కంటెంట్‌కు వెళ్లు

అన్యాయం ఎలా పోతుందో నేను తెలుసుకున్నాను

అన్యాయం ఎలా పోతుందో నేను తెలుసుకున్నాను

అన్యాయం ఎలా పోతుందో నేను తెలుసుకున్నాను

ఉర్సులా మెన్నె చెప్పినది

అందర్నీ సమానంగా చూడాలి, అందరికీ న్యాయం జరగాలి అనే కోరిక నాలో ఎప్పుడూ రగులుతూ ఉండేది. చివరికి దానివల్ల, నేను కమ్యూనిస్టు పాలన కింద ఉన్న తూర్పు జర్మనీలో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అదేంటో గానీ, ఏ అన్యాయాన్ని సరిచేయాలని జైలుకు వెళ్లానో, అక్కడే నాకు అన్యాయానికి పరిష్కారం దొరికింది. అర్థంకాలేదా? వివరిస్తాను ఉండండి.

నేను 1922 లో జర్మనీలో హాలే అనే ఊరిలో పుట్టాను. మా ఊరికి, 1,200 కన్నా ఎక్కువ సంవత్సరాల చరిత్ర ఉంది. అది బెర్లిన్‌కు నైరుతి దిశలో, దాదాపు 200 కి.మీ దూరంలో ఉంది. అప్పట్లో, వేర్వేరు ఊర్లలో చాలామంది ప్రజలు ప్రొటస్టెంట్లుగా మారారు. అలా మారిన ఊర్లలో మా ఊరు కూడా ఒకటి. మా చెల్లి క్యాథి 1923 లో పుట్టింది. నాన్న మిలటరీలో చేసేవాడు. అమ్మ థియేటర్‌లో పాటలు పాడేది.

అన్యాయాన్ని సరిదిద్దాలనే బలమైన కోరిక మా నాన్నను చూసే నాకు కలిగింది. ఆయన ఆర్మీ నుండి వచ్చేసిన తర్వాత ఒక షాపు పెట్టాడు. షాపుకు వచ్చే వాళ్లందరూ ఎక్కువశాతం పేదవాళ్లే కాబట్టి, ఆయన దయతో వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోకుండానే వస్తువులు ఇచ్చేసేవాడు. అలా దానధర్మాలు చేసిచేసి చివరికి ఆయన అప్పులపాలై దివాలా తీయాల్సివచ్చింది. అసమానత, అన్యాయం కోసం పోరాడడం అనుకున్నంత తేలిక కాదని మా నాన్నకు జరిగింది చూసైనా నేను నేర్చుకోవాల్సింది. కానీ, ఆ వయసులో ఉన్న ఉడుకు రక్తం వల్ల అవేవీ నా బుర్రకు ఎక్కలేదు.

అమ్మ నుంచి నాకు సంగీతం, నాట్యం లాంటి కొన్ని కళలు వచ్చాయి. అమ్మ నాకూ క్యాథికి సంగీతం, పాటలు పాడడం, డాన్స్‌ నేర్పించింది. నేను చాలా చురుగ్గా ఉండేదాన్ని. నా జీవితం, క్యాథి జీవితం చాలా సంతోషంగా సాగిపోయింది. కానీ అదంతా 1939 వరకే.

ఒక పీడకల

స్కూల్‌ చదువు పూర్తైన తర్వాత, నేను బాలే డాన్స్‌ నేర్పించే స్కూల్లో చేరాను. అక్కడ మేరీ విగ్మాన్‌ అనే ప్రముఖ కళాకారిణి దగ్గర, ఆస్ట్రక్‌స్టాన్జ్‌ అనే కొత్త రకమైన డాన్స్‌ను నేర్చుకున్నాను. ఆ డాన్స్‌కున్న ప్రత్యేకత ఏంటంటే, ఒక కళాకారుడు లేదా కళాకారిణి తన హావభావాలన్నీ డాన్స్‌లో పలికించాలి. ఆ డాన్సే కాకుండా, నేను పెయింటింగ్‌ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా నా తొలి టీనేజ్‌ సంవత్సరాల్ని చాలా సంతోషంగా, ఉల్లాసంగా కొత్త విషయాలు నేర్చుకుంటూ గడిపేశాను. కానీ 1939 లో రెండో ప్రపంచ యుద్ధం విరుచుకుపడింది. 1941 లో మాకు ఇంకో దెబ్బ తగిలింది, అదేంటంటే మా నాన్న టీబీతో చనిపోయాడు.

