అధ్యయనం ప్రతిఫలదాయకంగా ఉంటుంది
ప్రజలు పండును జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? అది పండిందో లేదో చూడడానికి, చాలా మంది దాని రంగునూ పరిమాణాన్నీ చూస్తారు. కొంతమంది పండు వాసన చూస్తారు. కొందరు పట్టుకొని చూస్తారు, నొక్కి కూడా చూస్తారు. మరికొందరు, రెండు చేతుల్లో ఒక్కొక్క పండును పట్టుకుని ఏది రసంతో ఎక్కువ బరువుగా ఉందా అని చూస్తారు. అలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమి ఆలోచిస్తుంటారు? వాళ్ళు వాటి గురించిన వివరాలను విశ్లేషిస్తారు, అంతకు ముందు తీసుకున్న వాటిని గుర్తుచేసుకుంటారు, ఇప్పుడు చూస్తున్నవాటిని పండ్ల గురించి తమకు తెలిసిన విషయాలతో పోల్చి చూస్తూ తేడాలను మదింపు చేస్తారు. వారు జాగ్రత్తగా ఆలోచించి ఎంపిక చేసుకుంటారు గనుక, దానికి ప్రతిఫలంగా ఎంతో రుచిని ఆస్వాదిస్తారు.
అవును, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం వల్ల కలిగే ప్రతిఫలాలు ఇంకా గొప్పగా ఉంటాయి. మన జీవితంలో అలాంటి అధ్యయనానికి ప్రముఖ స్థానమిచ్చినప్పుడు, మన విశ్వాసం మరింత బలపడుతుంది, మన ప్రేమ మరింత ప్రగాఢమవుతుంది, మన పరిచర్య మరింత ఫలవంతమవుతుంది, మనం తీసుకొనే నిర్ణయాలు, వివేచనకూ దైవిక జ్ఞానానికీ ఇంకా గొప్ప నిదర్శనంగా ఉంటాయి. సామెతలు 3:15 అలాంటి ప్రతిఫలాలను గురించి మాట్లాడుతూ, “నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు” అని చెబుతోంది. మీరు అలాంటి ప్రతిఫలాలు పొందుతున్నారా? అలాంటి ప్రతిఫలాలకు, మీ అధ్యయన విధానం ఒక కారకం కావచ్చు.—కొలొ. 1:9-12.
అధ్యయనం అంటే ఏమిటి? అధ్యయనమంటే పైపైన చదివేయడం మాత్రమే కాదు. అందులో విషయాన్ని జాగ్రత్తగా లేదా విపులంగా పరిశీలించడానికి మేధాశక్తులను ఉపయోగించడం ఇమిడివుంది. చదువుతున్న దాన్ని విశ్లేషించడం, ఇప్పటికే తెలిసిన దానితో పోల్చడం, దానిలో పేర్కొనబడిన విషయాలకూ వ్యాఖ్యలకూ గల కారణాలను గురించి ఆలోచించడం అధ్యయనంలో చేరివున్నాయి. అధ్యయనం చేసేటప్పుడు, అందులో వ్యక్తం చేయబడిన తలంపులలో ఏవైనా మీకు క్రొత్తగా ఉంటే వాటి గురించి లోతుగా ఆలోచించండి. లేఖనానుసారమైన ఉపదేశాన్ని మీరు ఇంకా సంపూర్ణంగా స్వయంగా ఆచరించడమెలాగో కూడా ఆలోచించండి. ఇతరులకు సహాయపడడానికి ఆ సమాచారాన్ని ఉపయోగించగల అవకాశాలను గురించి ఆలోచించాలని కూడా ఒక యోహోవాసాక్షిగా మీరు కోరుకుంటారు. అధ్యయనంలో ధ్యానించడం కూడా ఉందన్నది స్పష్టం.
సరైన మనఃస్థితికి రావడం
అధ్యయనం చేయడానికి సిద్ధమయ్యేటప్పుడు మీ బైబిలు, మీరు ఉపయోగించాలనుకుంటున్న ప్రచురణలు, పెన్సిలు లేదా పెన్ను, బహుశా ఒక నోట్ బుక్ వంటి వాటిని ముందుంచుకుంటారు. అయితే, మీరు మీ హృదయాన్ని కూడా సిద్ధపరుచుకుంటారా? “ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దానిచొప్పున ఎజ్రా 7:10) హృదయాన్ని అలా సిద్ధం చేసుకోవడంలో ఏమి చేరివుంది?
నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను” అని బైబిలు మనకు చెబుతోంది. [మూల భాషలోని పాఠ్యభాగాన్ని జాగ్రత్తగా అనువదిస్తే, “తన హృదయమును సిద్ధం చేసుకున్నాడు” అని వస్తుంది.] (మనం దేవుని వాక్యాన్ని సరైన దృక్పథంతో అధ్యయనం చేయడానికి ప్రార్థన సహాయపడుతుంది. యెహోవా మనకిచ్చే ఉపదేశాన్ని స్వీకరించడానికి మన హృదయం, మన అంతరంగం సిద్ధంగా ఉండాలని మనం కోరుకుంటాం. ఒక్కొక్క భాగాన్ని అధ్యయనం చేసే ముందు, యెహోవా దేవుని ఆత్మ సహాయం కోసం ఆయనకు విజ్ఞప్తి చేసుకోండి. (లూకా 11:13) మీరు అధ్యయనం చేస్తున్న సమాచారం భావం ఏమిటి, అది ఆయన సంకల్పంతో ఎలా ముడిపడి ఉంది, మంచి చెడులను గుర్తించేందుకు అది మీకెలా సహాయపడగలదు, ఆయన సూత్రాలను మీ జీవితంలో ఎలా ఆచరించాలి, ఆ సమాచారం మీకు ఆయనతో ఉన్న సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేవాటిని అర్థం చేసుకోవడానికి సహాయపడమని ఆయనను అడగండి. (సామె. 9:10) మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు, జ్ఞానము కోసం “దేవుని అడుగవలెను.” (యాకో. 1:5) తప్పుడు ఆలోచనలను గానీ హానికరమైన కోరికలను గానీ వదిలించుకోవడానికి మీరు యెహోవా సహాయం కోసం అడుగుతూ మీరు నేర్చుకుంటున్న దాని వెలుగులో, మిమ్మల్ని మీరు నిజాయితీగా మదింపు చేసుకోండి. యెహోవా వెల్లడిచేస్తున్న విషయాలను బట్టి ఆయనంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండండి. (కీర్త. 147:7) ప్రార్థనాపూర్వక అధ్యయనం, యెహోవా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆయన చెప్పేదానికి ప్రతిస్పందించేలా చేస్తుంది గనుక, మనకు యెహోవాతో సాన్నిహిత్యం పెరుగుతుంది.—కీర్త. 145:18.
అలా స్వీకరించే సిద్ధమనస్సు, యెహోవా ప్రజలను లోకంలోని చాలా మంది ప్రజలకు భిన్నంగా చేస్తుంది. లేఖనాలను సందేహించడం, సవాలు చేయడం అనేవి దైవభక్తి లేనివారికి ఫ్యాషన్ అయిపోయింది. కానీ మనం అలా కాదు. మనం యెహోవా మీద నమ్మకముంచుతాము. (సామె. 3:5-7) మనకు ఏదైనా అర్థం కాకపోతే అది తప్పయ్యుంటుందని అహంకారంతో భావించము. జవాబుల కోసం వెదుకుతూ లోతుగా పరిశీలిస్తూ మనం యెహోవా నడిపింపు కోసం ఎదురుచూస్తాం. (మీకా 7:7) నేర్చుకున్నదాని అనుసారంగా నడుచుకోవాలి, దానిని బోధించాలి అన్న లక్ష్యం ఎజ్రాకున్నట్లే మనకూ ఉంది. ఆ విధంగా చేయడానికి మన హృదయం మొగ్గు చూపితే, మనం మన అధ్యయనం ద్వారా గొప్ప ప్రతిఫలాలను పొందగలుగుతాం.
అధ్యయనం ఎలా చెయ్యాలి?
