కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

20వ అధ్యాయం

ఎప్పుడూ అందరికన్నా మీరే ముందుండాలని అనుకుంటారా?

ఎప్పుడూ అందరికన్నా మీరే ముందుండాలని అనుకుంటారా?

ఎప్పుడూ అందరికన్నా ముందుండాలని అనుకునేవాళ్లు ఎవరైనా మీకు తెలుసా?— అలాంటివాళ్లు వరుసలో తాము ముందుండడానికి వేరేవాళ్లను నెట్టేస్తుంటారు. ఎవరైనా అలా చేయడం మీరు చూశారా?— కొంతమంది పెద్దవాళ్లు కూడా అలా అందరికన్నా ముందు ఉండాలని లేదా అన్నిటికన్నా ముఖ్యమైన స్థానాల్లో ఉండాలని ప్రయత్నించడం గొప్ప బోధకుడు గమనించాడు. అది ఆయనకు నచ్చలేదు. అసలు ఏంజరిగిందో తెలుసుకుందాం.

అందరికన్నా ముందు ఉండాలని ఎవరైనా ప్రయత్నించడం మీరు చూశారా?

ఒకసారి ఒక పరిసయ్యుడు తన ఇంట్లో జరుగుతున్న విందుకు యేసును పిలిచాడని బైబిలు చెప్తోంది, ఆ పరిసయ్యుడు మతనాయకుల్లో ముఖ్యమైనవాడు. యేసు అక్కడికి వచ్చిన తర్వాత, విందుకు వస్తున్నవాళ్లు గొప్పగా ఉన్న స్థలాలను చూసుకుని కూర్చోవడం గమనించాడు. అప్పుడు ఆయన అక్కడున్నవాళ్లకు ఒక కథ చెప్పాడు. మీకు కూడా అది వినాలని ఉందా?—

యేసు ఇలా అన్నాడు, ‘నిన్ను ఎవరైనా పెళ్లి విందుకు పిలిస్తే అక్కడ అగ్రపీఠములలో కూర్చోవద్దు.’ యేసు ఎందుకు అలా అన్నాడో తెలుసా?— బహుశా అక్కడికి ఇంకా ముఖ్యమైన వాళ్లను పిలిచివుంటారని ఆయన వివరించాడు. కాబట్టి, ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నట్లు, విందు ఏర్పాటు చేసిన వ్యక్తి వచ్చి, ‘ఈ చోటు ఈయనకు ఇచ్చేసి నువ్వు వెళ్లి అక్కడ కూర్చో’ అన్నాడనుకోండి. అప్పుడు విందుకు వచ్చిన అతనికి ఎలా అనిపిస్తుంది?— అతను అంత గొప్పగా లేని స్థలానికి వెళ్లి కూర్చోవాల్సి రావడం మిగతావాళ్లంతా చూస్తుంటారు కాబట్టి అతనికి చాలా అవమానంగా అనిపిస్తుంది.

అన్నిటికన్నా గొప్ప స్థానం కావాలనుకోవడం సరైనది కాదని యేసు నేర్పిస్తున్నాడు. అందుకే ఆయన, ‘నిన్ను పెళ్లి విందుకు పిలిస్తే నువ్వు వెళ్లి గొప్పగా లేని స్థలంలో కూర్చో. అప్పుడు నిన్ను పిలిచిన వ్యక్తి వచ్చి గొప్పగా ఉన్న స్థలానికి వెళ్లమని నీతో చెప్తాడు. అప్పుడు విందుకు వచ్చిన వాళ్లందరి ముందు నీకు ఘనత కలుగుతుంది.’—లూకా 14:1, 7-11.

యేసు అన్నిటికన్నా గొప్పగా ఉండే స్థానాలను, లేదా మంచి స్థానాలను ఎంచుకునే వాళ్ల గురించి చెప్పినప్పుడు, ఏ పాఠం నేర్పించాడు?