యుద్ధం తాలూకు జ్ఞాపకాలు ఇప్పటికీ పీడకలలానే ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పుడు నా వయసు 17 ఏళ్లే. ఈ ప్రపంచానికి పిచ్చిపట్టిందా ఏంటి అని నాకు అనిపించింది. అప్పటిదాకా శాంతియుతంగా ఉన్న ప్రజలు నాజీ ప్రభుత్వానికి మద్దతివ్వడం నేను చూశాను. ఆ యుద్ధం వల్ల ఎక్కడ చూసినా ఆకలి, చావులు, విధ్వంసమే. బాంబు దాడిలో మా ఇల్లు పూర్తిగా పాడైంది, అలాగే యుద్ధం కారణంగా మా బంధువుల్లో చాలామంది చనిపోయారు.

1945 లో యుద్ధం ముగిసేనాటికి నేను, అమ్మ, క్యాథి ఇంకా హాలేలోనే ఉన్నాం. అప్పటికి, నాకు పెళ్లయి ఒక చిన్న పాప కూడా ఉంది. నేనూ, నా భర్త కలిసున్నాం అన్న మాటేగానీ, మా మధ్య సంతోషం లేదు. అందుకే మేము విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నాం. దాంతో నన్ను, నా కూతుర్ని పోషించుకోవడానికి నేను డాన్సర్‌గా, బొమ్మలు గీసే పెయింటర్‌గా పనిచేశాను.

యుద్ధం తర్వాత జర్మనీని నాలుగు భాగాలు కింద విడగొట్టారు. అందులో, మా ఊరు సోవియట్‌ యూనియన్‌ పాలన కింద ఉన్న భాగంలోకి వెళ్లింది. కాబట్టి, మేమంతా కమ్యూనిస్టు పాలన కింద జీవించడానికి అలవాటు పడాల్సి వచ్చింది. 1949 లో, మేము ఉండే భాగం అంటే తూర్పు జర్మనీ, జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌గా (GDR) అయ్యింది.

కమ్యూనిస్టు పాలన కింద జీవితం

అప్పట్లో, అమ్మకు జబ్బు చేయడంతో నేను ఆమెను చూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి, నేను స్థానిక ప్రభుత్వ ఆఫీసులో ఒక ఉద్యోగంలో చేరాను. ఆ సమయంలోనే విశ్వవిద్యాలయంలో చదువుకునే కొంతమంది విద్యార్థులను కలిశాను. వాళ్లు ప్రభుత్వం చేసే అన్యాయాల్ని వేరేవాళ్లకు ఎత్తి చూపిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవాళ్లు. ఉదాహరణకు, ఒక అబ్బాయి వాళ్ల నాన్న నాజీ పార్టీలో సభ్యుడైనందుకు, ఆ అబ్బాయికి యూనివర్సిటీలో సీటు ఇవ్వలేదు. ఆ అబ్బాయి నాకు అంతకుముందే తెలుసు. మేము తరచూ కలిసి సంగీతం వాయించేవాళ్లం. అయితే, ‘వాళ్ల నాన్న చేసిన తప్పుకు ఈ అబ్బాయి ఎందుకు బాధపడాలి?’ అని నాకు అనిపించింది. అప్పటినుండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవాళ్లకు ఇంకా ఎక్కువగా మద్దతివ్వడం మొదలుపెట్టాను. చివరికి, నేను ధర్నాలు చేయడంలో భాగం వహించాలని నిర్ణయించుకున్నాను. ఒక సందర్భంలోనైతే, ఒక స్థానిక కోర్టు భవనంలో మెట్ల బయట పోస్టర్లు కూడా అంటించాను.