మొదటి పేరాతో మొదలుపెట్టి చివరిదాకా అలా చదువుకుంటూ పోయే బదులు, ముందుగా ఆ ఆర్టికల్‌నుగానీ అధ్యాయాన్నిగానీ ఒకసారి ఆసాంతం చూడడానికి మొదట కొంచెం సమయం తీసుకోండి. శీర్షికలోని పదాలను విశ్లేషించడంతో మొదలుపెట్టండి. ఆ శీర్షికే, మీరు అధ్యయనం చేయబోతున్నదాని అంశము. తర్వాత ఉపశీర్షికలు అంశంతో ఎలా ముడిపడివున్నాయో జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. పాఠ్యభాగంతో పాటు చిత్రాలు గానీ చార్టులు గానీ బోధనా బాక్సులు గానీ ఏమైనా ఉంటే వాటిని కూడా పరిశీలించండి. ‘ఇలా ఆసాంతం చూసినదాన్ని
బట్టి, దీనినుండి నేనేమి నేర్చుకోగలనని ఎదురుచూడవచ్చు? ఇది నాకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అలా ప్రశ్నించుకోవడం మీ అధ్యయనానికి ఒక లక్ష్యాన్నిస్తుంది.ఆ తర్వాత, అది చెబుతున్న వాస్తవాలను గ్రహించండి. కావలికోట అధ్యయన ఆర్టికల్‌లలోను, కొన్ని పుస్తకాల్లోను ముద్రిత ప్రశ్నలుంటాయి. మీరు ఒక్కొక్క పేరా చదివేటప్పుడు జవాబులకు ఏదైనా గుర్తుపెట్టుకోవడం వల్ల ప్రయోజనముంటుంది. అధ్యయన ప్రశ్నలు లేకపోయినా కూడా, మీరు గుర్తుంచుకోవాలనుకుంటున్న ప్రాముఖ్యమైన విషయాలకు ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. అందులోని ఒక ఆలోచన మీకు క్రొత్తదైతే, దాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం వెచ్చించండి. క్షేత్రసేవలో మీకు ఉపయోగకరంగా ఉండగల, లేదా మీరు కొన్నాళ్ళలో ఇవ్వబోతున్న ప్రసంగంలో చేర్చగల ఉపమానాల కోసం తర్కించగల కోణాల కోసం చూడండి. మీరు అధ్యయనం చేస్తున్న దాన్ని పంచుకుంటే ఎవరి విశ్వాసం బలపడగలదో ఆలోచించండి. మీరు ఉపయోగించాలనుకుంటున్న విషయాలకు ఏదైనా గుర్తుపెట్టుకోండి. మీ అధ్యయనం పూర్తయిన తర్వాత వాటిని మరొకసారి చూసుకోండి.
మీరు సమాచారాన్ని పరిశీలిస్తుండగా, అందులో ఉదాహరించబడిన లేఖనాలను తెరిచి చూడండి. ఒక్కొక్క లేఖనానికి, ఆ పేరా చెబుతున్న విషయంతో ఎలాంటి సంబంధముందో విశ్లేషించండి.
అలా విశ్లేషించేటప్పుడు, మీరు వెంటనే అర్థం చేసుకోలేని విషయాలు గానీ తర్వాత ఇంకా క్షుణ్ణంగా పరిశోధించడానికి మీరు ఇష్టపడే విషయాలు గానీ మీకు తారసపడవచ్చు. ఆ విషయాలు ప్రస్తుతం పరిశీలిస్తున్న సమాచారం నుండి మీ అవధానాన్ని ప్రక్కకు మళ్ళించడానికి అనుమతించే బదులు, వాటి గురించి తర్వాత మరెక్కువగా పరిశీలించడానికి, వాటిని వ్రాసి పెట్టుకోండి. మీరు మిగతా భాగం చదువుతున్నప్పుడు ఆ విషయాలు స్పష్టమవుతుండవచ్చు. అప్పటికీ స్పష్టం కాకపోతే, మీరు అదనపు పరిశోధన చేయవచ్చు. ప్రత్యేకంగా పరిశీలించడానికి ఎటువంటి విషయాలను వ్రాసిపెట్టుకోవాలి? బహుశా అక్కడ ఉల్లేఖించబడిన లేఖనం మీకు స్పష్టంగా అర్థంకాకపోవచ్చు, ప్రస్తుతం చర్చిస్తున్న అంశానికి అది ఎలా వర్తిస్తుందో మీరు వెంటనే అర్థం చేసుకోలేకపోవచ్చు, మీరు చదువుతున్న ఒక విషయం మీకు అర్థమైనట్లు అనిపించినా దాన్ని ఇతరులకు వివరించగల్గేంతగా మీరు అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. అలాంటి వాటిని అలా వదిలేసే బదులు, మీరు అధ్యయనం చేయడం మొదలుపెట్టిన దాన్ని ముగించిన తర్వాత, వాటి గురించి పరిశోధన చేయడం జ్ఞానయుక్తంగా ఉండవచ్చు.