యేసు ఏమి చెప్పాలనుకున్నాడో అర్థమైందా?— మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీరు రద్దీగా ఉన్న బస్సులోకి ఎక్కుతున్నారని అనుకుందాం. మీరు ముందుగా సీట్లో కూర్చుండిపోయి, ఎవరైనా ఒక పెద్దాయన నిలబడివున్నా పట్టించుకోకపోవడం సరైనదేనా?— మీరు అలా చేస్తే యేసుకు నచ్చుతుందా?—

మనమేం చేసినా యేసుకు పెద్దగా పట్టింపు ఉండదని కొంతమంది అంటారు. అది మీరు నమ్ముతున్నారా?— యేసు ఆ పరిసయ్యుని ఇంట్లో విందుకు వెళ్లినప్పుడు, ప్రజలు స్థలాలను ఎంచుకుని కూర్చోవడం ఆయన గమనించాడు. మరి ఈ రోజుల్లో కూడా మనం చేస్తున్నది ఆయన ఆసక్తిగా గమనించడా?— యేసు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి మనల్ని ఇంకా బాగా గమనించగలడు.

అందరికన్నా ముందు ఉండాలని ఎవరైనా ప్రయత్నిస్తే దానివల్ల ఇబ్బందులు రావచ్చు. సాధారణంగా దానివల్ల గొడవలు జరుగుతాయి, మిగతా వాళ్లకు కోపం వస్తుంది. కొన్నిసార్లు పిల్లలంతా కలిసి బస్సులో వెళ్తున్నప్పుడు అలాంటివి జరుగుతాయి. బస్సు తలుపు తెరుచుకోగానే పిల్లలంతా ఒకరినొకరు నెట్టుకుంటూ బస్సులోకి ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరికీ కిటికీ దగ్గర చోటు కావాలి. అలాంటప్పుడు ఏంజరుగుతుంది?— సరిగ్గా చెప్పారు, ఒకరిమీద ఒకరికి పిచ్చికోపం వచ్చేస్తుంది.

అందరికన్నా ముందు ఉండాలని కోరుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. దానివల్ల యేసు అపొస్తలుల్లో కూడా సమస్యలు వచ్చాయి. మనం 6వ అధ్యాయంలో నేర్చుకున్నట్లు, తమలో ఎవరు గొప్ప అనేదాని గురించి వాళ్లు వాదించుకున్నారు. అప్పుడు యేసు ఏంచేశాడు?— అవును, ఆయన వాళ్లను సరిదిద్దాడు. కానీ ఆ తర్వాత వాళ్లు మళ్లీ వాదించుకున్నారు. అదెలా మొదలయ్యిందో చూద్దాం.

యేసుతో పాటు అపొస్తలులు, వేరేవాళ్లు చివరిసారిగా యెరూషలేము పట్టణానికి వెళ్తున్నారు. యేసు వాళ్లతో తన రాజ్యం గురించి మాట్లాడుతుండేవాడు, అందువల్ల యాకోబు యోహానులు యేసుతో కలిసి రాజులుగా పరిపాలించడం గురించి ఆలోచించేవాళ్లు. వాళ్లు దీని గురించి వాళ్ల అమ్మతో కూడా మాట్లాడారు, వాళ్ల అమ్మ పేరు సలోమే. (మత్తయి 27:56; మార్కు 15:40) కాబట్టి వాళ్లు అలా యెరూషలేముకు వెళ్తున్నప్పుడు, దారిలో సలోమే యేసు దగ్గరకు వచ్చి ఆయనకు వంగి నమస్కారం చేసింది.

‘నీకు ఏంకావాలి?’ అని యేసు ఆమెను అడిగాడు. ఆయన రాజ్యంలో తన ఇద్దరు కుమారులు ఆయన ప్రక్కనే అంటే ఒకరు ఆయన కుడివైపున మరొకరు ఆయన ఎడమవైపున కూర్చునే అవకాశం ఇవ్వమని కోరింది. యాకోబు, యోహాను తమ తల్లితో అలా అడిగించారని మిగిలిన పదిమంది అపొస్తలులకు తెలిసినప్పుడు, వాళ్లకు ఎలా అనిపించివుంటుంది?—

యేసును సలోమే ఏమి కోరింది, దానివల్ల ఏంజరిగింది?

