9వ అధ్యాయం
“లైంగిక పాపానికి దూరంగా పారిపోండి!”
“భూమ్మీద ఉన్న మీ శరీర అవయవాల్ని చంపేసుకోండి. లైంగిక పాపం, అపవిత్రత, అదుపులేని లైంగిక వాంఛ, చెడు కోరిక, విగ్రహపూజతో సమానమైన అత్యాశ అనేవి వాటిలో నుండే పుడతాయి.”—కొలొస్సయులు 3:5.
1, 2. బిలాము యెహోవా ప్రజలకు ఎలా హాని చేశాడు?
జాలరి ఒక రకమైన చేపలు పట్టడానికి అవి దొరికే చోటుకు వెళ్లాడు. అవి ఏ ఎరకు పడతాయో దాన్ని కొక్కేనికి తగిలించి నీళ్లలోకి గాలం వేశాడు. అతను చేప కోసం వేచి చూస్తున్నాడు. చేప ఆ ఎరను తినడానికి వచ్చి, కొక్కేనికి చిక్కుకోగానే గాలాన్ని పైకి లాగాడు.
2 మనుషులు కూడా కొన్నిరకాల ఎరలకు చిక్కుకుంటారు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి దగ్గర్లో ఉన్నప్పుడు మోయాబు మైదానాల్లో డేరాలు వేసుకున్నారు. వాళ్లను శపిస్తే చాలా డబ్బు ఇస్తానని మోయాబు రాజు బిలాము అనే వ్యక్తికి మాటిచ్చాడు. తర్వాత, ఇశ్రాయేలీయులు వాళ్లంతట వాళ్లే తమ మీదికి శాపం తెచ్చుకునేలా బిలాముకు ఒక ఆలోచన వచ్చింది. అతను జాగ్రత్తగా ఎరను సిద్ధం చేసుకున్నాడు. ఇశ్రాయేలు పురుషుల్ని ప్రలోభపెట్టడానికి అతను మోయాబు యువతుల్ని వాళ్ల దగ్గరికి పంపించాడు.—సంఖ్యాకాండం 22:1-7; 31:15, 16; ప్రకటన 2:14.
3. బిలాము వేసిన ఎరకు ఇశ్రాయేలీయులు ఎలా చిక్కుకున్నారు?
3 మరి బిలాము వేసిన ఎరకు ఇశ్రాయేలీయులు చిక్కుకున్నారా? చిక్కుకున్నారు. వేలమంది ఇశ్రాయేలు పురుషులు “మోయాబు స్త్రీలతో లైంగిక పాపం చేయడం మొదలుపెట్టారు.” అంతేకాదు వాళ్లు అసహ్యకరమైన లైంగిక దేవుడైన బయల్పెయోరును, ఇతర అబద్ధ దేవుళ్లను పూజించడం మొదలుపెట్టారు. దానివల్ల 24,000 మంది ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశం సరిహద్దుల్లో చనిపోయారు.—సంఖ్యాకాండం 25:1-9.
4. లైంగిక పాపం అనే ఎరకు వేలమంది ఇశ్రాయేలీయులు ఎందుకు చిక్కుకున్నారు?
4 బిలాము వేసిన ఎరకు అంతమంది ఇశ్రాయేలీయులు ఎందుకు చిక్కుకున్నారు? ఎందుకంటే, వాళ్లు యెహోవా తమకోసం చేసినవన్నీ మర్చిపోయి తమ సొంత సుఖాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నిజానికి, వాళ్లు యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయన వాళ్లను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించాడు, ఎడారిలో పోషించాడు, వాగ్దాన దేశం దగ్గరికి సురక్షితంగా తీసుకొచ్చాడు. (హెబ్రీయులు 3:12) అయినా వాళ్లు యెహోవాకు నమ్మకంగా ఉండాల్సిందిపోయి లైంగిక పాపం చేశారు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మనం లైంగిక పాపం చేయకుండా ఉందాం. వాళ్లలో కొందరు లైంగిక పాపం చేసి . . . చనిపోయారు.”—1 కొరింథీయులు 10:8.
