బహిరంగ ప్రసంగాలివ్వడానికి సిద్ధపడడం
ప్రతివారం, యెహోవాసాక్షుల సంఘాలు దాదాపు అన్నీ లేఖనాధారిత విషయంపై బహిరంగ ప్రసంగాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. మీరు ఒక పెద్దగానీ పరిచర్య సేవకుడు గానీ అయితే, మీరు ప్రతిభావంతుడైన బహిరంగ ప్రసంగీకుడని లేదా బోధకుడని రుజువు చేసుకుంటారా? అలాగైతే, బహిరంగ ప్రసంగం ఇవ్వమని మీరు ఆహ్వానించబడవచ్చు. ఈ సేవాధిక్యతకు యోగ్యులయ్యేలా దైవపరిపాలనా పరిచర్య పాఠశాల వేలాదిమంది సహోదరులకు సహాయపడింది. మీకు బహిరంగ ప్రసంగం నియమించబడినప్పుడు ఎక్కడ నుండి మొదలుపెట్టాలి?
సంక్షిప్త ప్రతిని అధ్యయనం చెయ్యండి
మీరు పరిశోధన చేసే ముందు, సంక్షిప్త ప్రతిని చదివి, దాని భావాన్ని గ్రహించే వరకు దానిని ధ్యానించండి. చర్చాంశమే మీ ప్రసంగ శీర్షిక, అది మీ మనస్సులో నాటుకుపోయేలా మననం చేసుకోండి. మీరు మీ ప్రేక్షకులకు నేర్పించవలసినది ఏమిటి? మీ లక్ష్యమేమిటి?
పతాక శీర్షికలకు సుపరిచితులవ్వండి. ముఖ్యాంశాలను విశ్లేషించండి. ప్రతి అంశం ప్రసంగాంశంతో ఎలా ముడిపడివుందో విశ్లేషించండి. ప్రతి ముఖ్యాంశం క్రింద అనేక ఉప అంశాలు ఉంటాయి. ఉప అంశాలను బలపరిచే అంశాలు వాటి క్రింద ఉంటాయి. సంక్షిప్త ప్రతిలోని ప్రతి భాగము, ముందున్న భాగంపై ఆధారపడుతూ తర్వాతి భాగానికి నడిపిస్తూ ఆ ప్రసంగ లక్ష్యాన్ని సాధించడానికి ఎలా సహాయపడుతుందో పరిశీలించండి. మీరు ఒకసారి మీ చర్చాంశాన్నీ లక్ష్యాన్నీ ముఖ్యాంశాలు ప్రసంగ ఉద్దేశాన్ని ఎలా సాధిస్తాయన్నదాన్నీ అర్థం చేసుకున్నారంటే, మీరు ఆ సమాచారాన్ని విపులీకరించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థం.
మొదట మీరు మీ ప్రసంగాన్ని నాలుగైదు చిన్న ప్రసంగాలుగా అంటే, ఒక్కొక్క ముఖ్యాంశాన్ని ఒక్కొక్క ప్రసంగంలా ఆలోచించుకోవడం సహాయకరంగా ఉంటుందని గ్రహిస్తారు. ఒకసారి ఒక భాగానికి సిద్ధపడండి.
మీకివ్వబడిన సంక్షిప్త ప్రతి, ప్రసంగాన్ని సిద్ధపడేందుకు సహాయపడే ఒక ఉపకరణం. దానిని ఇవ్వడంలోని ఉద్దేశం, అది మీరు ప్రసంగమివ్వడానికి నోట్సుగా ఉపకరించాలని కాదు. అది అస్థిపంజరంలాంటిది. ఒక విధంగా చెప్పాలంటే, మీరు దానిపై మాంసం కప్పి, దానిలో గుండెను అమర్చి, దానికి ఊపిరి పోయడం అవసరం.
