కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

41

ఇతరులకు అర్థమయ్యేలా ఉండడం

ఇతరులకు అర్థమయ్యేలా ఉండడం

మీరు మాట్లాడేటప్పుడు సమాచారాన్ని కేవలం అందజేయడం కన్నా ఎక్కువే చేయండి. వినేవారికి అర్థమయ్యేలా చెప్పడానికి కృషిచేయండి. మీరు సంఘంతో మాట్లాడుతున్నా సాక్షేతరులతో మాట్లాడుతున్నా సరే, ప్రభావితం చేసే విధంగా భావాలను వ్యక్తం చేసేందుకు మీకు సహాయపడగలదు.

సులభంగా అర్థమయ్యేలా మాట్లాడడంలో అనేక పార్శ్వాలున్నాయి. వాటిలో కొన్ని, “సమాచారాన్ని తర్కబద్ధంగా విపులీకరించడం” అనే 26వ అధ్యయనంలో చర్చించబడ్డాయి. మిగిలినవి, “ఎదుటి వ్యక్తి మీద ఆసక్తి చూపించడం” అనే 30వ అధ్యయనంలో చర్చించబడ్డాయి. ఈ అధ్యయనంలో, కొన్ని అదనపు అంశాలను మనం చర్చించబోతున్నాము.

సరళమైన పదాలూ సరళమైన శైలీ. సరళమైన పదాలూ చిన్న వాక్యాలూ భావాలను వ్యక్తం చేయడానికి శక్తివంతమైన సాధనాలు. కొండమీద యేసు ఇచ్చిన ప్రసంగం, ప్రజలు ఎవరైనా సరే ఎక్కడ జీవిస్తున్నవారైనా సరే వాళ్ళందరూ అర్థం చేసుకోగల ప్రసంగానికి అత్యుత్కృష్టమైన మాదిరిగా ఉంది. వాళ్ళకు ఆ భావాలు క్రొత్తగా ఉండవచ్చు. అయినప్పటికీ వాళ్ళు యేసు చెప్పినవాటిని అర్థం చేసుకోగలిగారు, ఎందుకంటే ఆయన మనమందరం ఆలోచించే విషయాలను అంటే, సంతోషంగా ఎలా ఉండాలి, ఇతరులతో ఉన్న సంబంధాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, వ్యాకులతను ఎలా అధిగమించాలి, జీవితానికి నిజమైన అర్థాన్ని ఎలా కనుగొనాలి వంటి విషయాలను ఆయన చర్చించాడు. ఆయన తన ఆలోచనలను సరళమైన భాషలో వ్యక్తం చేశాడు. (మత్త., 5-7 అధ్యా.) అవును, వాక్యాల పొడవులో ఉన్న వైవిధ్యానికీ నిర్మాణంలో ఉన్న వైవిధ్యానికీ అనేక ఉదాహరణలను బైబిలు ఇస్తోంది. ఆలోచనలను స్పష్టంగా, అర్థంచేసుకోగల విధంగా వ్యక్తం చేయాలన్నదే మీ ముఖ్య లక్ష్యంగా ఉండాలి.

మీరు లోతైన సమాచారాన్ని చర్చిస్తున్నప్పుడు కూడా, సులభంగా అర్థం చేసుకోవడానికి సరళమైన శైలి సహాయపడగలదు. సరళతను ఎలా సాధించవచ్చు? అనవసర వివరాలతో మీ ప్రేక్షకులను ముంచెత్తేయకండి. మీ సమాచారాన్ని క్రమబద్ధం చేసుకోండి. అప్పుడు ఆ సమాచారం మీ ముఖ్యాంశాలకు పూరకమవుతుంది. కీలకమైన లేఖనాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. ఒక్కొక్క వచనాన్ని త్వరత్వరగా చెప్పుకుంటూ వెళ్ళే బదులు వాటిని చదివి చర్చించండి. అనేక పదాలు ఉపయోగించడం ద్వారా మంచి ఆలోచనను సమాధి చేయకండి.

మీరు ఒక గృహ బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు, ఈ సూత్రాలనే అన్వయించండి. అన్ని వివరాలనూ వివరించాలని ప్రయత్నించకండి. ప్రధానమైన అంశాలను స్పష్టంగా అర్థం చేసుకునేలా విద్యార్థికి సహాయం చెయ్యండి. తర్వాత, వ్యక్తిగత అధ్యయనంలోనూ సంఘ కూటాల్లోనూ ఆయన ఆ వివరాలను తెలుసుకుంటాడు.

సమాచారాన్ని సరళంగా అందించాలంటే మంచి సిద్ధపాటు అవసరం. మీరు విషయాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పబోతున్నట్లయితే, మీరు స్పష్టంగా అర్థం చేసుకొనివుండాలి. మీకు ఒక విషయం నిజంగా అర్థమైనప్పుడు, దాన్ని వివరించేటప్పుడు కారణాలు ఇవ్వగలుగుతారు. దాన్ని మీరు మీ సొంత మాటల్లో కూడా చెప్పగలుగుతారు.