రీజనల్‌ పీస్‌ కమిటీలో నేను సెక్రెటరీగా పని చేస్తున్నప్పుడు, ఉత్తరాలు టైపు చేయాల్సి వచ్చేది. వాటిలో కొన్ని అన్యాయంగా అనిపించాయి, అది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఉదాహరణకు, ఒక సందర్భంలో కమిటీవాళ్లు కొన్ని రాజకీయ దురుద్దేశాలతో, పశ్చిమ జర్మనీలో నివసిస్తున్న ఒక వృద్ధుడి మీద అనుమానం రేకెత్తించడానికి, కమ్యూనిస్టు వ్యతిరేక సమాచారాన్ని ఆయనకు పంపాలని చూశారు. ఆ వ్యక్తికి జరుగుతున్న అన్యాయం చూసి నాకు చాలా కోపం వచ్చింది. అందుకే, నేను ఆ పార్సిల్‌ని అతనికి పంపించకుండా, ఆఫీసులోనే దాచిపెట్టి ఉంచాను.

“అందరూ నీచంగా చూసే ఒకామె” నాలో ఆశను నింపింది

1951, జూన్‌లో ఇద్దరు వ్యక్తులు మా ఆఫీసుకు వచ్చి, “నిన్ను అరెస్టు చేస్తున్నాం” అన్నారు. వాళ్లు నన్ను రెడ్‌ ఆక్స్‌ అనే జైలుకు తీసుకెళ్లారు. ఒక సంవత్సరం అక్కడున్న తర్వాత, నామీద దేశద్రోహం అనే నేరాన్ని ఆరోపించారు. ఒక విద్యార్థి, అంతకుముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను అంటించిన పోస్టర్ల గురించి పోలీసులకు చెప్పేసి నన్ను పట్టించాడు. విచిత్రంగా, ఆ విచారణలో ఒక్కరు కూడా నా వాదనను వినిపించుకోలేదు. నాకు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు. ఆ సమయంలో నా ఆరోగ్యం పాడవ్వడంతో, 40 మంది స్త్రీలున్న జైలు హాస్పిటల్లో నన్ను పెట్టారు. విపరీతమైన దుఃఖంలో ఉన్న వాళ్లందర్నీ చూసి నాకు భయమేసింది. నేను వెంటనే తలుపు దగ్గరికి పరుగెత్తి, పిడికిలితో తలుపును గుద్దాను.

“నీకు ఏం కావాలి?” అని గార్డు అడిగాడు.

“నన్ను ఇక్కడినుండి తీసుకెళ్లిపోండి. కావాలంటే నన్ను ఒక్కదాన్నే విడిగా ఒక జైల్లో పడేయండి, కానీ ముందైతే ఇక్కడినుండి తీసుకెళ్లిపోండి!” అని నేను అరిచాను. కానీ ఆ గార్డు ఏం పట్టించుకోలేదు. కాసేపటికి, అక్కడున్న వాళ్లలో ఒకామె మాత్రం మిగతా వాళ్లకంటే వేరుగా ఉండడం నేను గమనించాను. ఆమె కళ్లలో ఏదో తెలియని ప్రశాంతత కనిపించింది, కాబట్టి నేను వెళ్లి ఆమె పక్కన కూర్చున్నాను.

“నువ్వు నా పక్కన కూర్చుంటే, నీకే ప్రమాదం” అని ఆమె అంది. ఆమె ఎందుకలా అందో నాకు అర్థం కాలేదు. తర్వాత ఆమె ఇలా అంది: “ఇక్కడున్న వాళ్లందరూ నన్ను నీచంగా చూస్తారు, ఎందుకంటే నేను ఒక యెహోవాసాక్షిని.”