లేఖనాల ఉపయోగం
యేసుక్రీస్తూ ఆయన శిష్యులూ లేఖనానుసారంగానే బోధించారు. (లూకా 4:16-21; 24:27; అపొ. 17:2,3) మీరు కూడా అలాగే చేయవచ్చు. లేఖనాలే మీ ప్రసంగానికి ఆధారమై ఉండాలి. మీకివ్వబడిన సంక్షిప్త ప్రతిలోని వాక్యాలను వివరించి వాటిని అన్వయించడం మాత్రమే కాక, ఆ వాక్యాలకు లేఖనాలు ఎలా ఆధారంగా ఉన్నాయో గ్రహించి, తర్వాత లేఖనాల నుండి బోధించండి.
మీరు మీ ప్రసంగానికి సిద్ధపడుతున్నప్పుడు, సంక్షిప్త ప్రతిలో ఉదాహరించబడిన ప్రతి లేఖనాన్నీ పరిశీలించండి. సందర్భం చూడండి. కొన్ని వచనాలు సహాయకరమైన నేపథ్య సమాచారాన్ని తెలియజేయడం మాత్రమే చేస్తుండవచ్చు. మీరు ప్రసంగించేటప్పుడు వాటన్నింటినీ చదవవలసిన అవసరం గానీ వాటన్నింటి గురించి వ్యాఖ్యానించవలసిన అవసరం గానీ లేదు. మీ ప్రేక్షకులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చగలవాటిని మాత్రమే ఎంపికచేసుకోండి. ముద్రిత సంక్షిప్త ప్రతిలో ఉదాహరించబడిన లేఖనాల మీద మీరు ధ్యానముంచినట్లయితే, అదనపు లేఖనాలను ఉపయోగించవలసిన అవసరం ఉండకపోవచ్చు.
మీ ప్రసంగ సాఫల్యం, మీరు ఎన్ని లేఖనాలను ఉపయోగించారన్నదానిపై కాక, మీ బోధనా నాణ్యతపైనే ఆధారపడివుంటుంది. లేఖనాలను పేర్కొనే ముందు వాటిని ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలపండి. వాటిని అన్వయించడానికి సమయాన్ని కేటాయించండి. మీరు ఒక లేఖనాన్ని చదివిన తర్వాత, దాన్ని చర్చించేటప్పుడు బైబిలును తెరిచే ఉంచండి. అప్పుడు మీ ప్రేక్షకులు కూడా తెరిచే ఉంచవచ్చు. మీరు ప్రేక్షకుల ఆసక్తిని ఎలా రేకెత్తించగలరు? వారు దేవుని వాక్యం నుండి పూర్తి ప్రయోజనం పొందేలా వారికి ఎలా సహాయపడగలరు? (నెహె. 8:8,12) వివరణల ద్వారా ఉపమానాల ద్వారా అన్వయింపుల ద్వారా మీరు అలా చేయవచ్చు.
వివరించడం. ఒక కీలక లేఖనాన్ని వివరించడానికి సిద్ధపడుతున్నప్పుడు, ‘దీని భావమేమిటి? నేను దీనిని నా ప్రసంగంలో ఎందుకు ఉపయోగిస్తున్నాను? ఈ వచనాన్ని గురించి ప్రేక్షకులు తమలో తాము ఏమని ప్రశ్నించుకుంటుండవచ్చు?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఆ వచనంలోని మాటల సందర్భాన్నీ నేపథ్యాన్నీ పరిస్థితినీ మాటల తీవ్రతనూ ప్రేరేపిత రచయిత ఉద్దేశాన్నీ విశ్లేషించుకోవలసిన అవసరం ఉండవచ్చు. అందుకు పరిశోధన అవసరం. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందించిన ప్రచురణల్లో విలువైన సమాచార సమృద్ధిని మీరు చూస్తారు. (మత్త. 24:45-47) ఆ వచనం గురించిన ప్రతి అంశాన్ని వివరించాలని ప్రయత్నించే బదులు, మీరు చర్చిస్తున్న అంశానికీ ఆ వచనాన్ని చదవడానికీ సంబంధమేమిటో వివరించండి.