అపొస్తలుడైన పౌలు హీబ్రూ క్రైస్తవులకు వివరంగా ఒక ఉత్తరం వ్రాస్తూ, “ముఖ్య అంశం ఏమిటంటే:” అని మధ్యలో విరామమిచ్చాడు. (హెబ్రీ. 8:1, ఈజీ-టు-రీడ్ వర్షన్) మీరు కూడా మధ్యమధ్యలో ఆగి మీకై మీరు ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారా? పౌలు అలా ఎందుకు చేశాడో చూడండి. క్రీస్తు, గొప్ప ప్రధాన యాజకుడుగా పరలోకంలోకి ప్రవేశించాడని తన ప్రేరేపిత ఉత్తరంలోని ముందటి అధ్యాయాల్లో ఆయన అప్పటికే తెలియజేశాడు. (హెబ్రీ. 4:14-5:10; 6:20) అయితే, 8వ అధ్యాయం ఆరంభంలో ఆయన ముఖ్యమైన ఆ విషయాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పడం ద్వారా, తన పాఠకులు తమ జీవితాలకు దానితో ఎలాంటి సంబంధముందో లోతుగా ఆలోచించేందుకు వారి మనస్సులను సిద్ధం చేశాడు. క్రీస్తు మన పక్షాన దేవుని సముఖానికి వెళ్ళి, పరలోక సంబంధమైన “పరిశుద్ధస్థలము”లో ప్రవేశించే మార్గాన్ని తెరిచాడని ఆయన వారికి తెలియజేశాడు. (హెబ్రీ. 9:24; 10:19-22) విశ్వాసానికీ సహనానికీ క్రైస్తవ ప్రవర్తనకూ సంబంధించి ఆ ఉత్తరంలో మరెక్కువగా ఇవ్వబడిన ఉపదేశాన్ని అనుసరించేలా ప్రేరణ పొందడానికి తమ నిరీక్షణను గురించిన నిశ్చయత వాళ్ళకు సహాయపడింది. అలాగే మనమూ ముఖ్యమైన అంశాలపై మనస్సును కేంద్రీకరిస్తూ అధ్యయనం చేస్తే మనం అధ్యయనం చేస్తున్న ఆ అంశం ఎలా విపులీకరించబడిందో గ్రహించగలుగుతాము, దానికి అనుగుణంగా ప్రవర్తించడానికి గల సరైన కారణాలు మన మనస్సులపై ముద్రించబడతాయి.
మీ వ్యక్తిగత అధ్యయనం మీరు క్రియాశీలురయ్యేలా మిమ్మల్ని కదిలిస్తోందా? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. మీరు ఏదైనా తెలుసుకున్నప్పుడు, ‘ఇది నా దృక్పథంపైనా, నా జీవిత లక్ష్యాలపైనా ఎలాంటి ప్రభావం చూపాలి? ఒక సమస్యను పరిష్కరించుకోవడంలో గానీ ఒక నిర్ణయం తీసుకోవడంలో గానీ ఒక లక్ష్యాన్ని సాధించడంలో గానీ ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోగలను? నేను దీన్ని నా కుటుంబంలోనూ క్షేత్ర పరిచర్యలోనూ సంఘంలోనూ ఎలా ఉపయోగించుకోగలను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఈ ప్రశ్నలను ప్రార్థనాపూర్వకంగా వేసుకొని, మీరు మీ పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టగల వాస్తవిక పరిస్థితులను గురించి ఆలోచించండి.
ఒక అధ్యాయాన్నిగానీ ఒక ఆర్టికల్‌నిగానీ పూర్తి చేసిన తర్వాత, క్లుప్తంగా పునఃపరిశీలించడానికి సమయం తీసుకోండి. మీరు ముఖ్యమైన విషయాలనూ వాటిని బలపరిచే వాదనలనూ జ్ఞాపకం చేసుకోగలరేమో చూడండి. ఈ విధంగా చేయడం, మీరు చదివిన సమాచారాన్ని భవిష్యత్తులో ఉపయోగం కోసం జ్ఞాపకముంచుకునేందుకు మీకు సహాయపడుతుంది.
