ఒక ప్రసంగీకుడిగాను బోధకుడిగాను సామర్థ్యాన్ని పెంపొందించుకొనే కార్యక్రమం
మీరు యౌవనులైనా వయస్సు మళ్ళినవారైనా మగవారైనా ఆడవారైనా మీరు మీ భావాలను ఇంకా సమర్థవంతంగా వ్యక్తం చేసేందుకు, దేవుని వాక్యపు బోధకులుగా మరింత యోగ్యులయ్యేందుకు ఈ కోర్సు మీకు సహాయపడగలదు.
పాఠశాల పైవిచారణకర్త, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరినవారికి నియామకాలను ఇస్తాడు. తర్వాతి మూడు పేజీల్లో మీ వ్యక్తిగత సలహా పత్రాన్ని చూడవచ్చు. సలహా పత్రంలోని వివిధ ప్రసంగ లక్షణాలకు ముందు ఇవ్వబడిన అంకెలు, తర్వాతి పేజీల్లో ఉన్న అధ్యయనాల అంకెలను సూచిస్తాయి. ఆ అధ్యయనాల్లో, నిర్దిష్ట ప్రసంగ అంశాలపై బోధనా అంశాలపై పట్టు సాధించడానికి ఏమి చేయాలి, ప్రతి లక్షణము ఎందుకంత ప్రాముఖ్యమైనది అన్న వివరణను చూస్తారు. సూచించబడిన దానిని ఎలా సాధించాలన్న దానిపై సహాయకరమైన నిర్దేశం కూడా మీకు కనిపిస్తుంది.
సలహా పత్రం మీద ఉన్న వేర్వేరు రంగుల సంకేతాలు (1) ప్రేక్షకుల ఎదుట చదవడానికీ (2) ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందితో చేసే ప్రదర్శనకూ లేదా (3) సంఘం ఎదుట ఇచ్చే ప్రసంగానికీ ఏ ప్రసంగ లక్షణాలు వర్తిస్తాయో చూపిస్తాయి. మీరు కృషి చేయవలసిన ప్రసంగ లక్షణాన్ని మీ పాఠశాల పైవిచారణకర్త నియమిస్తాడు. ఒక్కోసారి ఒక్కో ప్రసంగ లక్షణం మీద కృషి చేయడం అభిలషణీయం. నియమించబడిన అధ్యయనం చివర్లో ఇవ్వబడిన అభ్యాసాలను చేయడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. నియమిత అధ్యయనంలోని ఉపదేశాన్ని మీరు సంపూర్ణంగా పాటించినట్లు మీరు చూపిస్తే, మీ సలహాదారుడు మీకు మరొక ప్రసంగ లక్షణాన్ని నియమిస్తాడు.
మీ నియామకాన్ని ప్రదర్శన రూపంలో నిర్వహించవలసి ఉంటే, మీకు ఒక సన్నివేశం అవసరమవుతుంది. 82వ పేజీలో సన్నివేశాల పట్టిక ఇవ్వబడింది, కానీ మీరు ఆ పట్టికకే పరిమితమై ఉండాలనేమీ లేదు. మీరు అనుభవాన్ని సంపాదించుకునేందుకు ఫలాని సన్నివేశాన్ని ప్రయత్నించమని మీ సలహాదారుడు సూచించవచ్చు, లేదా ఆ ఎంపికను మీకే వదిలేయవచ్చు.
మీకు పాఠశాలలో నియామకం లేనప్పుడు కూడా ఈ పుస్తకం చదివి అభ్యాసాలను చేయడం, మీ ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుంది. మీరు ఒక్కో వారం ఒక్కో అధ్యయనాన్ని అభ్యసించవచ్చు.
మీరు ఈ పాఠశాలలో లేదా క్షేత్ర పరిచర్యలో ఎంతకాలం నుండి పాల్గొంటున్నా మీరు మెరుగుపడవలసిన విషయాలుంటాయి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ద్వారా అందించబడుతున్న విద్య నుండి మీరు సంపూర్ణ ప్రయోజనం పొందుదురు గాక.