కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

విడాకులు, వేరుగా ఉండడం గురించి బైబిలు ఏమి చెబుతోంది?

విడాకులు, వేరుగా ఉండడం గురించి బైబిలు ఏమి చెబుతోంది?

భార్యాభర్తలు తమ పెళ్లినాటి ప్రమాణాలకు కట్టుబడి ఉండాలన్నదే యెహోవా కోరిక. అందుకే ఆయన మొదటి స్త్రీపురుషులను ఒకటి చేస్తూ, “పురుషుడు . . . తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు” అని అన్నాడు. ఆ తర్వాత యేసు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని” చెప్పాడు. (ఆదికాండము 2:24; మత్తయి 19:3-6) యెహోవా, యేసు ఇద్దరి దృష్టిలో పెళ్లి ఒక చిరకాల బంధం. భార్యాభర్తల్లో ఒకరు చనిపోయినప్పుడే అది తెగిపోతుంది. (1 కొరింథీయులు 7:39) పెళ్లి, దేవుడు చేసిన ఏర్పాటు కాబట్టి, విడాకులనేది చిన్న విషయం కాదు. నిజానికి, బైబిలు ఆధారం లేకుండా విడాకులు తీసుకోవడం యెహోవాకు అసహ్యం.—మలాకీ 2:15, 16.

విడాకులు తీసుకోవడానికి తగిన కారణమేమిటో బైబిలు చెబుతోంది. అదేంటి? యెహోవాకు వ్యభిచారం అన్నా, జారత్వం అన్నా అసహ్యం. (ఆదికాండము 39:9; 2 సమూయేలు 11:26, 27; కీర్తన 51:4) వ్యభిచారం అంటే ఆయనకు ఎంత అసహ్యం అంటే ఆ కారణాన్నిబట్టి విడాకులు తీసుకోవడానికి కూడా ఆయన అనుమతినిచ్చాడు. (జారత్వం అంటే ఏమిటో తెలుసుకోవడానికి 9వ అధ్యాయంలోని 7వ పేరా చూడండి.) వ్యభిచారం చేసిన వ్యక్తితో ఇంకా కలిసి ఉండాలా లేక విడాకులు తీసుకోవాలా అనేది నిర్ణయించుకునే స్వాతంత్ర్యాన్ని కూడా యెహోవా వాళ్లకిచ్చాడు. (మత్తయి 19:9) కాబట్టి, తప్పు చేయని భార్య/భర్త విడాకులు తీసుకుంటే అది యెహోవా దృష్టిలో సరైనదే. అదే సమయంలో, వాళ్లు ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలని క్రైస్తవ సంఘం బోధించడంలేదు. తప్పు చేసిన వ్యక్తి నిజంగా పశ్చాత్తాపం చూపించినప్పుడు, లేదా మరితర కారణాలనుబట్టి విడాకులు తీసుకోవద్దని నిర్ణయించుకోవచ్చు. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, బైబిలు ప్రకారం తగిన కారణం ఉన్నా విడాకులు తీసుకోవాలా వద్దా అన్నది వ్యక్తిగత నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నా, తర్వాత వచ్చే పర్యవసానాలను కూడా వారే భరించాలి.—గలతీయులు 6:5.

భర్త/భార్య వ్యభిచారం చేయకపోయినా కొన్ని అనివార్య పరిస్థితుల్లో కొంతమంది క్రైస్తవులు విడాకులు తీసుకుంటారు లేదా వేరుగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు విడిచిపెట్టి వెళ్ళే వ్యక్తి ‘పెండ్లిచేసుకోకూడదు; లేదా, తన భర్త/భార్యతో సమాధానపడాలి’ అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 7:11) వారు వేరేవాళ్లను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. (మత్తయి 5:32) భార్యాభర్తలు విడిపోయి వేరుగా ఉండాలని నిర్ణయించుకునే కొన్ని అనివార్య పరిస్థితులేంటో చూద్దాం.

