అధ్యాయం 14
జతగానే వృద్ధులు కావడం
1, 2. (ఎ) వృద్ధాప్యం సమీపిస్తుండగా ఏ మార్పులు వస్తాయి? (బి) బైబిలు కాలాల్లోని దైవీక పురుషులు వృద్ధాప్యంలో సంతృప్తిని ఎలా కనుగొన్నారు?
మనం వృద్ధులమౌతుండగా అనేక మార్పులు వస్తాయి. శారీరక బలహీనత మన పటుత్వాన్ని పీల్చేస్తుంది. అద్దంలో ఒకసారి చూసుకుంటే మొహంలోని క్రొత్త ముడతలను వెంట్రుకలు నెరిసిపోవడాన్ని లేక అవి మొత్తానికే రాలిపోడాన్ని గమనించవచ్చు. మన జ్ఞాపక శక్తి బలహీనం అవుతుండవచ్చు. పిల్లలకు పెళ్లి అయినప్పుడు, మనుమలు మనమరాండ్లు పుట్టినప్పుడు క్రొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. కొందరికి, ఉద్యోగ విరమణ లభించినప్పుడు వారి జీవన పద్ధతిలో మార్పు వస్తుంది.
2 వాస్తవానికి, వయస్సు పైబడుతున్నప్పుడు ఆ సంవత్సరాలు కష్టతరంగా ఉండగలవు. (ప్రసంగి 12:1-8) అయిననూ, బైబిలు కాలాల్లోని దేవుని సేవకులను పరిశీలించండి. వారు తుదకు మరణించినప్పటికీ, వారు జ్ఞానమును వివేకాన్ని పొందారు, ఆ వృద్ధాప్యంలో అది వారికి గొప్ప సంతృప్తిని కలిగించింది. (ఆదికాండము 25:8; 35:29; యోబు 12:12; 42:17) ఆనందంగా వృద్ధులవ్వడంలో వారెలా సఫలీకృతులు కాగలిగారు? నేడు బైబిలులో లిఖితమైనవని మనం కనుగొనే సూత్రాలకు అనుగుణంగా జీవించడం ద్వారా వారు దాన్ని వాస్తవంగా పొందగలిగారు.—కీర్తన 119:105; 2 తిమోతి 3:16, 17.
3. వృద్ధులైన స్త్రీ పురుషుల కొరకు పౌలు ఏ సలహా ఇచ్చాడు?
3 తీతుకు వ్రాసిన తన ఉత్తరంలో, వృద్ధులౌతున్న వారికి అపొస్తలుడైన పౌలు చక్కని నడిపింపునిచ్చాడు. ఆయనిలా వ్రాశాడు: ‘వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలెను, ఆలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెను . . . మంచి ఉపదేశము చేయువారునై యుండవలెను.’ (తీతు 2:2, 3) ఈ మాటలకు చెవి యొగ్గడం, వృద్ధులవ్వడంలోని సవాళ్లను మీరు ఎదిరించడంలో మీకు సహాయపడగలదు.
మీ పిల్లల స్వేచ్ఛకు తగినట్టు సర్దుకుపోండి
4, 5. తమ పిల్లల వివాహమై వారు ఇల్లు వదలి వెళ్లినప్పుడు అనేకమంది తలిదండ్రులు ఎలా ప్రతిస్పందిస్తారు, ఈ క్రొత్త పరిస్థితికి కొందరు ఎలా సర్దుకుపోతారు?
4 మారుతున్న పాత్రలు సంయోక్తతను కోరతాయి. పిల్లలు పెద్దవారై వారికి పెళ్లిళ్లయి ఇల్లు విడిచి వెళ్లిపోయినప్పుడు ఇదెంతో వాస్తవమని నిరూపించబడుతుంది! తాము వృద్ధులమవుతున్నాం అనేందుకు అనేకమంది తలిదండ్రులకు ఇదే మొదటి సూచన. తమ పిల్లలు పెద్దవారు అయ్యారని వారు సంతోషిస్తున్నప్పటికీ, తమ పిల్లలు స్వతంత్రంగా ఉండేందుకు వారిని సిద్ధపర్చడంలో తమకు వీలైనదంతా తాము చేశామో లేదో అని తరచూ అనేకమంది తలిదండ్రులు వ్యాకులత చెందుతారు. పిల్లలు ఇప్పుడు ఇంట్లో లేనందుకు వారికి ఇల్లంతా బోసిపోయినట్లు అనిపిస్తుంది.
