యేసు నిజముగా ఎవరు?
అధ్యాయము 59
యేసు నిజముగా ఎవరు?
యేసు, ఆయన శిష్యులు ప్రయాణం చేసిన పడవ బేత్సయిదా చేరినప్పుడు, ప్రజలు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొనివచ్చి, వాని ముట్టి బాగుచేయవలెనని ఆయనను వేడుకొందురు. యేసు ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొనిపోయి, అతని కన్నులమీద ఉమ్మివేసి, “నీకేమైనను కనబడుచున్నదా?” అని అడుగును.
“మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని” అతడు జవాబిచ్చును. అంతట ఆయన తన చేతులను ఆ మనుష్యుని కన్నులమీద ఉంచి, వాని చూపును పునరుద్ధరించగా అతడు స్పష్టముగా చూడసాగును. పట్టణములోనికి వెళ్లవద్దని ఆజ్ఞాపించి యేసు అతనిని యింటికి పంపివేయును.
యేసు ఇప్పుడు తన శిష్యులతోపాటు పాలస్తీనాకు చాలాదూరములో ఉత్తరదిశనున్న ఫిలిప్పుదైన కైసరియ గ్రామములకు వెళ్లును. అది దాదాపు సముద్రమట్టమునకు 1,150 అడుగుల ఎత్తునవున్న సుందర ప్రదేశమగు ఫిలిప్పుదైన కైసరయకు దాదాపు 48 కిలోమీటర్ల దూరములో ఎత్తుగాయున్న మార్గమైయున్నది. అక్కడికి వెళ్లివచ్చుటకు షుమారు రెండు రోజులు పట్టును.
మార్గమధ్యములో, యేసు ఒంటరిగా ప్రార్థించుటకు ప్రక్కకు వెళ్లును. తన మరణమునకు ఇంకా కేవలము తొమ్మిది లేక పది నెలలు మాత్రమే మిగిలియున్నవి, అందువలన ఆయన తన శిష్యులనుగూర్చి శ్రద్ధ కలిగియున్నాడు. అనేకులు అప్పటికే ఆయనను వెంబడించకుండ మానుకొని వెళ్లిపోయారు. ప్రజలు తనను రాజుగా చేయుటకు ప్రయత్నించినప్పుడు తను నిరాకరించినందున మరియు తన రాజరికమును నిరూపించుటకు తన శత్రువులు పరలోకమునుండి తమకొక సూచకక్రియను చూపుమని సవాలు చేసినప్పుడు తను అలాచేయనందున ఇతరులు స్పష్టముగా నిరుత్సాహపడి, కలతచెందిరి. తానెవరని తన అపొస్తలులు నమ్ముచున్నారు? తను ప్రార్థించుచున్న ప్రదేశమునకు వారు వచ్చినప్పుడు యేసు, “నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని?” వారినడుగును.
“కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరికొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని” జవాబిచ్చుదురు. అవును, యేసు మృతులలోనుండి లేచిన ఈ మనుష్యులలో ఒకడని ప్రజలనుకుంటున్నారు!
“మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని” యేసు వారినడుగును.
అందుకు పేతురు వెంటనే, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని” చెప్పును.
పేతురు చెప్పిన దానిని అంగీకరించిన మీదట యేసు ఇట్లనును: “నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక (హేడిస్ NW) ద్వారములు దానియెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.” ఇక్కడ యేసు మొదటిసారిగా తానొక సంఘమును నిర్మించెదనని, కాగా దానిసభ్యులు నమ్మకముగా తమ భూజీవితమును చాలించిన తర్వాత మరణము ఏ విధముగాను వారిని బంధించియుంచలేదని చెప్పును. ఆ పిమ్మట ఆయన పేతురుతో, “పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదనని” చెప్పును.
ఆ విధముగా పేతురు ప్రత్యేకమైన ఆధిక్యతలను పొందునని యేసు బయల్పరచుచున్నాడు. పేతురుకు అపొస్తలులలో మొదటి స్థానమివ్వబడలేదు, లేక సంఘమునకు ఆయనను పునాదిగా చేయలేదు. ఏలయనగా తన సంఘము నిర్మింపబడబోవు పునాది రాయి యేసే. అయితే పరలోకరాజ్యములో ప్రవేశించుటకు ఆయన వివిధప్రజలకు అవకాశము తెరచునట్లుగా పేతురుకు మూడు తాళపుచెవులు ఇవ్వబడునని, దాని భావము.
సా.శ. 33 పెంతెకొస్తునాడు రక్షింపబడుటకు మారుమనస్సు నొందిని యూదులు ఏమిచేయవలెనో చూపించుటద్వారా పేతురు మొదటి తాళపుచెవిని ఉపయోగించును. ఆ తర్వాత కొలది కాలమునకే దేవునిరాజ్యములో ప్రవేశించు అవకాశమును విశ్వసించిన సమరయులకు తెరచుటద్వారా రెండవ తాళపుచెవిని, ఆ పిమ్మట సా.శ. 36లో కొర్నేలి అతని స్నేహితులను, అనగా సున్నతి పొందని అన్యులకు ఇదే అవకాశమును తెరచుటద్వారా ఆయన మూడవ తాళపుచెవిని ఉపయోగించును.
యేసు తన శిష్యులతో తన చర్చను ఇంకను కొనసాగించును. త్వరలో యెరూషలేమునందు తాను అనుభవించు బాధలను, మరణమునుగూర్చి చెప్పుటద్వారా యేసు వారిని నిరుత్సాహపరచును. పరలోక జీవితమునకు యేసు పునరుత్థానుడగునను విషయమును అర్థము చేసికొనలేక, పేతురు యేసును ప్రక్కకు తీసుకొనిపోయి, “ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడును కలుగదని” ఆయనతో చెప్పును. అయితే యేసు వెనుదిరిగి, “సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని” జవాబిచ్చును.
అపొస్తలులతోపాటు ఇతరులును నిశ్చయముగా యేసుతో ప్రయాణము చేయుచుండిరి, కావున ఆయన వారిని పిలిచి తన అనుచరులుగా యుండుట అంత సులభము కాదని వారికి వివరించును. “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని తన హింసాకొయ్యనెత్తుకొని (NW) నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనునని” ఆయన చెప్పును.
అవును, యేసు అనుచరులు ఆయన అనుగ్రహము పొందవలెనంటే ధైర్యస్థులును, స్వయం-త్యాగ పూరితులునై యుండవలెను. ఆయనిట్లు వివరించును: “వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తనతండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడును.” మార్కు 8:22-38; మత్తయి 16:13-28; లూకా 9:18-27.
▪ యేసు తన శిష్యులనుగూర్చి ఎందుకు శ్రద్ధ కలిగియుండును?
▪ యేసు ఎవరని ప్రజలనుకుంటున్నారు?
▪ పేతురుకు ఏ తాళపుచెవులు ఇవ్వబడెను, మరియు అవి ఎట్లు ఉపయోగింపబడవలసి యున్నవి?
▪ పేతురు ఎలా సరిదిద్దబడును, ఎందుకు?