పరిచయంలేని పదాలను వివరించండి. కొన్నిసార్లు విషయం సులభంగా అర్థమయ్యేలా చెయ్యాలంటే, మీ ప్రేక్షకులకు పరిచయం లేని పదాలను మీరు వివరించి చెప్పాలి. మీ ప్రేక్షకుల పరిజ్ఞానాన్ని అతిగా అంచనా వేయకండి, అయితే వారి మేధాశక్తిని తక్కువగా కూడా అంచనా వేయకండి. మీరు బైబిలు అధ్యయనం చేయడం వల్ల, ఇతరులకు పరిచయం లేనట్లనిపించే కొన్ని పదాలను మీరు ఉపయోగించవచ్చు. యెహోవాసాక్షులతో సహవసించని వారికి కొంచెం వివరించకపోతే, వారు “శేషము,” ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు,’ “వేరే గొఱ్ఱెలు,” “గొప్పసమూహము” వంటి పదాలు నిర్దిష్ట గుంపులను సూచిస్తాయని అర్థం చేసుకోలేరు. (రోమా. 11:5; మత్త. 24:45; యోహా. 10:16; ప్రక. 7:9) అదేవిధంగా, ఒక వ్యక్తికి యెహోవాసాక్షుల సంస్థతో పరిచయం లేకపోతే, ఆయన “ప్రచారకుడు,” “పయినీరు,” “ప్రాంతీయ పైవిచారణకర్త,” “జ్ఞాపకార్థం” వంటి పదాల భావాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు.

సాక్షేతరులు కూడా తరచూ వాడే కొన్ని బైబిలు మాటలకు కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండవచ్చు. చాలామంది దృష్టిలో, “అర్మగిద్దోను” అంటే అణుశక్తితో సర్వనాశనం అని అర్థం. “దేవుని రాజ్యము” అంటే దాన్ని ఒక ప్రభుత్వముతో కాక, పరలోకంతో గానీ ఒక వ్యక్తి అంతరంగ స్థితితో గానీ ముడిపెడతారు. “ఆత్మ” అనే పదం, మరణించినప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి మనుగడ సాగించే మానవులలో ఉండే ఆత్మ సంబంధ భాగమని తలంచబడే దాని గురించిన ఆలోచనలను రేకెత్తించవచ్చు. లక్షలాది మంది ప్రజలకు బోధించబడినదాని ప్రకారం, “పరిశుద్ధాత్మ” ఒక వ్యక్తి, త్రిత్వంలో ఒక భాగం. చాలామంది బైబిలులోవున్న నైతిక నియమావళిని వదిలిపెట్టారు కనుక, “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని బైబిలు చెబుతున్నప్పుడు దాని ఉద్దేశమేమిటన్నది అర్థం చేసుకునేందుకు కూడా వారికి సహాయం అవసరం కావచ్చు.—1 కొరిం. 6:18.

“. . . అని పౌలు వ్రాశాడు” అనో “. . . లూకా అన్నాడు” అనో మాత్రమే అంటే, బైబిలును క్రమంగా చదవనివాళ్ళు అపార్థం చేసుకోగలరు. అవే పేర్లు గల స్నేహితులు గానీ పొరుగువారు గానీ వారికి ఉండవచ్చు. అది ఒక క్రైస్తవ అపొస్తలుడు లేదా బైబిలు లేఖకుడు అని వాళ్ళకు తెలియజేసే వివరించే పదాలను మీరు జోడించడం అవసరం కావచ్చు.

ప్రాచీన కాలానికి సంబంధించిన కొలతలు లేదా ఆచారాలు చేరివున్న లేఖనాలను అర్థం చేసుకోవడానికి ఆధునిక దిన ప్రేక్షకులకు తరచూ సహాయం అవసరమవుతుంది. ఉదాహరణకు, నోవహు ఓడ 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు అంటే వాళ్ళకు ఏమీ అర్థం కాకపోవచ్చు. (ఆది. 6:15) అయితే, అవే కొలతలను సుపరిచితమైన స్థానిక కట్టడాల పరిమాణంతో పోలుస్తూ తెలిపితే, మీ ప్రేక్షకులు ఓడ పరిమాణాన్ని వెంటనే తమ మనోఫలకంపై దృశ్యీకరించుకోగలుగుతారు.