5 పిల్లలు ఇల్లు వదిలి వెళ్లిన తర్వాత కూడా, తలిదండ్రులు తమ పిల్లల ఎడల శ్రద్ధ కలిగివుంటారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. “నాకు వాళ్లను గూర్చిన సమాచారం తరచూ లభిస్తే, వాళ్లు క్షేమంగా ఉన్నారని నాకు తెలిస్తే నాకెంతో ఊరటగా ఉంటుంది, అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది” అని ఒక తల్లి చెబుతోంది. ఒక తండ్రి ఇలా చెబుతున్నాడు: “మా పాపకు పెళ్లై ఆమె అత్తింటికి వెళ్లిపోయినప్పుడు, అదెంతో కష్టతరమైన సమయంగా ఉండేది. మేము అన్ని పనులనూ కుటుంబమంతా కలిసి చేసే వాళ్లం కాబట్టి అది మా మధ్య పెద్ద అగాధాన్ని ఏర్పరచింది.” తమ పిల్లల ఎడబాటును ఈ తలిదండ్రులు ఎలా తట్టుకోగలిగారు? అనేక సందర్భాల్లో, ఇతర ప్రజలపట్ల శ్రద్ధ చూపించి, వారికి సహాయం చేయడం ద్వారానే.
6. కుటుంబ బంధాలను వాటి సరైన స్థానంలో ఉంచేందుకు ఏది సహాయం చేస్తుంది?
6 పిల్లల పెళ్లి అయిన తర్వాత తలిదండ్రుల పాత్ర మారుతుంది. ఆదికాండము 2:24 (ఇటాలిక్కులు మావి) ఇలా పేర్కొంటోంది: “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.” మంచి క్రమం, శిరస్సత్వం యొక్క దైవిక సూత్రాలను గుర్తించడం, విషయాలను వాటి సరైన స్థానంలో ఉంచేందుకు తలిదండ్రులకు సహాయం చేస్తుంది.—1 కొరింథీయులు 11:3; 14:33, 40.
7. తన కుమార్తెల వివాహమై వారు తమ భర్తల ఇళ్లకు వెళ్లినప్పుడు ఒక తండ్రి వృద్ధిపర్చుకున్న చక్కని దృక్పథం ఏమిటి?
7 ఒక దంపతుల ఇద్దరు కుమార్తెలకు పెళ్లై వాళ్లు తమ భర్తల ఇళ్లకు వెళ్లిపోయినప్పుడు, ఆ దంపతులు తమ జీవితంలో వెలితి ఏర్పడిందని భావించారు. మొదట్లో, ఆ భర్త తన అల్లుళ్ల ఎడల విముఖంగా ఉన్నాడు. అయితే, శిరస్సత్వం యొక్క సూత్రాన్ని గురించి ఆయన పరిశీలించినప్పుడు, తన కూతుళ్ల భర్తలు తమ తమ స్వంత గృహాల ఎడల శ్రద్ధ వహించాల్సిన బాధ్యతను ఇప్పుడు కలిగి ఉన్నారని ఆయన గుర్తించాడు. కాబట్టి, ఆయన కుమార్తెలు సలహా అడిగినప్పుడు, ఆయన మొదట వారి భర్తలు ఏమని భావిస్తున్నారు అని ఆ అమ్మాయిలను అడిగి, అప్పుడు ఆయన వీలైనంత మద్దతును ఇచ్చేందుకు ప్రయత్నించేవాడు. ఇప్పుడు ఆయన అల్లుళ్లు ఆయనను ఒక స్నేహితునిగా దృష్టించి, ఆయన సలహాలను ఆహ్వానిస్తున్నారు.