దేనిని అధ్యయనం చెయ్యాలి?
యెహోవా ప్రజలుగా మనకు అధ్యయనం చేయడానికి చాలా ఉంది. కానీ ఎక్కడి నుండి మొదలుపెట్టాలి? ప్రతిదినం లేఖనాలను పరిశోధించడంలోని దినవచనాన్నీ వ్యాఖ్యానాలనూ ప్రతిరోజూ అధ్యయనం చేయడం మంచిది. ప్రతి వారం, మనం సంఘ కూటాలకు హాజరవుతాం, మనం వాటికి సిద్ధపడేందుకు అధ్యయనం చేయడం మనం ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందేందుకు మనకు సహాయపడుతుంది. అంతేకాక కొందరు, తాము సత్యాన్ని నేర్చుకోవడానికి ముందు ముద్రించబడిన క్రైస్తవ ప్రచురణల్లోని కొన్నింటిని అధ్యయనం చేసేందుకు జ్ఞానయుక్తంగా సమయాన్ని వెచ్చించారు. మరికొందరు, వారపు బైబిలు పఠనంలోని కొంత భాగాన్ని ఎంపిక చేసుకొని, ఆ వచనాలను ఇంకా లోతుగా అధ్యయనం చేస్తారు.
ప్రతి వారం సంఘ కూటాల్లో చర్చించబడే సమాచారాన్నంతటినీ శ్రద్ధగా అధ్యయనం చేసేందుకు మీ పరిస్థితులు అనుమతించకపోతే అప్పుడెలా? సమాచారాన్నంతటినీ అధ్యయనం చేయాలి కనుక, పైపైన చదివేసి ముగించేయడం, అంతకన్నా ఘోరంగా, ఎలాగూ అంతా అధ్యయనం చేయడం సాధ్యం కాదు కదా అని అసలు దేనినీ అధ్యయనం చేయకుండా ఉండడం లాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడండి. బదులుగా మీరు ఎంత అధ్యయనం చేయగలరో నిర్ణయించుకొని, అంత మట్టుకు చక్కగా అధ్యయనం చేయండి. ప్రతివారం అలా చేయండి, కొన్నాళ్ళకు మీ అధ్యయనంలో ఇతర కూటాల సిద్ధపాటును కూడా చేర్చుకోండి.
‘ఇల్లు కట్టుకొనుము’
తమ ప్రియమైనవారికి అవసరమైన వాటిని సమకూర్చేందుకు కుటుంబ శిరస్సులు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉందని యెహోవాకు తెలుసు. “బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాని సిద్ధపరచుము” అని సామెతలు 24:27 చెబుతోంది. అయినప్పటికీ, మీ కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే, ఆ వచనం “తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును” అని కూడా అంటోంది. కుటుంబ శిరస్సులు దీనినెలా చేయవచ్చు? “జ్ఞానమువలన ఇల్లు కట్టబడును, వివేచనవలన అది స్థిరపరచబడును” అని సామెతలు 24:3 చెబుతోంది.
వివేచన మీ ఇంటివారికి ఎలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది? స్పష్టంగా కనిపించేవాటిని మించి చూసే సామర్థ్యమే వివేచన. సమర్థవంతమైన కుటుంబ అధ్యయనం, సొంత కుటుంబాన్నే అధ్యయనం చేయడంతో మొదలవుతుందని చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక ప్రగతి ఎలా ఉంది? మీరు వారితో సంభాషించేటప్పుడు శ్రద్ధగా వినండి. ఫిర్యాదు చేసే స్వభావం గానీ, మనస్సులో కోపముంచుకునే స్వభావం గానీ వారికి ఉందా? వాళ్ళు భౌతిక లక్ష్యాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారా? మీరు మీ పిల్లలతోపాటు క్షేత్రసేవలో ఉన్నప్పుడు, వాళ్ళు, మేము యెహోవాసాక్షులమని తమ సమవయస్కులకు ఇబ్బందిపడకుండా చెబుతున్నారా? కుటుంబ సమేతంగా బైబిలు చదువుకుంటున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు వాళ్ళు ఆనందిస్తున్నారా? వాళ్ళు యెహోవా మార్గాన్ని నిజంగా తమ మార్గంగా చేసుకుంటున్నారా? అన్నవి జాగ్రత్తగా గమనిస్తే, కుటుంబ సభ్యుల్లోని ప్రతి ఒక్కరిలోను ఆధ్యాత్మిక గుణాలను అలవరిచి, వాటిని పెంపొందించేందుకు కుటుంబ శిరస్సుగా మీరు ఏమేమి చేయవలసిన అవసరం ఉందో మీకు తెలుస్తుంది.
