బాధపడు వారికి కరుణచూపుట
అధ్యాయము 57
బాధపడు వారికి కరుణచూపుట
వంశ పారంపర్యాచారములతో తమనుతాము సేవించుకొనుచున్న పరిసయ్యులను ఖండించిన తరువాత, యేసు తన శిష్యులతో వెళ్లును. ఆయన విశ్రాంతి తీసికొన ప్రయత్నించినప్పుడు, జనులాయనను కనుగొని అంతరాయము కలిగించిన సంఘటన జరిగి ఎంతో సమయముకాలేదని మీరు జ్ఞప్తికి తెచ్చుకొనవచ్చును. ఇప్పుడాయన తన శిష్యులతో ఉత్తరముగా అనేక మైళ్ళదూరమున నున్న తూరు, సీదోను ప్రాంతములకు వెళ్లును. యేసు తన శిష్యులతో ఇశ్రాయేలు సరిహద్దులు దాటుట ఈ ఒక్కసారి మాత్రమే.
యేసు ఒక ఇల్లు కనుగొని ఎవరికీ వారుండబోవు స్థలం తెలియకుండ ఉండాలని స్పష్టము చేయును. అయినను ఇశ్రాయేలీయుల ప్రాంతముకాని యిక్కడకూడా, ఆయన తన సంగతి తెలియకుండ తప్పించుకొన లేకపోవును. ఇక్కడ సురోఫెనికయ వంశమందు పుట్టిన ఒక గ్రీకు స్త్రీ యేసును కనుగొని “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. నాకుమార్తె దయ్యముపట్టి బాధింపబడుచున్నదని” బ్రతిమిలాడసాగును. యేసు ఒక్కమాటైనను, జవాబు చెప్పడు.
చివరికాయన శిష్యులు వచ్చి, “ఈమె మనవెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక యీమెను పంపివేయుము” అని యేసుతో చెప్పుదురు. ఆమెను పట్టించుకొనకుండుటకు గల కారణమును వివరించుచు యేసు, “ఇశ్రాయేలు యింటివారై నశించిన గొర్రెల యొద్దకేగాని మరి ఎవరియొద్దకు నేనుపంపబడలేదని” అనును.
అయితే ఆ స్త్రీ పట్టువిడువదు. ఆమె యేసు నొద్దకువచ్చి, సాగిలపడి “ప్రభువా నాకు సహాయము చేయుమని” ప్రాధేయపడును.
ఆ స్త్రీ పట్టుదలతో వేడుకొనుట ఆయన హృదయమును ఎంతగా ద్రవింపజేసియుండవచ్చును! అయినను, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు సేవచేయుట తన ప్రథమ కర్తవ్యమని ఆయన మరల చూపించును. అదే సమయములో, బహుశ ఆమె విశ్వాసమును పరీక్షించుటకుగాను, అన్యజనులను యూదులు ఎట్లు దురభిమానముతో చూతురో ఆమెకు తెల్పుచూ, “పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని” అనును.
యూదులు కానివారి యెడల తనకున్న సున్నిత భావములను తన ముఖ కవళికలతోను, కరుణాపూరిత స్వరముతోను యేసు నిశ్చయముగా తెలియజేయును. వారిని “కుక్కపిల్లలు” లేక కూనలు అనుట ద్వారా అన్యులను పెద్దకుక్కలతో పోల్చకుండును. ఆ స్త్రీ కోపగించుకొనుటకు బదులు, యేసు తెల్పిన యూదుల పక్షపాతవైఖరిని పురస్కరించుకొని వినయముతో, “అవును ప్రభువా! కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడిన ముక్కలు తినునుగదా” అని అనును.
అందుకు యేసు, “అమ్మా, నీ విశ్వాసము గొప్పది. నీవుకోరినట్లే నీకు అవునుగాక” అని చెప్పగా, అట్లే జరుగును! ఆమె యింటికి వచ్చినప్పుడు, తనకుమార్తె పూర్తి స్వస్థతపొంది, మంచము మీద పండుకొని యుండుట ఆమె కనుగొనును.
సీదోను కోస్తా ప్రాంతమునుండి, యేసు మరియు ఆయన శిష్యులు పల్లెల మధ్యనుండి యోర్దానునది ఆరంభమైన ప్రాంతమునకు బయలుదేరుదురు. ఆలాగే గలిలయ సముద్రము ఎగువ ఎక్కడో యోర్దాను నదిని దాటి, సముద్ర తూర్పు ప్రాంతమున దెకపొలిలోనికి ప్రవేశింతురు. అక్కడ వారు కొండ ఎక్కి కూర్చుందురు. కాని జనసమూహములు వారిని కనుగొని కుంటి, గ్రుడ్డి, మూగ, అంగవైకల్యముగల వారిని మరియు ఇతరత్రా రోగగ్రస్తులను, వికలాంగులను యేసునొద్దకు తీసికొనివచ్చి ఆయన పాదములవద్ద పడవేయుదురు. ఆయన వారినందరిని స్వస్థపరచును. మూగవారు మాటలాడుట, అంగవిహీనులు బాగుపడుట, కుంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూపునొందుటను ప్రజలుచూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచుదురు.
చెవుడుగల ఒక నత్తివాని ఎడల యేసు ప్రత్యేక శ్రద్ధను కనపరచును. చెవిటివారు తరచు, సుళువుగ తత్తరపడుదురు, ముఖ్యంగా జనసమూహములో ఉన్నప్పుడు. ఈ మనుష్యుని బలహీనతను యేసు గమనించి యుండవచ్చును. గనుక యేసు కనికరముతో అతనిని జనసమూహమునుండి ప్రక్కకుగొనిపోవును. వారు ఏకాంత ప్రదేశమునకు రాగానే యేసు అతనికి ఏమి చేయదలచెనో అతనికి చెప్పును. వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుకను ముట్టి, ఆ పిమ్మట యేసు ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి “తెరవబడుము” అని చెప్పును. వెంటనే, వానికి వినగల శక్తి పునఃరుద్ధరింపబడును. మరియు అతడు మామూలుగా మాటలాడసాగును.
యేసు ఈ విధముగా అనేకులను స్వస్థపరచినప్పుడు జనసమూహము ఆయనను మెచ్చుకొందురు. మరియు, “ఈయన సమస్తమును బాగుచేసియున్నాడు. చెవిటివారు వినునట్లుగాను, మూగవారు మాట్లాడునట్లు చేసియున్నాడని” వారందురు. మత్తయి 15:21-31; మార్కు 7:24-37.
▪ యేసు గ్రీసు దేశస్థురాలి కుమార్తెను వెంటనే ఎందుకు స్వస్థపరచలేదు?
▪ తరువాత, యేసు తనశిష్యులను ఎచ్చటికి కొనిపోవును?
▪ యేసు కరుణతో చెవుడుగల ఒక నత్తివానినెట్లు బాగుచేయును?