కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

42

మీ ప్రేక్షకులకు సమాచారాన్ని అందించేది

మీ ప్రేక్షకులకు సమాచారాన్ని అందించేది

మీ అందింపు మీ ప్రేక్షకులకు సమాచారాన్ని అందించేదిగా ఉండేలా చేయాలంటే, కేవలం ఒక విలువైన విషయం గురించి మాట్లాడడం మాత్రమే సరిపోదు. మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘ఇక్కడున్న  ప్రేక్షకులు  విషయాన్ని వినాల్సిన అవసరం ఎందుకు ఉంది? ఈ చర్చనుండి నిజంగా ప్రయోజనం పొందామని ప్రేక్షకులు భావించేందుకు వారికి నేనేమి చెప్పబోతున్నాను?’

సాక్ష్యమిచ్చే విధానాన్ని ప్రదర్శించే నియామకం మీకు లభిస్తే, ఈ సందర్భంలో మీ గృహస్థులే మీ ప్రేక్షకులు. ఇతర సందర్భాల్లో మీరు పూర్తి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడతారు.

మీ ప్రేక్షకులకు ఏమి తెలుసు? ‘ప్రేక్షకులకు ఈ విషయం గురించి ఇప్పటికే ఏమి తెలుసు?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దాని జవాబే మీ ప్రసంగం ప్రారంభాన్ని నిర్ధారించాలి. పరిణతి చెందిన క్రైస్తవులు చాలామంది ఉన్న సంఘంలో మీరు మాట్లాడుతున్నట్లైతే కేవలం ప్రాథమిక సత్యాలు మాత్రమే చెప్పకండి, వాటి గురించి దాదాపు వారందరికీ తెలుసు. వాటిని పునాదిగా చేసుకొని మాట్లాడండి. అయితే, అక్కడ కొత్తగా ఆసక్తిని కనబరుస్తున్నవారు చాలామంది ఉంటే, మీరు రెండు వర్గాల అవసరాలనూ పరిగణలోకి తీసుకోవాలి.

మీరు మాట్లాడే వేగాన్ని మీ ప్రేక్షకుల పరిజ్ఞానానికి అనుగుణంగా మలుచుకోండి. వారికి బాగా తెలిసిన కొన్ని వివరాలను చెప్పాలనుకుంటే వాటిని వేగంగా చెప్పేయండి. కానీ మీ శ్రోతల్లో అధిక సంఖ్యాకులకు కొత్తగా అనిపించే విషయాలను చెప్పేటప్పుడు మాత్రం వేగం తగ్గించండి, అలా వారు వాటిని స్పష్టంగా గ్రహించగలుగుతారు.

ఏ విషయాలు సమాచారాన్ని అందించేవిగా ఉంటాయి? సమాచారాన్ని అందించేదిగా ఉండడం అంటే ప్రతీసారి ఏదో ఒక కొత్త విషయం చెప్పడమని కాదు. కొందరు ప్రసంగీకులు కొన్ని సుపరిచిత సత్యాలనే ఎంత సరళంగా పేర్కొంటారంటే, ప్రేక్షకుల్లో చాలామంది తొలిసారిగా వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు.

క్షేత్ర పరిచర్యలో, మనం అంత్యదినాల్లో ఉన్నామని అవతలి వ్యక్తికి చూపించడానికి కేవలం ఒక వార్తా నివేదికను పేర్కొంటే సరిపోదు. ఆ నివేదికలోని సంఘటనకు అర్థం ఏమిటో చూపించడానికి బైబిలును ఉపయోగించండి. ఇది తప్పకుండా గృహస్థుడికి సమాచారాన్ని అందించేదిగా ఉంటుంది. అదే విధంగా, ప్రకృతి నియమాల గురించి లేదా వృక్షాలు లేక జంతువుల గురించి కొన్ని వివరాలు చెప్పేటప్పుడు, గృహస్థుడు ఇంతకు మునుపెన్నడూ విననటువంటి ఏదో ఆకర్షణీయమైన వైజ్ఞానిక వాస్తవాన్ని పేర్కొనడమే మీ లక్ష్యంగా ఉండకూడదు. బదులుగా, ఉదాహరణకు మనల్ని ప్రేమించే సృష్టికర్త ఉన్నాడని చూపించడానికి, ప్రకృతిలో కనబడే రుజువులను బైబిలు చెప్పే విషయాలతో సమన్వయపరచడమే లక్ష్యంగా ఉండాలి. ఆ విధంగా గృహస్థుడు ఈ విషయాన్ని ఒక కొత్త దృక్కోణంలోంచి చూసేందుకు సహాయం పొందుతాడు.