అప్పట్లో, కమ్యూనిస్టు ప్రభుత్వం యెహోవాసాక్షుల్ని శత్రువులుగా చూస్తుందని నాకు తెలీదు. కానీ నాకు తెలిసిందల్లా, నా చిన్నప్పుడు ఇద్దరు బైబిలు విద్యార్థులు (అప్పట్లో యెహోవాసాక్షుల్ని అలా పిలిచేవాళ్లు) మా నాన్న దగ్గరికి క్రమంగా వచ్చేవాళ్లు. నాకు బాగా గుర్తు, మా నాన్న “బైబిలు విద్యార్థులు చెప్పేదే కరెక్ట్‌!” అని అంటుండేవాడు.

ఆ ప్రియమైన సహోదరిని కలిసిన తర్వాత, నేను తనివితీరా ఏడ్చాను. తన పేరు బెర్టా బ్రూగెమియర్‌. “దయచేసి, నాకు యెహోవా గురించి చెప్పండి” అని నేను అన్నాను. అప్పటినుండి, మేమిద్దరం కలిసి ఎక్కువ సమయం గడిపేవాళ్లం, అలాగే బైబిలు గురించి ఎక్కువసేపు మాట్లాడుకునేవాళ్లం. నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. నిజమైన దేవుడు యెహోవా అని, ఆయన ప్రేమ, న్యాయం, శాంతి కలిగిన దేవుడని నేర్చుకున్నాను. దుష్టుల వల్ల, నియంతల వల్ల జరిగిన నష్టాన్నంతటినీ ఆయన పూర్తిగా తీసేస్తాడని తెలుసుకున్నాను. “కొంతకాలం తర్వాత దుష్టులు ఇక ఉండరు; . . . అయితే సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు” అని కీర్తన 37:10, 11 చెప్తుంది.

నేను విడుదలవ్వడం, పశ్చిమ జర్మనీకి వెళ్లిపోవడం

జైల్లో ఐదేళ్లకు పైనే ఉన్న తర్వాత, 1956 లో నన్ను విడుదల చేశారు. విడుదలైన ఐదు రోజులకు, నేను జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ని విడిచి పశ్చిమ జర్మనీకి వెళ్లిపోయాను. అప్పటికి నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు, వాళ్ల పేర్లు హానెలోర్‌, సబీన. వాళ్లను కూడా నాతోపాటు తీసుకెళ్లాను. అక్కడ నేను, నా భర్త విడాకులు తీసుకున్నాం. నేను మళ్లీ అక్కడ యెహోవాసాక్షుల్ని కలిశాను. నేను బైబిలు స్టడీ తీసుకుంటున్నప్పుడు, యెహోవా ప్రమాణాలకు తగ్గట్టు జీవించాలంటే నా జీవితంలో చాలా మార్పులు చేసుకోవాలని నాకు అర్థమైంది. నేను ఆ మార్పులు చేసుకుని, 1958 లో బాప్తిస్మం తీసుకున్నాను.

తర్వాత నేను మళ్లీ పెళ్లి చేసుకున్నాను. ఈసారి ఒక యెహోవాసాక్షిని చేసుకున్నాను. తన పేరు క్లాస్‌ మెన్నె. క్లాస్‌, నేను చాలా సంతోషంగా గడిపాం. మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు, వాళ్ల పేర్లు బెంజమిన్‌, టబీయా. విచారకరంగా, దాదాపు 20 ఏళ్ల క్రితం క్లాస్‌ ఒక యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అప్పటినుండి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నాను. కానీ, చనిపోయినవాళ్లు భూపరదైసు మీదికి పునరుత్థానం అవుతారనే నిరీక్షణ వల్ల నేను ఓదార్పు పొందుతున్నాను. (లూకా 23:43; అపొస్తలుల కార్యాలు 24:15) అలాగే, నా నలుగురు పిల్లలు యెహోవా సేవలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను.

