మనం ఎవరికి ప్రార్థించాలి?
మనం ఎవరికి ప్రార్థించినా ప్రార్థనలన్నీ ఒకేచోటికి చేరతాయా? ఈ రోజుల్లో చాలామంది అలా నమ్ముతారు. మతాలు వేరుగా ఉన్నా సరే, అన్ని మతాలు అంగీకరించబడాలి అని కోరుకునేవాళ్లకు ఆ ఆలోచనా బాగా నచ్చుతుంది. కానీ ఆ అభిప్రాయం సరైనదేనా?
నిజానికి చాలామంది ప్రజలు అసలైన దేవునికి ప్రార్థన చేయడం లేదని బైబిలు బోధిస్తుంది. బైబిల్ని రాసిన కాలంలో, చాలామంది చెక్కుడు విగ్రహాలకు ప్రార్థించేవాళ్లు. అలా చేయకూడదని దేవుడు పదేపదే హెచ్చరించాడు. ఉదాహరణకు, విగ్రహాల గురించి కీర్తన 115:4-6 లో ఇలా ఉంది: “వాటికి ... చెవులు ఉన్నాయి, కానీ వినలేవు.” ఆ మాటల అర్థం ఏమిటి? అసలు మన ప్రార్థనలు వినలేని దేవునికి ప్రార్థించడం దేనికి?
బైబిల్లోని ఒక సంఘటన ఈ విషయం గురించి చక్కగా వివరిస్తుంది. నిజమైన దేవుని ప్రవక్త ఏలీయా బయలు ప్రవక్తలతో ఒక సవాలు చేశాడు: ముందు వాళ్లు తమ దేవునికి ప్రార్థించాలి, తర్వాత ఏలీయా తన దేవునికి ప్రార్థిస్తాడు. నిజమైన దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు, అబద్ధ దేవుడు జవాబు ఇవ్వడు అని ఏలీయా చెప్పాడు. బయలు ప్రవక్తలు అందుకు ఒప్పుకున్నారు. వాళ్లు చాలాసేపు తీవ్రంగా ప్రార్థించారు, గట్టిగట్టిగా అరిచారు, కానీ ఫలితం లేదు! “ఎవ్వరూ జవాబివ్వలేదు; ఎవ్వరూ వాళ్లను పట్టించుకోలేదు” అని బైబిలు చెప్తుంది. (1 రాజులు 18:29) మరి ఏలీయా ప్రార్థించినప్పుడు ఏం జరిగింది?
ఏలీయా ప్రార్థించినప్పుడు అతని దేవుడు వెంటనే జవాబిచ్చాడు, ఆయన పరలోకం నుండి అగ్ని రప్పించి ఏలీయా అర్పణను దహించేశాడు. తేడా ఎక్కడ ఉంది? 1 రాజులు 18:36, 37 వచనాల్లో ఏలీయా చేసిన ప్రార్థనను గమనిస్తే మనకు తెలుస్తుంది. అది చాలా చిన్న ప్రార్థన, హీబ్రూ భాషలో దాన్ని చెప్పినప్పుడు అందులో దాదాపు 30 పదాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ కొన్ని మాటల్లోనే, యెహోవా అనే దేవుని పేరును ఏలీయా మూడుసార్లు ఉపయోగించాడు.
బయలు అనే మాటకు “సొంతదారుడు” లేదా “యజమాని” అని అర్థం, అతను కనానీయుల దేవుడు. ఆ పేరుతో వాళ్లకు స్థానికంగా చాలామంది దేవుళ్లు ఉండేవాళ్లు. అయితే యెహోవా అనేది ఒక ప్రత్యేకమైన పేరు, అది విశ్వంలో ఒకే ఒక్క వ్యక్తికి సొంతం. ఆ దేవుడు తన ప్రజలకు ఇలా చెప్పాడు: “నేను యెహోవాను. ఇదే నా పేరు; నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వను.”—యెషయా 42:8.