ఒక విషయాన్ని మునుపు ఎన్నోసార్లు విన్న ప్రేక్షకులకు మళ్ళీ అదే విషయం చెప్పడం ఒక సవాలే. కానీ సమర్థవంతమైన బోధకుడిగా ఉండాలంటే ఆ సవాలును విజయవంతంగా ఎదుర్కోవడం ఎలాగో నేర్చుకోవాలి. కానీ, ఎలా?

పరిశోధన చేస్తే ఫలితం ఉంటుంది. మీ ప్రసంగంలో, మనసుకి తట్టిన ఏవో కొన్ని వాస్తవాలను పేర్కొనడానికి బదులు 33 నుండి 38 పేజీల్లో చర్చించబడిన పరిశోధనా ఉపకరణాలను ఉపయోగించండి. మీరు కృషిచేసి సాధించవలసిన లక్ష్యాల గురించి అక్కడ ఇవ్వబడిన సూచనలను మనస్సులో ఉంచుకోండి. మీ పరిశోధనలో, ఎవరికీ ఎక్కువగా తెలియని ఒక చారిత్రక సంఘటన మీ విషయానికి నేరుగా సంబంధించినదని మీరు తెలుసుకుంటుండవచ్చు. లేదా మీరు చర్చించాలనుకుంటున్న అంశాన్ని స్పష్టం చేసే ఒక వ్యాఖ్యానాన్ని ఇటీవలి వార్తల్లో వినివుండవచ్చు.

మీ సమాచారాన్ని పరిశీలిస్తుండగా, ఏమిటి? ఎందుకు? ఎప్పుడు? ఎక్కడ? ఎవరు? ఎలా? అనే ప్రశ్నలు వేసుకుంటూ మీ ఆలోచనల్ని మీరే ప్రేరేపించుకోండి. ఉదాహరణకు: ఇది ఎందుకు సత్యం? దీన్ని ఎలా రుజువు చేయగలను? ఈ బైబిలు సత్యాన్ని గ్రహించడం కష్టతరం చేసే సర్వవ్యాప్త నమ్మకాలు ఏమిటి? ఇది ఎందుకు ప్రాముఖ్యం? ఒక వ్యక్తి జీవితాన్ని ఇదెలా ప్రభావితం చేయాలి? దీన్ని అన్వయించుకోవడం వల్ల లభించే ప్రయోజనాలను స్పష్టంచేసే ఉదాహరణ ఏమిటి? ఈ బైబిలు సత్యం యెహోవా వ్యక్తిత్వాన్ని గురించి ఏమి వెల్లడిచేస్తోంది? మీరు చర్చిస్తున్న సమాచారం ఆధారంగా మీరిలా కూడా ప్రశ్నించుకోవచ్చు: ఇది ఎప్పుడు సంభవించింది? ఈ సమాచారాన్ని నేటి కాలాలకు ఆచరణాత్మకంగా ఎలా అన్వయించవచ్చు? ప్రసంగం ఇస్తున్నప్పుడు కూడా అలాంటి కొన్ని ప్రశ్నలను వేయడం ద్వారా వాటికి జవాబులివ్వడం ద్వారా మీ ప్రసంగాన్ని ఉత్తేజభరితంగా చేయగలరు.

మీ ప్రసంగంలో ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న కొన్ని లేఖనాలను ఉపయోగించవలసి రావచ్చు. వీటిని ఉపయోగించేటప్పుడు అవి సమాచారాన్ని అందించేవిగా ఉండేందుకు మీరేమి చేయవచ్చు? వాటిని చదివి ఊరుకోకండి; వాటిని వివరించండి.

బాగా పరిచయం ఉన్న లేఖనాన్ని చర్చించేటప్పుడు మీరు దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి, మీ ప్రసంగాంశానికి సంబంధించిన భాగాలను నొక్కిచెబుతూ, ఆ భాగాలను వివరిస్తే అప్పుడు ఆ లేఖనం మరింత సమాచారాన్ని అందించేదిగా అవుతుంది. ఉదాహరణకు, మీకా 6:8 వంటి ఒక వచనంలో అలాంటి అవకాశాలు ఏమున్నాయో ఒకసారి పరిశీలించండి. “న్యాయము” అంటే ఏమిటి? ఎవరి న్యాయ ప్రమాణాలు ఇక్కడ చర్చించబడుతున్నాయి? “న్యాయముగా నడుచుకొనుట” అంటే ఏమిటో, లేదా “కనికరమును ప్రేమించుట” అంటే ఏమిటో మీరెలా విశదీకరిస్తారు? దీనమనస్సు అంటే ఏమిటి? ఒక వృద్ధుడి విషయంలో ఈ సమాచారాన్ని ఎలా అన్వయిస్తారు? అయితే మీరు చివరికి ఉపయోగించే సమాచారం మీరు చర్చించే అంశము, మీ లక్ష్యము, మీ ప్రేక్షకులు, మీకున్న సమయము వంటివాటిపై ఆధారపడివుండాలి.