8, 9. తమ ఎదిగిన పిల్లల స్వేచ్ఛతో కొందరు తలిదండ్రులు ఎలా సర్దుకుపోయారు?
8 అయితే, క్రొత్తగా వివాహం చేసుకున్న వారు ఏదైనా లేఖన విరుద్ధమైనది చేయనప్పటికీ, పిల్లలకు శ్రేష్టమైనది అని తలిదండ్రులు భావించిన దానిని చేయడంలో విఫలమైతే అప్పుడెలా? “వాళ్లు ఎప్పుడూ యెహోవా దృక్కోణాన్ని చూసేందుకు మేము వారికి సహాయం చేస్తాము” అని వివాహితులైన పిల్లలుగల దంపతులు వివరిస్తున్నారు, “అయితే మేము వారి నిర్ణయంతో ఏకీభవించనప్పుడు మేము దాన్ని అంగీకరించి మా మద్దతును మరియు ప్రోత్సాహాన్ని వారికి ఇస్తాము.”
9 కొన్ని ఆసియా దేశాల్లో, తమ కుమారుల స్వేచ్ఛను అంగీకరించడం కొందరు తల్లులకు ప్రాముఖ్యంగా కష్టంగా ఉంటుంది. అయితే వారు క్రైస్తవ క్రమాన్ని, శిరస్సత్వాన్ని గౌరవిస్తే, తమ కోడండ్లకు తమకు మధ్య వచ్చే సంఘర్షణ తగ్గుతుంది. తమ కుటుంబ గృహంనుండి తన కొడుకులు వెళ్లిపోవడం “నానాటికీ అధికమయ్యే కృతజ్ఞతా భావానికి మూలం” అయ్యిందని ఒక క్రైస్తవ స్త్రీ కనుగొన్నది. వారు తమ క్రొత్త సంసారాలను సాగించేందుకు వారికిగల సామర్థ్యాన్ని చూసి ఆమె పులకించిపోతోంది. దానికి ప్రతిగా ఆమె, ఆమె భర్త వృద్ధులౌతుండగా వారు భరించవలసి వచ్చే భౌతిక, మానసిక భారం కూడా తగ్గించబడింది.
మీ వివాహ బంధాన్ని పునరుజ్జీవనం చేసుకోవడం
10, 11. మధ్య వయస్సులోని కొన్ని ఉరులను నివారించేందుకు ఏ లేఖనాధార సలహాలు ప్రజలకు సహాయం చేస్తాయి?
10 మధ్య వయస్సుకు చేరుతుండగా ప్రజలు వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తారు. కొందరు పురుషులు యౌవనస్థులుగా కనిపించాలన్న ప్రయత్నంలో విభిన్నంగా ముస్తాబౌతారు. మెనోపాస్ తీసుకువచ్చే మార్పుల గురించి అనేకమంది స్త్రీలు చింతిస్తారు. మధ్య వయస్సులోని వ్యక్తులు కొందరు, వ్యతిరేక లింగ సభ్యులలోని యౌవనులతో సరసోక్తులాడటం ద్వారా తమ జతలలో విముఖతను, అసూయను రేకెత్తిస్తారన్నది దుఃఖకరమైన విషయం. అయితే, దైవభక్తిగల పురుషులు, అయుక్త కోరికలను అణచివేసుకోవడం ద్వారా “స్వస్థబుద్ధిగల” వారిగా ఉంటారు. (1 పేతురు 4:7) అదే విధంగా, పరిణతి చెందిన స్త్రీలు తమ భర్తల ఎడల ప్రేమవలన, యెహోవాను ప్రీతిపర్చాలన్న కోరిక వలన తమ వివాహాల పటిష్ఠతను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు.
