యేసు 70 మందిని పంపుట
అధ్యాయము 72
యేసు 70 మందిని పంపుట
అది సా.శ. 32 శరత్కాలం యేసు బాప్తిస్మము తీసుకొని పూర్తిగా మూడు సంవత్సరాలు నిండినవి. యేసు మరియు ఆయన శిష్యులు ఈమధ్యే యెరూషలేములో పర్ణశాలల పండుగకు హాజరైరి, మరియు వారింకా ఆ సమీప ప్రాంతమందే ఉన్నారు. వాస్తవానికి, యేసు మిగిలియున్న ఆరు నెలల పరిచర్యలో అధికభాగమును ఆయన యూదయలో లేక పెరీయ జిల్లాలోని యొర్దాను నదికి ఆవలివైపున గడుపును. ఈ ప్రాంతములోకూడ సేవచేయవలసి యున్నది.
నిజమే, సా.శ. 30 పస్కాపండుగ తర్వాత యేసు యూదయలోనే ప్రకటించుచు షుమారు ఎనిమిది నెలలు గడిపెను. అయితే సా.శ. 31 పస్కాపండుగ రోజున యూదులు ఆయనను చంప ప్రయత్నించిన తర్వాత, ఆయన ఆ మరుసటి సంవత్సమున్నర విస్తారముగా గలిలయలోనే బోధించెను. ఆ సమయములో, ఆయన తనకు అంతకుముందు లేని ఒక పెద్ద మంచి-శిక్షణ పొందిన ప్రచారకుల వ్యవస్థను పెంపొందించెను. కావున ఆయనిప్పుడు యూదయలో చివరిసారిగా ప్రబలమైన ప్రచారదాడిని ప్రవేశపెట్టును.
యేసు ఈ ప్రచారపు పనికి 70 మంది శిష్యులనెన్నుకొని వారిని ఇద్దరిద్దరిగా పంపుటద్వారా మొదలుపెట్టును. అట్లు ఆ ప్రాంతములో సేవచేయు రాజ్యప్రచారకుల సంఖ్య మొత్తము 35 జట్లు ఆయెను. యేసు తన అపొస్తలులతో కలిసివెళ్ల తలంచిన ప్రతి పట్టణము మరియు ప్రాంతమునకు వీరు ముందుగనే వెళ్లుచున్నారు.
యేసు ఆ 70 మందిని సమాజమందిరములకు వెళ్లమని చెప్పుటకు బదులు, ప్రజల ఇండ్లకు వెళ్లమని చెప్పుచు ఇట్లనును: “మీరు ఏ ఇంటనైనను ప్రవేశించునప్పుడు, ‘ఈ ఇంటికి సమాధానమగు గాక’ అని మొదట చెప్పుడి. సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతని మీద నిలుచును.” వారి వర్తమానమేమై యుండవలెను? “దేవుని రాజ్యము మీదగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి” అని యేసు వారికి చెప్పును. ఈ 70 మంది ప్రచార విధానమునుగూర్చి, మాథ్యు హెన్రీస్ కామెంట్రి ఇలా వ్రాయుచున్నది: “వారి బోధకునివలెనే, వారెక్కడికి వెళ్లినను, వారు ఇంటింటను ప్రకటించిరి.”
అంతకుముందు సంవత్సరము ప్రచారము చేయుటకు 12 మందిని గలిలయకు పంపినప్పుడు వారికిచ్చినటువంటి ఉపదేశములనే యేసు ఈ 70 మందికిని ఇచ్చును. వారు ఎదుర్కొనబోవు వ్యతిరేకతనుగూర్చి ఈ 70 మందిని హెచ్చరించుటయే కాకుండ, యేసు గృహస్థులకు వర్తమానము చెప్పుటకును వారిని సిద్ధపరచి, రోగులను బాగుచేయు శక్తినికూడ ఆయన వారికి అనుగ్రహించును. ఆ విధముగా, కొద్దికాలమైన తర్వాత యేసుతిరిగి వచ్చినప్పుడు, ఆయన శిష్యులు అటువంటి ఆశ్చర్యకార్యములను చేయగలుగుచున్నందుకు, వారి బోధకుని కలిసికొనుటకు చాలమంది ఆతురతతో ఎదురుచూచెదరు.
డెబ్బయి మంది ప్రచారము చేయుటకు ఆ పిమ్మట యేసువారిని తిరిగి కలిసికొనుటకు కేవలము కొద్దికాలమే పట్టును. త్వరలోనే రాజ్య ప్రచారకుల ఈ 35 జట్లు యేసునొద్దకు తిరిగివచ్చెదరు. సంతోషముతో వారు, “ప్రభువా, దయ్యములుకూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పిరి.” అటువంటి శ్రేష్ఠమైన సేవనుగూర్చిన వార్త నిశ్చయముగా యేసును పులకరింపజేసియుండును, ఏలయనగా ఆయన ఇట్లు ప్రతిస్పందించును: “సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును . . . మీకు అధికారము అనుగ్రహించియున్నాను.”
యుగాంతమందు దేవుని రాజ్యపుట్టుక తర్వాత, సాతాను అతని దయ్యములు పరలోకమునుండి పడద్రోయబడవలెనని యేసు ఎరిగియున్నాడు. అయితే ఇప్పుడు కేవలము మానవమాత్రులు అదృశ్యమైన దయ్యములను వెళ్లగొట్టుట, రానైయున్న ఆ సంఘటనను మరి నిశ్చయపరచుచున్నది. కాబట్టి, భవిష్యత్తులో ఖచ్చితముగా సాతాను పరలోకమునుండి పడిపోవునని యేసు మాట్లాడుచున్నాడు. అందువలన, ఆ 70 మందికి పాములను తేళ్లను త్రొక్కుటకు అధికారము ఇవ్వబడుట సూచనార్థక భావమును కలిగియున్నది. అయినను, యేసు ఇట్లు చెప్పును: “దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి.”
అంత శక్తివంతముగా తన ఈ దీనులైన సేవకులను ఉపయోగించుచున్నందుకు, యేసు ఎంతో ఆనందించి బహిరంగముగా తన తండ్రిని స్తుతించును. తన శిష్యులవైపు తిరిగి ఆయనిట్లనును: “మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి; అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నాను.” లూకా 10:1-24; మత్తయి 10:1-42; ప్రకటన 12:7-12.
▪ తన పరిచర్య కాలములో మొదటి మూడు సంవత్సరములు యేసు ఎక్కడ ప్రకటించెను, తన చివరి ఆరు నెలలలో ఏ ప్రాంతములో ఆయన సేవచేయును?
▪ ప్రజలను కనుగొనుటకు 70 మందిని యేసు ఎక్కడకు పంపును?
▪ సాతాను పరలోకమునుండి అప్పటికే పడిపోవుట చూచితినని యేసు ఎందుకు చెప్పును?
▪ ఏ భావముతో ఆ 70 మంది పాములను తేళ్లను త్రొక్కగలరు?