అవును, యాకోబు మీద యోహాను మీద వాళ్లకు చాలా కోపం వచ్చింది. అందుకే యేసు తన అపొస్తలులందరికీ చక్కని సలహా ఇచ్చాడు. లోకంలో ఉన్న పరిపాలకులు గొప్పగా, ప్రముఖులుగా ఉండడానికి చాలా ఇష్టపడతారని యేసు వాళ్లకు చెప్పాడు. అందరి మీద అధికారం చెలాయించే స్థానంలో తాము ఉండాలని వాళ్లు కోరుకుంటారు. కానీ తన అనుచరులు అలా ఉండకూడదని యేసు వాళ్లకు చెప్పాడు. ‘మీలో ఎవరు గొప్పవాళ్లుగా ఉండాలని కోరుకుంటారో వాళ్లు మీ పరిచారకులుగా ఉండాలి’ అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాని గురించి ఆలోచించండి!—మత్తయి 20:20-28.

పరిచారకుడు అంటే ఎవరో తెలుసా?— పరిచారకుడు వేరేవాళ్లకు సేవ చేస్తాడు, వేరేవాళ్లు తనకు సేవ చేయాలని ఆశించడు. ఆయన గొప్పగా ఉండే స్థానాన్ని కాదుగానీ అన్నిటికన్నా తక్కువ స్థానాన్ని ఎంచుకుంటాడు. తాను అందరికన్నా తక్కువ వాడినన్నట్లు ప్రవర్తిస్తాడు కానీ అందరికన్నా గొప్ప వాడినన్నట్లు ప్రవర్తించడు. అందరికన్నా ముందు ఉండాలనుకునే వాళ్లు, వేరేవాళ్లకు పరిచారకులుగా ఉండాలని యేసు చెప్పినట్లు గుర్తుంచుకోండి.

ఇప్పుడు చెప్పండి, ఆయన మనకు ఏమి చెప్పాలనుకుంటున్నాడు?— తమ ఇద్దరిలో ఎవరు మంచి స్థలంలో కూర్చోవాలనే దాని గురించి పరిచారకుడు తన యజమానితో వాదిస్తాడా? లేదా, తమ ఇద్దరిలో ఎవరు ముందు తినాలనే దాని గురించి వాదిస్తాడా? మీకు ఏమనిపిస్తుంది?— ఒక పరిచారకుడు ఎప్పుడూ తనకన్నా తన యజమానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడని యేసు వివరించాడు.—లూకా 17:7-10.

కాబట్టి అందరికన్నా ముందు ఉండడానికి ప్రయత్నించే బదులు మనమేమి చేయాలి?— అవును, మనం వేరేవాళ్లకు పరిచారకులుగా ఉండాలి. అంటే వేరేవాళ్లకు మనకన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే వేరేవాళ్లను మనకన్నా ముఖ్యమైన వాళ్లుగా చూడాలి. వేరేవాళ్లకు మనకన్నా ఎక్కువ ప్రాముఖ్యతను ఎలా ఇవ్వవచ్చో చెప్పగలరా?— మీ పుస్తకంలో 40, 41 పేజీలకు తిప్పి వేరేవాళ్లకు సేవ చేస్తూ వాళ్లకు ఎలా ప్రాముఖ్యత ఇవ్వవచ్చో మరోసారి చూస్తే బావుంటుంది.

గొప్ప బోధకుడు వేరేవాళ్లకు సేవ చేయడం ద్వారా వాళ్లకు తనకన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడని మీకు గుర్తుండే ఉంటుంది. తన అపొస్తలులతో గడిపిన చివరి సాయంత్రం, ఆయన వాళ్ల కాళ్లు కూడా కడిగాడు. మనం కూడా ఇతరులకు సేవ చేస్తూ వాళ్లకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, మనం మన గొప్ప బోధకుడిని, ఆయన తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి సంతోషపెడతాం.

ఇతరులకు మనకన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రోత్సహించే, లూకా 9:48; రోమీయులు 12:3; ఫిలిప్పీయులు 2:3, 4 వచనాలు కూడా చదువుదాం.