5, 6. మోయాబు మైదానాల్లో ఇశ్రాయేలీయులకు జరిగిన దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
5 మనం కొత్తలోకానికి చాలా దగ్గర్లో ఉన్నాం. కాబట్టి మనం వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టబోతున్న ఇశ్రాయేలీయుల్లాగే ఉన్నాం. (1 కొరింథీయులు 10:11) మోయాబు ప్రజల కన్నా నేడు లోకంలోని ప్రజలు లైంగికంగా ఇంకా దిగజారిపోయారు. ఆ ప్రభావం యెహోవా ప్రజలమైన మన మీద కూడా పడవచ్చు. నిజానికి సాతాను ఉపయోగించే ఎరల్లో అత్యంత శక్తివంతమైనది, లైంగిక పాపమే.—సంఖ్యాకాండం 25:6, 14; 2 కొరింథీయులు 2:11; యూదా 4.
6 మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను క్షణకాలం పాటు ఉండే సుఖాన్ని కోరుకుంటానా, లేక కొత్తలోకంలో ఉండే శాశ్వత సంతోషాన్ని కోరుకుంటానా?’ “లైంగిక పాపానికి దూరంగా పారిపోండి” అని యెహోవా ఇస్తున్న ఆజ్ఞకు లోబడడం ఎంత మంచిదో కదా!—1 కొరింథీయులు 6:18.
లైంగిక పాపం అంటే ఏంటి?
7, 8. లైంగిక పాపం అంటే ఏంటి? దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి?
7 ఈ రోజుల్లో చాలామంది లైంగిక విషయాల్లో దేవుని నియమాల్ని ఏమాత్రం గౌరవించకుండా, లెక్కలేని స్వభావం చూపి స్తున్నారు. బైబిల్లో లైంగిక పాపం అనే పదం చట్టపరంగా పెళ్లి చేసుకోని వాళ్ల మధ్య ఉండే లైంగిక సంబంధాన్ని సూచిస్తుంది. పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో, మనుషులు జంతువులతో పెట్టుకునే లైంగిక సంబంధాన్ని కూడా సూచిస్తుంది. అక్రమ సంబంధాలు, ముఖరతి (ఓరల్ సెక్స్), ఆసన సంభోగం (ఆనల్ సెక్స్), లైంగికంగా ఉద్రేకపర్చేలా వేరే వ్యక్తి మర్మాంగాలను స్పర్శించడం వంటివి కూడా లైంగిక పాపం కిందకే వస్తాయి.—“లెక్కలేనితనం, అపవిత్రత” చూడండి.
8 లైంగిక పాపం చేస్తూ ఉండే వ్యక్తిని సంఘం నుండి బహిష్కరించాలని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (1 కొరింథీయులు 6:9; ప్రకటన 22:15) లైంగిక పాపం చేసినవాళ్లు ఆత్మగౌరవాన్ని, ఇతరుల నమ్మకాన్ని, మంచి మనస్సాక్షిని కోల్పోతారు. లైంగిక పాపం వల్ల గర్భం రావచ్చు, వివాహ జీవితంలో సమస్యలు రావచ్చు, అలాగే రోగాలు, చివరికి మరణం కూడా రావచ్చు. (గలతీయులు 6:7, 8 చదవండి.) లైంగిక పాపం వల్ల వచ్చే నష్టాల గురించి ఒక వ్యక్తి ముందుగానే ఆలోచిస్తే, దానికి దూరంగా ఉంటాడు. కానీ ఒక వ్యక్తి లైంగిక పాపం వైపు అడుగులు వేస్తున్నాడంటే, తన సొంత కోరికలు తీర్చుకోవడం గురించే ఆలోచిస్తున్నాడని అర్థం. సాధారణంగా లైంగిక పాపం వైపు నడిపించే మొదటి అడుగు, అశ్లీల చిత్రాలు చూడడమే.
