దేవుని స్వరము మూడవసారి వినబడుట
అధ్యాయము 104
దేవుని స్వరము మూడవసారి వినబడుట
యేసు దేవాలయములో ఉండగా, త్వరలో తాను ఎదుర్కొనబోవు మరణమునుగూర్చి వ్యాకులపడును. తన తండ్రి పేరుపై ఎలాంటి ప్రభావమునది చూపునోయని ఆయన ముఖ్యముగా చింతించుచున్నాడు, కావున ఆయన ఇట్లు ప్రార్థించును: “తండ్రీ, నీ నామమును మహిమ పరచుము.”
అప్పుడు పరలోకమునుండి ఒక పెద్ద శబ్దమువచ్చి ఇట్లు ప్రకటించును: “నేను దానిని మహిమపరచితిని, మరల మహిమపరతును.”
అక్కడ గుమికూడిన జనసమూహము దిగ్భ్రాంతి చెందుదురు, “దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెనని” కొందరు అనగా, మరికొందరు ఉరిమెనని అందురు. అయితే నిజానికి, అప్పుడు యెహోవా దేవుడు మాట్లాడెను! కాని యేసు విషయములో దేవుని స్వరము వినబడుట ఇది మొదటిసారి కాదు.
మూడు సంవత్సరముల క్రితము, యేసు బాప్తిస్మము పొందినప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను యేసునుగూర్చి దేవుడిట్లు చెప్పుట వినెను: “ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను.” ఆ పిమ్మట గత పస్కాపండుగ తర్వాత కొద్దికాలమునకు, యేసు వారియెదుట రూపాంతరము పొందినప్పుడు, యాకోబు, యోహాను, పేతురు అనువారు దేవుడు ఇట్లు ప్రకటించుటను వినిరి: “ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను; ఈయన మాట వినుడి.” ఇప్పుడు, మూడవసారి అనగా యేసు మరణానికి నాలుగురోజులముందు, నీసాను 10వ తారీఖున ప్రజలు మరలా దేవుని స్వరమును వినిరి. అయితే ఈసారి జనసమూహములు వినగలుగునట్లుగా యెహోవా మాట్లాడును!
“ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను” అని యేసు వివరించును. ఇది యేసు నిజముగా దేవుని కుమారుడని, వాగ్దానము చేయబడిన మెస్సీయ అని రుజువుపరచును. యేసు ఇంకను ఇట్లనును: “ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది; ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును.” యేసుయొక్క నమ్మకమైన జీవన విధానము, నిజానికి లోకాధికారియగు అపవాదియగు సాతాను “త్రోసివేయబడి,” నాశనముచేయబడ అర్హుడని నిశ్చయపరచుచున్నది.
సమీపించుచున్న తన మరణ పరిణామములను సూచించుచు, యేసు ఇట్లనును: “నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందును.” ఆయన మరణము ఏ విధముగాను పరాజయము కాదు, ఏలయనగా దానిద్వారా ఆయన ఇతరులు నిత్యజీవము అనుభవించులాగున వారిని తన వైపు ఆకర్షించును.
అయితే జనసమూహము అభ్యంతరము చెప్పుచు, “క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్యకుమారుడగు ఈయన ఎవరని ఆయనను అడిగిరి.”
దేవుని స్వంత స్వరముతో సహా రుజువెంతో ఉన్నను, అనేకమంది యేసును వాగ్దానము చేయబడిన, నిజమైన మనుష్యకుమారునిగా నమ్ముటలేదు. అయినను, ఆరు నెలల క్రితము పర్ణశాలల పండుగలో చేసినట్లుగానే, యేసు మరలా తననుతాను, “వెలుగునని” చెప్పుకొంటూ తనమాటలు వినువారిని ఇట్లు ప్రోత్సహించును: “మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడి.” ఈ మాటలు చెప్పిన తర్వాత యేసు వెళ్లిపోయి, నిశ్చయంగా తన ప్రాణము అపాయమందున్నందు వలన దాగియుండును.
యూదులు యేసును విశ్వసించకపోవుట యనునది ‘స్వస్థపరచబడకుండునట్లు ప్రజల కన్నులకు అంధత్వమున్నదని, హృదయము కాఠిన్యమైనదని’ యెషయా పలికిన మాటలను నెరవేర్చును. యేసు తన మానవపూర్వ మహిమయందు యెహోవాతోపాటు ఉండుటను, యెహోవా పరలోక సభామండలములను యెషయా దర్శనమందు చూసెను. అయినను, యూదులు యెషయా వ్రాసిన దాని నెరవేర్పు కనుగుణ్యముగా, ఈయన వాగ్దానము చేయబడిన రక్షకుడను రుజువును మూర్ఖముగా తిరస్కరించుదురు.
మరొకవైపున, అనేకమంది అధికారులు సహితము (స్పష్టముగా యూదుల మహాసభయగు ఉన్నత న్యాయస్థానముయొక్క సభ్యులు) యేసునందు నిజముగా విశ్వాసముంచుదురు. నీకొదేము, అరిమతయియ యోసేపు ఈ అధికారులలో ఇద్దరైయున్నారు. అయితే ఈ అధికారులు సమాజమందిరములో వారికున్న స్థానములనుండి తొలగించబడుదురేమోనను భయముతో, ఇప్పుడుకూడ తమ విశ్వాసమును వెల్లడిచేయలేదు. అటువంటివారు ఎంతగా నష్టపోయారో!
యేసు ఇంకను తెలియజేయునదేమనగా, “నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. . . . ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేనతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పుతీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. . . . నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పుతీర్చును.”
మానవలోకము యెడల యెహోవాకున్న ప్రేమను బట్టియే యేసును పంపుటకు ఆయన కదిలించబడెను, గనుక ఆయనయందు విశ్వాసముంచువాడు రక్షింపబడును. దేవుడు యేసును మాట్లాడుమని ఉపదేశించిన సంగతులకు వారు లోబడుదురా లేదాయను దానిపై ప్రజలు రక్షింపబడుట ఆధారపడియుండును. “అంత్యదినమున,” క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన కాలములో తీర్పు జరుగును.
యేసు ఈ మాటలుచెప్పి ముగించును: “నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ ఇచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను.” యోహాను 12:28-50; 19:38, 39; మత్తయి 3:17; 17:5; యెషయా 6:1, 8-10.
▪ యేసు విషయములో ఏ మూడు సందర్భములలో దేవుని స్వరము వినబడెను?
▪ ప్రవక్తయైన యెషయా యేసు మహిమను ఎట్లు చూచెను?
▪ యేసునందు విశ్వాసముంచిన అధికారులు ఎవరు, అయితే వారు బహిరంగముగా యేసును ఎందుకు ఒప్పుకొనలేదు?
▪ “అంత్యదినము” ఏమైయున్నది, మరియు దేని ఆధారముగా ప్రజలు అప్పుడు తీర్పు తీర్చబడుదురు?