అవసరమైన వివరణలను ఇవ్వండి. మీ ప్రేక్షకులకు ఒక విషయాన్ని స్పష్టం చేసేందుకు, ఒక నిర్దిష్ట పదానికున్న సరైన నిర్వచనం కన్నా ఎక్కువే అవసరం కావచ్చు. ఎజ్రా కాలంలో యెరూషలేములో, ధర్మశాస్త్ర పఠనంతో పాటు వివరణనివ్వడం కూడా జరిగేది. ప్రజలు ధర్మశాస్త్రం చెబుతున్న దాని అర్థాన్ని గ్రహించేందుకు, లేవీయులు దాన్ని వ్యాఖ్యానించేవారు, ఆ కాలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితికి అన్వయించేవారు. (నెహె. 8:8,12) అదేవిధంగా, మీరు చదివే లేఖనాలను వివరించేందుకూ అన్వయించేందుకూ సమయం తీసుకోండి.

తాను చనిపోవడం పునరుత్థానం చేయబడడం లేఖనాల నెరవేర్పేనని అవి జరిగిన తర్వాత యేసు తన శిష్యులకు వివరించాడు. వాటికి సాక్షులుగా వారి బాధ్యతను ఆయన నొక్కిచెప్పాడు కూడా. (లూకా 24:44-48) తమకు బోధించబడింది తమ సొంత జీవితాలపై ఎలా ప్రభావం చూపించాలో గ్రహించేందుకు ప్రజలకు సహాయం చేసినప్పుడు, దాని అసలు అర్థం ఏమిటన్నది వాళ్ళు ఇంకా త్వరగా అర్థం చేసుకోగలుగుతారు.

హృదయం పాత్ర ఏమిటి? నిజమే, మీ వివరణలు స్పష్టంగా ఉన్నా అవతలి వ్యక్తి అర్థం చేసుకుంటాడా లేదా అన్నదానిపై ఇతర విషయాలు కూడా ప్రభావం చూపుతాయి. ఒక వ్యక్తి హృదయం ప్రతిస్పందించనిదిగా ఉన్నప్పుడు, చెప్పబడిన దాని భావాన్ని అర్థం చేసుకోకుండా ఉండేందుకు అదే ఒక అడ్డుగోడగా ఉంటుంది. (మత్త. 13:13-15) భౌతిక దృక్కోణంలోనే చూడాలన్న దృఢనిశ్చయంతో ఉన్నవాళ్ళకు ఆధ్యాత్మిక విషయాలు వెఱ్ఱితనంగా అనిపిస్తాయి. (1 కొరిం. 2:14) ఒక వ్యక్తి అలాంటి స్ఫూర్తిని చూపించినప్పుడు, ఆ చర్చను కనీసం అప్పటికి ముగించేయడం జ్ఞానయుక్తమైన పని.

అయితే కొందరి హృదయాలు ప్రతిస్పందించకుండా ఉండడానికి కారణం వారికి జీవితంలో ఎదురైన కఠినమైన పరిస్థితులే. బైబిలు సత్యాన్ని మళ్ళీ మళ్ళీ వినే అవకాశం కొంతకాలంగా ఆయనకుంటే ఆయన హృదయం ప్రతిస్పందించేదిగా మారవచ్చు. కొరడాలచేత కొట్టబడి ఆ తర్వాత చంపబడబోతున్నానని యేసు తన అపొస్తలులకు చెప్పినప్పుడు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదు? నిజానికి అది వాళ్ళు ఎదురుచూసిందీ కాదు, కోరుకున్నదీ కాదు! (లూకా 18:31-34) అయినప్పటికీ ఆ అపొస్తలుల్లో 11 మంది కొన్నాళ్ళ తర్వాత అర్థం చేసుకున్నారు, వాళ్ళు అది అర్థం చేసుకున్నారన్నది, యేసు తమకు బోధించిన దానికి అనుగుణంగా ప్రవర్తించడం ద్వారా చూపించారు.

చక్కని మాదిరి ప్రభావం. ప్రజలు మన మాటల ద్వారా కాక మన క్రియల ద్వారా కూడా అర్థం చేసుకోవడానికి సహాయం పొందారు. తాము రాజ్యమందిరానికి మొదటిసారి వచ్చినప్పుడు అక్కడ చెప్పబడింది కాదుకానీ కనిపించిన ప్రేమే తమకు గుర్తున్నట్లు చాలామంది చెబుతారు. అదేవిధంగా, మనలో కనిపించిన సంతోషం కూడా చాలామంది గృహస్థులు బైబిలు సత్యాన్ని స్వీకరించడానికి సహాయపడింది. యెహోవా ప్రజలకు ఒకరి మీద ఒకరికున్న ప్రేమపూర్వక దయనూ ఇతరులకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వారు చూపించిన ప్రేమపూర్వక శ్రద్ధనూ చూడడం, సాక్షుల మతము సత్య మతమనే నిర్ధారణకు కొందరు వచ్చేలా చేసింది. కాబట్టి ప్రజలు బైబిలు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు వారికి సహాయపడడానికి ప్రయత్నిస్తుండగా, మీరు దాన్ని ఎలా వివరించాలన్న దాని గురించీ మీరు ఎలాంటి మాదిరిని ఉంచుతున్నారన్న దాని గురించి కూడా ఆలోచించండి.