అశ్లీల చిత్రాలు చూడడం
9. అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఎందుకు ప్రమాదకరమైనది?
9 లైంగిక కోరికల్ని రెచ్చగొట్టడానికే అశ్లీల చిత్రాలు తయారు చేస్తున్నారు. నేడు అవి పత్రికల్లో, పుస్తకాల్లో, సంగీతంలో, టీవీ కార్యక్రమాల్లో, ఇంటర్నెట్‌లో అన్నిచోట్లా కనిపిస్తున్నాయి. అశ్లీల చిత్రాలు చూడడం వల్ల నష్టం ఏమీ లేదని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి అది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే, అశ్లీల చిత్రాలు చూసే వ్యక్తి ఎప్పుడూ లైంగిక విషయాల గురించే ఆలోచిస్తూ, అసహజమైన కోరికలు వృద్ధి చేసుకోవచ్చు. అశ్లీల చిత్రాలు చూసే అలవాటు హస్తప్రయోగానికి, వివాహ జీవితంలో సమస్యలకు, ఆఖరికి విడాకులకు దారితీయవచ్చు.—రోమీయులు 1:24-27; ఎఫెసీయులు 4:19; “హస్తప్రయోగం” చూడండి.
10. లైంగిక పాపానికి దూరంగా ఉండడానికి యాకోబు 1:14, 15 లో ఉన్న సూత్రం ఎలా సహాయం చేస్తుంది?
10 లైంగిక పాపం అనే ఎరకు మనం ఎలా చిక్కుకునే అవకాశం ఉందో తెలుసుకుంటే, దానికి దూరంగా ఉంటాం. యాకోబు 1:14, 15 లో ఉన్న ఈ హెచ్చరికను గమనించండి: “ఒక వ్యక్తి కోరికే అతన్ని లాక్కెళ్లి, వలలో పడేసి అతన్ని పరీక్షకు గురిచేస్తుంది. కోరిక బలపడినప్పుడు అతను పాపం చేస్తాడు; దానివల్ల మరణం వస్తుంది.” కాబట్టి తప్పుడు కోరికలు మీ మనసులోకి వచ్చిన వెంటనే వాటిని తీసేసుకోండి. అనుకోకుండా అశ్లీల చిత్రాలు కనిపిస్తే వెంటనే చూపు తిప్పుకోండి! కంప్యూటర్ ఆపేయండి లేదా టీవీలో ఛానల్ మార్చేయండి. తప్పుడు కోరికల్ని మీ జీవితంలోకి అస్సలు అడుగుపెట్టనివ్వకండి. లేదంటే అవి అణుచుకోలేనంత బలంగా తయారవ్వవచ్చు.—మత్తయి 5:29, 30 చదవండి.
11. మనం తప్పుడు ఆలోచనలతో పోరాడుతున్నప్పుడు యెహోవా ఎలా సహాయం చేస్తాడు?
11 మన గురించి మన కన్నా యెహోవాకే బాగా తెలుసు. మనం అపరిపూర్ణులమని, అయినా మనం తప్పుడు కోరికల్ని తీసేసుకోగలమని ఆయనకు తెలుసు. యెహోవా మనకు ఇలా చెప్తున్నాడు: “భూమ్మీద ఉన్న మీ శరీర అవయవాల్ని చంపేసుకోండి. లైంగిక పాపం, అపవిత్రత, అదుపులేని లైంగిక వాంఛ, చెడు కోరిక, విగ్రహపూజతో సమానమైన అత్యాశ అనేవి వాటిలో నుండే పుడతాయి.” (కొలొస్సయులు 3:5) ఆ సలహాను పాటించడం తేలికేమీ కాదు. కానీ యెహోవా ఓపిక చూపిస్తూ మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. (కీర్తన 68:19) ఒక యువ సహోదరుడికి అశ్లీల చిత్రాలు చూడడం, హస్తప్రయోగం అలవాటయ్యాయి. ఈ వయసులో అలాంటివి సహజమని స్కూల్లో అతని స్నేహితులు చెప్పేవాళ్లు. కానీ ఆ సహోదరుడు ఇలా అంటున్నాడు: “అవి నా మనస్సాక్షిని పాడుచేశాయి, నన్ను అనైతిక జీవితంలోకి లాక్కెళ్లాయి.” అతను తన కోరికల్ని అదుపు చేసుకోవాలని గుర్తించి, యెహోవా సహాయంతో ఆ అలవాట్ల నుండి బయటపడ్డాడు. మీరు తప్పుడు ఆలోచనలతో పోరాడుతుంటే సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి. ఆయన మీకు “అసాధారణ శక్తి” ఇచ్చి, మీ ఆలోచనలు పవిత్రంగా ఉండేలా సహాయం చేస్తాడు.—2 కొరింథీయులు 4:7; 1 కొరింథీయులు 9:27.
