కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆశతో బ్రతకడం—అది నిజంగా సహాయపడుతుందా?

ఆశతో బ్రతకడం—అది నిజంగా సహాయపడుతుందా?

ఆశతో బ్రతకడం—అది నిజంగా సహాయపడుతుందా?

డానియేల్‌కు పట్టుమని పదేళ్లు కూడా లేవు, కానీ సంవత్సరం నుండి కాన్సర్‌తో పోరాడుతున్నాడు. డాక్టర్లు, అతని కుటుంబ సభ్యులు ఆశ వదిలేసుకున్నారు. కానీ డానియేల్‌ మాత్రం ఆశ వదులుకోలేదు. పెద్దయ్యాక, ఏదోక రోజు కాన్సర్‌కి మందు కనిపెట్టాలని అతను అనుకున్నాడు. ఇంకొన్ని రోజుల్లో పెద్ద డాక్టరు రావాల్సివుంది. ఆయన వస్తాడని, తన కాన్సర్‌కి ట్రీట్‌మెంట్‌ ఇస్తాడని డానియేల్‌ ఎంతో ఆశపడ్డాడు. తీరా ఆ రోజు వచ్చేసరికి, వాతావరణం బాగోకపోవడం వల్ల డాక్టరు రాలేదు. దాంతో డానియేల్‌ కృంగిపోయాడు, ఆశ వదిలేసుకున్నాడు. కొన్ని రోజులకే అతను చనిపోయాడు.

ఆశ, నిరాశ ఒక వ్యక్తి ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తాయో అధ్యయనం చేసిన ఒక స్పెషలిస్టు, డానియేల్‌కు జరిగినదాన్ని వివరించాడు. డానియేల్‌ లాంటి అనుభవాలు మీరు వినేవుంటారు. ఉదాహరణకు, చావుకు దగ్గర్లో ఉన్న ఒక పెద్దవయసు ఆయన తన ప్రియమైనవాళ్ల రాక కోసమో, ఏదైనా ప్రత్యేకమైన సందర్భం కోసమో ఆశతో ఎదురు చూస్తుంటాడు. ఆ ఆశే ఆయన్ని బ్రతికిస్తూ ఉంటుంది. అయితే ఆ సందర్భం వచ్చి వెళ్లిపోగానే, ఆయన త్వరగా చనిపోతాడు. అలా ఎందుకు జరుగుతుంది? ఆశతో ఉండడం నిజంగా మన జీవితం మీద అంత ప్రభావం చూపిస్తుందా?

ఆశతో ఉండడం, సానుకూలంగా ఆలోచించడం ఒక వ్యక్తి జీవితం మీద, ఆరోగ్యం మీద బలమైన ప్రభావం చూపిస్తాయని చాలామంది వైద్య పరిశోధకులు నమ్ముతున్నారు. కానీ అందరూ దానికి ఒప్పుకోవట్లేదు. కొంతమంది పరిశోధకులేమో, ఆశతో బ్రతకడం మనకు సహాయం చేస్తుందనడానికి ఆధారాలు లేవని చెప్తున్నారు. ఆశతో బ్రతికినంత మాత్రాన జబ్బులు నయం అవ్వవని వాళ్లు అనుకుంటున్నారు.

అలా అనుకోవడం కొత్తేమీ కాదు. వేల సంవత్సరాల క్రితం, గ్రీకు తత్త్వవేత్త అయిన అరిస్టాటిల్‌ని ఆశ అంటే ఏంటి అని అడిగినప్పుడు, “అదొక పగటి కల” అనేశాడు. అంతేకాదు ఈమధ్య కాలంలో, అమెరికా రాజకీయ నేత అయిన బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ వెటకారంగా ఇలా అన్నాడు: “ఆశతో బ్రతికేవాళ్లు ఆకలితో చచ్చిపోతారు.”

మరైతే ఏది నిజం? ఆశతో ఉండడం అంటే పగటి కలల్లో, ఊహల్లో బ్రతకడమా? లేక ఆశ అంటే మన ఆరోగ్యానికి-సంతోషానికి ఎంతో అవసరమయ్యేది, బలమైన ఆధారాలతో ఉండేది, నిజంగా ప్రయోజనాలు తెచ్చేదా?