పదాలకు సరళమైన నిర్వచనాలు చెప్పడం తరచు మంచి ఫలితాలనిస్తుంది. మత్తయి 6:9,10 వచనాల్లో ఉన్న “రాజ్యము” అనే పదానికిగల అర్థాన్ని తెలుసుకున్నప్పుడు కొందరికి గొప్ప కనువిప్పు కలుగుతుంది. ఒక పదం నిర్వచనాన్ని మళ్ళీ గుర్తు చేస్తే, ఎంతోకాలంగా క్రైస్తవులుగా ఉన్నవారు సహితం ఫలాని లేఖనం నిజానికి ఏమి చెబుతోందన్నది మరింత ఖచ్చితంగా వివేచించవచ్చు. మనం 2 పేతురు 1:5-8 వచనాలు చదివి, వాటిలో పేర్కొనబడిన విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ వంటి వేర్వేరు అంశాలను నిర్వచిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కొన్ని పదాల అర్థచ్ఛాయలు చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటి పదాలు ఒకే సందర్భంలో ఉపయోగించబడినప్పుడు మీరు వాటిని నిర్వచిస్తే వాటి మధ్యగల భేదాన్ని ప్రేక్షకులు గ్రహిస్తారు. ఉదాహరణకు సామెతలు 2:1-6 వచనాల్లోని జ్ఞానము, విజ్ఞానము, వివేచన, తెలివి వంటి పదాల విషయంలో అది వాస్తవం.

మీరేదైనా వచనంపై కేవలం తర్కించినా ప్రేక్షకులు అది సమాచారాన్ని అందించేదిగా ఉన్నట్లు గ్రహించవచ్చు. చాలామంది ప్రజలకు, చనిపోయిన తన స్నేహితుడు ‘నిద్ర విశ్రాంతిలో’ ఉన్నాడని యేసు వర్ణించడం గురించి యోహాను 11:11-14 వచనాల్లో చదివినప్పుడూ, అలాగే “చచ్చినవారు ఏమియు ఎరుగరు” అని బైబిలు సూటిగా పేర్కొనడం గురించి ప్రసంగి 9:5 వ వచనంలో చదివినప్పుడూ ఒక్కసారిగా కనువిప్పు కలుగుతుంది. ఒక సందర్భంలో యేసు, సద్దూకయ్యులు తాము నమ్ముతున్నామని చెప్పుకునే నిర్గమకాండము 3:6 ను ఉల్లేఖిస్తూ దాన్ని మృతుల పునరుత్థానానికి అన్వయించి వారిని ఆశ్చర్యపరిచాడు.—లూకా 20:37,38.

కొన్నిసార్లు ఒక లేఖన సందర్భాన్ని, ఆ లేఖనం వ్రాయబడినప్పటి పరిస్థితులను, ఆ లేఖనంలో మాట్లాడేదెవరో వింటున్నదెవరో సూచించడమే జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. పరిసయ్యులకు 110వ కీర్తన సుపరిచితమైనది. అయినా, యేసు మొదటి వచనంలోని ఒక ముఖ్యమైన వివరాన్ని వారి దృష్టికి తెచ్చాడు. ‘క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు’ అని ఆయన వారినడిగాడు. ‘దావీదు కుమారుడు’ అని వారు జవాబిచ్చారు. అప్పుడాయన వారితో ఇలా అన్నాడు: ‘ఆలాగైతే—నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగును?’ (మత్త. 22:41-45) లేఖనాలపై యేసు తర్కించినట్లుగా మీరు కూడా తర్కించినప్పుడు, ప్రజలు దేవుని వాక్యాన్ని మరింత జాగ్రత్తగా చదివేలా వారికి సహాయం చేసినవారవుతారు.