ఉపమానం. ప్రేక్షకులను మరింత లోతైన అవగాహనా స్థాయికి తీసుకువెళ్ళాలి, లేదా మీరు చర్చించిన అంశాన్ని గానీ సూత్రాన్ని గానీ గుర్తుంచుకోవడానికి సహాయపడడమే ఉపమానాల ఉద్దేశం. మీరు వారికి చెప్పినదానిని అర్థం చేసుకోవడానికీ వారు తమకు అప్పటికే తెలిసిన వాటితో దానిని జతచేసుకోవడానికీ ఉపమానాలు సహాయపడతాయి. యేసు, కొండ మీద ఇచ్చిన ప్రఖ్యాత ప్రసంగంలో అదే చేశాడు. ‘ఆకాశపక్షులు,’ “అడవిపువ్వులు,” “ఇరుకు ద్వారము,” ‘బండమీద యిల్లు’ వంటి ఇంకా అనేక మాటలు ఆయన బోధనను శక్తివంతమైనదిగా స్పష్టమైనదిగా మరువలేనిదిగా చేశాయి.—మత్త. 5-7 అధ్యాయాలు.
అన్వయింపు. ఒక లేఖనాన్ని వివరించడము, దానికి ఉపమానాన్ని జోడించడము పరిజ్ఞానాన్ని అందిస్తాయి, కానీ ఆ పరిజ్ఞానాన్ని అన్వయించినప్పుడే ఫలితాలుంటాయి. నిజమే, బైబిలు సందేశానుసారంగా ప్రవర్తించే బాధ్యత మీ ప్రేక్షకులదే. కానీ, వారేమి చేయవలసి ఉందో గ్రహించేందుకు మీరు వారికి సహాయపడగలరు. ప్రేక్షకులు, చర్చించబడుతున్న వచనాన్ని అర్థం చేసుకున్నారనీ ఆ వచనానికి మీరు చర్చిస్తున్న అంశానికి గల సంబంధాన్ని గ్రహిస్తున్నారనీ మీకు నమ్మకం కలిగిన తర్వాత, అది వారి విశ్వాసాలపైనా ప్రవర్తనపైనా ఎలాంటి ప్రభావం చూపాలో
చూపించడానికి సమయం తీసుకోండి. చర్చిస్తున్న సత్యానికి విరుద్ధంగా ఉన్న తప్పుడు తలంపులను గానీ తప్పుడు ప్రవర్తనను గానీ విడిచిపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రత్యేకంగా నొక్కిచెప్పండి.మీరు లేఖనాలను ఎలా అన్వయించాలో ఆలోచిస్తున్నప్పుడు, మీ ప్రేక్షకుల్లో వివిధ నేపథ్యాల నుండి వచ్చినవారున్నారనీ వాళ్ళు వివిధ రకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నారనీ గుర్తుంచుకోండి. క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్నవారు, యౌవనస్థులు, పెద్దవాళ్ళు, వివిధ రకాల వ్యక్తిగత సమస్యలతో పోరాడుతున్నవారు మీ ప్రేక్షకుల్లో ఉండవచ్చు. మీ ప్రసంగం ఆచరణాత్మకమైనదిగా వాస్తవ జీవితానికి సంబంధించినదిగా ఉండేలా చూసుకోండి. మీ మనస్సులో కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే ఉన్నట్లు అనిపించేలా సలహాలు ఇవ్వకుండా జాగ్రత్తపడండి.
