“ఇదిగో ఈ మనుష్యుడు”
అధ్యాయము 123
“ఇదిగో ఈ మనుష్యుడు”
యేసు నడవడికి, ఆయన నిర్దోషత్వమునకు ముగ్ధుడై, పిలాతు ఆయనను విడుదలకు మరొక విధముగా ప్రయత్నించును. “పస్కాపండుగలో నేనొకని మీకు విడుదలచేయు వాడుక కలదు గదా” అని జనసమూహములతో అతడనును.
పేరుబడిన హంతకుడైన బరబ్బ అనువాడును చెరసాలలో ఉన్నాడు, కావున పిలాతు వారినిట్లడగును: “నేనెవనిని విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా?”
ప్రధాన యాజకులచే రెచ్చగొట్టబడిన ప్రజలు యేసును చంపి తమకు బరబ్బను విడుదల చేయవలెనని కేకలు వేసిరి. పట్టువదలక, పిలాతు వారిని మరలా ఇట్లడుగును: “ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు?”
“బరబ్బనే” అని వారు కేకలు వేయుదురు.
“ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతును?” అని పిలాతు ఉద్వేగముతో వారినడుగును.
వారందరు, “అతని వ్రేలాడవేయుము!” “అతని వ్రేలాడవేయుము, వ్రేలాడవేయుము!” (NW) అని ప్రత్యుత్తరమిత్తురు.
ఒక అమాయకుని ప్రాణమును వారడుగుచున్నారని తెలిసికొని, పిలాతు వారినిట్లు ప్రాధేయపడును: “ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతును.”
అతని ప్రయత్నముల మధ్యను, తమ మతనాయకులచే ప్రేరేపింపబడి కోపోద్రేకులైన జనులు ఒకేపట్టుగా, “వీనిని వ్రేలాడదీయుము!” (NW) అని బిగ్గరగా కేకలు వేయుదురు. తమ యాజకుల వలన ప్రజలు వెర్రి ఆవేశముతో, రక్తము కావలెనని కోరుచున్నారు. వీరిలోని కొందరు బహుశ, కొద్దిదినముల ముందు యేసును రాజుగా యెరూషలేమునకు ఆహ్వానించిన వారిలో ఉండవచ్చుననుటను ఊహించుము. ఈ సమయమంతటిలో, యేసు శిష్యులు, వారు అక్కడ హాజరైయున్నట్లయిన, మౌనముగా మరియు నిగూఢముగా ఉన్నారు.
తన విన్నపములు ఏ మంచిని చేయకపోవుటకు బదులు మరింత అల్లరి జరుగుటకు కారణమగుటను చూచిన పిలాతు, నీళ్లు తీసికొని, జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, “ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని” చెప్పును. అందుకు ప్రజలందరు, “వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకని” ప్రత్యుత్తరమిచ్చుదురు.
కావున, వారి అభీష్టము మేరకు—సరియని తనకు తెలిసిన దానిని చేయుటకు బదులు ఆ జనసమూహమును తృప్తిపరచుటకు వారు కోరినట్లు పిలాతు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును పట్టుకొని కొరడాలతో కొట్టించును. అది మామూలుగా కొరడాలతో కొట్టుటకాదు. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ రోమన్లు కొరడాలతో ఎట్లు కొట్టుదురో ఇట్లు వర్ణించుచున్నది:
“సాధారణముగా ఉపయోగించు చిన్నసైజు కొరడా, (చేర్లకోల లేక చుబుకము) చిన్నపెద్ద పొడవుగల అనేక తోలు పీలికలు, అందులో కొన్ని మధ్యమధ్య ఇనుపగుండ్లు లేక పదునైన గొర్రె ఎముకలు ముడివేసి అల్లబడిన తోలుపట్టీలై యుండును. . . . రోము సైనికులు తమ బలమంతా ఉపయోగించి వాటితో అనేకమార్లు శిక్షితుల వీపుపై కొట్టినప్పుడు, ఇనుపగుండ్ల వలన శరీరము మిక్కిలి కమిలిపోవును, ఇక తోలుపట్టీలు, గొర్రె ఎముకలు చర్మమును, చర్మమందలి పొరలను లోతుగా చీల్చివేయును. అలా కొరడాలతో కొట్టుట ఇంకను కొనసాగుచుండగా, ఆ చీల్చబడుట మాంసపు అంతర్భాగములకుచేరి శరీరము చిట్లి తోళ్లు వ్రేలాడుతు విపరీతముగా రక్తముకారును.”
