మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతున్నారా?
“యెహోవా పరలోక రథం ముందుకు వెళ్తోంది!” అని తరచూ మన సహోదరులు అనడం మీరు వినే ఉంటారు. అది నిజమే. అయితే, యెహోవా సంస్థలోని అదృశ్య భాగాన్ని సూచిస్తున్న ఆ పరలోక రథం, మరిముఖ్యంగా 1914 నుండి శరవేగంతో దూసుకుపోతోంది. ఈ ప్రచురణను చదువుతున్నంతసేపూ ఆ విషయం మీకు స్పష్టమౌతూ ఉంటుంది. రాజ్య ప్రచారకులు మంచివార్తను భూమంతటా ప్రకటించడానికి వార్తాపత్రికలు, సమాచార ప్రదర్శనలు, ఫోటో-డ్రామా ఆఫ్ క్రియేషన్, సాక్ష్యపు కార్డులు, ఫోనోగ్రాఫ్‌లు, రేడియో, ఇంటర్నెట్ వంటి ఎన్నో కొత్తకొత్త పద్ధతుల్ని ఉపయోగించారు.
యెహోవా మన పనిని ఆశీర్వదించడం వల్లే, 670 కన్నా ఎక్కువ భాషల్లో బైబిలు సాహిత్యాన్ని ప్రచురించి, ఉచితంగా అందించగలుగుతున్నాం. ధనిక దేశాల్లో అలాగే పేద దేశాల్లో రాజ్యమందిరాలను, సమావేశ హాళ్లను, బ్రాంచి భవనాలను నిర్మించే పనిలో ఎంతోమంది స్వచ్ఛందంగా సహాయం చేస్తున్నారు. విపత్తులు వచ్చినప్పుడు, మన ప్రియమైన సహోదరసహోదరీలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, “దుర్దశలో” సహాయం చేసే స్నేహితులుగా నిరూపించుకుంటున్నారు.—సామె. 17:17.
కొంతమంది మతనాయకులు, వ్యతిరేకులు ‘కట్టడ వలన కీడు కల్పించడానికి’ ప్రయత్నించారు. కానీ, వాళ్ల ప్రయత్నాలు ప్రతీసారి “మంచివార్తను వ్యాప్తి చేయడానికే” దోహదపడ్డాయి. ఆ ఉదాహరణలు పరిశీలించడం వల్ల మన విశ్వాసం బలపడుతుంది.—కీర్త. 94:20; ఫిలి. 1:12.
‘ఇంటివాళ్లైన’ మీతో కలిసి సహవసించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మీ అందర్నీ ఎంతో ప్రేమిస్తున్నాం. మీ ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని మరింత విలువైనదిగా ఎంచడానికి, ఈ పుస్తకంలోని విషయాలు మీకు సహాయం చేస్తాయని ఆశిస్తున్నాం.—మత్త. 24:45.
శుభాకాంక్షలతో,
మీ సహోదరులు
యెహోవాసాక్షుల పరిపాలక సభ