11 ప్రేరేపించబడిన వాడై, రాజైన లెమూయేలు “గుణవతియైన భార్య” కొరకు పొగడ్తలను లిఖించాడు. ‘ఆమె తాను బ్రదుకు దినములన్నియు తన భర్తకు మేలు చేయుటద్వారా ఆయనకు ప్రతిఫలమిచ్చును గాని కీడేమియు చేయదు.’ ఒక క్రైస్తవ భర్త, తన భార్య మధ్య వయస్సులో అనుభవించే భావోద్రేక హెచ్చుతగ్గులకు తట్టుకునేందుకు ఆమె కృషి చేస్తుండటాన్ని గుణగ్రహించడంలో విఫలంకాడు. ఆయనకున్న ప్రేమ ‘ఆమెను పొగిడేందుకు’ ఆయనను పురికొల్పుతుంది.—సామెతలు 31:10, 12, 28.
12. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దంపతులు ఎలా దగ్గరవ్వగలరు?
12 పిల్లల పెంపకం సాగిన తీరికదొరకని సంవత్సరాలలో, మీ పిల్లల అవసరతలను తీర్చేందుకు మీరు ఇరువురూ కూడా మీ వ్యక్తిగత కోర్కెలను సంతోషంగా త్యజించి ఉండవచ్చు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మీ వైవాహిక జీవితంవైపు అవధానాన్ని మళ్లించాల్సిన సమయమిదే. “నా కుమార్తెల పెళ్లై వాళ్లు వెళ్లిపోయిన తర్వాత, నేను మళ్లీ నా భార్యతో ప్రేమ కథ ప్రారంభించాను” అని ఒక భర్త చెబుతున్నాడు. “మేము ఒకరి ఆరోగ్యం ఎడల మరొకరం శ్రద్ధవహిస్తాము, వ్యాయామం చేయాల్సిన అవసరతను గురించి ఒకరికొకరం జ్ఞాపకం చేసుకుంటాము” అని మరొక భర్త చెబుతున్నాడు. ఒంటరిగా ఉన్నామనే భావం కలుగకుండా ఉండేందుకు, ఆయనా ఆయన భార్య సంఘంలోని ఇతర సభ్యులకు ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. అవును, ఇతరుల ఎడల శ్రద్ధ చూపించడం ఆశీర్వాదాలను తెస్తుంది. అంతేకాకుండా, అది యెహోవాను ప్రీతిపర్చుతుంది.—ఫిలిప్పీయులు 2:4; హెబ్రీయులు 13:2, 16.
13. జంటగా కలిసి వృద్ధులౌతుండగా అరమరికల్లేకుండా ఉండటం మరియు యథార్థత ఏ పాత్ర వహించగలవు?
13 మీకు మీ వివాహ భాగస్వామికి మధ్య సంభాషణా అంతరం రాకుండా చూసుకోండి. ఒకరితో ఒకరు నిస్సంకోచంగా మాట్లాడుకోండి. (సామెతలు 17:27) “ఒకరి ఎడల ఒకరం శ్రద్ధవహిస్తూ ఉండటం మరియు అవగాహన చూపడం ద్వారా మేము ఒకరినొకరం మరింత ఎక్కువగా అర్థం చేసుకోగలం” అని ఒక భర్త వ్యాఖ్యానిస్తున్నాడు. “మేము వృద్ధులం అవుతుండగా, ఇద్దరం కలిసి టీ త్రాగుతూ, సంభాషిస్తూ, ఒకరితో ఒకరం సహకరించుకోవడంలో ఆనందిస్తున్నాం” అని చెబుతూ ఆయన భార్య కూడా అంగీకరిస్తోంది. మీరు అరమరికల్లేకుండా, యథార్థంగా ఉండటం, వివాహాన్ని విచ్ఛిన్నం చేసేవాడైన సాతాను దాడులను త్రిప్పికొట్టే సమర్థతను మీ వివాహ బంధానికి ఇస్తూ, దాన్ని పటిష్ఠం చేయడంలో సహాయ పడగలదు.