నిర్దిష్ట అవసరాలను తీర్చగల ఆర్టికల్‌ల కోసం కావలికోట, తేజరిల్లు! పత్రికలను చూడండి. ఆ తర్వాత, మీరు ఏ ఆర్టికల్‌ను అధ్యయనం చేయబోతున్నారో మీ కుటుంబ సభ్యులకు ముందుగా చెప్పండి, అప్పుడు వాళ్ళు కూడా ఆ సమాచారాన్ని గురించి అధ్యయనానికి ముందే ఆలోచించగలుగుతారు. అధ్యయన సమయంలో ప్రేమపూర్వకమైన వాతావరణం కొనసాగేలా చూడండి. కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా గద్దించడం గానీ కలవరపరచడం గానీ చేయకుండా, మీరు ప్రస్తుతం పరిశీలిస్తున్న సమాచార విలువను నొక్కిచెప్పి, అది మీ కుటుంబ సభ్యులు మెరుగుపడవలసిన విషయాలకు ఎలా అన్వయిస్తుందో తెలియజేయండి. ప్రతి సభ్యుడూ చర్చలో పాల్గొనేలా చూడండి. జీవితంలో సరిగ్గా కావలసినదానిని ఇవ్వడంలో, యెహోవా వాక్యం ఏ విధంగా “పరిపూర్ణమైనదో” గ్రహించేందుకు ప్రతి ఒక్కరికీ సహాయపడండి.—కీర్త. 19:7, NW.
ప్రతిఫలాలను పొందడం
విషయాలను జాగ్రత్తగా గమనించే ప్రజలు తమకు ఆధ్యాత్మిక అవగాహన లేకపోయినా, విశ్వాన్ని గురించీ లోక సంఘటనల గురించీ చివరికి తమ గురించి తాము కూడా అధ్యయనం చేయగలరు, కానీ తాము చూస్తున్నవాటి వెనుకవున్న అసలు అర్థాన్ని మాత్రం అర్థం చేసుకోలేరు. మరొకవైపు, వాటిలో దేవుని హస్తకృత్యాన్నీ బైబిలు ప్రవచనాల నెరవేర్పునీ విధేయతగల మానవులను ఆశీర్వదించాలన్న దేవుని సంకల్పం వెల్లడి కావడాన్నీ క్రమంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసేవారు దేవుని ఆత్మ సహాయంతో గ్రహిస్తారు.—మార్కు 13:4-29; రోమా. 1:20; ప్రక. 12:12.
అలా గ్రహించగలగడం, ఎంతో విశిష్టమైన విషయమైనప్పటికీ, మనం గర్విష్ఠులమవడానికి అది కారణం కాకూడదు. బదులుగా, దేవుని వాక్యాన్ని ప్రతిరోజూ పరిశీలించడం, మనం అన్నివేళలా వినయస్థులుగా ఉండడానికి మనకు సహాయపడుతుంది. (ద్వితీ. 17:18-20) వాక్యాన్ని పరిశీలించడం, మనలను “పాపమువలన కలుగు భ్రమ” నుండి కాపాడుతుంది. ఎందుకంటే, దేవుని వాక్యం మన హృదయాల్లో సజీవంగా ఉన్నప్పుడు పాపాన్ని తిరస్కరించాలన్న మన నిర్ణయాన్ని సడలించేంత బలీయంగా పాపపు ప్రేరణ ఉండే అవకాశం తక్కువ. (హెబ్రీ. 2:1; 3:13-15; కొలొ. 3:5-10) అలా, మనం “ప్రతి సత్కార్యములో సఫలులగుచు, . . . అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచు[కొంటాం].” (కొలొ. 1:9-12) అలా నడుచుకోవాలన్నదే మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి గల లక్ష్యం, ఆ విధంగా నడుచుకోగలగడమే వాక్య అధ్యయనం వల్ల వచ్చే గొప్ప ప్రతిఫలం.