12. మనం ఎందుకు ‘హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి’?
12 సొలొమోను ఇలా రాశాడు: “అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, ఎందుకంటే దానిలో నుండే జీవపు ఊటలు బయల్దేరతాయి.” (సామెతలు 4:23) ఇక్కడ “హృదయం” అనే పదం మన లోపలి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. యెహోవా దాన్నే గమనిస్తాడు. మనం చూసేవి మన హృదయంపై ప్రభావం చూపిస్తాయి. నమ్మకస్థుడైన యోబు ఇలా అన్నాడు: “నేను నా కళ్లతో ఒప్పందం చేసుకున్నాను. కన్యను నేనెలా తప్పుడు దృష్టితో చూడగలను?” (యోబు 31:1) యోబులాగే మనం కూడా చూసేవాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవాలి. కీర్తనకర్తలాగే మనం కూడా ఇలా ప్రార్థించాలి: “వ్యర్థమైనవాటిని చూడకుండా నా కళ్లను పక్కకు తిప్పు.”—కీర్తన 119:37.
దీనా తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం
13. దీనా ఎలాంటి స్నేహితుల్ని ఎంచుకుంది?
13 మన స్నేహితుల ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది, అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా కావచ్చు. దేవుని ప్రమాణాల్ని పాటించేవాళ్లను స్నేహితులుగా ఎంచుకుంటే మీరూ వాటిని పాటించగలుగుతారు. (సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33 చదవండి.) స్నేహితుల్ని ఎంచుకోవడం ఎంత ప్రాముఖ్యమో దీనా అనుభవం నుండి నేర్చుకోవచ్చు. యాకోబు కూతురైన దీనా యెహోవాను ఆరాధించే కుటుంబంలో పెరిగింది. ఆమె మంచిదే, కానీ యెహోవాను ఆరాధించని కనాను అమ్మాయిలతో ఎక్కువగా స్నేహం చేసింది. కనానీయులు చాలా అనైతికమైన ప్రజలు. లైంగిక విషయాల్లో వాళ్ల అభిప్రాయం దేవుని ప్రజల అభిప్రాయానికి చాలా వేరుగా ఉండేది. (లేవీయకాండం 18:6-25) దీనా తన స్నేహితురాళ్లతో ఉన్నప్పుడు, షెకెము అనే కనాను అబ్బాయి ఆమెను చూసి ఇష్టపడ్డాడు. ఆ అబ్బాయి తన కుటుంబంలో “అత్యంత గౌరవనీయుడు” అని పిలవబడ్డాడు. కానీ అతనికి యెహోవా మీద ప్రేమ లేదు.—ఆదికాండం 34:18, 19.
14. దీనాకు ఏమైంది?
14 షెకెము దీనా మీద మోజుపడ్డాడు కాబట్టి ఆమెను తీసుకెళ్లి పాడుచేశాడు. అది అతనికి తప్పు అనిపించలేదు. (ఆదికాండం 34:1-4 చదవండి.) ఆ నేరం మరికొన్ని సంఘటనలకు దారితీసి దీనాకు, ఆమె కుటుంబం మొత్తానికి విషాదాన్ని మిగిల్చింది.—ఆదికాండం 34:7, 25-31; గలతీయులు 6:7, 8.