మీ మనుమలు మనుమరాండ్రతో ఆనందించండి
14. తిమోతి క్రైస్తవుడిగా పెరిగి పెద్దవ్వడంలో అతని అమ్మమ్మ ఏ పాత్ర వహించిందని స్పష్టమౌతుంది?
14 మనుమలు మనుమరాండ్రు వృద్ధులకు “కిరీటము.” (సామెతలు 17:6) మనుమలతో సహవాసం వాస్తవంగా ఆనందదాయకంగా ఉండగలదు, అదెంతో ఉత్తేజవంతంగా, సేదదీర్పునిచ్చేదిగా ఉండగలదు. లోయి గురించి బైబిలు ఎంతో మంచిగా మాట్లాడుతోంది, ఆమె తన కుమార్తె యునీకేతో కలిసి, తన పసి మనుమడైన తిమోతితో తన నమ్మకాలను పంచుకున్నది. తన తల్లి, తన అమ్మమ్మ బైబిలు సత్యాలను విలువైనవిగా ఎంచారని ఎరిగినవాడై ఈ యౌవనుడు పెరిగి పెద్దవాడయ్యాడు.—2 తిమోతి 1:5; 3:14, 15.
15. మనుమలు మనుమరాండ్ర విషయానికొస్తే, తాతయ్య మామ్మలు ఏ విలువైన సహాయాన్ని అందించగలరు, అయితే వారు దేన్ని నివారించాలి?
15 కాబట్టి, తాతయ్య మామ్మలు అత్యంత విలువైన సహాయం అందివ్వగల ఒక ప్రత్యేక ప్రాంతం ఇక్కడుంది. తాతయ్య మామ్మలారా, యెహోవా సంకల్పాలను గురించి మీకు తెలిసిన విషయాలను మీరు ఇప్పటికే మీ పిల్లలకు అందించారు. ఇప్పుడు మీరు మరింకో తరానికి వాటిని అందించగలరు! తమ తాతయ్య మామ్మలు బైబిలు కథలను చెబితే వినేందుకు అనేకమంది యౌవన పిల్లలు పులకిస్తారు. అయితే, తన పిల్లలకు బైబిలు సత్యాలను అభ్యసింపజేయాల్సిన తండ్రి బాధ్యతను మీరు తీసుకోరు. (ద్వితీయోపదేశకాండము 6:7) బదులుగా, మీరు దానికి మద్దతునిస్తారు. మీ ప్రార్థన కీర్తనల గ్రంథకర్త ప్రార్థనైయుండును గాక: “దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండు వరకు నన్ను విడువకుము.”—కీర్తన 71:18; 78:5, 6.
16. తమ కుటుంబంలో అలజడి రేగేందుకు తాము కారణం కాకుండా తాతయ్య మామ్మలు ఏలా నివారించగలరు?
16 దుఃఖకరంగా, కొందరు తాతయ్య మామ్మలు చిన్న పిల్లలను ఎంత గారాబం చేస్తారంటే, తాతయ్య మామ్మలకు వారి పెరిగిన పిల్లలకు మధ్య చికాకు పెరుగుతుంది. అంతే కాకుండా, తమ తలిదండ్రులకు విషయాలను చెప్పాలని వారికి అనిపించనప్పుడు వారు ఆ విషయాలను మీతో చెప్పుకునేందుకు మీ యథార్థమైన దయాగుణం వారికి సులభతరం చేయవచ్చు. తమపై మక్కువగల తాతయ్య మామ్మలు తమ తలిదండ్రులకు విరుద్ధంగా తమ పక్షం వహిస్తారని యౌవనులు కొన్నిసార్లు ఆశిస్తారు. అప్పుడెలా మరి? జ్ఞానాన్ని ప్రదర్శించి, మీ మనుమలు మనుమరాండ్రు తమ తలిదండ్రులతో అరమరికలు లేకుండా ఉండాలని వారిని ప్రోత్సహించండి. ఇది యెహోవాను ప్రీతిపర్చుతుందని మీరు వివరించవచ్చు. (ఎఫెసీయులు 6:1-3) ఒకవేళ అవసరమైతే, వారి తలిదండ్రులతో ముందే మాట్లాడటం ద్వారా యౌవనులు తమ తలిదండ్రులతో ఈ విషయాలను చర్చించేందుకు మీరు మార్గాన్ని సుగమం చేసుకునేందుకు స్వచ్ఛందంగా కృషి చేయగలరు. గడచిన సంవత్సరాలలో మీరు ఏమి నేర్చుకున్నారో వాటి గురించి మీ మనుమలు మనుమరాండ్రకు దాచకుండా చెప్పండి. మీ యథార్థత మరియు నిష్కాపట్యం వారికి ప్రయోజనం కలిగించగలదు.
