మనుష్యుని ఏది అపవిత్రపరచును?
అధ్యాయము 56
మనుష్యుని ఏది అపవిత్రపరచును?
యేసు యెడల వ్యతిరేకత ఎక్కువగుచున్నది. శిష్యులలో అనేకులు ఆయనను వెంబడించుటను మానుకొనుటయేగాక యూదయలోని యూదులు ఆయనను చంపుటకు ప్రయత్నించుచున్నారు. ఆయన యెరూషలేములో నున్నప్పుడు సా.శ. 31 పస్కా సమయములోను వారట్లు ప్రయత్నించిరి.
ఇప్పుడు సా.శ. 32 పస్కా సమయము. హాజరుకావలెనన్న దేవుని నియమమునుబట్టియే, బహుశ యేసు పస్కా నాచరించుటకు యెరూషలేముకు వెళ్లును. అయినను ఆయన ప్రాణాపాయమునుబట్టి తగు జాగరూకతతోనే వెళ్లును. తదుపరి ఆయన గలిలయకు తిరిగివచ్చును.
శాస్త్రులు, పరిసయ్యులు యెరూషలేమునుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు యేసు కపెర్నహూములో ఉండవచ్చును. మత శాసనమునుల్లంఘించు చున్నాడను నేరము ఆయనపై మోపుటకు వారు ఆధారమును వెదకుచు, “నీ శిష్యులు పెద్దల పారంపర్యాచారము నెందుకు అతిక్రమించుచున్నారు? వారు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే?” అని అడుగుదురు. ఇది దేవుడు కోరునది కాదు. అయినను మోచేతులవరకు కడుగుకొనే ఆచారముతోపాటు ఈ పారంపర్యాచారాన్ని పాటించక పోవుటను పరిసయ్యులు తీవ్రమైన తప్పుగా భావించుదురు.
వారి నేరారోపణకు జవాబు చెప్పుటకు బదులు, దుష్టత్వముతో, ఉద్దేశ్యపూర్వకముగ వారెట్లు దేవుని శాసనమును ఉల్లంఘించుచున్నారో యేసు వారికి చూపును. ఆయనిట్లు తెలిసికొనగోరును: “మీరును మీపారంపర్యాచారము, నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? —‘తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను, తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు’ దేవుడు సెలవిచ్చెను. కాని మీరైతే ఒకడు తన తండ్రినైనను, తల్లినైనను చూచి —‘నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని’ చెప్పుచున్నారేల?”
పరిసయ్యులు నిజంగా డబ్బు, ఆస్తి లేక దేవునికి బహుమతిగా అర్పించినదేదైనా దేవాలయమునకు చెందినదేనని, మరిదేనికైనను దానినుపయోగించరాదని బోధించుదురు. అయితే వాస్తవమునకు ఆ సమర్పిత అర్పణను దానినర్పించిన వ్యక్తియే ఉంచుకొనేవాడు. ఈ విధంగా ఒక కుమారుడు తన డబ్బు లేక ఆస్తిని “కొర్బాను”—అనగా దేవునికి లేక దేవాలయమునకు అర్పించబడినదని—చెప్పుటతోనే వృద్ధులైన తన తలిదండ్రులెంత అవసరములోనున్నను, వారి నాదుకొను బాధ్యత నుండి అతడు తప్పించుకొనును.
దేవుని శాసనమును పరిసయ్యులు దుష్టత్వముతో వక్రీకరించుచున్నందున, యేసు వారిపై సరిగానే కోపగించుకొని వారితో, “మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా—‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు,’ అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే” అని చెప్పును.
బహుశ పరిసయ్యులు యేసును ప్రశ్నించుటకుగాను జనసమూహము వెనకే ఉండిపోవుదురు. ఇప్పుడైతే తమను గట్టిగా మందలించిన యేసుకు పరిసయ్యులు జవాబివ్వలేక పోయిరి. ఆయన జనసమూహములను పిలిచి, “మీరు విని గ్రహించుడి; నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోటనుండి వచ్చునదే మనుష్యుని అపవిత్రపరచును” అని వారితో చెప్పును.
ఆ తరువాత వారు ఒక ఇంటిలో ప్రవేశించినప్పుడు, “పరిసయ్యులు ఆమాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా” అని శిష్యులాయనను అడిగెదరు,
“పరలోకమందున్న నాతండ్రి నాటని ప్రతిమొక్కయు పెల్లగింపబడును. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవచూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవచూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు” అని యేసు సమాధానమిచ్చును.
మనుష్యుని ఏది అపవిత్రపరచునో వివరించుమని శిష్యుల తరపున పేతురు కోరగా, యేసు ఆశ్చర్యపడినట్లుగా కన్పించును. ఆయన ప్రత్యుత్తరమిచ్చుచు, “మీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును. గాని నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునుగాని చేతులు కడుగుకొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని” చెప్పును.
యేసు ఇక్కడ మామూలు పరిశుభ్రత అవసరము లేదనుటలేదు. ఆహారము సిగ్గుపర్చుటకు లేక భోజనము చేయుటకు ముందు ఒకవ్యక్తి చేతులు కడుగుకొనే అవసరములేదని ఆయన వాదించుటలేదు. బదులుగా, లేఖనరహితమైన పారంపర్యాచారములను పాటించవలెనని బలవంతముచేయుచు దేవుని నీతిశాసనములను దారి మళ్లించుటకు ప్రయత్నించే మతనాయకుల వేషధారణను ఖండించుచున్నాడు. అవును, మనుష్యుని అపవిత్రపరచునవి దుష్టక్రియలే, ఇవి ఒకని హృదయమునుండి పుట్టునని యేసు చూపించుచున్నాడు. యోహాను 7:1; ద్వితీయోపదేశకాండము 16:16; మత్తయి 15:1-20; మార్కు 7:1-23; నిర్గమకాండము 20:12; 21:17; యెషయా 29:13.
▪ యేసు ఇప్పుడు ఏ వ్యతిరేకతను ఎదుర్కొనును?
▪ పరిసయ్యులు ఏ నేరారోపణను చేయుదురు, అయితే యేసు చెప్పిన దానినిబట్టి, పరిసయ్యులు ఎట్లు ఉద్దేశ్యపూర్వకముగా దేవుని శాసనము ఉల్లంఘిస్తున్నారు?
▪ మనుష్యుని ఏవి అపవిత్రపరచునని యేసు వెల్లడిచేయును?