ప్రసంగీకుడు ఒక బైబిలు పుస్తకం వ్రాయబడిన కాలాన్ని లేదా ఒకానొక సంఘటన జరిగిన కాలాన్ని పేర్కొన్నప్పుడు, ఆయన ఆ కాలంలో ఉన్న పరిస్థితులను కూడా వర్ణించాలి. ఆ విధంగా, ప్రేక్షకులు ఆ పుస్తకం యొక్క లేదా ఆ సంఘటన యొక్క ప్రాముఖ్యాన్ని మరింత స్పష్టంగా గ్రహిస్తారు.

వేర్వేరు విషయాల మధ్య ఉన్న పోలికలు చూపించడం మీరు చెప్పేది మరింత సమాచారాన్ని అందించేదిగా ఉండేలా చేయడానికి దోహదం చేస్తుంది. ఏదైనా సర్వసాధారణమైన దృక్కోణాన్ని, అదే అంశంపై బైబిలు చెప్పేదానితో పోలుస్తూ రెండింటి మధ్యగల భేదాన్ని మీరు చూపించవచ్చు. లేదా రెండు సమాంతర బైబిలు వృత్తాంతాలను పోల్చవచ్చు. రెండింటికీ ఏవైనా తేడాలున్నాయా? ఎందుకున్నాయి? వాటి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మీరిలా చేస్తే, మీ శ్రోతలకు ఆ విషయంపై సరిక్రొత్త దృక్కోణాన్ని అందజేయగలుగుతారు.

క్రైస్తవ పరిచర్యలోని ఏదైనా ఒక అంశాన్ని చర్చించడానికి మీరు నియమించబడితే, మీరు దాని సారాంశాన్ని చెప్పడంతో ప్రారంభించడం ద్వారా మీ చర్చను ఆసక్తికరంగా చేయవచ్చు. ఏమి చేయాలో, ఎందుకు చేయాలో, అది యెహోవాసాక్షులుగా మన అసలు లక్ష్యానికి ఎలా సంబంధం కలిగివుందో చర్చించండి. ఆ తర్వాత దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయాలో వివరించండి.

మీ ప్రసంగంలో కొన్ని “దేవుని మర్మములను” చర్చించాల్సివుంటే, అప్పుడెలా? (1 కొరిం. 2:10) ఆ విషయంలోని కీలక భాగాలను పేర్కొని, వాటిని వివరించడం ద్వారా ప్రారంభిస్తే, మిగతా వివరాలు మరింత త్వరగా అర్థమవుతాయి. చివరికి ముగింపులో మీ సమాచారమంతటికీ క్లుప్తమైన సారాంశాన్నిస్తే, మీ ప్రేక్షకులు తాము నిజంగా ఏదో నేర్చుకున్నామన్న తృప్తితో ఇంటికి వెళతారు.

క్రైస్తవ జీవనంపై సలహా. మీ ప్రసంగంలోని సమాచారం ప్రేక్షకుల జీవితాలకు ఎలా అన్వయిస్తుందో గ్రహించేందుకు మీరు వారికి సహాయం చేస్తే వారు ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందుతారు. మీరు మీ నియమిత సమాచారంలోని లేఖనాలను పరిశీలిస్తుండగా, ‘నేటి వరకు ఈ విషయాలు బైబిలులో ఎందుకు పొందుపరచబడ్డాయి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (రోమా. 15:4; 1 కొరిం. 10:11) మీ ప్రేక్షకులు తమ జీవితాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఆలోచించండి. లేఖనాల్లోని సలహాలు, సూత్రాల వెలుగులో ఆ పరిస్థితులను పరిశీలించండి. ఒక వ్యక్తి అలాంటి పరిస్థితులతో జ్ఞానయుక్తంగా వ్యవహరించడానికి లేఖనాలు ఎలా సహాయం చేస్తాయో మీ ప్రసంగంలో తర్కించండి. అస్పష్ట వ్యాఖ్యానాలకు దూరంగా ఉండండి. నిర్దిష్టమైన వైఖరులు, చర్యల గురించి చర్చించండి.

తొలి మెట్టుగా, పైనున్న సూచనల్లో ఒకటి లేదా రెండు సూచనలను మీరు సిద్ధపడుతున్న ఒక ప్రసంగానికి అన్వయించండి. మీరు అనుభవం సంపాదిస్తుండగా మరిన్ని సూచనల్ని అన్వయించండి. కొంతకాలానికి ప్రేక్షకులు మీ ప్రసంగాల కోసం ఎదురుచూస్తున్నట్లు గ్రహిస్తారు, తమకు నిజంగా ప్రయోజనకరంగా ఉండే సమాచారాన్ని వింటామన్న నమ్మకం వారిలో ఏర్పడుతుంది.