మీ వయస్సు పెరుగుతున్న కొద్దీ సర్దుకుపోండి
17. కీర్తనల గ్రంథకర్త యొక్క ఏ తీర్మానాన్ని వృద్ధులౌతున్న క్రైస్తవులు అనుకరించాలి?
17 ఏళ్లు గడుస్తున్న కొద్దీ, మీరు ముందు చేయగల్గినవన్నీ లేక మీరు చేయాలనుకున్నవన్నీ ఇప్పుడు చేయలేరని మీరు తెలుసుకుంటారు. వృద్ధులయ్యే ఈ ప్రక్రియతో ఒకరు ఎలా సరిపెట్టుకోగలరు? మీకు 30 ఏళ్ళని మీ మనస్సులో మీరు భావించవచ్చు, అయితే అద్దంలో చూస్తే వేరే వాస్తవం కళ్లెదుట కనిపిస్తుంది. నిరుత్సాహం చెందకండి. కీర్తనల గ్రంథకర్త యెహోవాను ఇలా వేడుకున్నాడు: “వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము.” కీర్తనల గ్రంథకర్త నిశ్చయతను అనుకరించడం మీ తీర్మానంగా చేసుకోండి. ఆయనిలా చెప్పాడు: “నేను ఎల్లప్పుడు నిరీక్షింతును నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును.”—కీర్తన 71:9, 14.
18. పరిపక్వతగల క్రైస్తవులు ఉద్యోగ విరమణను విలువైన దానిగా ఎలా ఉపయోగించుకోగలరు?
18 ఉద్యోగ విరమణ పొందిన తర్వాత యెహోవాను తాము స్తుతించడాన్ని అధికం చేయాలని అనేకులు ముందుగానే సిద్ధపడారు. “నా కుమార్తె పాఠశాల చదువు ముగించిన తర్వాత నేను ఏమి చేయాలనే దాన్ని ముందుగానే పథకం వేసుకున్నాను. నేను పూర్తికాల ప్రకటనా పరిచర్యను ప్రారంభించాలని నిశ్చయించుకున్నాను, యెహోవాను మరింత ఎక్కువగా సేవించడానికి ఖాళీగా ఉండేందుకు నా వ్యాపారాన్ని అమ్మివేశాను. నేను దేవుని నడిపింపు కొరకు ప్రార్థించాను” అని ఇప్పుడు ఉద్యోగ విరమణ పొందిన ఒక తండ్రి చెబుతున్నాడు. ఒకవేళ మీరు ఇప్పుడు ఉద్యోగ విరమణ వయస్సుకు దగ్గరపడుతుంటే మన గొప్ప సృష్టికర్త చెబుతున్న దానినుండి ఆదరణను పొందండి: “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తలవెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే.”—యెషయా 46:4.
19. వృద్ధులౌతున్న వారికి ఏ సలహా ఇవ్వబడింది?