15, 16. మనం ఎలా తెలివిగలవాళ్లం అవ్వవచ్చు?
15 యెహోవా నైతిక ప్రమాణాలు మంచివని గ్రహించడానికి మనం దీనాలాంటి తప్పులు చేయాల్సిన అవసరం లేదు. “తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు.” (సామెతలు 13:20) “ఏది మంచి మార్గమో” గ్రహించాలనే లక్ష్యం పెట్టుకోండి. అప్పుడు మీరు అనవసరమైన బాధ, వేదన నుండి తప్పించుకుంటారు.—సామెతలు 2:6-9; కీర్తన 1:1-3.
16 దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా, నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థించడం ద్వారా, నమ్మకమైన బుద్ధిగల దాసుడు ఇచ్చే మంచి సలహాల్ని పాటించడం ద్వారా మనం తెలివిగలవాళ్లం అవ్వవచ్చు. (మత్తయి 24:45; యాకోబు 1:5) నిజమే మనందరం బలహీనులం, అపరిపూర్ణులం. (యిర్మీయా 17:9) కానీ మనం లైంగిక పాపం చేసే ప్రమాదంలో ఉన్నామని ఎవరైనా హెచ్చరిస్తే ఏం చేస్తాం? నొచ్చుకుంటామా లేక వాళ్లు ఇస్తున్న సహాయాన్ని వినయంగా తీసుకుంటామా?—2 రాజులు 22:18, 19.
17. తోటి క్రైస్తవులు ఇచ్చే సలహా మనకెలా సహాయం చేయగలదో ఒక ఉదాహరణ చెప్పండి.
17 ఉదాహరణకు, ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. ఒక సహోదరి ఉద్యోగం చేసే చోట ఒకతను ఆమెను ఇష్టపడుతున్నాడు. డేటింగ్‌కు రమ్మని కూడా పిలిచాడు. అతను యెహోవా ఆరాధకుడు కాదు, కానీ చూడడానికి మాత్రం మంచివాడిలా, దయగల వ్యక్తిలా ఉన్నాడు. వాళ్లిద్దరూ కలిసి తిరగడం మరో సహోదరి చూసి, ఆమెను హెచ్చరించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఆ మొదటి సహోదరి ఏం చేస్తుంది? తనను తాను సమర్థించుకుంటుందా, లేక ఆ హెచ్చరిక ఎంత తెలివైనదో అర్థం చేసుకుంటుందా? ఆమెకు యెహోవా మీద ప్రేమ, సరైనది చేయాలనే కోరిక ఉండవచ్చు. కానీ ఆమె అతనితో కలిసి తిరుగుతూ ఉంటే ‘లైంగిక పాపానికి దూరంగా పారిపోతున్నట్టా’ లేక ‘తన హృదయాన్ని నమ్ముకుంటున్నట్టా’?—సామెతలు 22:3; 28:26; మత్తయి 6:13; 26:41.
యోసేపు ఉదాహరణ నుండి నేర్చుకోండి
18, 19. యోసేపు లైంగిక పాపానికి దూరంగా ఎలా పారిపోయాడు?
18 యువకుడైన యోసేపు ఐగుప్తులో బానిసగా ఉన్నాడు. అతని యజమాని భార్య తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని రోజూ యోసేపును ఒత్తిడి చేస్తూ ఉండేది. కానీ అలా చేయడం తప్పని యోసేపుకు తెలుసు. యోసేపు యెహోవాను ప్రేమించాడు, ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకున్నాడు. కాబట్టి ఆమె ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా యోసేపు ఒప్పుకోలేదు. అతను బానిస కాబట్టి తన యజమానిని వదిలి వెళ్లలేడు. ఒకరోజు ఆమె యోసేపును లొంగదీసుకోవడానికి ప్రయత్నించింది, అప్పుడు యోసేపు “బయటికి పారిపోయాడు.”—ఆదికాండం 39:7-12 చదవండి.