ప్రసంగీకుని నిర్ణయాలు
మీ ప్రసంగానికి సంబంధించి మీ కోసం కొన్ని నిర్ణయాలు ముందే చేయబడివున్నాయి. ముఖ్యాంశాలు స్పష్టంగా సూచించబడ్డాయి, ముఖ్యమైన ఒక్కొక్క శీర్షిక మీద మీరు ఎంత సమయం చర్చించాలన్నది స్పష్టంగా చూపించబడింది. ఇక మిగతా నిర్ణయాలు మీరే తీసుకోవాలి. కొన్ని ఉప అంశాల మీద కొంచెం ఎక్కువ సమయమూ మిగతా వాటి మీద ఇంకొంచెం తక్కువ సమయమూ తీసుకోవాలని మీరు ఎంపిక చేసుకోవచ్చు. ప్రతి ఉప అంశాన్నీ ఒకే స్థాయిలో చర్చించాలని అనుకోకండి. అలా చేస్తే, మీరు సమాచారాన్ని వేగంగా చెప్పుకుపోవలసి వస్తుంది, అప్పుడు ప్రేక్షకులు అయోమయంలో పడిపోవచ్చు. దేనిని పూర్తిగా విపులీకరించాలి, దేనిని క్లుప్తంగా చెప్పాలి, లేదా దేనిని పైపైన చెప్పుకుంటూ పోవాలి అన్నది ఎలా నిర్ణయించుకోవచ్చు? ‘ప్రసంగంలోని కీలకమైన తలంపును తెలియజేసేందుకు నాకు ఏ యే అంశాలు సహాయపడతాయి? నా ప్రేక్షకులకు అత్యధికంగా ప్రయోజనం చేకూర్చగల అంశాలు ఏవి? ఉదాహరించబడిన ఒక లేఖనాన్ని, దానికి సంబంధించిన అంశాలను వదిలిపెట్టడం వల్ల అందజేయబడుతున్న రుజువుల క్రమంలోని లింకు దెబ్బతింటుందా?’ అని ప్రశ్నించుకోండి.
ఊహాకల్పనలకు దారివ్వకుండా, లేదా మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తపడండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా ‘తనంతట తానే’ ఏమీ చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. (యోహా. 14:10) ప్రజలు యెహోవాసాక్షుల కూటాలకు వచ్చేది బైబిలు చర్చించబడుతుండగా వినడానికేనన్న విషయం గుర్తించండి. మీరు మంచి ప్రసంగీకుడిగా ఎంచబడుతున్నట్లయితే, దానికి కారణం, ప్రేక్షకుల దృష్టిని మీ వైపుకు మళ్ళించకుండా, అలవాటుగా దేవుని వాక్యం వైపుకు మళ్ళించడమే కావచ్చు. అందువల్లే మీ ప్రసంగాలు మెచ్చుకోబడతాయి.—ఫిలి. 1:9-11.
సరళమైన సంక్షిప్త ప్రతిని, లేఖనాల గురించి ఆలోచింపజేసే లోతైన సమాచారంగా మార్చిన తర్వాత, మీరు మీ ప్రసంగాన్ని అభ్యసించడం అవసరం. మీరు బిగ్గరగా అభ్యసించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ మనస్సులో అంశాలన్నీ స్పష్టంగా ఉండేలా చూడడం ప్రాముఖ్యం. మీరు ప్రసంగిస్తున్నప్పుడు ఆత్మ విశ్వాసంతో ప్రసంగించాలి, ఆ సమాచారానికి ఊపిరి పోయాలి, సత్యాన్ని ఉత్సాహంగా అందజేయాలి. మీరు ప్రసంగించడానికి ముందు, ‘నేను ఏమి సాధించాలని అనుకుంటున్నాను? ముఖ్యాంశాలు ప్రత్యేకంగా గుర్తించబడతాయా? నేను నా ప్రసంగానికి సామె. 15:2.
నిజంగా లేఖనాలనే ఆధారంగా చేసుకున్నానా? ప్రతి ముఖ్యాంశమూ దాని తర్వాతి ముఖ్యాంశానికి సహజంగా దారితీస్తోందా? ఈ ప్రసంగం, యెహోవాను గురించీ ఆయన ఏర్పాటుచేసిన వాటిని గురించీ కృతజ్ఞతను పెంపొందిస్తుందా? ముగింపు, ప్రసంగాంశంతో నేరుగా ముడిపడివుందా? ఏమి చేయాలో ప్రేక్షకులకు చూపిస్తోందా? దానిని చేయడానికి వారిని ప్రేరేపిస్తోందా?’ అని ప్రశ్నించుకోండి. అవును అని మీరు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పుకోగలిగితే, సంఘ ప్రయోజనాల కోసం యెహోవాను స్తుతించేందుకు మీరు “మనోహరమైన జ్ఞానాంశములు” చెప్పగలరన్నమాట.—