19 ఉద్యోగ విరమణ పొందినప్పుడు దానికి సర్దుకుపోవడం అంత సులభంగా ఉండకపోవచ్చు. వృద్ధులు “మితానుభవముగల” వారిగా ఉండాలని అపొస్తలుడైన పౌలు వారికి సలహా ఇచ్చాడు. దీని కొరకు సాధారణ నియంత్రణ అవసరం, సులభమైన జీవితాన్ని కోరుకోవాలన్న ఇష్టతకు లొంగిపోకుండా ఉండాలి. ఉద్యోగ విరమణ ముందు కంటే తర్వాతనే ఒక మంచి క్రమం, స్వయం శిక్షణ యొక్క గొప్ప అవసరం ఉండవచ్చు. కాబట్టి, పని తొందర కలిగి ఉండండి, “మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి . . . ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.” (1 కొరింథీయులు 15:58) ఇతరులకు సహాయం చేసేందుకు మీ కార్యకలాపాలను విస్తృతం చేసుకోండి. (2 కొరింథీయులు 6:13) తమకు వీలైనంత క్రమంగా సువార్తను ఆసక్తితో ప్రకటించడం ద్వారా అనేకమంది క్రైస్తవులు దీన్ని చేస్తున్నారు. మీరు వృద్ధులౌతుండగా, “విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేని” వారిగా ఉండండి.—తీతు 2:2.
మీ జతను కోల్పోయినప్పటి పరిస్థితితో వ్యవహరించడం
20, 21. (ఎ) ప్రస్తుత విధానంలో ఒక వివాహిత జంటను తుదకు ఏది విడదీస్తుంది? (బి) దుఃఖిస్తున్న భాగస్వాములకు అన్న ఒక చక్కని మాదిరిని ఎలా అందించింది?
20 ప్రస్తుత విధానంలో వివాహ దంపతులు మరణం ద్వారా తుదకు వేరుచేయబడతారన్నది దుఃఖకరమైనదే అయినా అది వాస్తవం. తమ ప్రియమైన జత ఇప్పుడు నిద్రిస్తున్నారని దుఃఖిస్తున్న క్రైస్తవ భాగస్వామికి తెలుసు, తాము వారిని మళ్లీ చూడగలమనే నమ్మకం వారికుంది. (యోహాను 11:11, 25) అయినప్పటికీ ఆ నష్టం ఎంతో తీవ్రంగా గాయపర్చుతుంది. బ్రతికున్న వారు ఈ పరిస్థితిని ఎలా తట్టుకోగలరు? a
21 బైబిలులోని ఒక వ్యక్తి ఈ పరిస్థితిలో ఎలా ప్రవర్తించిందో జ్ఞాపకం చేసుకోవడం సహాయం చేస్తుంది. అన్న వివాహమైన ఏడు సంవత్సరాలకే విధవరాలయ్యింది, ఆమె గురించి మనం చదివేసరికి ఆమెకు 84 సంవత్సరాలు. ఆమె తన భర్తను కోల్పోయినప్పుడు ఆమె ఎంతో దుఃఖించి ఉంటుంది. ఆమె ఎలా తట్టుకోగలిగింది? ఆలయం వద్ద యెహోవా దేవునికి ఆమె రాత్రింబవళ్లు పవిత్ర సేవచేసింది. (లూకా 2:36-38) ఒక విధవరాలిగా ఆమె అనుభవించిన దుఃఖానికి మరియు ఒంటరితనానికి, ఆమె జీవితంలోని ప్రార్థనా పూర్వక సేవ నిశ్చయంగా ఒక గొప్ప విరుగుడుగా ఉండినది.
22. కొందరు విధవరాండ్రు మరియు భార్యలను పోగొట్టుకున్న వ్యక్తులు ఒంటరితనంతో ఎలా పోరాడారు?