19 ఒకవేళ యోసేపు ఆమె గురించి చెడుగా ఆలోచిస్తూ, ఊహాలోకంలో విహరిస్తూ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ యోసేపు అలా చేయలేదు. యోసేపుకు అన్నిటికన్నా యెహోవాతో ఉన్న సంబంధమే ముఖ్యం. యోసేపు ఆమెతో ఇలా అన్నాడు: “యజమాని . . . నాకు అన్నీ అప్పగించాడు, ఒక్క నిన్ను తప్ప. ఎందుకంటే నువ్వు అతని భార్యవు. కాబట్టి నేను ఇంత చెడ్డపని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?”—ఆదికాండం 39:8, 9.
20. యెహోవా యోసేపును చూసి సంతోషించాడని ఎలా చెప్పవచ్చు?
20 యోసేపు తన కుటుంబానికి, ఇంటికి దూరంగా ఉన్నా ఎప్పుడూ దేవునికి విశ్వసనీయంగా ఉన్నాడు. అందుకు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. (ఆదికాండం 41:39-49) యోసేపు విశ్వసనీయతను చూసి యెహోవా ఎంతో సంతోషించాడు. (సామెతలు 27:11) నిజమే, లైంగిక పాపానికి దూరంగా ఉండడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ఈ మాటలు గుర్తుంచుకోండి: “యెహోవాను ప్రేమించే వాళ్లారా, చెడును అసహ్యించుకోండి. తన విశ్వసనీయుల ప్రాణాల్ని ఆయన కాపాడుతున్నాడు; దుష్టుల చేతి నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.”—కీర్తన 97:10.
21. ఒక యువ సహోదరుడు ఏ విధంగా యోసేపులా ప్రవర్తించాడు?
21 ప్రతీ రోజు యెహోవా ప్రజలు ‘చెడును ద్వేషిస్తూ మంచిని ప్రేమిస్తున్నామని’ ధైర్యంగా చూపిస్తున్నారు. (ఆమోసు 5:15) మీరు ఏ వయసు వాళ్లయినా యెహోవాకు నమ్మకంగా ఉండగలరు. ఒక యువ సహోదరుడికి స్కూల్లో ఒక శోధన ఎదురైంది. లెక్కల పరీక్షలో సహాయం చేస్తే తనతో సెక్స్‌లో పాల్గొంటానని ఒక అమ్మాయి అతనితో చెప్పింది. ఆ సహోదరుడు ఏం చేశాడు? అతను యోసేపులా ప్రవర్తించాడు. అతను ఇలా చెప్తున్నాడు: “నేను వెంటనే దాన్ని తిరస్కరించాను. యథార్థంగా ఉండడం వల్ల నా మర్యాదను, ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాను.” సాధారణంగా, లైంగిక పాపం వల్ల వచ్చే ఎలాంటి ‘తాత్కాలిక సుఖమైనా’ బాధకు, వేదనకు నడిపిస్తుంది. (హెబ్రీయులు 11:25) కానీ యెహోవాకు చూపించే విధేయత ఎప్పుడూ శాశ్వత సంతోషానికి నడిపిస్తుంది.—సామెతలు 10:22.
యెహోవా సహాయాన్ని తీసుకోండి
22, 23. మనం ఘోరమైన పాపం చేసినా యెహోవా ఎలా సహాయం చేయగలడు?