ఇట్లు కౄరముగా కొట్టిన పిదప, యేసు గవర్నరు సౌధమునకు తేబడును. అప్పుడు సైనిక పటాలము వారందరు అక్కడకు పిలువబడుదురు. అక్కడ సైనికులు ఆయనను మరలా హింసించి ఆయన తలపై ముళ్లకిరీటమును దిగగొట్టుదురు. వారాయన చేతిలో ఒక కర్రనుంచి, రాజులు ధరించు ఉదారంగు వస్త్రమును ఆయనకు తొడిగింతురు. ఆ పిమ్మట వారు, “యూదుల రాజా, నీకు శుభము” అని హేళన చేయుదురు. అంతేకాదు వారు ఆయనపై ఉమ్మివేసి, ముఖముపై అరచేతులతో కొట్టుదురు. ఆయన చేతిలోని ఆ బలమైన కర్ర లాక్కొని, దానితో ఆయన తలపై అవమానకరముగా ఉంచిన “కిరీటము” యొక్క పదునైన ముండ్లు మరింత లోతుగా ఆయన తలలోనికి దిగునట్లు కొట్టుదురు.
ఈ అకృత్యము మధ్యను యేసు చూపిన అసాధారణమైన నిబ్బరము మరియు శక్తి పిలాతుపై ఎంతగా ప్రభావము చూపెననగా, అతడు ఆయనను విడిపించుటకు మరొకసారి ప్రయత్నించుటకు కదిలింపబడెను. “ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నాను” అని జనసమూహముతో అనును. బహుగా హింసింపబడిన యేసు పరిస్థితి వారి హృదయములను కరిగించునని బహుశ అతడు ఊహించియుండవచ్చును. హృదయ కాఠిన్యముగల ఆ గుంపు యెదుట ముండ్ల కిరీటము ఊదారంగు వస్త్రము ధరించి రక్తముతో తడిసిన ముఖముతో, నొప్పితో యేసు నిలువబడగా, పిలాతు ఇట్లనును: “ఇదిగో ఈ మనుష్యుడు.”
కొట్టబడి బహుగా హింసింపబడినను, చరిత్రలోకెల్లా మహాగొప్ప మనిషి నిలువబడియున్నాడు, నిజముగా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి! అవును, పిలాతు సహితము గుర్తించవలసిన గొప్పతనమును చాటిచెప్పు ఉన్నతత్వమును, ప్రశాంతతను యేసు చూపించును, ఏలయనగా పిలాతు మాటలలో స్పష్టముగా గౌరవము, సానుభూతియు కలిసియున్నవి. యోహాను 18:39–19:5; మత్తయి 27:15-17, 20-30; మార్కు 15:6-19; లూకా 23:18-25.
▪ యేసును విడుదల గావించుటకు పిలాతు ఏ విధములుగా ప్రయత్నించును?
▪ బాధ్యతనుండి తప్పించుకొనుటకు పిలాతు ఎట్లు ప్రయత్నించును?
▪ కొరడాలతో కొట్టుటయందు ఏమి యిమిడియున్నది?
▪ కొరడాలతో కొట్టబడిన తర్వాత యేసు ఎట్లు అపహసింపబడును?
▪ యేసును విడుదల చేయుటకు పిలాతు మరింకే ప్రయత్నము చేయును?