22 “నేను ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఏమంటే నేను మాట్లాడేందుకు ఒక భాగస్వామి లేకపోవడమే. నా భర్త ఎంతో చక్కగా ఆలకించేవారు. మేము సంఘం గురించి, క్రైస్తవ పరిచర్యలో మేమెలా భాగం వహిస్తున్నామో దాని గురించీ మాట్లాడుకునే వాళ్లం” అని 10 ఏళ్ల క్రితం విధవరాలైన 72 సంవత్సరాల స్త్రీ వివరిస్తోంది. మరొక విధవరాలు ఇలా చెబుతోంది: “గడిచే సమయం గాయాన్ని మాన్పుతుంది, అయితే తమకున్న సమయంలో ఒకరు ఏమి చేస్తారో అది వారి గాయాన్ని మాన్పడంలో సహాయం చేస్తుందని చెప్పడం మరింత కచ్చితంగా ఉంటుందని నేను తెలుసుకున్నాను. ఇతరులకు సహాయం చేసేందుకు మీరు శ్రేష్ఠమైన స్థానంలో ఉన్నారు.” “దుఃఖాన్ని ఎదుర్కోడానికిగల ఒక అద్భుతమైన మార్గం ఏమిటంటే, ఇతరులకు ఓదార్పునివ్వడంలో మిమ్మల్ని మీరు అర్పించుకోవడమేనని” చెబుతూ తన భార్యను కోల్పోయిన 67 సంవత్సరాల వ్యక్తి అంగీకరిస్తున్నాడు.
వృద్ధాప్యంలో దేవునిచే విలువైన వారిగా ఎంచబడటం
23, 24. వృద్ధులకు, ప్రాముఖ్యంగా తమ వివాహ భాగస్వామిని కోల్పోయిన వారికి బైబిలు ఏ గొప్ప ఆదరణను అందిస్తోంది?
23 మరణం మీ ప్రియమైన జతను తీసేసుకున్నప్పటికీ, యెహోవా ఎప్పుడూ నమ్మకంగా, విశ్వాసంగా నిలుస్తాడు. “యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను” అని ప్రాచీన కాలంనాటి రాజైన దావీదు పాడాడు.—కీర్తన 27:4.
24 “నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము” అని అపొస్తలుడైన పౌలు పురికొల్పాడు. (1 తిమోతి 5:3) ఈ ఉపదేశం తర్వాత ఇవ్వబడిన సలహా, సన్నిహిత బంధువులు లేని యోగ్యురాలైన విధవరాండ్లు సంఘం నుండి అవసరమైన వస్తుదాయక మద్దతును పొందేందుకు అర్హులని సూచిస్తుంది. ‘సన్మానించాలి’ అన్న ఆ ఉపదేశం యొక్క భావంలో వారిని విలువైన వారిగా ఎంచాలనే ఆలోచన కూడా ఉంది. యెహోవా వారిని విలువైన వారిగా ఎంచుతున్నాడని, వారిని సంరక్షిస్తాడని తెలుసుకోవడం ద్వారా దైవభక్తిగల విధవరాండ్రు, భార్యలను కోల్పోయిన వ్యక్తులు ఎంతో ఆదరణను పొందగలరు!—యాకోబు 1:27.
25. పెద్ద వయస్సులో ఉన్న వారికి ఇంకా ఏ లక్ష్యం నిలిచివుంది?
25 “తలనెరపు వృద్ధులకు సౌందర్యము” అని దేవుని ప్రేరేపిత వాక్యం పేర్కొంటోంది. అది ‘నీతి ప్రవర్తన గల వానికి సొగసైన కిరీటము.’ (సామెతలు 16:31; 20:29) కాబట్టి, మీరు వివాహితులైనా లేక ప్రస్తుతం మీ జతను కోల్పోయిన వారైనా మళ్లీ ఒకసారి యెహోవా సేవను మీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచుకోవడంలో కొనసాగండి. అలా మీరు ఇప్పుడు దేవునితో మంచి పేరును కలిగి ఉంటారు మరి వృద్ధాప్యం యొక్క బాధలు లేని లోకంలో నిత్యం జీవించే ఉత్తరాపేక్షను కలిగి ఉంటారు.—కీర్తన 37:3-5; యెషయా 65:20.
a ఈ అంశాన్ని గూర్చిన మరింత వివరమైన చర్చ కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే బ్రోషూర్‌ను చూడండి.