ఏలీయా ప్రార్థన, ఆ బయలు ప్రవక్తల ప్రార్థనలు ఒకే చోటికి చేరుకున్నాయా? బయలు ఆరాధన ప్రజలను నైతికంగా దిగజారేలా చేసేది, ఎందుకంటే అందులో ఆచారబద్ధంగా చేసే వేశ్యా వృత్తి, మనుషుల్ని బలి అర్పించడం ఉండేది. కానీ యెహోవా ఆరాధన అలాంటి దిగజారిన అలవాట్ల నుండి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని కాపాడి, హుందాగా ఆరాధించేలా చేసింది. ఒకసారి ఈ విషయం పరిశీలించండి: మీరు ఎంతో గౌరవనీయుడైన మీ స్నేహితుడికి ఒక ఉత్తరం రాశారనుకోండి. అది వేరే పేరు ఉన్న వ్యక్తికి, మీ స్నేహితుడు వేటినైతే విలువైనవిగా ఎంచుతాడో వాటికి పూర్తి విరుద్ధంగా బ్రతికే వ్యక్తికి అందాలని మీరు కోరుకుంటారా? ఖచ్చితంగా కోరుకోరు!
బయలు ప్రవక్తలతో ఏలీయా చేసిన సవాలు, ప్రార్థనలన్నీ ఒకే చోటికి చేరవని చూపిస్తుంది
మీరు యెహోవాకు ప్రార్థించినప్పుడు, మనుషులందరికీ తండ్రైన సృష్టికర్తకు ప్రార్థిస్తున్నారు. * ఆయనకు ప్రార్థిస్తూ యెషయా ప్రవక్త ఇలా అన్నాడు, “యెహోవా, నువ్వే మా తండ్రివి.” (యెషయా 63:16) “నా తండ్రీ మీ తండ్రీ, నా దేవుడూ మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను” అని యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పినప్పుడు ఆ దేవుని గురించే మాట్లాడుతున్నాడు. (యోహాను 20:17) యెహోవా యేసుకు తండ్రి. యేసు ఆ దేవునికే ప్రార్థించాడు, ఆయనకే ప్రార్థించమని తన శిష్యులకు నేర్పించాడు.—మత్తయి 6:9.
యేసుకు, మరియకు, సెయింట్లకు, లేదా దేవదూతలకు ప్రార్థించమని బైబిలు చెప్తుందా? లేదు, అది యెహోవాకు మాత్రమే ప్రార్థించాలని చెప్తుంది. అందుకు రెండు కారణాలు పరిశీలించండి. మొదటిది, ప్రార్థన అనేది ఆరాధనలో భాగం. మనం యెహోవాను మాత్రమే ఆరాధించాలని బైబిలు చెప్తుంది. (నిర్గమకాండం 20:5) రెండవది, యెహోవాకు ‘ప్రార్థనలు వినే దేవుడు’ అనే బిరుదు ఉందని బైబిలు చెప్తుంది. (కీర్తన 65:2) యెహోవా చాలా బాధ్యతల్ని వేరేవాళ్లకు అప్పగిస్తాడు, అయితే ప్రార్థనలు వినే బాధ్యతను ఆయన ఎప్పుడూ ఎవ్వరికీ ఇవ్వలేదు. యెహోవా దేవుడు తానే స్వయంగా మన ప్రార్థనలు వింటానని మాటిస్తున్నాడు.
కాబట్టి మీ ప్రార్థనల్ని దేవుడు వినాలంటే, లేఖనాల్లో ఉన్న ఈ మాటను గుర్తుంచుకోండి: “యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.” (అపొస్తలుల కార్యాలు 2:21) అయితే యెహోవా ప్రతీ ప్రార్థనను వింటాడా? లేదా యెహోవా మన ప్రార్థనలు వినాలంటే మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉందా?
^ పేరా 9 కొన్ని మత సంప్రదాయాలు దేవుని పేరు ఉపయోగించడం తప్పు అని, చివరికి ప్రార్థనలో అయినాసరే అలా చేయడం తప్పు అని చెప్తాయి. కానీ మొట్టమొదట బైబిల్ని రాసిన భాషల్లో ఆ పేరు దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో యెహోవా నమ్మకమైన సేవకులు చేసిన ప్రార్థనల్లో, వాళ్లు పాడిన కీర్తనల్లో ఆ పేరు కనిపిస్తుంది.