22 సాతాను లైంగిక పాపం అనే ఎరను ఉపయోగించి మనల్ని పట్టుకోవాలని చూస్తున్నాడు. ఆ ఎరకు పడిపోకుండా ఉండడం నిజంగా ఒక సవాలే. మనందరికీ కొన్నిసార్లు చెడు ఆలోచనలు వస్తుంటాయి. (రోమీయులు 7:21-25) యెహోవా దాన్ని అర్థం చేసుకుంటాడు, మనం “మట్టివాళ్లమని” గుర్తుచేసుకుంటాడు. (కీర్తన 103:14) మరి ఒక క్రైస్తవుడు లైంగిక పాపం అనే ఘోరమైన తప్పు చేస్తే, అప్పుడేంటి? పరిస్థితి చెయ్యి దాటిపోయినట్టేనా? కాదు. అతను నిజంగా పశ్చాత్తాపపడితే యెహోవా అతనికి సహాయం చేస్తాడు, ‘క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు.’—కీర్తన 86:5; యాకోబు 5:16; సామెతలు 28:13 చదవండి.
23 అంతేకాదు యెహోవా మనకు “మనుషుల్లో వరాల్ని” అంటే పెద్దల్ని ఇచ్చాడు. వాళ్లు మనల్ని ప్రేమగా, శ్రద్ధగా చూసుకుంటారు. (ఎఫెసీయులు 4:8, 12; యాకోబు 5:14, 15) యెహోవాతో మనకున్న సంబంధాన్ని బాగుచేసుకోవడానికి వాళ్లు సహాయం చేస్తారు.—సామెతలు 15:32.
“వివేచన” ఉపయోగించండి
24, 25. లైంగిక పాపానికి దూరంగా ఉండడానికి “వివేచన” ఎలా సహాయం చేస్తుంది?
24 మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే, యెహోవా నియమాలు మనకు ఎలా మేలు చేస్తాయో అర్థం చేసుకోవాలి. సామెతలు 7:6-23 వచనాలు ఒక యువకుడి గురించి చెప్తున్నాయి. “వివేచన” లేకపోవడం వల్ల అతను లైంగిక పాపం అనే ఎరకు చిక్కుకుపోయాడు. మనం అతనిలా ఉండాలనుకోం. వివేచన అంటే తెలివితేటలు మాత్రమే కాదు, దేవుని ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్లు నడుచుకోవడానికి ప్రయత్నించడం. మనం సామెతలు 19:8 లో ఉన్న ఈ తెలివైన సలహాను గుర్తుంచుకుంటాం: “వివేకం సంపాదించేవాడు తన ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నాడు. ఎప్పుడూ వివేచన చూపించేవాడు విజయం సాధిస్తాడు.”
25 దేవుని ప్రమాణాలు సరైనవని, వాటిని పాటిస్తే సంతోషంగా ఉంటామని మీరు నిజంగా నమ్ముతున్నారా? (కీర్తన 19:7-10; యెషయా 48:17, 18) ఒకవేళ మీకు నమ్మకం కుదరకపోతే, యెహోవా మీకోసం చేసిన మంచి అంతటినీ గుర్తుచేసుకోండి. “యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి.” (కీర్తన 34:8) అలా రుచిచూసే కొద్దీ మీరు ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన ప్రేమించేవాటిని ప్రేమించండి, ద్వేషించేవాటిని ద్వేషించండి. మీ మనసును మంచి ఆలోచనలతో నింపుకోండి. అంటే ఏవి నిజమైనవో, నీతిగలవో, పవిత్రమైనవో, ప్రేమించదగినవో, మంచివో వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి. (ఫిలిప్పీయులు 4:8, 9) మీరు కూడా యెహోవాకు నచ్చినట్టు నడుచుకున్న యోసేపులా ఉండగలరు.—యెషయా 64:8.
26. తర్వాతి అధ్యాయాల్లో ఏం పరిశీలిస్తాం?
26 మీకు పెళ్లి అయినా కాకపోయినా మీ జీవితం ఆనందంగా, సంతోషంగా సాగాలని యెహోవా కోరుకుంటున్నాడు. వివాహ జీవితంలో సంతోషంగా ఉండడానికి సహాయం చేసే సమాచారం తర్వాతి రెండు అధ్యాయాల్లో ఉంది.