పలుమార్లు ప్రత్యక్షమగుట
అధ్యాయము 129
పలుమార్లు ప్రత్యక్షమగుట
శిష్యులు ఇంకను బరువెక్కిన హృదయముతో వున్నారు. ఖాళీ సమాధియొక్క అర్థమును వారు గ్రహించరు, లేక స్త్రీలు చెప్పిన సంగతిని వారు నమ్మరు. కావున ఆదివారము ప్రొద్దెక్కిన తర్వాత, క్లెయోపా మరియు వేరొక శిష్యుడు యెరూషలేముకు దాదాపు 11 కిలోమీటర్ల దూరములోగల ఎమ్మాయుకు ప్రయాణమగుదురు.
వెళ్లుచూ వారు జరిగిన సంగతులను మాట్లాడుకొనుచుండగా, వారితో ఒక కొత్తవ్యక్తియు కలియును. “మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాటలేమి?” అని అడుగును.
శిష్యులు ఆగుదురు, వారు దుఃఖముఖులై యున్నారు, వారిలో క్లెయొపా మాట్లాడుచు, “యెరూషలేములో బసచేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా?” అని అనగా, ‘అవి ఏ సంగతులు?’ అని ఆయన వారినడుగును.
దానికి వారు, “నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; . . . మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, వ్రేలాడదీయించిరి. (NW) . . . ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి” అని జవాబిత్తురు.
క్లెయొపా అతని సహవాసి జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనలను గూర్చి—మానవాతీత రీతిలో దూతలును, ఖాళీ సమాధియు కన్పించుటను—వివరించి అవన్నియు తమకు విస్మయము కలుగజేసెనని తెలియజేయుదురు. ఆ క్రొత్తవ్యక్తి వారి గద్దించుచు ఇట్లనును: “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా?” ఆ పిమ్మట ఆయన క్రీస్తుకు సంబంధించిన లేఖనములన్నిటిలోని భావమును వారికి తెల్పును.
ఇంతలో వారు ఎమ్మాయు సమీపించుదురు, ఆ క్రొత్తవ్యక్తి యింక దూరము వెళ్లునట్లు కన్పించును. ఇంకను ఎక్కువ వినగోరి, శిష్యులు ఆయనను ఇలా బ్రతిమాలుదురు: “సాయంకాలము కావచ్చినది, . . . మాతోకూడ ఉండుము.” కావున ఆయన భోజనము నిమిత్తము వారితో ఉండును. ప్రార్థనచేసి రొట్టెవిరిచి వారికిచ్చుచుండగా, ఆయన నిజముగా మానవ శరీరము ధరించిన యేసని వారు గుర్తింతురు. అంతట ఆయన అదృశ్యమగును.
ఇదంతయు ఆ క్రొత్తవ్యక్తికి ఎట్లు తెలియునో వారిప్పుడు గ్రహింతురు! “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?” అని వారు చెప్పుకొందురు. ఇక ఆలస్యము చేయకుండా వారులేచి మరలా వేగముగా యెరూషలేమునకు తిరిగివెళ్లి, అపొస్తలులను వారితోకూడ ఉన్నవారిని కలిసికొందురు. క్లెయొపా అతని సహవాసి ఒక్కమాటైనా మాట్లాడకముందే, అక్కడున్నవారు అత్యానందముతో, “ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని” చెప్పుదురు. ఆ పిమ్మట వారిద్దరు యేసు తమకుకూడ ఎట్లు కనబడెనో వివరింతురు. ఇలా ఆయన తన వేర్వేరు శిష్యులకు ఆ దినమున నాలుగుసార్లు కన్పించును.
యేసు ఆకస్మికముగా ఐదవసారి ప్రత్యక్షమగును. శిష్యులు యూదుల భయముతో తలుపులు తాళము వేసికొని లోనవున్నను, ఆయన ప్రవేశించి వారి మధ్యను నిలిచి, “మీకు సమాధానమవును గాక” అనును. తాము భూతమును చూచుచున్నామని వారు భయపడుదురు. కావున, యేసు తాను భూతము కాదని వివరించుచు, ఇట్లనును: “మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టిచూడుడి, నా కున్నట్లుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమున కుండవు.” అయినను నమ్ముటకు వారింకా సంశయించుచున్నారు.
తాను నిజముగా యేసునని వారు గ్రహించులాగున సహాయపడుటకు, ఆయన “ఇక్కడ మీయొద్ద ఏమైనా ఆహారము కలదా?” అని వారినడుగును. వారినుండి కాల్చిన చేపముక్క తీసికొని దానిని భుజించిన తర్వాత, ఆయనిట్లనును: “మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు [నా మరణమునకు ముందు] మీతో చెప్పిన మాటలు నెరవేరినవి.”
నిజానికి, వారితో బైబిలు అధ్యయనమని చెప్పదగిన రీతిలో తన మాటలను కొనసాగిస్తూ యేసు వారికిలా బోధించును: “క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు.”
ఏదోకారణముచే తోమా ఈ ప్రాముఖ్యమైన ఆదివారపు సాయంకాల కూటమిలో లేడు. కావున అతడు వచ్చినదినమున, ఇతరులు ఆనందముతో అతనితో ఇట్లు చెప్పుదురు: “మేము ప్రభువును చూచితిమి!”
దానికి తోమా అడ్డుచెప్పుచు, “నేనాయన చేతులలో మేకుల గురుతునుచూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కల ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో” చెప్పును.
మరి ఎనిమిది దినములైన పిదప శిష్యులు మరలా ఒకగదిలో కూడుకొందురు. ఈసారి తోమాకూడ వారితో ఉన్నాడు. తలుపులు గడియవేసియున్నను, యేసు మరియొకసారి వారిమధ్యను నిలిచి, “మీకు సమాధానము కలుగునుగాక” అని వారితో చెప్పును. ఆ తర్వాత, తోమావైపు తిరిగి అతనిని ఇట్లు ఆహ్వానించును: “నీ వ్రేలు ఇటుచాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివైయుండుము.”
అందుకు తోమా, “నా ప్రభువా, నా దేవా!” అనును.
యేసు, “నీవు నన్నుచూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని” అతనితో చెప్పును. లూకా 24:11, 13-48; యోహాను 20:19-29.
▪ ఎమ్మాయునకు వెళ్లుదారిలోనున్న ఇద్దరు శిష్యులను క్రొత్తవ్యక్తి ఏమని వాకబుచేయును?
▪ శిష్యుల హృదయము వారిలోనే మండునట్లుచేసే ఏ మాటలను ఆ క్రొత్తవ్యక్తి చెప్పును?
▪ ఆ క్రొత్తవ్యక్తి ఎవరయినది శిష్యులు ఎట్లు గ్రహింతురు?
▪ క్లెయొపా అతని సహవాసి యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు, ఎటువంటి ఉత్తేజకరమైన సమాచారాన్ని వారు విందురు?
▪ ఐదవసారి యేసు శిష్యులకు ఎట్లు ప్రత్యక్షమగును, ఆ సమయములో ఏమి జరుగును?
▪ ఐదవసారి యేసు ప్రత్యక్షమైన తర్వాత ఎనిమిదవ దినమున ఏమి జరుగును, యేసు సజీవుడని చివరకు తోమా ఎట్లు విశ్వసించును?