1
మనం తెలుసుకోవడానికి ఇష్టపడే ఒక రహస్యం
పిల్లలూ, ఎవరైనా ఓ విషయాన్ని మీకు మాత్రమే చెప్పారా?— a ఆ విషయం మీకూ వాళ్లకూ తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు కాబట్టి దాన్ని రహస్యం అంటారు. బైబిలు ఒక ప్రత్యేక రహస్యం గురించి చెబుతోంది, దాన్నే పరిశుద్ధ మర్మం అంటారు. ఈ రహస్యాన్ని దేవుడు చెబుతున్నాడు, అందుకే అది పరిశుద్ధమైనది. దీని గురించి దేవదూతలు కూడా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నారు. మరి మీకు ఆ రహస్యమేంటో తెలుసుకోవాలనుందా?—
ఈ దేవదూతలు ఏమి తెలుసుకోవాలని ఆసక్తిగా వింటున్నారు?
చాలాకాలం క్రితం, దేవుడు మొట్టమొదటి పురుషుడిని, స్త్రీని సృష్టించాడు. వాళ్ల పేర్లు ఆదాము, హవ్వ. దేవుడు వాళ్లను అందమైన ఏదెను తోటలో ఉంచాడు. అదే వాళ్ల ఇల్లు. ఆదాముహవ్వలు దేవుని మాట వినుంటే వాళ్లు, వాళ్ల పిల్లలు మొత్తం భూమిని పరదైసులా అంటే, అందమైన తోటలా చేసివుండేవాళ్లు. చూడచక్కని పరిసరాల్లో ఎప్పటికీ చనిపోకుండా అలా జీవిస్తూ ఉండేవాళ్లు. కానీ ఆదాముహవ్వలు ఏమి చేశారో మీకు గుర్తుందా?—
వాళ్లు దేవుని మాట వినలేదు, అందుకే ఇప్పుడు మన భూమి అందమైన తోటలా లేదు. అయితే దేవుడు ఈ భూమంతటినీ అందంగా మారుస్తాననీ, అప్పుడు ఎవ్వరూ చనిపోకుండా సంతోషంగా ఉంటారనీ చెప్పాడు. ఆయన ఇదెలా చేస్తాడు? ఆ విషయం చాలాకాలం వరకు ప్రజలకు తెలియలేదు. అదొక రహస్యంగా ఉండిపోయింది.
యేసు భూమ్మీదకు వచ్చినప్పుడు దాని గురించి ప్రజలకు మరిన్ని వివరాలు చెప్పాడు. ఆ రహస్యం దేవుని రాజ్యం గురించినదని ఆయన అన్నాడు. ఆ రాజ్యం రావాలని ప్రార్థించమని ప్రజలకు చెప్పాడు. ఆ రాజ్యం భూమిని ఒక అందమైన పరదైసులా చేస్తుంది.
ఈ రహస్యం గురించి తెలుసుకున్నందుకు మీకు ఆనందంగా లేదా?— అయితే ఓ విషయం గుర్తుంచుకోండి, యెహోవా చెప్పిన మాట వినేవాళ్లే పరదైసులో జీవిస్తారు. ఆయన మాట విన్న స్త్రీపురుషుల కథలెన్నో బైబిల్లో ఉన్నాయి. మీకు వాళ్ల గురించి తెలుసుకోవాలనుందా?— అయితే వాళ్లలో కొంతమంది గురించి చూద్దాం, వాళ్లలా ఉండాలంటే ఏమి చేయాలో కూడా నేర్చుకుందాం.
మీ బైబిల్లో చదవండి
-
మార్కు 4:11
-
1 పేతురు 1:12
-
ఆదికాండము 1:26-28; 2:8, 9; 3:6, 23
-
మత్తయి 6:9, 10
-
కీర్తన 37:11, 29
a ఈ బ్రోషుర్‌లోని ప్రతీ పాఠంలో కొన్ని ప్రశ్నల దగ్గర ఓ అడ్డగీత (—) ఉంటుంది. అక్కడ కొంచెం ఆగి, ఆ ప్రశ్నలకు మీ చిన్నారులు ఏమి చెబుతారో వినండి.