సంరక్షణ కరువైతే. అంటే భర్తకు చేయగలిగే శక్తి ఉండి కూడా కావాలనే కుటుంబాన్ని పోషించే బాధ్యతను పట్టించుకోకుండా భార్యాబిడ్డల కనీస అవసరాలు తీర్చకపోతే, భార్య వేరుగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. “తన యింటివారిని సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును” అని బైబిలు చెబుతోంది. (1 తిమోతి 5:8) అలాంటి వ్యక్తి మారడానికి సిద్ధంగా లేకపోతే తన సంక్షేమం, తన పిల్లల సంక్షేమం కోసం చట్టబద్ధంగా అనుమతి పొంది వేరుగా ఉండాలో వద్దో నిర్ణయించుకోవచ్చు. a అయితే, భర్త కుటుంబాన్ని పోషించడం లేదనే ఫిర్యాదు వచ్చినప్పుడు సంఘ పెద్దలు ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక వ్యక్తి తన కుటుంబ బాధ్యతల్ని విస్మరిస్తే సంఘం నుండి బహిష్కరించే అవకాశం కూడా ఉంది.

శారీరకంగా హింసిస్తున్నట్లైతే. తన జత తనను బాగా హింసించడం వల్ల ఒక వ్యక్తి ఆరోగ్యం బాగా దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే వేరుగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. హింసించేవారు క్రైస్తవులైతే సంఘ పెద్దలు ఈ విషయాన్ని జాగ్రత్తగా విచారించాలి. మాటిమాటికీ తీవ్రంగా కోపం తెచ్చుకునేవారిని, ఇతరుల్ని హింసించేవారిని సంఘం బహిష్కరించే అవకాశం ఉంది.—గలతీయులు 5:19-21.

సత్యారాధనలో పాల్గొననివ్వకపోతుంటే. సత్యారాధనలో పాల్గొనకుండా నిత్యం అడ్డగిస్తూ లేదా ఏదోక విధంగా దేవుని నియమాల్ని ఉల్లంఘించమని భర్త/భార్య బలవంతపెడుతుంటే వేరైపోవాలని నిర్ణయించుకోవచ్చు. వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వ్యక్తి, ‘మనుష్యులకు కాకుండా దేవునికే లోబడాలంటే’ వేరుగా ఉండడం ఒక్కటే పరిష్కారమేమో ఆలోచించాలి.—అపొస్తలుల కార్యములు 5:29.

పైన పేర్కొన్న మూడు అనివార్య పరిస్థితుల్లో లేదా అలాంటి ఇతర సందర్భాల్లో ఎవరైనా సరే బాధపడుతున్నవారిని వేరైపొమ్మనో లేదా కలిసి ఉండమనో ఒత్తిడి చేయకూడదు. సంఘంలోని పెద్దలు, పరిణతిగల ఇతర క్రైస్తవులు వారికి మద్దతిస్తూ, బైబిలు నుండి చక్కని సలహాలు ఇచ్చినప్పటికీ వారికి ఇంట్లో జరిగే సంగతులన్నీ తెలియవు. యెహోవా మాత్రమే వాటిని చూడగలడు. అయితే, భార్య/భర్త వేరుగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటి సమస్యల్ని కొండంతలు చేసి చెబితే దేవుణ్ణి, ఆయన చేసిన వివాహ ఏర్పాటును అగౌరవపరిచినట్లు అవుతుంది. వారెంత దాచిపెట్టాలని ప్రయత్నించినా ఒకవేళ వారు కుయుక్తితో వేరైపోవాలని చూస్తే, యెహోవాకు ఆ విషయం తెలియకుండాపోదు. “మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.” (హెబ్రీయులు 4:13) నిజంగానే ఇంట్లో విపరీతమైన పరిస్థితులు కొనసాగిన పక్షంలో గత్యంతరం లేక క్రైస్తవులు తన భార్య/భర్త నుండి విడిపోవాలని నిర్ణయించుకుంటే ఎవ్వరూ వారిని విమర్శించకూడదు. ఏదేమైనా, చివరకు ‘మనమందరం దేవుని న్యాయ పీఠము ఎదుట నిలబడాలి.’—రోమీయులు 14:10-12.

a చట్టబద్ధంగా వేరైపోవడం అంటే విడాకులు తీసుకోవడం కాదు. వేరుగా ఉంటున్నా వారింకా చట్టబద్ధంగా భార్యాభర్తలే.