బైబిలు స్టడీ వల్ల, యెహోవా మాత్రమే నిజమైన న్యాయాన్ని తీసుకురాగలడని నేను తెలుసుకున్నాను. మనుషులు కంటికి కనిపించేదాన్ని చూస్తారు. కానీ, యెహోవా మన పరిస్థితులన్నిటినీ, అలాగే ఇతరులకు కనిపించని విషయాల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాడు. ఈ విలువైన సత్యం తెలుసుకోవడం వల్ల, నేను ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. మరిముఖ్యంగా, నేను అన్యాయాన్ని చూసినా లేదా అనుభవించినా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ప్రసంగి 5:8 ఇలా చెప్తుంది: “ఏ ప్రాంతంలోనైనా పేదవాళ్లు అణచివేయబడడం, నీతిన్యాయాలు జరగకపోవడం నువ్వు గమనిస్తే ఆశ్చర్యపోకు. ఎందుకంటే ఆ ఉన్నతాధికారి కన్నా పైస్థానంలో ఉన్న వ్యక్తి అతన్ని గమనిస్తున్నాడు, వాళ్లకన్నా పైస్థానంలో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.” అందరికన్నా “పైస్థానంలో ఉన్న వ్యక్తి” మన సృష్టికర్త. “మనం ఎవరికి లెక్క అప్పజెప్పాలో ఆ దేవుని కళ్లకు అన్నీ స్పష్టంగా, తేటతెల్లంగా కనిపిస్తున్నాయి” అని హెబ్రీయులు 4:13 చెప్తుంది.

నా 90 ఏళ్ల గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ...

‘మీరు నాజీ పరిపాలన చూశారు, కమ్యూనిస్టు పరిపాలన చూశారు. ఆ రెండిటి కింద జీవితం ఎలా ఉండేది?’ అని ప్రజలు కొన్నిసార్లు నన్ను అడుగుతుంటారు. ఆ రెండిటి కింద జీవితం చాలా కష్టంగా ఉండేది. పైగా మిగతా మానవ ప్రభుత్వాలన్నిటిలాగే, ఆ రెండు ప్రభుత్వాలు కూడా మనుషులు తమను తాము పరిపాలించుకోలేరని నిరూపించాయి. బైబిలు సరిగ్గానే ఇలా చెప్పింది: “మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని చేసుకున్నాడు.”​—ప్రసంగి 8:9.

తెలిసీ తెలియని వయసులో, నేను న్యాయమైన పరిపాలన మనుషుల ద్వారానే సాధ్యమౌతుందని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను వాస్తవాలు తెలుసుకున్నాను. మన సృష్టికర్త మాత్రమే నిజమైన న్యాయాన్ని తీసుకురాగలడు. ఆయన దుష్టులందర్నీ తీసేయడం ద్వారా, అలాగే భూమిని తన కుమారుడైన యేసుక్రీస్తు చేతుల్లో పెట్టడం ద్వారా అలా చేస్తాడు. యేసుక్రీస్తు ఎప్పుడూ తన అవసరాల కన్నా వేరేవాళ్ల అవసరాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. యేసు గురించి బైబిలు ఇలా చెప్తుంది: “నువ్వు నీతిని ప్రేమించావు, అవినీతిని ద్వేషించావు.” (హెబ్రీయులు 1:9) ఇలాంటి అద్భుతమైన, న్యాయమైన రాజు వైపుకు నన్ను ఆకర్షించినందుకు నేను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. అలాంటి రాజు పరిపాలన కింద శాశ్వత కాలం జీవించాలని నేను కోరుకుంటున్నాను!

[చిత్రం]

పశ్చిమ జర్మనీకి వచ్చేసిన తర్వాత, నా కూతుళ్లు హానెలోర్‌తో, సబీనతో

[చిత్రం]

నేడు మా అబ్బాయి బెంజమిన్‌తో, ఆయన భార్య శాండ్రాతో